ఈలా-ఇల్లాలు
"తాయారూ" అని గట్టిగా అరిచాడు పాపారావు. జబ్బమీద వున్నా పురుగుని దులిపేసుకుంటూ నిర్లక్ష్యంగా చూసింది తాయారు. "నిన్నింట్లో ఈల వేసుకుంటూ తిరగొద్దన్నానా?" అన్నాడు కోపంగా.
"అంటే వీధిలో తిరగమనా దానర్ధం?" అంటూ వీధిలోకి పోబోయింది తాయారు. చెయ్యి పట్టుకొని ఆపుచేసి బాధగా- "తాయారూ! నన్నిలా ఎందుకు బాధపెడుతున్నావో తెలియడం లేదు. నువ్వెందుకులే - నేనే వెడుతున్నాను" అని బైటికి నడిచాడు పాపారావు.
దారిలో పాపారావుకి ఖాన్ ఎదురయ్యాడు. "ఏరా, పాపారావ్, ఈరోజు సెషన్స్ కి రావా? టూ ఫోర్లు ఆడదాం. రాఘవరావు కూడా వచ్చేడు" అని ఆహ్వానించాడు. పాపారావు విషాదంగా "సారీరా ఖానూ, ఈ రోజు నా మనస్సేం బాగాలేదు. నీవు వెళ్ళిరా" అన్నాడు.
ఖాన్ వెంటనే ఆముదం తాగినవాడిలా తన మొహాన్ని మార్చేసుకొని....."అరెరే పాపం...... నీమనసు కేమయిందిరా?" అన్నాడు. పాపారావుకి ఒళ్ళు మండింది. కోపంగా "ఒరేయ్ వెధవ్వేషాలు వెయ్యకు. నీ వెంత తైరు కొట్టినా నీకు నయాపైసా అప్పివ్వను. అందులోనూ పేకాటకి" అన్నాడు.
ఖాన్"ఛా! ఎత్తు పారలేదు" అందులోనూ వెళ్ళిపోయాడు.
పాపారావు తిన్నగా నడిచి పార్కులోకి వెళ్ళాడు. పొగడచెట్టు కింద వున్నా సిమెంటు బెంచీ మీద కూర్చొని ఆలోచించటం మొదలు పెట్టాడు.
తాయారు ఎందుకిలా చేస్తూంది? అసలీ అలవాటు తాయారు కెలా వచ్చింది-అని తర్కించుకున్నాడు. ఇదేదో అంతుపట్టని సమస్యలా మిగిలిపోయింది. సరే..... ఆలోచన్లలో పాపారావుని వదిలిపెట్టేసి అతని గత చరిత్రలోకి వెళదాం.
* * *
పాపారావు అసలు పేరు పాపారావే నాలుగయిదు సంవత్సరాలు కాపీకొట్టి చివరికి ఎలాగయితేనేం బి.ఏ. పాసయ్యాడు. ఉద్యోగాలకోసం చెడతిరిగి వ్యవసాయమే మంచిదని వాళ్ళ వూరు కొత్తపల్లి పోయాడు. తీరా కాడి పట్టుకొనేసరికి 'స్టేట్ బ్యాంక్' నుంచి ఇంటర్వ్యూ వచ్చేసరికి 'కాడి' వదిలేసి కాకినాడ పరుగెత్తుకొచ్చాడు. ఎలాగయితేనేం కాకినాడలో ఉద్యోగం సంపాదించగలిగాడు.
పాపారావు భూమికి ఓ అయిదు అడుగుల ఎత్తులో వుంటాడు. (అపార్ధం చేసుకోకండి. పాపారావు దయ్యమయిపోయాడని నా ఉద్దేశ్యం కాదు). నల్లగా వున్నా కనుముక్కుతీరా అదీ బాగుంటుంది. పోతే కొంచెం పిరికి గుండె.
బ్యాంక్ లో ఉద్యోగం అనగానే పెళ్ళికూతుళ్ళ తండ్రులు ఎగబడ్డారు. చివరికి నాలుగెకరాలు, పదివేల రూపాయలతో అలివేలు మంగతాయారుని పెళ్ళాడాడు.
తాయారు చిన్నతనంనుంచీ చాలా గారాబంగా పెరిగింది! ఒక్కతే కూతురు కావడం వల్ల 'ఆడింది ఆట, పాడింది పాట'గా సాగుతుండేది. అసలు తాయారుకి ఈల వేయడం అనే అలవాటు ఎలా వచ్చిందీ - అంటే అదో కథ.
చిన్నప్పుడు తాయారు వాళ్ళ స్కూల్లో అమ్మాయిలంతా డ్రామావేద్దామనుకొన్నారు. ఆ డ్రామాలో తాయారు రౌడీ! ఒక చోట ఈల వేయాలి. ఎలాగయినా ఈల వేయడం నేర్చుకోవాలి అనుకొంది. వాళ్ళ మాస్టారు మాత్రం "నీ కెందుకమ్మా శ్రమ. నీవు ఈలవేసే సమయానికి తెర వెనుకనుండి వేయిస్తాను" అన్నాడు.
"ఎందుకండీ? ఎలాగయినా నేర్చుకొనే పూచీ నాది" అంటూ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యను వేపుకుతింది. వాళ్ళ నాన్న రెండు వడ్డించినా ఏడవకుండా నిరాహారదీక్ష సాగించి పంతం నెగ్గించుకుంది. ఎలాగైతేనేం తాయారు ఇంట్లో రెండు రోజులపాటు ఈల ప్రాక్టీసు సాగింది. అలా నేర్చుకొన్న ఈ విద్య ఇలా లోతుగా పాతుకుపోయి పాపారావు మనసులో కలతలు రేపుతోంది. దానికితోడు చిన్నతనం నుంచీ గారాబంగా పెరిగిందేమో మొండి మనిషై కూర్చుంది.
ఉన్నట్టుండి అంతవరకూ నిశ్శబ్దంగా వున్నదల్లా చటుక్కున విజిల్ వేస్తుంది తాయారు. ఉలిక్కిపడి చూస్తాడు పాపారావు. ఎంతో బాధ వేస్తుంది. కోపం కూడా వస్తుంది. కానీ ఏం చేస్తాడు? పదివేలకి అమ్ముడు పోయాడు. ఏమైనా అంటే "మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి పెళ్ళాడాననుకున్నారా? పదివేలిచ్చి పెళ్ళి చేశాడు మా నాన్న" అని మొదలు పెడుతుంది. ఏమీ చేయలేని మగాళ్ళందరిలాగే పాపారావు కూడా భార్యకి 'వట్టి మూర్ఖపుమనిషి' అని బిరుదిచ్చుకుని ఇంకా వాదాలెందుకని సరిపెట్టుకున్నాడు.
అందరాడవాళ్ళూ ఏవో కీర్తనలో, లేకపోతే కనీసం సినిమా పాటలో పాడుకుంటూ పని చేసుకుంటారు. కానీ, తాయారు మాత్రం వంటింట్లో అనే ఏమిటి, బయట వరండాలో కూడా అప్పుడప్పుడూ చేతులు వెనక్కి కట్టుకొని విజిల్ వేస్తూ పచార్లు చేస్తూ వుంటుంది. పాపారావుకి మతిపోతూ వుంటుంది.
అంతెందుకు? ఎవరన్నా స్నేహితుడు వచ్చినప్పుడు చూడాలి. పాపారావు అవస్థ చచ్చిన చావు అవుతుంది. మాట్లాడుతున్నవాడల్లా లోపలినుంచి ఈల పాట ఏదయినా వినిపించగానే, తను మాట్లాడటం మానేసి పాపారావు ఈల వేయటం మొదలుపెడతాడు. అవతలివాడు తలమునకలయ్యేంతగా ఆశ్చర్యపోయి, "ఇప్పటివరకూ మాట్లాడాడు కదా! ఇంతలోనే ఏమొచ్చింది?" అనుకొని పాపారావువైపు భయంభయంగా చూస్తాడు. స్నేహితుడి అవస్థ గమనించి పాపారావు మొహం ఆముదం తాగినట్లు అయిపోయినా, విజిల్ మాత్రం తాయారు లోపల ఆపుచేసేంతవరకూ ఆపడు. పోనీ తను గట్టిగా మాట్లాడి లోపలనుంచి విజిల్ వినిపించకుండా చెయ్యవచ్చుకదా అనే అనుమానం ఇక్కడ రాకూడదు. ఎందుకంటే రైలుకూత కూడా తాయారు విజిల్ ని డామినేట్ చేయలేదు.
విజిల్ వేస్తున్నట్లు నటించటం అనేది పాపారావు ఒరిజనల్ ఐడియా కాదు. వాళ్ళ మామగారిది. ఆయన దాన్ని పాపారావుమీద ప్రయోగించి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేశాడు.
పెళ్ళి చూపులకి వచ్చి కుర్చీలో కూర్చునివున్న కుర్రాడిని చూసి సరదాగా విజిల్ వేసేది తాయారు (మనసులో ఇంకే ఉద్దేశ్యమూ లేదుసుమండీ). దానితో ఆ కుర్రాడూ, మిగతా పెద్దలూ బేజారెత్తి వెళ్ళిపోయేవారు. తాయారు నాన్నగారు నెత్తీ నోరూ కొట్టుకునేవారు. ఇలా రెండు మూడు సంబంధాలు తప్పిపోయాక తాయారు అన్నయ్యకి ఒక మంచి ఐడియా వచ్చింది. తాయారు నాన్న దగ్గిరకు వెళ్ళి "నాన్నా ఈ సారి వచ్చే సంబంధం మనకి సెటిల్ అయిపోయినట్టే. పెళ్ళి వాళ్ళని చూసుకోవడానికి రమ్మను" అన్నాడు.
"ఎలారా?" అన్నాడు వాళ్ళ నాన్న "నేను చెబుతాగా" అని భరోసా ఇచ్చేశాడు.
ముందు పాపారావు తాలూకు పెద్దలు వచ్చి చూసుకున్నారు. అదృష్టవశాత్తూ అప్పుడేమీ గొడవ చెయ్యలేదు మంగతాయారు. ఆ తరువాత కొద్ది రోజులకు పాపారావు కొంతమంది ఫ్రెండ్స్ తో అంటే ఖాన్, రాఘవేంద్ర, సూర్యంలతో అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాడు.
శుభ్రంగా కడుపునిండా టిఫిన్ తిన్న తరువాత బ్రేవ్ మని తేన్చి, అమ్మాయికోసం ఎదురు చూడసాగాడు పాపారావు. అంతలో తాయారు వచ్చింది. పాపారావును చూడగానే సరదాగా విజిల్ వేసింది. అంతలోనే పక్కనున్న అన్నయ్యకూడా గట్టిగా విజిల్ వేశాడు. పాపారావు చతుష్టయం ఈ విషయాన్ని గమనించలేక పోయారు. "తాయారు అన్నయ్య ఇంత మానర్లెస్ గా విజిల్స్ వేస్తాడేమిటా?" అని జాలిపడ్డారు కూడాను. అలా పాపారావు "విక్టిమ్" అయిపోయాడు. ఆ తరువాత ఈ సలహా చెప్పి స్నేహితుల బారినుంచి తప్పుకొనే మార్గం బోధించాడు మామగారు.
పాపారావుకి తన భార్య అలవాటు సంగతి ఎలా తెలిసిందంటే అదీ పెద్ద కథే.
మొదటి రోజు రాత్రి.....
పందిరి మంచం మీద పాపారావు కాలుమీద కాలేసుకుని జిలేబి తింటున్నాడు. కొంచెం భోజన ప్రియుడులెండి. అగరొత్తులూ, మల్లెపూల వాసనతో గది గుభాళిస్తూంది. పాపారావుకి బెదురుగానే వుంది.