ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినాడు. భీష్ముడు రాజ్యము వదులుకున్నాడు. ధృతరాష్ట్రునకు పట్టము కట్టినాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముని ధనువుగను, విదురుని బుద్దిగాను చేసుకొని రాజ్యము పాలించినాడు. భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రునకు కనులు అయినారు. వారి కనులతో లోకము చూచినాడు. రాజ్యము ఏలినాడు.
ధృతరాష్ట్రునకు వయసు వచ్చినది. పెండ్లి చేయవలెననుకున్నాడు భీష్ముడు. విదురుని ఆలోచించినాడు. గాంధారదేశపు రాజు సుబలుడు . అతనికి ఒక కూతురు ఉన్నది. ఆమె రూపసౌందర్యము గలది. గుణవంతురాలు. గాంధారి శివుని గూర్చి తపస్సు చేసినది. నూరుగురు పుత్రులు కలుగునట్లు వరము పొందినది. ఆమెను ధృతరాష్ట్రునకు ఇప్పించుట మంచిదని భీష్ముడు ఆలోచించినాడు. విదురుడు అందుకు సమ్మతించినాడు.
హస్తిన నుండి పెద్దలు బయలుదేరినారు. గాంధార దేశమునకు చేరినారు. సుబలుని దర్శించుకున్నారు. తమ రాకకు కారణము ఎరుక పరచినారు.
సుబలుడు ఆలోచించినాడు. ధృతరాష్ట్రుడు మహారాజు, సంపన్నుడు. తన కూతురు సుఖపడునని అనుకున్నాడు. అయినను బంధుజనులను సంప్రదించినాడు. అవయవములందు శిరస్సు ప్రధానమయినది. అందునను నేత్రములు అతి ప్రధానములు. అవి లేనివాడు ధృతరాష్ట్రుడు. అతనికి గాంధారిని ఇచ్చుటకు బంధు జనులు ఇష్టపడలేదు.
సుబలుడు గాంధారిని అడిగినాడు. ఆమె అప్పటికే ఒక నిశ్చయమునకు వచ్చినది. ధృతరాష్ట్రుని పెండ్లాడుటకు నిశ్చయించుకున్నది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. కాబట్టి ఆమె తన కనులకు గుడ్డ కట్టుకున్నది. తండ్రికి తన నిశ్చయము తెలియజేసినది.
సుబలుడు హస్తిన నుండి వచ్చిన పెద్దలను పిలిపించినాడు. గాంధారిని ధృతరాష్ట్రునకు ఇత్తునని చెప్పినాడు. పెద్దలు సంతోషించినారు. హస్తినకు వెళ్ళినారు. అనందవార్త తెలియబరచినారు.
సుబలుని పుత్రుడు , గాంధారి సోదరుడు శకుని. సుబలుడు శకుని వెంట గాంధారిని పంపించినాడు . వారు హస్తిన చేరినారు. మహావైభవముగా వివాహము జరిగినది. గాంధారి ధృతరాష్ట్రుని పట్టమహిషి అయినది. గాంధారికి పది మంది చెల్లెళ్ళు . వారు కూడ ధృతరాష్ట్రుని భార్యలు అయినారు. భీష్ముడు అప్పుడప్పుడు మంచి కన్యలను ధృతరాష్ట్రునకు ఇచ్చినాడు. ఆవిధముగా ధృతరాష్ట్రునకు నూరుగురు భార్యలు అయినారు. వారిలో పెద్ద భార్య గాంధారి. పట్టమహిషి గాంధారి. ఆమె సర్వదా కనులకు బట్ట కట్టుకొని భర్తవలేనే లోకము చూడకుండును.
ఆలోచనామృతము
1. భీష్ముని రాజ్యము సకల సంపదలచే విరాజిల్లినది అని చెప్పుచున్నాడు వ్యాసుడు. అట్లు చెప్పి పాలకులు ఎట్లుండవలెనో నిరూపించుచున్నాడు. భీష్ముడు త్యాగజీవి. అతనికి ధర్మము తప్ప అన్యము తెలియదు. అతనికి కుటుంబము లేదు. కాబట్టి స్వార్ధము లేదు. పాలకులు నిస్వార్దులయి ఉండవలెను. అను సత్యమును ప్రవచించుచున్నాడు . స్వార్ధమే జీవికగాగల పాలకులు దేశమును ఏమి చేయిచున్నారో మనము చూచుచున్నాము.
2. సింహాసనము వచ్చినంతనే దానిని పట్టివదలననుట ప్రమాదకరము. పాలకుడు కర్తవ్య నిర్వహణగా పాలించవలెను. అవసరమయినపుడు దానిని అప్పగించుటకు వెనుకాడరాదు. భీష్ముడు రాజ్యమును సుసంపన్నము చేసినాడు. అయినను అనురక్తి పెంచుకొనలేదు. నిర్వికారముగా రాజ్యమును ధృతరాష్ట్రునాకు ఇచ్చినాడు. పదవులు పట్టుకొని వదలనివారి వలన కలుగు హాని మనము చూచుచున్నాము.
3. బహు\భార్యత్వము ఇప్పుడే కనిపించినది. ఒక్కొక్కసారి పురుషులు తక్కువ అయి స్త్రీలు ఎక్కువ అగుదురు. సాధారణముగ యుద్దముల తరువాత అట్లు జరుగును. రెండవ ప్రపంచ సంగ్రామము తరువాత అట్లు జరిగినది. అప్పుడు బహుభార్యత్వము అచారమగును.
4. సుబలుడు దుర్బలుడయిన రాజు అయి ఉండవలెను. అందుకే ఒక కూతురును అడుగగా పదిమందిని ఇచ్చినాడు. బరువు దించుకున్నాడు.
5. శంతనుని వంశమున ఎప్పుడును ఎక్కువ మంది పిల్లలు లేరు. అప్పుడు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు. ఇల్లు పిల్లలతో కళకళ లాడవలెననుకున్నాడు. ధృతరాష్ట్రునకు నూరుగురు పిల్లలు కావలెనని కోరుకున్నాడు భీష్ముడు.
ఇది సహజము.
కుంతీ కధ
శూరుడు యాదవ రాజు. అతనికి అనేకమంది కూతుళ్ళు. వారిలో కుంతి పెద్దది. ఆమె వసుదేవుడు చెల్లెలు. శూరునకు మేనత్త కొడుకు కుంతిభోజుడు. అతనికి సంతానము లేదు. శూరుడు కుంతిని కుంతిభోజునకు దత్తత ఇచ్చినాడు.
కుంతి అందమయినది. రూపలావణ్యముగలది. కుంతిభోజుడు ఆమెను అతిధి సత్కారములకు నియమించినాడు. ఆమె మునులను ఋషులను చక్కగా సత్కరించునది. ఆమె ఆదరమునకు మునులు సంతసింతురు. సంతృప్తిగా వెళ్ళిపోదురు.
ఒకనాడు దుర్వాస మునీంద్రుడు వచ్చినాడు. ఆమె అర్ఘ్యము ఇచ్చినది. పాద్యము ఇచ్చినది. మృష్టాన్నము పెట్టినది. దుర్వాసుడు ఎంతో సంతసించినాడు. సంతృప్తి చెందినాడు. అనందించినాడు. కుంతికి ఒక మంత్రము ఉపదేశించినాడు. అన్నాడు :-
"కుంతీ! ఈ మంత్రము దివ్యమైనది. ఎంతో ప్రభావము కలది. దీనివలన నీవుకోరిన దేవత ప్రత్యక్షమగును. పుత్రుని ప్రసాదించును. వెళ్ళిపోవును."
దుర్వాసుడు మంత్రమును ఉపదేశించినాడు. వెళ్ళిపొయినాడు.
కుంతీ చిన్నది. వయసులో ఉన్నది. మనసున మల్లెలు రాలుచున్నది. కోరికలు పోటమరించుచున్నవి. గాలిలో తేలిపోవుచున్నది. ఆమె దుర్వాసుని మాత్రము తలచుకున్నది. రానున్న దేవతలా తలచుకున్నది. ఆమె పులకాంకిత అయినది. ప్రయత్నించవలెననుకున్నది. చిలిపిదనము చోటుచేసుకున్నది. కుంతి ఒంటరిగా గంగకు వెళ్ళినది. ఎవరికి ఎరుక కానీయలేదు. చాటుగా గంగ యొడ్డునాకు చేరినది . గంగలో మునిగినది. స్నానమాడినది. చల్లని నీరు , గంగ అందము, చల్లని గాలి ఆమె పరవశము చేసినవి. వయసు తొందర పెట్టినది. మనసు ఉరకలు తీసినది.
కుంతి దోసిలిలో నీరు తీసుకున్నది. సూర్యునకు నమస్కరించినది. మంత్రము పఠించినది. సూర్యుని పిలిచినది. అమెది చిలిపివయసు. సూర్యుడు వచ్చునని అనుకోనలేదు. అటు ఇటు చూచినది. రాడనుకున్నది. చిన్నబుచ్చుకున్నది.
కుంతి అటు చూచినది. సూర్యుడు దిగివచ్చినాడు. ఆమె ముందు నిలిచినాడు. అంతకుముందు రావలెను అనుకున్నది. వచ్చినాడు. సూర్యుని చూచినది. ఆమె గుండెలో గుబులుచేరినది. తత్తరపాటు వచ్చినది. తలవంచుకున్నది. బుగ్గలు జేవురించినవి.