"పిచ్చి ఎక్కక ఏం చేస్తుంది? మొత్తం జీతం రాళ్ళు అటు త్రాగుళ్ళకీ ఇటు లాటరీలకి తగలేయ్యటం! లక్షల్లో కొట్లో వస్తాయని ఎదురు చూట్టం! ఫలితాలు చూచి యిలా పిచ్చెక్కటం! మామూలే!
ఇలా పిచ్చి పట్టి అంటే లాటరీ పిచ్చి పట్టి వీధుల వెంట బికారుల్లా తిరుగుతున్న వాళ్ళని చాలామందిని చూచాం! పద పద!!
ప్రయిజ్ వచ్చిందంట! టికెట్ పొయిందంట! మాకేం పనులుండవని మా మీద పడతారు. హుత్!!" అని విసుక్కుంటూ మరో వంకకు తిరిగిపోయాడు కోటిలింగం.
"కోటిలింగం నువ్వేగా టికెట్ యిచ్చావు?"
"రోజూ పదివేల మందికిస్తాను. అందరూ నాకు గుర్తా?"
"నిజంగా నా టికెట్ పోయింది"
"కాదు . నిజంగా నీకు పిచ్చి పట్టింది. అరె జావ్ జా జా!!" అంటూ మెడ మీద చేయి పెట్టి బయటికి గెంటాడు కోటిలింగం!
జయసింహ కళ్ళలో విస్ప్లులింగాలు ప్రజ్వలించాయి.
"పిచ్చోడు! పిచ్చోడు! లాటరీ పిచ్చోడు" అంటూ జనం నవ్వుతున్నారు.
"పాపం ఉన్నదంతా లాటరీలకే పోయుంటుంది. మతి చలించి యిలా తిరుగుతున్నాడు. ఆ నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారో పాపం!!" అంటూ వెళ్ళిపోతున్నారు జాలిగుండె కలిగిన వాళ్ళు.
ఈ కాలం కుర్రాళ్ళ అంతే నండీ! రూపాయి పెట్టి లక్ష రావాలంటారు.
కష్టపడి పనిచేయటం గొప్ప అనుకోరు. పని చేయకుండా సుఖంగా బ్రతకుతామని వాళ్ళకి గొప్ప!
"అందుకే ఈ దేశాన్ని ఇంత దరిద్రం పీడిస్తోంది" అన్నాడు ఓ హిస్టరీ మాష్టారు తెలుగు మాష్టారితో!
"అవునండీ ఈ మధ్య చందమామ కాబోలు ఓ కధ చదివాను. లాటరీకి పెట్టె డబ్బులు దాచుకుంటే ముచ్చటగా ఓ వ్యాపారం చేసుకోవచ్చు! దాని కోసం ఆరాటపడుతూ తిరిగే కాలాన్ని పొదుపు చేసుకుని కష్టపడి చాకిరీ చేసుకుంటే హాయిగా బ్రతకొచ్చు!
దురాశ అనేది కాళ్ళ క్రింద మంటలాంటిది!
ఒకచోట కాలు నిలువనియ్యదు" అంటూ సోదాహరణంగా వివరించి చెప్పాడు తెలుసు మాష్టారు.
తలోకమాట అంటున్నారు. జయసింహ పట్టించుకోలేదు.
"కోటిలింగం! డబుల్ హెచ్ సిరీస్ లో ప్రయిజు తప్పకుండా తగులుతుందని చెప్పావు గుర్తులేదా?"
"లక్షమందికి లక్ష చెప్తాను. అవన్నీ గుర్తుంటయ్యా? పోపోవయ్యా .
"నీ ఏజెన్సీలో ప్రయిజ్ వచ్చిందా , రాలేదా?"
"నీ కెందుకు చెప్పాలి? నువ్వేం ఇన్ కంటాక్స్ ఆఫీసర్ వా?"
"చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను."
"ఈ పిచ్చాడు నన్ను కోరికేట్టున్నాడు. లాక్కుపొండి" అరిచాడు . ఇలాంటి సందర్భాలు ఎదురయితే మద్దతు యివ్వటం కోసం ప్రత్యేకంగా పోషించబడుతున్న దాదాలు ఆ పిలుపు అందుకున్నారు.
అయితే వీరు జనంలోంచి వేరుగా బయట పడతారు.
"లాటరీ పిచ్చోడు" అంటూ ఒకడు ఖాళీ సిగరెట్ పాకెట్ విసిరాడు.
మరొకడు అగ్గిపెట్టె విసిరాడు.
ఇంకొకడు జయసింహ మీదికి చిన్న రాయి విసిరాడు. ఒకడు చేయి పెట్టి షాపు మెట్ట మీది నించి క్రిందికి లాగేశాడు. రాళ్ళు వర్షంలా కురిశాయి. నుదురు చిట్లి రక్తం కారుతోంది.
"మర్యాదగా చెప్పు! నీ ఏజన్సీలో ప్రయిజ్ వచ్చిందా, రాలేదా? పట్టిన పట్టు విడువకుండా అడిగాడు జయసింహ.
కోటిలింగం చుట్టూ చూశాడు. జనంలో మార్పు కన్పిస్తోంది. అంత జరిగినా ఆ యువకుడు అక్కడి నించి తిరిగి పోలేదు. అంటే ఏదో జరిగిందన్న మాట! ప్రేక్షకులు ఊహిస్తున్నారు.
ఈ ఆలోచన పెరగకూడదు. తీగ లాగితే డొంకంతా కదుల్తుంది. వెంటనే అతన్ని ఆ చోటు నించి పంపాలి!
గెంటి వేసేందుకు జయసింహ కాలర్ పట్టుకున్నాడు.
ఈసారి అతని ఊహకి అందని వేగంతో తిరగబడ్డాడు మరుక్షణంలో రోడ్ మీద పడి మట్టి కరిచాడు. ఆ షాపు రక్షణ కోసం నియమించబడిన దాదాలు విజ్రుంభించారు.
జయసింహ వెనుకడుగు వేయలేదు. ఆ వీధి ఒక రణస్థలంగా మారిపోయింది. పోలీసులోచ్చారు! విజిల్స్ ఊదారు. పై జనాన్ని దూరం చేశారు.
"ఏం జరుగుతోందిక్కడ?
"సార్! ఈ దగుల్బాజీ! రౌడీలతో నా కొట్టు మీద దాడి చేశాడు. నా షాపులో లాటరీ టికెట్స్ అన్నీ దోచుకుపోయారు" అంటూ రిపోర్టు చేశాడు కోటిలింగం. ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి ఎక్కించాడు.
పి.సి. లు జయసింహని రెక్కలు విరిచి పట్టుకున్నారు.
"పద పోలీస్ స్టేషన్ కి"
"ఎందుకు రావాలి?"
"చట్టబద్దంగా నడుపుతున్న షాపు మీద దాడి చేసినందుకు."
"అతనే నా మీద దాడి చేశాడు"
"అతని ప్రిమిసిస్ లో నువ్వున్నావు"
"ఈ షాపులోకి వచ్చినంత మాత్రాన నేను దోషినా?"
"మరి నువ్వెందుకొచ్చావు?"
"లాటరీ ఫలితాల వివరాలు తెలుసుకోవటానికి"
"నువ్వు టికెట్స్ తీసుకున్నవా?"
"అవును తీసుకున్నాను"
"ప్రైజ్ వచ్చిందా?"
"వచ్చింది"
"ఎంత ?"
"పది లక్షలు" ఈసారి చుట్టూ ఉన్న అందరితో పాటు పోలీసులు కూడా నవ్వటం మొదలెట్టాడు.
"టికెట్ యేదీ? పోయిందా?"
"అవును పోయింది"
"ప్రయిజ్ వచ్చే ముఖం యిలాగే ఉంటుందా, పద స్టేషన్ కి"
"సార్ యిరవై వేల రూపాయలు ఖరీదు చేసే టికెట్స్ పోయాయి.
"అన్నీ కక్కిస్తాంలే! నువ్వేమీ దిగులు పడకు!" జయసింహ బలవంతంగా తీసుకుపోయి వ్యాన్ లో ఎక్కించారు.
* * *
"నమస్కారం సార్!' తీయని కంఠం విన్పించింది.
"నమస్తే! నమస్తే! వచ్చిన పనేమిటో చెప్పండి"
"ఖైదీల్ని యింటర్వ్యూ చేస్తాం. పర్మిషన్ యిస్తారా?"
"మీకింక వేరే పనేం లేదా?"
"మా కాల్ ని మ్యాగ్జేయిన్ లో ఓ సెన్సేషన్ రాయాలని నా కోరిక.
"అవును. అదే మా ప్రియాంక చిరకాల వాంఛ" అంటూ ప్రక్క నున్న విద్యార్ధిను లందరూ వంత పాట పాడారు.
'చాల చిత్రమయిన కోరిక"
"అవును సార్! నేరస్తులు అందరూ కావాలని తప్పు చేయకపోవచ్చు. అసలు తప్పు చేయని వాళ్ళు కూడ ఉండొచ్చు."
"అడ ఖైదీలా? మగ ఖైదీలా? మీరు ఎవర్ని యింటర్వ్యూ చేస్తారు."
"మేము ఆడవాళ్ళం కదా! మగ ఖైదీని పిలిపించండి"
"ఒన్ జీరో టు! ఆ లాటరీ పిచ్చోడిని యిలా పట్టుకురా!" కేక పెట్టి చెప్పాడు. "మీరు అయిదు నిముషాల్లో ముగించాలి" అని హెచ్చరించాడు.
'అలాగే సార్! నాలుగు నిమిషాలు చాలు. అవునూ! నేరస్తులే కాక పిచ్చోళ్ళని కూడ మీరు జైల్లో పెడతారా సార్!"
"పిచ్చోడాంటే నిజంగా పిచ్చోడు కాదు. అదో రకం వెర్రి!" లాటరీ టికెట్ కొన్నాడట! పది లక్షలు ఫ్రైజ్ వచ్చిందట"
"లక్కీ ఫెలో! కంగ్రాచ్యూలేషన్స్ చెప్పాలి"
"నా బొంద! ఓ నెంబర్ డైరీలో రాసుకొచ్చాడు. నంబర్ చూపమంటే చూపుతాడు. టికెట్ అడిగితే పోయిందంటాడు"
"పాపం పూర్ ఫెలో!"