Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 15


    వంటినున్న సబ్బునురుగంతా ఒకేసారి జారిపోయేటట్లు బొక్కెనెత్తి నీళ్ళన్నీ వంటిమీద గుమ్మరించుకుంది.

    ఇప్పుడు శృతి ప్రాణమెంతో హాయిగా వుంది.

    బొక్కెన నీళ్ళతో మురికి వదిలినట్లు విడిదిచ్చినందుకు విరోధి వదిలిపోయాడు చాలా తేలిగ్గా.

    "ఇంకా స్నానం చేయటం పూర్తి కాలేదుటే శృతీ!" బైట నుంచి సీతమ్మ కేక పెట్టింది.

    "అయిపోయిందమ్మా! వచ్చేస్తున్నా బాత్ రూమ్ లోంచి జవాబిచ్చింది శృతి. మరో బొక్కెన నీళ్ళు వంటి మీద ఎత్తి గుమ్మరించుకుంది.

    చాలా ఆనందంగా వుంది శృతికి. కూనిరాగం తీస్తూ చీర చుట్టుకుని జాకెట్టులో మళ్ళీ లెటర్ ని దాచి బాత్ రూమ్ నుంచి బైటపడింది.


                                                                        11


    సాయంత్రం అయిదయింది.

    తనకు కావలసిన టాయ్ లేట్ సామానుగాక ఇంటికి కావలసిన సరుకులుకూడా తెస్తానని శృతి బజారు వెళ్ళింది.

    తనకు తెలిసినవారి కోడలికి నొప్పులొస్తుంటే వారికి తోడుగా సీతమ్మ నర్సింగ్ హొమ్ కెళ్ళింది.

    క్రితం రాత్రి నైట్ డ్యూటీ చేసి ఈరోజు రెస్టు తీసుకుంటున్న సిద్దార్థ ఇంట్లోనే వుండిపోయాడు.

    సిద్దార్థకి ఏ రోజు డ్యూటీయో, ఏ రోజు సెలవో తెలిసిన శ్రీదేవి వచ్చింది.

    కిటికీ దగ్గర కూర్చుని బైటికి  చూస్తున్న సిద్దార్థ దూరంగా శ్రీదేవి రావడం చూశాడు. మెదడులొ తళుక్కుమని ఓ మెరుపు మెరిసింది. ఓ చిలిపి కోరిక కలిగింది. ఇంటి తలుపులు ఎలాగూ తెరిచిపెట్టె వున్నాయి తలుపుచాటున నక్కి నుంచుండిపోయాడు.

    "శృతీ! శృతీ!" అంటూ సరాసరి ఇంట్లోకొచ్చేసింది శ్రీదేవి.

    నెమ్మదిగా తలుపులు చేరేసి గడియపెట్టాడు సిద్దార్థ.

    ఇంట్లో ఏ అలికిడి లేదే! ఎవరూ లేరా ఏమిటి?" అనుకుంటూ శ్రీదేవి వెనుతిరిగింది. సిద్దార్థ దొంగనవ్వు నవ్వుతూ కనబడ్డాడు.

    "ఏయ్, ఏమిటిది?" అంది శ్రీదేవి.

    "ఏమిటి నీవనేది నాకేం అర్ధం కావటంలేదు శ్రీ!" శ్రీదేవి దగ్గరకొస్తూ అమాయకంగా ముఖంపెట్టి అన్నాడు సిద్దార్థ.

    "తలుపెందుకేశావ్?" శ్రీదేవి ముందే గ్రహించింది ఇంట్లో ఎవరూ లేకపోబట్టే ధైర్యంగా సిద్దార్థ తలుపు గడియపెట్టాడని.

    "వెయ్య బుద్ది పుట్టింది." తలెగరేసి మహా ధైర్యంగా అన్నాడు సిద్ధార్థ.

    "పుడుతుంది, పుడుతుంది ఇంట్లో ఎవరూ లేరేమో. అబ్బాయిగారికి మాలావు ధైర్యం వచ్చింది. మీ అమ్మ వున్నప్పుడో శృతివున్నప్పుడో తలుపు గడీ పెట్టుచూద్దాం?"

    "వెక్కిరించకు అమ్మడూ! అందరి ముందూ తమరి ధైర్యం ఏ పాటీది? ముక్తసరిగా మాట్లాడటం, ఏమండీ అని  మన్నింపు ఎవరూ లేకపోతే నీవు అనటం, సిద్దూ అని పిలవటం, అమాంతం మీద పడటం....."

    "నేనేం పడను, చివరన్నది తుడిచెయ్యి."

    "పోనీ నేనేపడతాను. సరేనా!" అంటూ సిద్ధార్థ దగ్గరకొచ్చి శ్రీదేవిని మీదకు లాక్కున్నాడు వెంటనే గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు.

    సిద్దార్థ కౌగిలిలో శ్రీదేవికి పరవశంగానే ఉందిగాని వివేకం హెచ్చరించింది. "వదులు సిద్దూ! ఎవరైనా వచ్చారంటే బాగుండదు. అమ్మా, శృతీ ఎక్కడికెళ్ళారు?" అంది దూరంగా జరగటానికి ప్రయత్నిస్తూ.

    "శృతి బజారుకి వెళ్ళింది. నెప్పులొస్తుంటే అమ్మ...."

    "అమ్మకి నొప్పులేమిటీ?" తెల్లబోయింది శ్రీదేవి. మైమరపులో ఉన్న సిద్దార్థ అప్పుడు తెప్పరిల్లాడు. "ఓహ్ తెలిసిన వారికోడలకి  నొప్పులోస్తుంటే వాళ్ళకి సాయంగా అమ్మ వెళ్ళింది."

    కిలకిలా నవ్వేసింది శ్రీదేవి.

    "ఓ కవి ఏమన్నడో తెలుసా?"

    "ఏమన్నాడేం?"

    "స్వర్గం ఎక్కడోలేదు. ఆడదాని కౌగిలిలొ వుంది. సర్వం మరచిపోయేది ఈ స్వర్గంలోనే అన్నాడు. అనుభవం మీద రాసినట్లున్నాడు. ఆవరణలో ఇప్పుడు నాకు తెరిసింది ఇయామ్కా కొన్ని ఇటువంటి ప్రయోగాలు చేసి చూస్తే ఎంతో అనుభవం సంపాదించిన వాడినీ అవుతాను. పెద్దల మాట నిజమనీ తెలుసుకుంటాను. కాస్త నీవు సహకరిస్తే చాలుశ్రీ"

    "ఉడత పిల్లలా ముఖంచూడు. అమాయకంగా కనపడటం. అసాధ్యపు పనులు చేయటం నీకే చెల్లింది పెళ్ళి కావలసిన ఆడపిల్లనిగదా ఇలా బంధించి బలవంతం చేయటం ఏమన్నా బాగుందా! అబ్బ వదలమంటుంటే.!"

    "ఏయ్, ఉడత గిడత అన్నావంటే నా కౌగిలి ఉక్కు కౌగిలి అవుతుంది జాగ్రత్త. చుంచుపిల్లలా  ఈ ముఖం చూడు. అమాయకంగా ముఖం పెట్టడం చాతవును. అల్లరి మాత్రం  బోలెడు. పెళ్ళి కావలసిన ఆడపిల్లనే కాని ఈ పిల్లదాని మెడలో మూడుముళ్ళేయవలసిన వాడిని నేనే కదా? బలవంతం చేస్తున్నాని నిందవేశావ్ ఇది బలవంతమూకాదు, బలప్రయోగమూ కాదు. పరస్పర ఆకర్షణతో దగ్గరకావటం" అంటూ గట్టిగా హత్తుకున్నాడు సిద్దార్థ.

    "అబ్బా, వదలమంటుంటే, ఎవరైనా వచ్చారంటే," తలుపువేపు భయంభయంగా చూస్తూ అంది శ్రీదేవి.

    "ఎవ్వరూ రారు, వాళ్ళకు తెలియ దేమిటి మనిద్దరం ఏ కాంతంగా వున్నామని బైట కల్సుకుని మాట్లాడుతున్నామనుకో. కాస్త చెయ్యి పట్టుకుందామన్నా, ఓ  కిస్ పారేద్దామన్నా చోటేది చాటేది?"

    "నాలుగు రోజులక్రితమేగా రష్ లేని పిక్చర్ కి తీసుకెళ్ళి బాల్కనీలో...." అంటూ కిలకిలా నవ్వింది శ్రీదేవి.

    అది గుర్తుకొచ్చి సిద్దార్థ పకపక నవ్వాడు. రష్ వుండని సినిమా హాలుని మించిన రహస్యపు చోటు దొరకదని పాత సినిమాకి కూడబలుక్కుని ఇరువురూ వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన పావుగంటలో హాలు హౌస్ పుల్ అయింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చివుంటే బాగుండదని బాల్కనీలో ఆ మూలోకరు ఈ మూలోకరు కూర్చుని సినిమా చూశారు.

    "ఈ బాదెందుకుగాని తొందరగా మూడు ముళ్ళు వేసేయ్యి." అంది శ్రీదేవి.

    "ఎలా ముందు చెల్లాయి పెళ్ళి కావాలి కదా?" అన్నాడు సిద్దార్థ.

    "అన్నగారి పెళ్ళి కానిదే చెల్లెలి పెళ్ళిచేయరు. ఇంత అమాయకత్వం ఏమిటి బాబూ?"

    "మరి మా అమ్మ చెల్లాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నదే ముందు!"

    "ఆడపిల్ల పెళ్ళి తొందరగా కుదరదు ఎన్నో చూసుకోవాలి. మగపిల్లవాడిదేముంది? ఊ అంటే అయిపోతుంది. శృతికి ఎవరినన్నా ఖాయం చేసుకొని ఆ చేత్తో నీకూ చూసి ఓ నెల వారగా రెండు పెళ్ళిళ్ళూ చేయాలని మీ అమ్మగారి ఆలోచన కావచ్చు. శృతి పెళ్ళికి పీటలమీద కూర్చోవలసింది అన్నా, వదిన." అంటూ ముక్కు పట్టుకుంది శ్రీదేవి.

    "అంటే నీవూ నేనూ అన్నమాట. అబ్బ ముక్కు వదల మంటుంటే."

    "ఊహూ. ఆడపిల్ల మెడలో మగాడు ముడి వేస్తాడు మగాడి ముక్కుకి ఆడపిల్ల తాడేసి ముడేస్తుంది."

    "నిజమా శ్రీ?"

    "అబద్దం కాదు సిద్దార్థ మహాశయా"!

    సరిగ్గా అప్పుడే దబదబ తలుపు తట్టిన చప్పుడయింది. "తొందరగా తలుపు తియ్యి శ్రీ," అన్న శృతి మాటలు వినిపించాయి.

    కంగారుగా సిద్దార్థ శ్రీదేవి విడిపోయారు. ఏం చేద్దాం అన్నట్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

    మరోసారి తలుపు కొట్టి పిలిచింది శృతి.

    తల వంచుకుని నుంచుండిపోయింది శ్రీదేవి.

    సిద్దార్థ అంతకన్నా తల వంచుకుని వెళ్ళి తలుపుతీసి శృతి లోపలికి అడుగు పెట్టగానే అటునుంచి బయటకు వెళ్ళాడు, ఎదురుగా సీతమ్మ వస్తూ కనబడింది.

    లోపలికొచ్చిన శృతి చేతిలో  సంచీ పెట్టి స్లిప్పర్స్ స్టాండులొ పెడుతూ అంది. "దూరంగా అమ్మ వస్తూ కనపడింది శ్రీ! నేను మీ ఏకాంతానికి అంతరాయం కలిగించటం ఇష్టం లేక గుమ్మం అవతలే వుండిపోయి కాపలా కాస్తూ ఈ మూసివున్న తలుపులు ఎన్ని యుగాలకు తెరుచుకుంటాయా అని ఎదురు చూస్తూన్నాను. అమ్మ రాబట్టి తలుపు కొట్టక తప్పలేదు."

    "థాంక్స్" గొణిగింది శ్రీదేవి.

 Previous Page Next Page