Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 16

 

    పెట్టెముందు బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు కోదండరామయ్య.

    ఆయన పక్కనే చతికిలబడి కూర్చుంది వెంకుమాంబ.

    పెట్టెలో__

    బంగారు బిస్కెట్లు వుంటాయో, దిమ్మలు వుంటాయో, కడ్డీలు వుంటాయో తెలియదు. మొత్తానికి ఆ మూడింటిలో ఒకటి వుండవచ్చు. ఏదో ఒకటి బంగారం అయితే సరి.

    బంగారాన్ని ఏం చేయాలి? అని కోదండరామయ్య ఆలోచించలేదు. పెట్టెలోంచి తీసి వేరేచోట దాద్దాం అని తప్పించి వెంకుమాంబ మాత్రం చాలాదూరం ఆలోచించింది. వంకీలబంగారు జడ రాణీకాసుల పేరు ఆమెకి చాలా ఇష్టం. జడ పదార్ధం రోజులు పోయి ముడిపదార్ధం చుట్టే వయసు వచ్చింది కాబట్టి వంకీల బంగారు జడని లిస్ట్ లోంచి తొలగించింది. రాణీకాసుల పేరు వంద తులాలది చేయించుకోవాలనుకుంది. అలాగే మరికొన్ని ఆలోచనలు చేసింది.

    పెట్టెముందు కూర్చుని చేయి జాపి "ఊ" అన్నాడు కోదండరామయ్య.

    తాళం చెవుల గుత్తి అందించింది వెంకుమాంబ.

    తాళం చెవుల గుత్తులు వాళ్ళింట్లో అయిదు వున్నాయి. ఒక్కోతాళం గుత్తికి పదిహేను తాళం చెవులు వున్నాయి. ఆ చెవుల తాలూకా తాళాలు మాత్రం ఆ యింట్లో లేవు.

    కోదండరామయ్య అరగంటసేపు అన్ని తాళం చెవులూ ఉపయోగించి పురుష ప్రయత్నం చేశాడు.

    పెట్టె తాళం తెరుచుకోలేదు.

    ఎన్నాళ్ళనుంచో పోగుచేసి అతి పదిలంగా దాచిన నానాజాతి తాళం చెవులూ నిమకి నీరెత్తినట్లు వున్నాయిగాని అవసరానికి అణుమాత్రం కూడా పనికిరాలేదు.

    అట్లకాడ ఉపయోగించి, ఇనుప చువ్వసన్నటిది దూర్చి అటుతిప్పి ఇటుతిప్పి ఎంత కష్టపడ్డా ఫలితం సున్నా దగ్గరే ఆగింది.

    "లాభంలేదు పెట్టె పగలగొట్టాల్సిందే" అలసిపోయి చెమట తుడుచుకుంటూ అన్నాడు కోదండరామయ్య.

    "పెట్టె ఎలా పగలగొడతాము. అదేమన్నా చెక్కపెట్టా?" అంది వెంకుమాంబ.

    "పెట్టె అంటే పెట్టేకాదు. తాళం పగలగొడతాను. అలమారలో స్క్రూడ్రైవరు, రెంచి, శానం, మేకులు పెట్టిన అట్టపెట్టె వుంది. ఆ పెట్టె, సుత్తి తీసుకురా" అన్నాడు కోదండరామయ్య.

    వెంకుమాంబ మారు మాట్లాడకుండా వెళ్ళి తెచ్చింది.

    అప్పటికి గంటకాలం వృధా ఆయింది.

    పెట్టెకి వున్న తాళం చెవి దూర్చే కంతలో పెద్దమేకుని దూర్చి ఆ మేకుమీద సుత్తితో రెండు దెబ్బలు వేశాడు ఆ దెబ్బలకి దెయ్యం కదిలిరాలేదు. ఈ తఫా బలమంతా ఉపయోగించి గట్టిగా కొట్టాడు,

    "చప్పుడుకి వాళ్ళు లేస్తారేమో?" అంది వెంకుమాంబ.

    "ఈ చప్పుడు అక్కడిదాకా వినపడలేదులే" అంటూ మరో దెబ్బ గట్టిగా వేశాడు కోదండరామయ్య.

    పెట్టెకున్న తాళం పగిలిపోయింది.

    "అమ్మా! మహాలక్ష్మీ కరుణించావా!" సజలనేత్రాలతో రెండుచేతులూ జోడించింది వెంకుమాంబ.

    "కష్టే ఫలీ అన్నారు పెద్దలు" అన్నాడు కోదండరామయ్య.

    ఆ తర్వాత ఇరువురూ కలసి నెమ్మదిగా పెట్టె మూత చెరోవేపూ పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎత్తారు.

    పెట్టె వెడల్పున పరచిన బంగారం ట్యూబ్ లైట్ వెలుగుకి తళతళ లాడింది.

    "అమ్మో ఎంత బంగారమో" అంది వెంకుమాంబ.

    "నీ ముఖం. సరీగా చూడు అది బంగారంకాదు. గోల్డ్ కలర్ లో వున్న తళుకు కాగితం బంగారానికి పైన కప్పారు." అంటూ కాగితాన్ని తొలగించాడు. ఆ తర్వాత పేర్చిన చెక్కలు లాంటివి వుంటే వాటినితీసి కిందపెట్టాడు. పెట్టెలోంచి ఏదోవాసన వస్తుంటే ముఖం చిట్లిస్తూ బిగగొట్టినట్టున్న బండ చెక్కని పైకి బలంగా లాగాడు కోదండరామయ్య.
   

 Previous Page Next Page