పెళ్ళికి నెలరోజులు ముందు పెళ్ళి కొడుకు తల్లీ-తండ్రీ విడిపోయారంటే అది చాలా లజ్జాకరమైన విషయం. వాడు చాలా బాధపడవచ్చు. పెళ్ళయ్యేవరకూ ఈ విషయాన్ని దాచిపెట్టి ఆ తరువాత వెల్లడి చేసినా, వాడికి అది అంతే అవమానం కావొచ్చు.
-ఏం చెయ్యాలో నిర్ణయించవలసింది వాడే.
ఒకటి మాత్రం నిజం.
పెళ్ళయిన కొత్తలో ఆయన నన్ను కాదన్నా సహించాను.
నా కొడుకుని దూరంగా పెంచినా ఒప్పుకున్నాను.
నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో, అందులో వెయ్యవ వంతు ఆయన నన్ను ప్రేమించకపోయినా ఆయనతో కలిసి ఇన్నేళ్ళు జీవించాను.
కానీ ఆయన మరో ఇద్దరు స్త్రీలని మోసం చేసారంటే మాత్రం సహించలేను.
విడిపోతాను- ఆస్తితో సహా.
సాహితీ, సంకేతలని ఆయన పెంచుతారో, నాకు వదిలి పెడతారో ఆయన ఇష్టం.
ఆనందరావు చెప్పిన కథ
ఈ రాత్రి, నా జీవితంలో ఇంత విషమ పరిస్థితి తెస్తుందని, నన్ను ఇంత ఇరకాటంలో పడేస్తుందని నేను కలలో కూడా వూహించలేదు.
అసలు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావటమే నాకు అర్ధంకాని పరిస్థితి.
ఎవరో అమ్మాయి నా ఫోటో పట్టుకుని, ఫలానా ఆనందరావే నా తండ్రి అని చెప్తే - అర్ధరాత్రి బెదిరిపోతూ వెళ్ళే అవసరం నాలాటివాడికి లేదు. కేవలం కుతూహలంతోనే వెళ్ళాను. నా ప్రత్యర్ధులు ఎవరైనా నాకు చెడ్డపేరు తీసుకురావటానికి ఈ విధంగా ఆ అమ్మాయిని ప్లాంట్ చేశారేమో అనుకున్నాను. కానీ ఆ అమ్మాయిని చూశాక నీ అభిప్రాయం మార్చుకున్నాను.
చాలా అమాయకంగా, సంసారపక్షంగా వుంది ఆ అమ్మాయి.
నన్ను చూసి ఏడవటం మొదలుపెట్టింది. మామూలుస్థితికి తీసుకురావటానికి నాకు అరగంట పట్టింది. ఆ అమ్మాయి దగ్గిరున్నది నా ఫోటోనే. కానీ పాతిక సంవత్సరాల క్రితంది.
నన్ను చూడగానే ఆ అమ్మాయి కళ్ళలో వెలుగు కనబడింది. స్వంత తండ్రినే చూసినంత ఆనందం.
ఆ అమ్మాయి తేరుకున్నాక అడిగాను. "నీ పేరేమిటి?" అని.
"దేవిక" అంది.
"మీ ఊరు?"
"వరంగల్లు"
ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ మా సంభాషణ ఆసక్తిగా వింటున్నాడు.
"మీ తల్లి పేరు?"
"ప్రమద్వర..."
నాలో ఏదో అనుమానం అగ్నిపర్వతంలా బ్రద్దలైంది. "ఏ ప్రమద్వర?"
"అయినంపూడి ప్రమద్వర" అంది. ఆ అమ్మాయి మాటల్లో నాపట్ల వెటకారం ధ్వనించిందేమో నేను గుర్తించలేదు. అప్పటికే నా చుట్టూ ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. ప్ర... మ... ద్వ...ర. ఈ అమ్మాయి ప్రమద్వర కూతురు.
ఆమె చేతిలో నా ఫోటో!
"ఈ ఫోటో ఎవరిచ్చారు?"
"అమ్మిచ్చింది".
"మీ అన్నగారి పేరేమిటన్నావ్?"
ఆ అమ్మాయి నా వంక అదోలా చూసి మొహం తిప్పేసుకుంది. ఆ తిప్పుకోవటంలో, "ఎన్నిసార్లు చెప్పను? నువ్వే నా తండ్రివి" అన్న సమాధానం వుంది.
లేచి గదిలో ఇటూ అటూ పచార్లు చేయసాగారు. ముందు నా రక్తపు పోటు తగ్గితే తప్ప ఇంకో ప్రశ్న వేసే స్థితిలో లేను. కాస్త సర్దుకున్నాక- నా జీవితం- ఇన్నాళ్ళూ దేనికోసమైతే ఎదురు చూశానో- ఏ ఆచూకీ కోసం తపించిపోయానో ఆ ప్రశ్న వేశాను.
"అన్నయ్యెక్కడ?"
ఆ అమ్మాయి తలెత్తింది.
ఆ మాత్రం ఆలస్యంకూడా భరించలేక పోయాను. విసురుగా దగ్గరికి వెళ్ళాను. అన్నయ్యెక్కడ? అన్నయ్యెక్కడ? నీ అన్నయ్య ఎక్కడ? ఒకే ప్రశ్న వేయి ప్రశ్నలుగా ఆమెను నా చూపులోంచి చుట్టుముట్టింది.
"అన్నయ్యెవరు?" అంది ఆ సమాధానంలో నిజాయితీకి షాక్ అయ్యాను. కానీ నేను వూహించని సమాధానం అది.
"గోపీచంద్... నీ అన్నయ్య" అన్నాను.
"నాకు అన్నయ్య లెవరూ లేరు".
"లేరా...?" రెట్టించాను.
"లేరు".
"అమ్మ ఎక్కడుంది?" ఆమె సమాధానం చెప్పలేదు.
"మీ అమ్మ.....ప్రమద్వర....అమ్మెక్కడుంది?"
"అమ్మ చచ్చిపోయింది" తల దించుకుని సమాధానం యిచ్చింది.
నా చేతుల్లోంచి కారు తాళాలు అప్రయత్నంగా జారిపోయాయి.
కుర్చీలో కుప్పకూలిపోయాను.
ప్రమద్వర చచ్చిపోయింది.
ప్రమద్వర ఇక లేదు!
నీటిపొర కంటిచుట్టూ కనబడకుండా చేయటానికి విఫల ప్రయత్నం చేయవలసి వచ్చింది. సర్దుకోవటానికి అయిదు నిమిషాలు పట్టింది.
"నీకు నిజంగా నీ అన్నయ్య గురించి తెలీదా?"
ఆమె తల అడ్డంగా వూపుతూ, "ఊహు, నాకసలు అన్నయ్య వున్నట్టే తెలీదు" అంది.
"అమ్మ చచ్చిపోయి ఎంతకాలం అయింది?"
"రెండు నెలలు".
మిగతాది నాకు అర్ధం అయింది. తల్లి మరణంతో ఈ అమ్మాయి చేతిలో వున్న ఒక్క ఆధారంతో బయల్దేరి వుంటుంది. ఎవరో మోసగాళ్ళ వలయంలో ఇరుక్కుపోయి అదృష్టవశాత్తు ఈ రాత్రి బయటపడింది. తన కూతురు కింత ఘోరమైన స్థితి దాపురించిందంటే ఆమె ఆత్మ వూరుకోదు. నన్ను క్షమించదు.
నేనొక నిర్ణయానికి వచ్చాను.
ప్రమద్వర ఇంతకాలం ఎక్కడుంది- ఏం చేసిందని ఆమె కూతుర్ని అడగటం నాకు ఇష్టంలేదు. ఆ అమ్మాయి చెప్పే సమాధానం ఎలా వినవలసి వస్తుందో...
బహుశా తన కూతురికీ సమాజంలో ఒక స్థానం కలిగించటానికి నేనే తన తండ్రినని చెప్పిందేమో?
ఆ బాధ్యత నేను పూర్తి చేస్తాను.
ఈ నిర్ణయానికి రాగానే నా మనసు తేలికపడింది.