Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 14


    ఇప్పుడే వీళ్ళు ఇలా చెప్పాపెట్టక పోతూ వుంటే, ముందుముందు అసలు తన మాట వింటారా? తనను లక్ష్యపెడతారా?

    ప్రధాని పర్సనల్ సెక్రటరీ రీతూ రాకతో ఆలోచనలనుంచి వర్తమానంలోకి వచ్చింది అపర్ణ. తడబడుతూ తచ్చాడింది. గ్రహించారు ప్రధాని...

    రీతూ రాకను గుర్తించిన ప్రధాని ఆమెను లోనికి ఆహ్వానించారు. క్షణం తటపటాయించింది రీతు. ప్రధాని మరల పిలవడంతో, వచ్చి డైనింగ్ టేబుల్ ముందు ఒదిగికూర్చుంది. అపర్ణ ప్లేటును రీతూ ముందు వుంచి టిఫిన్ ఐటమ్స్ ను సర్వ్ చేయసాగింది.

    "మిస్ రీతూ!"

    ప్రధాని పిలుపుతో ఉలిక్కిపడి తలపై కెత్తింది రీతు.

    "మా బడుద్దాయిల గురించిన వివరాలను కాస్త పరిశీలించండి. అసలు వాళ్ళు కాలేజీకి వెడుతున్నారా లేదా? అన్ని క్లాసులకు ఠంచనుగా హాజరవుతున్నారా, ఎగ్గొడుతున్నారా? స్నేహితులు ఎవరెవరు, వాళ్ళు ఎలాంటివారు? నాకు పూర్తి వివరాలు కావాలి. తెలుసుకుని చెప్పండి!" గంభీరంగా పలికారు ప్రధాని.

    "అలాగే!" అన్నట్టు తలవూపింది రీతు.

    "అపర్ణా!"

    ప్రధాని కళ్ళలో ఎర్రజీరను చూసి కనులు వాల్చేసింది అపర్ణ.

    "మేడమ్! పరిస్థితి నీకు తెలుసు. నేనా, నా విధి నిర్వహణలోపడి ఇంటి విషయాలన్నీ మరచిపోవచ్చు. నీకు అన్ని అధికారాలు ఇచ్చాను. అవకాశం వుంది. కనీసం కూడా చెప్పకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి?" మందలింపు ధోరణిలో మెల్లిగా అన్నారు. 

    ఆమె కనుకొలకులలో నీరు...!

    మిసెస్ చక్రవర్తి ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించింది.

    "నో! సారీ విమలా... క్రమశిక్షణ విషయంలో ఎవ్వరూ ఏ విధంగానూ ఎప్పుడూ వుదాసీనత వహించవద్దు, అది నాకు సరిపడని సంగతి. ఐ డోంట్ టాలరేట్ ఇన్-డిసిప్లీన్!" అసహనంగా అంటూ కుర్చీలోంచి లేచారు ప్రధాని.

    అపర్ణా! ఈ వయసులోనే వాళ్ళను దారిలోకి పెట్టలేకపోతే, వాళ్ళ భవిష్యత్తు ఏమి కాను? వాళ్ళు తప్పుదారిపడితే, ఆ తరువాత బాధపడీ ప్రయోజనం వుండదు!" తన ధోరణిలో అంటూనే, చకచకా బయటకు నడిచాడు ప్రధాని.

    అప్పటికే కాన్వాయ్ రడీగా వుంది.

    ప్రధానిని చూస్తూనే సెక్యూరిటీ ఆఫీసరు రవితేజ సెల్యూట్ చేశాడు.

    రవితేజను చూస్తూనే రీతూ ముఖం జేవురించింది.

    "కమాన్, గెట్ ఇన్ మిస్ రీతూ!" ప్రధాని తన కారు ఎక్కి అన్నారు.

    కారు ముందు సీటులోకి రవితేజ ఎక్కేశాడు. రీతూ అతని పక్కనే కూర్చోవాలి...

    "సర్! నేను స్పేర్ కారులో వస్తాను..." అంటూ వెనుదిరిగింది.

    "యుకెన్ సిట్ కంఫర్టబుల్లీ బై మై సైడ్...!"

    "థాంక్యూ, సర్! కారు ఎలానూ ఖాళీగానే వస్తున్నది. నేను దానిలో వచ్చేస్తాను..."

    "ఓ.కే! యాజ్ యు విష్!"

    రీతూ ఊపిరి పీల్చుకుంటూ చకచకా వెళ్ళి స్పేర్ కారు ఎక్కింది.

    "యు సీ, మిష్టర్ రవితేజ! మీకు రీతూ పరిచయమేనా?" ఉన్నట్టుండి ప్రధాని ప్రశ్నించారు. తబ్బిబ్బుపడ్డాడు రవితేజ.

    "తెలుసు సార్..." అప్రయత్నంగా అన్నాడే కాని, ఆ తరువాత ప్రధాని ఏమని అడుగుతారోనని బిక్కుబిక్కుమన్నది రవితేజ మనసు.

    ప్రధాని మౌనం వహించారు.

    కాన్వాయ్ బయలుదేరింది.


                          *    *    *


    జూపార్కు నుంచి తప్పించుకుని నగరంలోకి ప్రవేశించింది పులి.

    అది అటవీ శాఖాధికారులకు, పోలీసులకు తలనొప్పిగా తయారయింది.

    ఎలా అయినా సరే గాలించి, పట్టి బంధించి ఆ పులిని మరల జంతు ప్రదర్శన ప్రాంగణంలోకి చేర్చవలసిన బాధ్యత ఈ ఉభయ శాఖల వారి మీద పడింది.

    అయితే, అది ఈలోగానే మనుషుల ప్రాణాలకు హాని తలపెడితే...?

    'షూట్-ఎట్-సైట్' ఉత్తర్వులు రావడానికి జాప్యం జరగవచ్చు...

    నిలువెత్తు యువకుడొకరు ఇంపోర్టెడ్ బైనాక్యుఅర్స్ తో దీక్షగా చూస్తున్నాడు. పులి అతని కెక్కడా కనిపించడం లేదు కాని, ఒక యువతి మీద మాత్రం అతని దృష్టి నిలిచింది !

 Previous Page Next Page