Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 18


    సూటిగా అడిగాడు అతను. ముఖాన్ని చాటుచేసుకుంటూనే అడిగాడు...!

    ధీరజ నిశ్చేష్టఅయింది. తటపటాయించింది. తడబడింది.

    "డోంట్ వర్రి! నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పాలని లేదు. రెండు మూడు రోజులపాటు ఆలోచించుకునే చెప్పవచ్చు. నీ అంగీకారాన్ని బట్టే నీకు లక్ష రూపాయలను ఇవ్వడమా లేదా అనేది ఆధారపడి వుంటుంది!" అన్నాడతను.

    "అలాగే!" అన్నట్టు తలూపుతూ, వడివడిగా వెళ్ళబోయింది ధీరజ.

    "జస్ట్ వెయిట్ మిస్ ధీరజ! నీమీద మా నిఘా ఎప్పుడూ వుంటుందని మాత్రం మరచిపోవద్దు బి కేర్ ఫుల్!" హెచ్చరించాడతను, గంభీరంగా చెప్పాడు.

    నిట్టూర్చింది ధీరజ. నిరాశగా నిస్పృహతో వెనుదిరిగింది...

    కిందపడి మూలుగుతూ, దొర్లుతూ మూటకట్టుకుపోతున్న అధికారిని అవలీలగా ఎత్తి భుజాన వేసుకున్నాడు ఆ వ్యక్తే. సూట్ కేస్ ను అందుకున్నాడు. కనుమరుగయ్యాడు.

    రోడ్డుమీదకు వచ్చిన ధీరజ, ఎదురుగా వేగంగా వస్తున్న కారును  గమనించి, లిఫ్ట్ అన్నట్టు చేతి బొటనవ్రేలును పైకెత్తి చూపుతూ వంగి ఊపింది.

    భారత ప్రధాని చక్రవర్తి కుమార్తె కుమారి మంజు తన కారుకు షడన్ బ్రేక్ వేసింది.


                         *    *    *


    అది పోలీస్ ఉన్నతాధికారుల సదస్సు.

    "ప్రస్తుత కాలమాన పరిస్థితుల ననుసరించి ఏ దేశంలో అయినా సరే, ఏ వి.వి.ఐ.పి. కి అయినా సరే, పోలీస్ సెక్యూరిటీని మరింత పటిష్టమంతం చేయవలసిన అవసరం ఎంతేని వున్నది. నేరస్తులు రానురాను కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. రోజురోజుకూ వాళ్లు తెలివి మీరిపోతున్నారు. కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక ప్రక్రియ మార్పులను వ్యక్తిగత మేధస్సును కలగలిపి నేరస్తులు అటు సామాన్యులకు అసాధ్యమైన విధంగా, ఇటు పోలీస్ వ్యవస్థ కొక చాలెంజింగ్ గా తయారవుతున్నారు. వాళ్ళను తక్కువ అంచనా వేయడం తప్పు. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పోలీస్ సెక్యూరిటీ విభాగంలో కూడా అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్పులూ చేర్పులూ చేసుకుంటూపోవాలి.

    "అసలు వి.ఐ.పి.కి అభద్రత ఎందుకు వుంటున్నది? ఎవరి వలన ప్రమాదం? అది ఏ విధంగా జరుగవచ్చు? వి.ఐ.పి.కి శత్రువులు వున్నారా? వుంటే, వారు ఏ బాపతు? స్వదేశీయులా విదేశీయులా? ఇలా క్షణక్షణం అన్నికోణాల నుంచి విశ్లేషణ జరుపుకుంటే, ముందుజాగ్రత్త చర్యలను పటిష్టమంతంగా తీసికోవచ్చు.

    "అంతేకాదు. వి.ఐ.పి.కి అసలు ఏయే ప్రదేశాలలో ప్రమాదం అంటూ జరగవచ్చునో ముందుగానే ఇంటిలిజెన్స్ విభాగంవారు వర్కవుట్ చేయాలి. చేయడమే కాదు. లభించిన సమాచారాన్ని సెక్యూరిటీ  విభాగానికి సకాలంలో తెలియజేయాలి. ఈ రెండింటిలో ఎక్కడ ఏమాత్రం జాప్యం జరిగినా జరగవలసిన ప్రమాదం ఊహించని రీతిలో జరిగిపోతుంది. ఆ తరువాత నాలుక కొరుక్కుని, పశ్చాత్తాపపడీ ప్రయోజనం ఏమిటి?

    ఇంటిలిజెన్స్, సెక్యూరిటీ విభాగాలు తమ బాధ్యతలను వదిలించుకోవడమే ప్రాతిపదికగా కాక, వి.ఐ.పి. రక్షణలో కృతకృత్యులు కావడమే ధ్యేయంగా పెట్టుకోవాలి.

    ఇంటిలిజెన్స్ విషయ సేకరణ అంత తేలికైన విషయమేమీ కాదు. ఎంతోశ్రమతో కూడుకున్నది. కటోర పరిశ్రమ అవసరం. కావలసిన సమాచారం ఏ ఒక్కరోజులోనో వచ్చేది కాదు, ఏ వ్యక్తికో పరిమిత మయిందీకాదు. ఇంటిలిజెన్స్ మేటర్ కలక్షన్ ఎంత సీక్రెట్ గా జరిగితే అంత ఉపయోగం. కీలకమైన నిర్ణయాలను సకాలంలో తీసుకుంటే జరగనున్న అనర్ధాన్ని అవలీలగా ఆపవచ్చు. శత్రువును వ్యూహాత్మకంగా చిత్తుచేయవచ్చు. ఉన్నతమైన వ్యక్తిత్వ ప్రమాణాలుగల వ్యక్తులనే అందుకు నిర్దేశించాలి.

    "కొన్ని సందర్భాలలో 'సీక్రెట్', 'టాప్ సీక్రెట్' అనుకుంటూ ప్రజలకు దూరంగా వుంటే విషయ సేకరణ అసాధ్యమవుతుంది. అంటే, అవసరాన్ని బట్టి, ఇంటిలిజన్స్ ఆఫీసరు ప్రజల మధ్యకు చొరవతో చొరచుకు పోవాలి. ఐతే, అదే సమయంలో తన ఇడెంటిటీని మాత్రం నిగూడంగానే వుంచాలి! అంతేకాదు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లను సహజంగా ఇంటిలిజన్స్ శాఖలో ఎంతో కొంత అనుభవం గడించినవారి జాబితానుంచీ తీసికోవడం మంచిది. ఇంటిలిజెన్స్ అధికారికి వుండే లక్షణాలే దాదాపు వి.ఐ.పి.కి సెక్యూరిటీగా నియమితమయే వ్యక్తికి వుండాలి. 

 Previous Page Next Page