"అరగంట నుంచి కొడ్తున్నాను. ఏం చేస్తున్నావ్?" కోపంగా అరిచాడు.
"బెల్ మ్రోగటం లేదండీ. పాడయిందేమో....."నెమ్మదిగా అంది.
గేటు బయటున్న స్నేహితుడు, విష్ణు క్షేమంగా లోపలికి వెళ్తున్నాడని నిశ్చయించుకుని. "గుడ్ నైట్ బ్రదర్" అని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
"బెల్ మ్రోగటం లేదని నాకూ తెలుసు. అందుకే తలుపు బాదుతున్నాను" అన్నాడు.
"బాగా నిద్రపట్టేసినట్టుంది...."
"మధ్యాహ్నమంతా ఏంచేస్తావ్? నిద్రపోవటం లేదా?"
"తలనొప్పిగా వుండింది"
"తీరిక ఎక్కువైతే తలనొప్పి వస్తుందట....."
"తీరిగ్గా ఇప్పుడీ అర్థరాత్రి ఆ కబుర్లన్నీ దేనికండీ. పడుకోండి."
"అంటే నేను చాలా తీరిగ్గా అర్థరాత్రి వరకూ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసి కబుర్లు చెబుతూ వుంటననేగా వుద్దేశ్యం...."
"నాకే ఉద్దేశ్యాలు లేవుగానీ, మీరు పడుకోండి" అంది ఆవులిస్తూ ఆమెకు నిజంగానే తలనొప్పిగా వుంది.
"నేను పడుకోను"
"మరేం చేస్తారు"
"ఇంకా డ్రింక్ చేస్తాను"
"ఎందుకలా ఆరోగ్యం పాడుచేసుకుంటారు?"
"నా ఆరోగ్యం పాడవదు. నాకు నీలా మధ్యాహ్నం పూట తలనొప్పులూ, నెలకొకసారి కడుపునొప్పులూ రావు. ఐయామ్ హెల్దీ! అసలు నేనెంత కష్టపడతానో నీకేం తెల్సు? అందుకే నా ఇష్టంవొచ్చినట్టు రిలాక్స్ అవుతాను. కొంచెం డ్రింక్ ఇవ్వు".
"లేదు"
"ఏమైంది?"
"నిన్నే అయిపోయింది"
"ఎవరు తాగారు"
"నేను తాగాను. సరా...." మాట పూర్తి కాలేదు.
ఆమె చెంప ఛెళ్ళుమంది. వెటకారం సహించలేక..... మాటకు మాట చెప్పిందనో.....
అదే మొదటిసారి ఆమెనతడు కొట్టటం.......
2
"హల్లో..."
"ఎవరూ?" ఎడిటర్ అడిగాడు.
"నేనండీ. లక్ష్మిని. స్క్రిప్టు పూర్తిగా చివరివరకూ వ్రాసి పంపాను అందిందా?"
ఆయన చివరి వరకూ వినలేదు. పేరు చెప్పగానే. ".......మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను" అన్నాడు ఎగ్జయిటింగ్ గా. "రెస్పాన్స్ చాలా బావుంది. ఇంకా కొన్ని వారాలు పొడిగిస్తే బావుంటుంది."
"పొడిగించటానికి అందులో కథే మిగల్లేదు కదండీ...."
"అదేమిటమ్మా. మా రచయితలందరూ......'సమాప్తం' అని వ్రాస్తే మళ్ళీ ఛాన్సు దొరకదేమో అన్నట్టు నలభై ఏభై వారాలు వ్రాస్తూనే పోతారు కదా"
ఆమె మొహమాటంగా "నేనంత చేయి తిరిగిన రచయిత్రిని కానండీ అంది.
"ఎక్కువ వ్రాయటానికి చేయి తిరగనక్కర్లేదమ్మా. క్లుప్తంగా ముగించటానికి కావాలి. పోనీ ఈ నవల అయిపోగానే మరొకటి ప్రారంభించు. వెంటనే కంటిన్యూ చేద్దాం"
"అయ్యో...నాకసలు రచనల గురించి ఏమీ తెలీదండీ. మనసులో ఏవో భావాలు వస్తే పేపర్ మీద పెట్టానంతే. అదృష్టవశాత్తూ మీకు నచ్చి ప్రచురిస్తానన్నారు. నేనవరో తెలియకుండా, అడ్రసు కూడా లేకుండా, సగం స్క్రిప్టుతో ప్రారంభించినందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు."
"అడ్రసంటే గుర్తొచ్చింది. నువ్వొకసారి పత్రికఫీసుకొస్తే మా ఫోటోగ్రాఫర్ తో ఫోటోలు తీయించి ఇంటర్వ్యూ ప్రచురిస్తాను."
"అమ్మో వద్దండీ" కంగారుగా అంది లక్ష్మీ "నా గురించి ఏ వివరాలూ బయటకు రావటం ఇష్టం లేదు. అందుకే అడ్రసు కూడా ఇవ్వలేదు."
"అవును. అదే నేనూ అడుగుదామనుకుంటున్నాను. అడ్రసు కూడా ఇవ్వనంత రహస్యమేముంది దీంట్లో?"
"ఏం చెపుతుంది? తన భర్తకి తను వ్రాసిందని తెలిసి.....అతను చదివితే.... తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెట్టుకుందని అతను అనుకుంటే.....అసలు తనలో ఇంత అసంతృప్తి వుందని తెలిస్తే.....ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవటం గురించి...భర్త అసమర్థత గురించీ తను వ్రాసింది చదివితే.
ఆపైన ఆలోచించలేకపోయింది.
ఈలోపులో ఎడిటర్ అన్నాడు.... "సర్లే. నీ అడ్రస్ నా కన్నా చెప్పమ్మా. పారితోషికం పంపించాలి కదా!"
పారితోషికం!
మొదటి సంపాదన.....!
మన దగ్గర ఎంత డబ్బుందని కాదు. మొదటి పారితోషికం. అదీ రచన కొచ్చినదైతే ఆ అనుభూతి వర్ణనాతీతం!
ఆమె కాదనలేకపోయింది.
"మరెవరికీ చెప్పకండి"
"నేనెందుకు చెప్తానమ్మా? అందులోనూ నువ్వు మరీ అంత చెప్పాక! ఒకటి మాత్రం నిజం. నువ్వు మళ్ళీ ఇంకో నవల వ్రాస్తే మాత్రం నాకే పంపు"
"నాకంత శక్తి లేదండీ" అంటూ ఆమె తన అడ్రస్ చెప్పింది.
ఆ తరువాత వారం రోజులకి ఆమెకి పోస్ట్ లో చెక్ వచ్చింది.
ఇది జరిగిన మరో నాలుగు రోజులకి పబ్లిషర్ నుంచి ఉత్తరం వచ్చింది. ఈ నవల ప్రచురింటంలో తమకి ఆసక్తి వుందనీ, రాయల్టీ విషయం మాట్లాడటంకోసం ఆమె వచ్చినా సరే.....లేదా.....తాము వచ్చి మాట్లాడతామని.
తన అడ్రస్ ఎలా తెలిసిందా అని ఆమె కంగారు పడింది. తురువాత గుర్తొచ్చింది..... ఎడిటర్ కి ఇచ్చిన విషయం.
........ఆమె కొంచెం ఆలోచించింది. పుస్తకాల్ని ఇంటికి తీసుకురాకపోతే భర్తకి తను రచయిత్రినని తెలిసే అవకాశం లేదు...! ఆ నిర్ణయానికి వచ్చాక, ఉత్తరంలో ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసింది.
తానెవరో ఆమె చెప్పగానే అట్నుంచి ఎవరో నమ్రతగా "మీరు మా దగ్గరికి రాగలరా మేడమ్" అని అడిగారు. ఆమె కోరిక కూడా అదే. తమింటికి పరాయి వ్యక్తులు రావటం విష్ణుకి ఇష్టం వుండదు. అందులోనూ పబ్లిషర్స్ అంటే....మొత్తం తెలిసిపోయే ప్రమాదం వుంది.
ఆమెకి తన మీద తనకే జాలివేసింది. ఒక భార్య తన మనసులోని నిర్లప్తతని భర్తకు చెప్పుకోలేని ప్రపంచం ఇది. చెప్తే ఎక్కడ కోపగించుకుంటాడో అని ఆలోచించవలసిన దౌర్భాగ్యం.
"మీకు అభ్యంతరమా మాడమ్?"
ఆమె తెప్పెరిల్లి..... "అబ్బే లేదండీ. నేను వస్తాను" అంది. అతను అడ్రస్ చెప్పాడు. అక సాయంత్రం అయిందింటికి ఆమె ఆ అడ్రస్ కి బయల్దేరింది.
అంతకు పదిరోజుల క్రితం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తనకు తెలియకుండా దాదాపు వంద ఫోటోలు తీసాడని ఆమెకు తెలీదు.
ఆమె వెళ్ళేసరికి గేటు దగ్గర ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. వినయంగా విష్ చేసి ఆమెని లోపలి తీసుకెళ్లాడు. ఎత్తయిన విశాలమైన సింహద్వారం! అది షాపులా లేదు. చాలా రిచ్ గా వుంది. ముందో గదిలావుంది. రెండువైపులా గోడలున్నాయి. పెద్ద పెద్ద తెరలు.....! గదిలో చాలా ఖరీదైన సోఫా సెట్ వుంది. మధ్య బల్లమీద పుస్తకాలున్నాయి. గోడలకు అమర్చిన స్పీకర్స్ లోంచి మ్యూజిక్ వస్తోంది.
బీతోవెన్.
బీతోవెన్ మ్యూజిక్ ఎప్పుడూ మంద్రస్వరంలోనే వినాలి. అది తెలిసే తక్కువ స్థాయిలో పెట్టినట్టున్నారు. వారియొక్క టెస్టుకు మనసులో మెచ్చుకోకుండా వుండలేకపోయింది. ఏ పాత ఎలా వినాలో తెలుసుకోవటం కూడా కళే.
స్పీకర్ సింఫోని నెం. 5 - ఎల్ గ్రో కాన్ బ్రియో బీతో వెన్ వస్తోంది. సెంటు స్ప్రే చేసినట్టున్నారు. గదిలోని గాలంతా మందమైన పరిమళంతో నిండివుంది. అంతా నిశ్శబ్దంగా వుంది. అంత నిశ్శబ్దంలో.....గాలిలోంచి తెలివస్తున్నట్టు వంద వయోలిన్ ల నాదం మనసుని ఎక్కడికో తీసుకు వెళ్తూంది. వాటిమధ్య అప్పుడప్పుడు వినపడుతూన్న పియానో, సెక్సాఫోన్ గతులు మనసుమీద లయబద్దంగా అడుగులేస్తూన్నట్టున్నాయి. ఆమె ఆ స్వరాన్ని అస్వాదిస్తూండగా "లోపలికి రండి మిస్ లక్ష్మి" అని వినిపించింది.
ముందామె ఆ మాటలు కూడా పాటలో ఒక భాగంగా స్పీకర్ లోంచి వచ్చాయనుకుంది. అంత మధురంగా, గంభీరంగా వున్నదా స్వరం. అది తన కోసం పిలుపు అని అర్థమై ఆమె తన పొరపాటుకి నవ్వుకుంటూ తెరలు తొలగించింది.
ఏదో రాజభవనపు ముఖద్వారానికి కట్టినట్టున్న విశాలమైన ఆ తెరలమధ్య నుంచి ఆమె..... లోపలి హాలులోకి ప్రవేశించింది.
పాట పూర్తయి కన్సర్ట్ ఆగిపోయింది.
లోపలికి ప్రవేశించిన లక్ష్మి..... అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయి ఆగిపోయింది. అకస్మాత్తుగా అలుముకున్న నిశ్శబ్దం ఆ దిగ్భ్రమకు మరింత మూడ్ ని జతకూర్చింది.
అది విశాలమైన హాలు. ఆఫీసు కాదు. నాలుగువైపులా ఎత్తయిన గోడలు. మధ్యలో నిలువెత్తు స్థంభాలు. గోడలకి పెద్ద పెద్ద చిత్రాలున్నాయి. నిలువెత్తువి. రకరకాల భంగిమల్లో....
అన్నీ ఆమెవే.
నిల్చున్నవి..... కూర్చున్నవి..... నవ్వుతున్నవి.... ఏదో పనిచేసుకుంటూ పరధ్యానంలో వున్నవి....క్లోజప్ లు.....పోర్ట్రేట్ లు....
తను చూస్తున్నది కలో నిజమో తెలియని స్థితిలో ఆమె అడుగు ముందుకేసింది.
బీతోవెన్ కన్సర్ట్ లో "టర్కిష్ మార్చ్" సింఫోనీ మొదలైంది. ఆమె అడుగులకు లయబద్ధంగా యాదృచ్చికంగా అది మ్యాచ్ అయినట్టుంది.
ఆమె నడుస్తూ ముందు కెళ్తూంటే.....ఒక్కొక్క నిలువెత్తు చిత్తరువూ.... వరుస తాటిచెట్ల మధ్య మనిషి నడుస్తుంటే చెట్లు వెనక్కి వెళ్ళినట్టు వెళుతున్నాయి. ఆమె ఆగి వున్నట్టు, అవి కదుల్తూన్నట్టు చిత్రమైన అనుభూతి.
ఆమె అయోమయంతో, ఉద్వేగంతో ఆ చిత్రాలకేసి చూస్తోంది. అంతలో "గుడ్ ఈవినింగ్" అని వినిపించింది. ఆమె ఉలిక్కిపడి అటూ చూసింది.
చిత్రాల్లో చిత్తరువుగా కలిసిపోయి వున్నాడు ప్రహసిత్! ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది. బీత్ వెన్ మ్యూజిక్ ఒక్కసారిగా ఉచ్ఛస్వరంలోకి చేరుకుంది.
అతడు బొమ్మల మధ్యనుంచి బయటకు వస్తూ మళ్ళీ ఒకసారి 'గుడ్ ఈవెనింగ్' అన్నాడు. ఆమె ఇంకా దిగ్భ్రమ నుంచి తేరుకోలేదు. అతడివైపు బ్లాంక్ గా చూస్తోంది.
అతడు చిరునవ్వుతో, "......మన కలయిక ఇంతకన్నా బాగా ఎలా ఏర్పాటు చేయాలో నాకు తోచలేదు. నేను మీలా రచయితని కానుగా" అన్నాడు.
హాల్లో లైటు వెలుతురు - ఒక నిలువెత్తు బొమ్మలో ఆమె కట్టిన ఎర్ర చీర పైబడి ఆమె ప్రస్తుతం కట్టుకున్న నీలం చీరపై ప్రతిబింబించి, వెల్వెట్ కలర్ గా పరివర్తనం చెందుతోంది.