అంతటి స్థాయికి ఎదిగిన మనోహర్ ఓ దుర్మార్గుడి చేతిలో బలైపోతాడేమోనని కమలినికి ఆందోళనగా వుంది.
అనుపమకు అలాంటి ప్రమాదం జరిగిందని తనకింతవరకు తెలియదు. కనీసం అనుపమయినా చెప్పలేదు. ఇంతకాలం బడబాగ్నిలా తమ గుండెల్లోనే ఆ అవమానాన్ని దాచుకున్న అన్నాచెల్లెల్ని ఎలా అర్థంచేసుకోవాలో తెలియలేదు మంగళకు. పెళ్ళీడుకొచ్చిన తన చెల్లెలికి జరిగిన అవమానం బయటపడితే ఆమె భవిష్యత్ నాశనం అవుతుందని మనోహర్ దాన్ని సమాధి చేశాడని మంగళకు తెలియదు.
* * *
మధు చక్రవర్తి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగేవరకూ తన పని ఎలా సాధించుకోవాలో తట్టక ఒకటే గింజుకున్నాడు. ఫోన్ చేయాలా బాస్ కి? చేస్తే తాను అసమర్థుడి క్రింద లెక్క. ఎలా? ఆలోచిస్తూనే ఎయిర్ పోర్ట్ బుక్ స్టాల్ దగ్గరకు నడిచాడు. చుట్టూ పరికించి చూశాడు. దగ్గర్లో నలుగురై దుగురు యువతులున్నారు. రిటన్ టికెట్ కలెక్ట్ చేసుకొనేందుకు రంజీతా కోసం ఎదురుచూస్తున్నాడు.
మోడల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకొనే వారికి భయం, పిరికితనం సంకోచం వుండకూడదు. ఎక్కడ అందమైన అమ్మాయిలు కనపడ్డా వారికి ఫర్ ఫెక్టు ప్రొఫైల్, ఫేస్ ఫీచర్స్ వున్నాయా అని పరిశీలించాలి. అవి బావుంటే దూరంగా వుండి వారిమాటతీరు, లిప్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్ బాగా గమనించాలి. ఫరవాలేదు మోడల్స్ గా పనికొస్తారకుంటే తక్షణం మనం ప్రసన్నంగా మారిపోయి పలకరింపు నవ్వుతో వారి ముందుకు వెళ్ళాలి.
మగడాయితే హలో హేండ్సమ్ అని, అమ్మాయి అయితే హలో స్మార్ట్ మొదలెడితే వారి ఎటన్షన్ మనవైపు డైవర్ట్ అవుతుంది.[ఇది జెనరల్ హ్యూమన్ వీక్ నేస్] అప్పుడు మన విజిటింగ్ కార్డ్ ఇవ్వాలి. అది చూడగానే ముక్కు, మొహం తెలియకుండానే మనం వారిని అలా ఎందుకన్నామో అర్ధమవుతుంది. అప్పుడు మనం అవసరం బయటపెట్టాలి. ఇది మోడల్స్ ను ఎన్నుకొనే విధానం. చదువుకున్నవారిగా, ఆధునికులుగా కనిపించేవారి దగ్గర అలా ప్రవర్తించాలి. అదే మామూలుగా సాదాసీదాగా, నగర జీవితం తెలియని అమ్మాయిలు కనిపిస్తే, పాలిష్ చేస్తే పనికొస్తారనుకుంటే, వార్ని ఒప్పించే విధానం వేరు. వీరిదగ్గర పెద్దమనిషితరహాలో ప్రవరర్తించాలి. లేకుంటే అపార్ధం చేసుకొని డొక్క చీరేసే ప్రమాదం వుంది. మనం ఎక్కడ వున్నా ఎక్కడ తిరుగుతున్నా లోతైన పరిశీలన వుండాలి. మరో కంటికి తెలియకుండానే మన కళ్ళు కెమేరా లెన్సులా, డేగ కళ్ళలా పనిచేయాలి. ఒక్కోసారి యాక్సిడెంటల్ గా మన దృష్టిలో స్టన్నింగ్ బ్యూటిస్ పడవచ్చు. నచ్చితే ప్రయత్నించాలి. ఎక్కడకు వెళ్ళినా, ఏ పనిలో వున్నా మన వృత్తివేటను మరువరాదు. మోడల్స్ కోసం ఒక ప్రక్క గమనిస్తూ వుండాలి. ఇదెందుకంటే మారుతున్న ప్రజలని స్టడీ చేస్తూంటే వారిని ఆకట్టుకొనే విధంగా మన యాడ్ ఫిల్మ్ మేకింగ్ మార్చుకుంటూ పోవచ్చు.
మద్రాసు, బొంబాయి స్టూడియోల్లో, స్టార్ హొటల్స్ లో కూర్చునే సినీ డైరక్టర్స్ కి, రైటర్స్ కి మారుతున్న జనబాహుళ్యం జీవన విధానం తెలియక, తెలుసుకొనే ఓపికలేక రొటీన్ గా సినిమాలు తీస్తూ దెబ్బతింటున్నారు.
బిజినెస్ మెన్ బ్రతికినా, ఇండస్ట్రియలిస్టు బ్రతికినా, ఫోటో గ్రాఫర్స్ బ్రతికినా ప్రజల అవసరాలమీదే. మరికొన్ని కొత్త అవసరాలను కల్గించి, వాటిమీదే.....ఆ అవసరాలు తీరుస్తూనే, వార్నే విస్మరిస్తే ఎవరి ప్రయత్నామైనా లేబరిటరరీలకే పరిమితమవుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు మనోహర్ ఎంతోశ్రద్ధగా చెబుతుంటాడు తన శిష్యుడు మధుకి. అయినా హఠాత్తుగా కొత్త అమ్మాయిల్ని పలకరించాలంటే చచ్చే వణుకు, భయం మధుకి.
అంతలో ఓ యువతి మధువైపు పరిశీలనగా చూస్తూ దగ్గరకు వచ్చింది. "మీరేనా అవినాష్?" అడిగింది.
"అవును. మీరు మిస్ రంజీతా."
"యస్ ఇదిగోండి టికెట్" అంటూ బ్యాగ్ లోంచి ప్లయిట్ టిక్కెట్ తీసి ఇచ్చింది. అది తీసుకుని థాంక్స్ చెప్పి రెండడుగులు వేయగానే ప్లాష్ లా తట్టింది ఓ ఐడియా.
సన్నగా విజిల్ గా వేసుకుంటూ ఎయిర్ పోర్ట్ బయటకొచ్చి టాక్సీ ఎక్కి 'కరోల్ బాగ్' అని చెప్పి కూర్చున్నాడు.
టాక్సీ దిగి రూపాచక్రవర్తి ఇల్లు వెంటనే గుర్తుపట్టాడు. సమయానికి రూపా తల్లి దండ్రులు లేకుంటేనే తన ప్లాన్ పారుతుంది. ఢిల్లీ లో ఆగేందుకు వీలులేదు. సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. తను సోఫియా ఫోటోలు తీసుకెళితేనే బాస్ డైరెక్టర్ వ్యాస్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. వెంటనే పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు.
రూపా చక్రవర్తి ఇంటికి ఫోన్ చేశాడు. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో వుంటే బయటకు పంపించాలని.
"హలో ఎవరూ మాట్లాడేది?" మధు అడిగాడు ఫోన్ లో.
"నేను భూపాల్ చక్రవర్తిని మాట్లాడుతున్నాను."
"హలో అంకుల్...."ఠక్కున అనేశాడు అంత పెద్ద సిటీలో ఎవరో ఒకరు ఆయన్ని అంకుల్ అని పిలిచేవారుండకపోరు అనే ఉద్దేశంతో. మధు ట్రిక్ ఉపయోగపడింది.
"ఎవరూధనుంజయ్?"
"యస్.....అంకుల్......ధనుంజయ్ నే మాట్లాడుతున్నాను. మమ్మీ మిమ్మల్ని, ఆంటీని అర్జంటుగా రమ్మని చెమ్మమన్నారు. వెరీ అర్జంట్ ప్లీజ్....క్విక్" సాధ్యమైనంత ఆతృత, ఆందోళన మిళితం చేశాడు తన గొంతులో. తన గొంతు ధనుంజయ్ లాలేదని గుర్తుపడతాడని భయంగా వుంది మధుకి.
"ఇంట్లోనే ఫోన్ వుందిగా, మమ్మీ చేయలేకపోయిందా?" అమ్మ ముసలాడు ఘటికుడే అనుకున్నాడు మధు.
"ఫోన్ చెడిపోయింది అంకుల్! అర్జంటుగా రావాలి మీరు."
"ఎందుకు?"
"ఏమో......అర్జంటు" ఫోన్ పెట్టేశాడు. ఎక్కువగా మాట్లాడితే వివరాలలోకి వెళితే పట్టుబడవచ్చని, వడివడిగా రూపా ఇంటి ఎదురుగా ఉన్న బస్ స్టాప్ లో కొచ్చి నిలబడ్డాడు తన ఎత్తు పారుతుందో లేదోనని చూస్తూ.
సెకన్లు, నిముషాలు లెక్కబెడుతున్నాడు. మధు కళ్ళు మెరిశాయి. రూపా తల్లి, తండ్రి బయటకు వచ్చారు. వారువెళ్ళి ఫోన్ అబద్దమని తెల్సుకొని వచ్చేలోపు పని పూర్తి చేసుకొని బయట పడాలి.
ముసలివాళ్ళు ఇద్దరూ ఆటో ఎక్కారు. వెంటనే ఆ ఇంటివైపు బయలుదేరాడు పరుగులాంటి నడకతో. తలుపు ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కాడు. నిముషం గడిచాక తలుపు తెరుచుకుంది. ఎదురుగా సోఫియా ఆమెను మధు చూడటం ఇదే మొదటిసారి.
స్టన్నింగ్ బ్యూటీ, ఫెంటాస్టిక్ ఫీచర్స్, సూపర్బ్ అనాటమీ. అందుకే బాస్ సెలక్ట్ చేసుకొనుంటాడు మోడల్ గా అని అనుకున్నాడు మనస్సులో మధు.
"నేను మనోహర్ గారి అసిస్టెంట్ ని. పనిమీద ఢిల్లీ వచ్చాను. వచ్చేప్పుడు మిమ్మల్ని చూసి రమ్మని చెప్పింది మీ అక్క రూపా.
"రండి.....రండి......" అంది మొహమాటానికి సోఫియా. కాని ఆమెకు అనుమానంగా వుంది. తన అక్క మనోహర్ గురించి చెప్పింది కాని మధు అనే పేరే చెప్పలేదు. ఢిల్లీ లో పట్టపగలే దొంగతనాలు చాలా పకడ్పందీగా జరుగుతాయి. అదీ ఆమె భయం.
ఇద్దరూమాట్లాడుతూనే కూచుండిపోయారు. మధు ఆమెతో మాట్లాడుతూనే చుట్టూ పరికించి చూశాడు. ఎదురుగా వున్న షోకేస్ లో తనక్కావల్సిన ఆల్స్మ్స్ కనిపించాయి. తను కూర్చున్న స్థలానికి, ఆల్భమ్స్ ఉన్న షోకేస్ దగ్గరకు మధ్య ఉన్న దూరాన్ని మెంటల్ గా కాలుక్యులేట్ చేసుకున్నాడు. కాని సోఫియ లోనికెళ్ళే ప్రయత్నం ఏమీ చేయలేదు. కాలం గడిచిపోతోంది. బయటకు వెళ్ళిన ముసలివాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు.
మధుగుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. "కాస్త మంచినీళ్ళు ఇస్తారా? ఆ చేత్తో కాస్త కాఫీ ఇస్తే....ఏంలేదు తలనెప్పిగా వుంది. తొందరేం లేదు....." అన్నాడు.
సోఫియా అనుమానంతోనే లోనికి వెళ్ళింది.
మెరుపు వేగంతో కదిలాడు మధు షోకేస్ వైపు. రెండు నిమిషాలు గడిచాయి. సోఫియాకాఫీ తీసుకురావటం, బయట ముసలివాళ్ళు ఆటోదిగటం ఒకేసారి జరిగింది.
* * *
"ఫోటోస్ ఎలా వచ్చాయి?" ప్రదీప్ పైపుకాలుస్తూ అడిగాడు.
"బాగానే వచ్చాయ్ సార్. ఎగ్లాట్ షూటింగ్ స్పాట్ కూడా తెలుసుకున్నాం వాటితో" అన్నాడు కైలాష్ మోర్ సిగరెట్ ప్యాకెట్ జేబులోంచి తీయబోయి, ఆగిపోతూ.
"అయితే ఆ స్విమ్మర్ ని పిలుపు" అన్నాడు. చేతిలో వున్న పైవునుసి యాష్ ట్రేలో రాల్చి, ఫోటోలవంకే తీక్షణంగా చూస్తూ ప్రదీప్ సక్సేనా.
మనిషి ఐదడుగుల రెండంగుళాలుంటాడు. బలిష్టంగా వుంటాడు. వయస్సు నలభైదాకా వుంటుంది. కూలింగ్ గ్లాసు కళ్ళద్దాల్లోంచి అతని చూపులెలా వుంటాయో ఎవరూ పసిగట్టలేరుగాని, కళ్ళద్దాలు లేకుండా అతనికి ఎదురుపడి, అతని చూపులో చూపు కలపటం మామూలు వాళ్ళకు సాధ్యం కానిపని. ఎక్కువగా మాట్లాడడు. ఎక్కడికీ తిరగడు. తన ఎయిర్ కండిషన్డు గదిలో కూర్చుని ఫోన్ ద్వారానే పనులన్నీ చేయించు కోగల సమర్ధుడు డాషింగ్ ఎడ్వర్టెయిజింగ్ ఏజెన్సీ అంటే ఇండియన్ యాడ్ వరల్డ్ లో తెలియని వాళ్ళులేరు. దాని బాస్ ప్రదీప్ సక్సేనా అంటే కూడా అంతే.
ఇండియాలో కోట్ల వ్యాపారంచేసే పెద్ద కంపెనీల్లో పాతిక శాతం డాషింగ్ ఏజెన్సీకే తమ పబ్లిసిటీ అప్పచెప్పారంటే అతని సమర్ధత వేరే చెప్పక్కర్లేదు. ఎవరి వీక్ నెస్ ఏమిటో తొలిచూపులోనే గ్రహిస్తాడు ప్రదీప్. తెలివిగా ఆ వీక్ నెస్ ఏమిటో తొలిచూపులోనే గ్రహిస్తాడు ప్రదీప్. తెలివిగా ఆ వీక్ నెస్ పై దెబ్బకొట్టి తనక్కావల్సిన బిజినెస్ తెచ్చుకుంటాడు. తన కెవరన్నా ఎదురునిలిచినా, పోటీకి వచ్చినా వార్నినామరూపాలులేకుండా చేయడం ప్రదీప్ కి వెన్నతో పెట్టిన విధ్య. ఆరడుగల ఎత్తులో బలిష్టంగా వున్న నలభై ఏళ్ళ వ్యక్తి లోపలకు వచ్చాడు.
"నీకు ఈత బాగా వచ్చా?"
"వచ్చుసార్" గులకరాళ్ళు డబ్బాలోపోసి ఊపినట్లుగా వుంది అతని మాటతీరు.
"నీళ్ళలో మునిగి ఎంతసేపుండగలను."
"విషయం అంతా కైలాష్ చెప్పుంటాడు అవునా?"
"చెప్పాడు సార్. అతను నాకిచ్చిన ఫోటోలో ఉన్న అమ్మాయిని సఫా చేయటమే."
"దట్స్ గుడ్! తెలివిగా పని పూర్తిచేయి. నువ్వు చేసినట్లు నేను చేయించినట్లు ఆసలిది ప్రిప్లాన్డు మర్డర్ అయినట్లు అనుమానం వస్తే నువ్వు మిగలవు. వెళ్ళు....." కళ్ళజోడు తీసి తీక్షణంగా అతనివైపు చూస్తూ అన్నాడు ప్రదీప్.
ప్రదీప్ చూపుల్లోని తీక్షణతకు ప్రొఫెషనల్ కిల్లర్ అయిన స్విమ్మర్ కూడా వణికిపోయాడు.
స్విమ్మర్ బయటకు రాగానే కైలాష్ అతన్ని మరో గదిలోకి తీసుకెళ్ళాడు. "నువ్వు రెడీనా?"
"యస్ సార్" అంటూ తన స్విమింగ్ డ్రెస్ లోపల దాచుకున్న సన్నని ప్లాస్టిక్ ట్యూబ్ ని ఒకసారి తడిమి చూసుకున్నాడు.
* * *
ఉదయం పది కావస్తోంది. హాయ్.....హాయ్ కూల్ డ్రింక్ యాడ్ ఫిల్మ్ వర్క్ రెండోరోజు షూటింగ్ మొదలయింది. లేక్ ముందు మోడల్స్ షూటింగ్ బోట్ లోకి ఎక్కారు. మధు ఉదయం ఢిల్లీ పోవటంతో క్లాప్ వర్క్ మనోహర్ ఆఫీసు అసిస్టెంట్ చందూకి అప్పగించబడింది. చందూ క్లాప్ బోర్డుతో మోడల్స్ బోట్ లోకి ఎక్కేముందు చాక్ పీస్ తూ నల్లటి క్లాప్ బోర్డుమీద 'సన్ రైజ్ ఎడ్వర్టెయిజింగ్ ఏజెన్సీస్ ప్రొడక్షన్స్ నెం. 42, హాయ్___హాయ్ కూల్ డ్రింక్, సీన్ నెం.1 షాట్ నెం. 18, టేక్ నెం.1' అని రాసుకున్నాడు గిరీష్ ఇచ్చిన సూచనలను బట్టి.