Previous Page Next Page 
13... 14.... 15 పేజి 15


    "........చాలా రహస్యాలు తెలుసుకున్నావే" అన్నాడు.

    ఆమె కూడా వెనక్కి తగ్గదల్చుకోలేదు. "అవును. తెలుసుకున్నాను. అందుకే నీక్కాబోయే భార్యగా ఇవన్నీ ఆపమని అర్థిస్తున్నాను" అంది.

    "ఆపకపోతే?" తాపీగా అన్నాడు.

     ఆమె నిరత్తురాలై చూసింది. అతడు గర్వంగా అన్నాడు.

    "నేను నాకున్న విద్యతో డబ్బుసంపాదించదల్చుకున్నను. నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గరకొచ్చి ఫీజు ఇస్తున్నారు. ఇందులో మోసం ఏమీ లేదు. నా విద్య...."

    "విద్య.....విద్య.....విద్య...." ఆమె అరిచింది. "ఏమిటి నీ విద్య? నీకంత విద్యే వుంటే నీ చెల్లెళ్ళిద్దరూ ఏడో క్లాసు ఎందుకు ఫెయిలవుతారు? వారి జ్ఞాపకశక్తిని ఎందుకు పెంచలేకపోయావన్న అనుమానం నీ పేషెంట్లలో ఒక్కరికీ రాలేదా?"

    అతడు నవ్వి "రాలేదు" అన్నాడు.

    "నన్ను నీ వశీకరణ శక్తితో అయిదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళు. మన  మొదటి పరిచయం నాడు ఏమి మాట్లాడుకున్నామో చెప్పించగలవా?"

    "చెప్పించలేను"

    "నీ థెరపీ ద్వారా నీ తండ్రిగారి చుట్ట అలవాటు ఎందుకు మాన్పించలేదు?"

    "మానటం ఆయన కిష్టం లేదు" అంటూ అతడు కుర్చీలోంచి లేచి ఆమె  దగ్గరగా వచ్చాడు. "చూడు  మధూ! అసలు విషయం చెప్తాను విను. డాక్టరు విశాల్ మైండ్ హిప్నో మాగ్నో క్లినిక్ ని నీలాటి వెయ్యిమంది కలిసినా వ్యాపారం చేయటం మంచి పద్ధతి. నువ్వన్నట్టు ప్రజలు మూర్ఖులు. తాము కష్టంలోకి బయటపడటానికి ఏ చిన్న ఆధారం దొరుకుతుందా అని చూస్తూంటారు. ఈ  బలహీనతని క్యాష్ చేసుకోవటం అన్నది అన్ని రంగాల్లోనూ వున్నదే. దీని గురించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు. వచ్చే ఏడాదికల్లా నేను కారుకొంటాను. నా భార్యగా నీకు అన్ని సౌఖ్యాలూ లభిస్తాయి."

    "వొద్దు రాజూ! ఇంతమంది అమాయకుల ఉసురుతో సంపాదించి ఆ డబ్బు మనకి ఏ సౌఖ్యాన్నీ ఇవ్వదు. ఆ ఆలోచన మానుకో."

    "ఏ ఆలోచన? క్లినిక్ మూసేయటమన్న ఆలోచనా? నీతో జీవితం పంచుకోవటమన్న ఆలోచనా?"

    అతడు చాలా తాపీగా అన్న ఆ మాటలకి ఆమె బాంబు పడ్డట్టు అదిరిపడింది. ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఈ లోపులో అతనన్నాడు.... "నువ్వూ నేను ఒకప్పుడు సాధారణమైన మనుష్యులం. నీ కళ్ళముందే నేను ఎదిగిపోయాను. నాతోపాటే నిన్నూ పైకి లాగుదామనుకున్నాను. కానీ నువ్వు.....? చేతకాని వాళ్ళందరూ చెప్పే నైతిక సిద్దాంతాల్నే చెపుతున్నావు. నీకు హాయిగా బ్రతకటం చేతకాదు. నిన్ను ప్రేమించాను కాబట్టి మాటమీద నిలబడి నీతో కలిసి జీవించాలనుకున్నాను. కానీ నీకు నా మీద గౌరవం లేదు. ఏడాది తిరిగేసరికల్లా నా చుట్టూ ఎంతమంది అమ్మాయిలు క్యూలో నిలబడతారో చూడు. నేన్నీకు అంతగా నచ్చకపోతే నిరభ్యంతరంగా నన్ను వదిలేయ్యొచ్చు. ఒక విధంగా అది మనిద్దరికీ మేలు....."

    ఆమె  నోటమాటరానట్టు అలాగే వుండిపోయింది. అతనన్నాడు "ఈ  విషయమై గత కొద్దిరోజులుగా నేనూ ఆలోచిస్తూనే వున్నాను. నా మీద గౌరవం లేని నిన్ను ఎందుకు ప్రేమించాలి? నీ కోసం ఎందుకు మారాలి?"

    ఒక నిర్ణయానికి వచ్చిందామె. అతడేం చెప్పదల్చుకున్నాడో ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. నవ్వింది "......నీ  అద్భుతమైన వాదనాపటిమని నా మీద ప్రయోగించకు రాజూ.....నాకు తెలిసిందిలే. ఇప్పుడు నీ ఆర్థిక స్టేటస్ వేరు. నీకు నా కన్నా అందమైన, డబ్బున్న అమ్మాయిలు దొరుకుతారు. నన్ను వదిలించుకోవాలన్న ఆలోచన నీకు ఎప్పట్నుంచో వుంది. ఇప్పుడా అవకాశం దొరికింది. కానీ ఒక్క విషయం జాగ్రత్త. పెళ్ళికూతురుగా నీ దగ్గరకొచ్చే ఆడ పేషెంట్లని మాత్రం ఎన్నుకోక. వారు మానసిక రోగగ్రస్తులాయి వుండే ప్రమాదం వుంది."

    అతడి మొహం ఎర్రగా మారింది. "నీ సలహాకి థాంక్స్....."అన్నాడు, ఇక నువ్వెళ్ళుచ్చు అన్నట్టుగా!

    ఆమె వెళ్ళబోయి ఆగింది...... "అయిదుసంవత్సారాలు ప్రేమించుకున్న వారు కూడా విడిపోవాల్సి వచ్చినప్పుడు ఇంత నిర్ధాక్షిణ్యంగా ఒకరిమీద ఒకరు నెపం వేసుకుంటారన్నది చూస్తూంటే.....నాకు  ప్రేమ మీదే నమ్మకం పోతోంది."

    "నెపం వేసింది నేను కాదు. నువ్వు."

    "ఒకరోజు నువ్వు  చేస్తున్న పనికి తప్పక పశ్చాత్తాప పడతావ్ రాజూ!"

    "ఫారిన్ కారులో నా భార్యతో నీ కళ్ళముందే తిరిగినప్పుడు పశ్చాత్తాప పడేదెవరో......తెలుస్తుందిలే."

    "వెళ్లొస్తాను రాజూ. అయిదు సంవత్సరాలు స్నేహితురాలిగా ప్రేమని పంచినందుకు థాంక్స్"

    "సేమ్ టు యూ. గుడ్ బై అండ్ గుడ్ బై ఫరెవర్." అన్నాడు రాజు.

    అశృపూరితమైన కళ్ళని అతడు చూడకుండా ఆమె కదిలి, నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళబోతూ ఒక మాట మాత్రం అనుకుంది. "ఇదంతా వేదన కలిగిస్తే కలిగించవచ్చుగాక! ఈ నిర్ణయానికి మాత్రం నేను ఎన్నడూ బాధపడను....."

    .....ఆమె వెళ్ళాక ఆ గదిలోకి తిరిగి స్ఫోటకం మచ్చల వ్యక్తి ప్రవేశించాడు. సంభాషణ అంతా విన్నట్టు అతడి మొహమే చెపుతోంది.

    "గుడ్ మిస్టర్ రాజూ. మంచి నిర్ణయం తీసుకున్నావ్. ఈ అమ్మాయి ముందునుంచీ నాకెందుకో 'డేంజర్' గానే తోచింది. ఇంతకన్నా మంచివాళ్ళు నీకు  లక్షలమంది దొరుకుతారు" అన్నాడు.

    "థాంక్యూ డాక్టర్ విశాల్" అన్నాడు రాజు.

                         మూడో అధ్యాయం

    లక్ష్మికి నాల్రోజుల్నుంచీ మనసు మనసులో లేదు.

    తన ఫోన్ నెంబరు మధూహ ప్రహసిత్ కి ఇచ్చిందని తెలుసు. అయినా అతడినుంచి ఫోన్ రాలేదు. వస్తే ఏంచేయాలా అని ఇంతకాలం ఆలోచించింది. ఎలా తప్పించుకోవాల అనుకుని భయపడింది. ఇప్పుడు 'ఎందుకురాలేదా' అని ఆలోచిస్తూంది. ఈ మనసనేది చాలా గమ్మత్తయినది.

    దానికి సామాజిక విలువలు, నైతికపరమైన తప్పోప్పులూ...ఏవీ అవసరం లేదు. తనిష్టం వచ్చినట్టు ఆలోచించుకు పోతుందంతే. అది వెళ్ళేదారిలో ఊహల పూవులుండవచ్చు. బాధల ముళ్ళుండవచ్చు. దేన్నీ పట్టించుకోదు.  ఆనందిస్తుంది. విషాదిస్తుండి. కొంచెంసేపు నిర్లిప్తంగా వుంటుంది. కొంచెంసేపు కేరింతలు కొడుతుంది. దాని ఆలోచనలకి కళ్లెంవేసి ఆపుచేయటం ఎవరికీ సాధ్యం కాదు. ఆలోచనలకి ఆనకట్టవేసే యంత్రం కనుక్కోబడలేదు. ఆమెకి లక్ష అనుమానాలొచ్చాయి. తను లేనప్పుడు అతడు ఫోన్ చేస్తే తన భర్త రిసీవ్ చేసుకున్నాడేమోనన్నది మొదటి అనుమానం. దానివల్ల  ఒకరకంగా ఆమెకి సంతోషం కలిగింది. తను వివాహితనని అతడికి తెలుస్తుంది. దాంతో ఇక ఆ ఆలోచన మానుకుంటాడు. అదీ సంతోషం.....

    నిజంగా సంతోషమేనా?

    ని....జం.....గా....నా?

    ఆమెకు భర్తంటే చాలా ఇష్టం. పెళ్ళికి ముందూ, పెళ్ళయిన కొత్తలోనూ చాలా కలలు కన్నది. తనూ, తన భర్తా....కాలక్రమేణా పిల్లలూ..... సంసారం...... మొదట్లో చిలిపి అల్లర్లూ.... తరువాత్తరువాత గాంభీర్యంతో కూడిన పెద్దరికం.....మనవలు. మనవరాళ్ళు...హుందా అయినా వృద్ధాప్యం.... అంతకన్నా ఏమీ  కోరుకోలేదామె. కానీ అవి కూడా పెద్ద కోరికలేనని ఆమెకు త్వరలోనే తెలిసింది.

    పెళ్ళయిన మొదట్లో భర్త బాగానే వుండేవాడు. బావుండటమంటే మరీ ఆప్యాయత లొలకబోసి..... నువ్వే  నా ప్రాణమని.....నువ్వు లేనిదే నేను బ్రతకలేననీ.......నా అదృష్టం కొద్దీ నువ్వు నా అర్థాంగివయ్యావనీ.....ఇలాంటి నాటకీయత ఏమీ  వుండేది కాదుగానీ, ప్రేమగానే చూసుకునేవాడు.

    కానీ అది చాలా కొద్దికాలం మాత్రమే. ఒకే స్టేషన్ నుంచి రెండు వేర్వేరు గమ్యాలకి బయల్దేరిన రైళ్ళు క్రమక్రమంగా ఎలా దూరమవుతాయో, అలా  మానసికంగా దూరమయ్యారు ఇద్దరూ. తను చాలా తెలివైన వాడినని అతడి నమ్మకం. తనకున్న ప్రతి చిన్న నైపుణ్యాన్నీ భూతద్దంలో చూపిస్తూంటాడు. 'నువ్వు సంపాదించుచూద్దాం.....', 'సంపాదిస్తే తెలుస్తుంది' లాటి పదాలు అతని సంభాషణలో తరచూ దొర్లుతుంటాయి. రాత్రి స్నేహితులతో గడిపి ఆలస్యంగా వస్తే. "పగలంతా పని చేసి అలసిపోయిన వాడికి ఆ మాత్రం రిలాక్సేషను కావాలి. నీకేం? అరగంటలో వంటచేసి టి.వి. చూస్తూనో.....కబుర్లు చెప్తూనో కూర్చుంటావ్" అంటాడు. ఈ '.....నీకేం' అన్న పదం అవతలి వాళ్ళ మనసుల్ని ఎంత గాయపరుస్తుందో అని ఆలోచించడు.

    పెళ్ళయిన కొత్తలో అతడు ఆలస్యంగా వస్తే, ఎంత రాత్రయినా అలా ఎదురుచూస్తూ కూర్చొనేది....ఒకవేళ అతడు బయటే భోజనం చేసి వస్తే, ఒంటరిగా తినబుద్ధిగాక గిన్నెలు సర్దేసి పడుకునేది. అతడు తనకోసం ఎదురుచూడవద్దనేవాడు. ఆమెకి నిద్రపట్టేది కాదు. అది భయం కూడా కాదు. అదోలాటి స్థబ్దత. బెడ్ రూమ్ లో మంచంమీద పడుకుంటే బెడ్ ల్యాంప్ చుట్టూ పరుచుకుని వున్న చీకటి ఒంటరితనాన్ని బాగా గుర్తుకు తెచ్చేది. రాత్రి నిశ్శబ్దం దిగులుగా ఏదో పారేసుకున్నట్టు వుండేది. పిల్లలు లేకపోవటంకన్నా ఈ నిశ్శబ్దమే ఎక్కువ దుఃఖం కలిగించేది. ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి సినిమాలకీ వెళ్ళటం ఇష్టం వుండేదికాదు.

    అందులోనూ ఆమెది మంచి సౌందర్యం అవటం కూడా కష్టానికే వచ్చింది. రెండు రకాల కష్టాలు. బయట జనం ఒక కష్టం. ఇరుగు పొరుగు వారితో మరొక  కష్టం. ఆమె అందానికి ఈర్ష్యపడి, దాన్ని దాచుకోలేక.....ఆమెకి పిల్లలు పుట్టకపోవటాన్ని దానితో కాంపెన్సేట్ చేసి సంతృప్తిపడేవారు. సానుభూతి చూపిస్తున్నట్టే మాట్లాడి మనసుని మరింత గాయపర్చేవారు. దాంతో ఆమె పూర్తిగా ఇంట్రావర్ట్ అయిపోయింది. దినమంతా ఇంట్లోవుండి అసూర్యంపశ్య  అయింది. దాంతో ఆమె అందం ద్విగుణీకృతమైంది. స్త్రీ నిజమైన అందం16 -20  మధ్య  వయసులో కాదు. 20 -28 మధ్య వుంటుంది. సౌష్టవాన్ని సరిగ్గా కాపాడుకోగల్గితే! కానీ  దురదృష్టవశాత్తూ ఒక వయసు దాటేసరికి చాలామంది మనుష్యులకి తమ మీద తమకి ఇంటరెస్టు పోతుంది. ఆమె మాత్రం రెగ్యులర్ గా వ్యాయామం చేసేది. మీద తమకి ఇంటరెస్టు పోతుంది. ఆమె మాత్రం రెగ్యులర్ గా  వ్యాయామం చేసేది. తండ్రి నేర్పిన మంచి అలవాట్లలో అదొక్కటి. దాంతో శరీరం బిగువుగా వుండేది. చెప్తే తప్ప పెళ్ళయింది అని ఆమెని చూసి తెలుసుకోవటం కష్టం.

    అదే ఆమెనిప్పుడు కష్టాల్లో పడేసింది.

    పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెత ఆమె పట్ల నిజమైంది. విష్ణు ఆమె అందాన్ని ఎప్పుడూ గుర్తించినట్టే మాట్లాడేవాడు కాదు. ఆ ఒక్క  విషయమే కాదు. వంట బాగా చేసిన రోజు, శ్రద్ధగా అలంకరించుకున్న రోజు  కూడా పట్టించుకునేవాడు కాదు. ప్రశంసా పూర్వకం సంగతి సరే..... కనీసం చూసేవాడు కాదు. ఆమె దానికి అలవాటు పడిపోయింది.

    అతడు ఆలస్యంగా రావటానికి కూడా!

    భోజనంచేసి పడుకునేది. అతడొచ్చి కాలింగ్ బెల్ కొట్టేవాడు. నిద్రమత్తులో వెళ్ళి తలుపు తీసేది. భోజనం  చేస్తానంటే వడ్డించటం.....లేకపోతే మళ్ళీ వెళ్ళి పడుకోవటం.....ఒకరోజు గడిచినట్టు మరుసటి దినం తెల్లవారేది.

    ఒకరాత్రి ఆమె అలాగే పడుకుని నిద్రపోతూంది. అర్థరాత్రి దాటి గంటపైగా అయింది. తలుపు దబదబా బాదిన శబ్దం వినిపించి హఠాత్తుగా నిద్రలోంచి మేల్కొంది.

    కాలింగ్ బెల్ పనిచేయటం లేదని అర్థమవటానికి అర నిముషం పట్టింది. దాదాపు పరుగెత్తున్నట్లు వెళ్ళి తలుపు తీసింది. అప్పటికే విష్ణు తూలిపడటానికి సిద్ధంగా వున్నాడు. అతడిని స్కూటర్ మీదా డ్రాప్ చేయటానికి వచ్చిన స్నేహితుడు గేటు బయటే ఆగి చూస్తున్నాడు. 

 Previous Page Next Page