ఈ క్రొత్తగా వచ్చిన పిల్ల ఏ సమస్యలను తీసుకువస్తుందోనన్న ఆలోచనలో పడింది శాంతిశ్రీ.
* * *
టింకూ హార్లిక్స్ అందిస్తుంటే కృష్ణప్రియ లేచి కూర్చోబోయింది.
"కానీ శరీరం ఆమె ఆధీనంలో లేదు..."
కూర్చోవడానికి వీలుగా దిండు గోకుకు ఆనించి కృష్ణప్రియను కూర్చోబెట్టి టింకూ హార్లిక్స్ పట్టించాడు.
చిన్నారిచేత తను సేవ చేయించుకుంటున్నందుకు కృష్ణప్రియ బాధపడింది.
తను తొందరగా కోలుకోవాలని వేయి దేవుళ్ళకు మొక్కుకుంది.
"హల్లో ప్రియా...గుడ్ మార్నింగ్..." అంటూ గదిలో అడుగుపెడుతూనే విష్ చేశాడు కుమార్.
కృష్ణప్రియ మవునం వహించిందే తప్ప పెదవి విప్పలేదు.
"ఎలా వుంది ఇప్పుడు?"
అంటూనే పల్స్ చూసి టెంపరేచర్ చెక్ చేశాడు నార్మల్ గా వుంది.
"ఈరోజు లైట్ గా మీల్స్ తీసుకోవచ్చు..." ఇంజక్షన్ చేస్తూ చెప్పాడు కుమార్.
అప్పటికే కృష్ణప్రియ మవునంగానే ఉండేసరికి__
"మరీ అంత చిన్నపిల్లలా ఖంగారుపడి నువ్వే పేషెంట్ లా మారిపోయావు చూశావా! ఇప్పుడు టింకూకు ఏమయిందని నిద్రాహారాలు మానేసి అంతలా బాధపడిపోయావు...టింకూ వైపు చూడు...నిన్ను చూసి ఎంత ఆందోళన పడుతున్నాడో...తన జ్వరం సంగతి కూడా మరచిపోయి నీకు శుశ్రూషలు చేశాడు..."
మాట్లాడడం ఆపిన కుమార్ వైపు వింతగా చూసింది కృష్ణప్రియ.
తనకు బాగోలేదని తెలిసి ఇంటికివచ్చి ట్రీట్ మెంట్ చేసిన కుమార్ ను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అంతుబట్ట లేదామెకు...
కుమార్ ను, ఆంటీని మార్చి మార్చి చూశాడు టింకు.
అతన్ని దగ్గరకు తీసుకుని కుమార్ ముద్దు పెట్టుకోబోతే తప్పించుకుని కృష్ణప్రియ దగ్గరకు పరుగుతీశాడు టింకూ.
కృష్ణప్రియ గర్వంగా అతనివైపు చూసింది.
"నేను న్యూరో సర్జరీ లో స్పెషలైజ్ చేసిన సంగతి నీకు తెలుసుగా...నువ్వు ఏం ఖంగారుపడవద్దు. టింకూకు నయంచేసే పూచీ నాది. నువ్వు త్వరగా కోలుకుంటే టింకూకు నేను ఆపరేషన్ చేస్తాను"
కుమార్ ఆమెకు ధైర్యం చెప్పాడు.
అతను ఏ ఉద్దేశ్యంతో అలాంటి హామీ యిచ్చినా తను కోలుకోవడానికి తన ప్రాణం అయిన టింకూను రక్షించటానికి అతను శ్రద్ధ చూపడం చూసి కృతజ్ఞత నిండిన చూపులతో కుమార్ ను సాగనంపింది.
కృష్ణప్రియ కోలుకున్న వెంటనే హాస్పిటల్ కు బయలుదేరింది.
చాలారోజుల తరువాత హాస్పిటల్ లో అడుగు పెడుతుంటే ఆమెకు ఏదో కొత్త అనుభూతి కలుగుతున్నది.
పచ్చని ఆమె శరీరం జ్వరంపడి పాలిపోవడంతో మరింత పచ్చగా అయింది. కొద్దిగా సన్నబడడంతో కొత్త అందాలను సంతరించుకున్నట్లు ఏదో కొత్తకళ కొట్టవచ్చినట్టు కనపడింది.