Previous Page Next Page 
రామాయణము పేజి 13

                                    

                                                    8. దశరథుని మరణము   
    పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.   
    రథముతో అయోధ్యకు తిరిగి వచ్చిన సుమంత్రుడు కౌసల్య అంతఃపురముననున్న దశరథునితో "ప్రభూ సీతారామ లక్ష్మణులను 'గంగ యొడ్డు'న దింపి వచ్చినాను. వారీపాటికి నదిని దాటి అరణ్యమున ప్రవేశించి యుందురు" అని చెప్పి వెడలినాడు. దశరథుడు 'పుత్రకామేష్టి ప్రసాదించిన పుత్రులలో ఇరువురును అడవుల పాలు చేసికొంటినని" దుఃఖించసాగినాడు. కౌసల్య నిష్ఠురముగ 'కైకకు వశ్యులై మీరు నాకునూ సుమిత్రకును శోకమును కలిగించినారు! ఏడ్వవలసినది మేము. మీకెందులకీ దుఃఖము?" అన్నది. దశరథుడు దైన్యముతో "కౌసల్యా, చచ్చిన పామును కొట్టెదవెందులకు? శాపగ్రస్తుడనగు నేనింక బ్రతుకను!" అన్నాడు. కౌసల్య పశ్చాత్తాప్తయై "ప్రభూ నన్ను క్షమించుడు. రామునితో ఎడబాటు నా వివేకమును నశింపజేసినది!.....'శాపగ్రస్తుడ'నన్నారేమిటి? ఇదివరకెన్నడునూ చెప్పలేదే" అని ఆందోళనను వ్యక్తము చేసినది.
    "నేను యువరాజుగా ఉన్నప్పుడు జరిగినదది. నేనా విషయమును మరచియే పోతిని. ఇప్పుడెందు వల్లనో జ్ఞప్తికి వచ్చినది. వినుము: నేనానాడు సరయూనదీ తీరమందలి యడవికి వేట కొరకు పోయినాను. ధనుస్సును పట్టుకొని క్రూరమృగములకై నిరీక్షించుచూ ఒక చెట్టు మాటున నిలిచినాను. సూర్యుడస్తమించి చీకటి వ్యాపించినది కాని జంతువేదియూ అటు రాలేదు. నగరమునకు తిరిగిపోవుద మనుకొనుచుండగా సమీపమందలి సెలయేరు నుండి బుడ బుడయను శబ్దము వినవచ్చినది. జంతువేదియో వచ్చి నీరు త్రాగుచున్నదని తోచినది. శబ్దమును బట్టి జంతువెక్కడనున్నదో ఊహించుకొని దానికి తగులునట్లు బాణమును ప్రయోగించు నేర్పు నాకున్నది. నేను వదలిన వాడియమ్ము అత్యంత రయమున పోయి గుణిని గ్రుచ్చుకొన్నది మరుక్షణము నాకచ్చట నుండి మానవ కంఠమున నొక ఆర్తనాదము వినవచ్చినది: "అయ్యో! ఎన్నడునూ ఎవ్వరికినీ అపచారము చేయని నన్నీ బాణముతో కొట్టిన క్రూరుడెవడు? అంధులునూ వృద్దులునూ అగు నా తల్లిదండ్రుల దాహమును తీర్చుటకు ఈ జల కలశమును కొనిపోవుటకు ముందే ఇచ్చట మృత్యువువాత పడుచున్నాను".   
    ....నేను జరిగిన నా పొరబాటును తెలిసికొని ఆచోటునకు పరుగెత్తి పోయినాను. నా వాడియమ్ము రొమ్మున లోతుగా చొచ్చుకొని పోయి గిలగిల కొట్టుకొనుచున్న ముని కుమారుడొకడు సెలయేటి యొడ్డున కనపడినాడు. అతడు నన్ను చూచుటతోనే "ఈ శరమును నా వక్షము నుండి పెరికివైచి నా ప్రాణములు త్వరగా పోవుటకు తోడ్పడుము. మరణయాతనను భరించలేకపోవుచున్నాను...సమీపముననే ఉన్న మా పర్ణశాలకు పోయి నా తల్లిదండ్రులకు నా మరణవార్తను తెలియజేయుము" అని అర్ధించినాడు.
    నేనాతడు కోరినట్లు చేసి అతడు అసువులను బాసిన పిమ్మట జలభాండమును తీసికొని కుటీరమునకు పోయినాను. అంధుడగు అతని తండ్రి నా అడుగుల సవ్వడిని విని తన తనయుడే యనుకొని "నాయనా శ్రవణ కుమారా నీరు దెచ్చెదనని పోయి ఆలసించితివేమి?" అని అడిగినాడు. నేను దైన్యముతో జరిగినదంతయూ విన్నవించినాను. ఏకైక సుతుని మరణవార్తను విని ఆ దంపతులు గుండెలు పగులునట్లు రోదించినారు. "ముదిమియందున్నాము; కన్నులు కనపడుటలేదు; ఇంక మాకు దిక్కెవరు? మేమునూ ప్రాణములను విడిచెదము" అని యేడ్చినారు. ఆ వృద్దుడు క్రుద్ధుడై "మమ్మీ దుస్థితికి తెచ్చిన నీవునూ పుత్రశోకమున మరణించెదవు గాక!" అని శపించినాడు.   
    పశ్చాత్తాపముతో కుమిలిపోవుచున్న నేనప్పుడా ముని వాక్యమును పట్టించుకొనలేదు. అప్పటికింకనూ అవివాహితుడనైన నాకు పుత్రులను గురించిన ఆలోచన లేవియూ రాలేదు. అనతి కాలముననే శాపము మాట మరచిపోయినాను.  
    ...కైకేయి ఆదేశానుసారము భరత శత్రుఘ్నులు అయోధ్యను చేరుకొనుటకు ఎనిమిది దినములు పట్టునని అనుకొనుచుండగా సుమంత్రుడు వచ్చి రామలక్ష్మణులీపాటికి అరణ్యమును ప్రవేశించి యుందురని చెప్పినాడు. నాకు తటాలున నా నల్వురు కుమారులలో ఎవరునూ నేడు నావద్ద లేడన్న సత్యము గోచరించినది. ఆ క్షణముననే ముని శాపమునూ స్పురించినది. ఇప్పుడు నా శరీరమున అణువణువునూ కంపించుచున్నది! అవయవములు శక్తిని కోల్పోవుచున్నవి! శాపము ప్రకారము నా ప్రాణములు నిష్క్రమించు సమయము సమీపించుచున్నదని తోచుచున్నది!"   
    కౌసల్యాదేవి ఆందోళనతో లేచి "నాథా మీకిప్పుడు విశ్రాంతి అవసరము" అని దశరథుని తల్పము వద్దకు తీసుకొనిపోయి పరుండ బెట్టినది. నిద్రకువశ్యుడైన దశరథుని కన్నులు మూయబడినవి. అవి మరల తెరువబడలేదు. మహారాజు ప్రాణములు సుషుప్తియందే ఎగిరిపోయినవి. తల్పమున తనువు మాత్రమే మిగిలినది.                                                                                                                          *    *     *

 Previous Page Next Page