Previous Page Next Page 
వెన్నెల్లో గోదారి పేజి 11


                                          5
    
    మేము ఇంటికి వెళ్ళేసరికి పాలు వచ్చే వేళయింది. ఆయన చాలా గంభీరంగా వున్నారు. తేలు కుట్టిన ఘరానా దొంగ పోలీసులకి దొరికాక ఈ విధమైన గాంభీర్యాన్నే చూపిస్తాడు.
    
    సాహితి; సంకేతలు బిక్కమొహం వేసుకొని వున్నారు. వాళ్ళకి వూహ తెలిసిన తరువాత మేము అలా ప్రవర్తించటం ఇదే మొదటిసారి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. నేనెప్పుడైనా దెబ్బలాడినా, కోపం వచ్చి అలిగినా ఆయనే బ్రతిమాలి మంచి చేసుకొనేవారు. ఇప్పుడు అర్ధమవుతూంది. ఆ మంచితనం వెనక ఏముందో.
    
    నా ఆస్తి!
    
    కావల్సిన సుఖాలు బయట దొరుకుతున్నప్పుడు ఇంట్లో ఎంత నమ్రతగానైనా ప్రవర్తిస్తాడు భర్త.
    
    మా పెళ్ళయిన కొత్తలో ఈయన బాగా తాగేవారు. పేకాడి, రాత్రి ఏ రెండింటికో ఇంటికి చేరుకొనేవారు. దాదాపు సంవత్సరం నరకం అనుభవించాను. ఆరోజులు తల్చుకుంటేనే భయమేస్తుంది. ఈయన చేతులు పట్టుకుని బ్రతిమాలేదాన్ని. "పేకాట మానెయ్యండి, ఆస్తి వ్యవహారాలు చూసుకోండి" అని ఈయన వినేవారు కాదు. "మీరు చేసిన ద్రోహానికి ఇంతకంటే నరకం అనుభవించాలి" అనేవారు. ఏమిటి మేము చేసిన ద్రోహం? గాలికి తిరిగే వాడిని తీసుకొచ్చి ఇంత ఆస్తినీ, కూతుర్నీ వప్పచెప్పటమేనా? అర్హతలేని వాడిని అందలం ఎక్కించటమేనా?
    
    మీకు అనిపిస్తూ వుండవచ్చు. ఏమిటి ఈవిడ భర్త గురించి ఇలా చెపుతూంది అని. నిజమే ఇన్నాళ్ళూ నేను ఒక్కమాటా అనలేదు. పెళ్ళయిన కొత్తలో ఆయన పెట్టిన బాధలకి ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆఖరికి....ఆఖరికి....నాన్న చనిపోయినప్పుడు కూడా నాలో నేనే కుమిలిపోయాను తప్ప ఈయన్నేమీ అనలేదు.
    
    కేవలం ఈయన్ను ప్రేమించిన నేరానికి, నాన్నని వప్పించి ప్రపంచాన్ని ఎదిరించి ఈయన్ను చేసుకున్న పాపానికి, ఈయన ఎలాంటి వారైనా ఏ పని చేసినా భరించవలసి వచ్చింది.
    
    ప్రేమకన్నా ఘోరమైన తప్పు మరొకటి వుండదని నా వుద్దేశ్యం. ఆ తప్పే నేనూ చేశాను. ఈయన్ని ప్రేమించటం! ఈయన కోసం అర్ధరాత్రి గోదావరిలో దూకేటంతగా ప్రేమించటం.....అంతేకాదు. ఇంకో ఉదాహరణ కూడా చెపుతాను.
    
    పెళ్ళయిన కొత్తలో, ఇంటినసలు పట్టించుకోకుండా ఈయన తిరిగేవారు. నా సహనానికి కూడా ఒక హద్దుంది. ఒకరోజు నిలదీశాను. అప్పటికి మా  వివాహమై ఆర్నెల్లు గడిచాయి. నాకు ఆరోనెల. ఒక అచ్చటా ముచ్చటాలేదు. ఇంట్లో నిండుగర్భిణీ వుందని కూడా లెక్కలేదు. మామూలుగా తాగుడుకీ, ఆ తరువాత పేకాటకీ బయలుదేరారు. "మీరిలా అర్ధరాత్రి ఇంటికొస్తే ఏం చెయ్యాలి నేను? అసలు ఇంట్లో భార్య అనేది ఒకత్తుందనైనా మీకు గుర్తుందా?" అడిగాను ఏడుస్తూ.
    
    "గుర్తుండకుండా వుండాలనే-" అన్నారు.
    
    నాకు ఒళ్ళు మండిపోయింది. "మీరు క్లబ్బుల్లోనే కాపురం చేస్తే ఇంట్లో నేనేం చెయ్యాలి?" అని అడిగాను.
    
    "కావల్సింది ఎలాగైనా సాధించటం అలవాటేగా. ఒక గోడ మీద నా పేరు వ్రాసుకుని చూస్తూ సంతృప్తిపడు" అనేసి వెళ్ళిపోయారు. నిశ్చేష్టురాల నయ్యాను. నేను తనను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయనకి ఎలా చెప్పటం?
    
    ఆయన ఆరోజు ఇంటికొచ్చేసరికి రాత్రి రెండయింది. తూలుతూ వచ్చారు. నేనేం చేశానో తెలుసా? గోడలమీద ఆయన చెప్పినట్టు పేర్లు వ్రాశాను. ఒకటి కాదు. రెండు కాదు. వందలు...వేలు బాత్ రూమ్ లో మొదలుపెట్టి - బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, వంటిల్లు- మొత్తం ఇంటిగోడల్నిండా ఆయన పేరు వ్రాసేను.
    
    ఇదంతా మీకు పిచ్చిగానూ, వెర్రిగానూ కనిపిస్తే అది మీ లోపమే! ఇంకా గాఢంగా ప్రేమించటం చేతకాకపోతే మీరు ప్రేమించటానికి అనర్హులు. ఇంకా గాఢంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేకపోతే మీరు జీవించటానికి అనర్హులు.
    
    అంత గాఢంగా ఆయన్ని ప్రేమించాను. ఈ క్షణంవరకూ ప్రేమిస్తూ వచ్చాను.
    
    నిండు కడుపుతో, రాత్రి రెండింటికి ఆరుబయట చలిలో మెట్లమీద కూర్చుని, ఆఖరిపేరు పూర్తిచేస్తున్న నన్ను చూసి ఆయన చలించిపోయిన మాట నిజమే. 'ఈ పిచ్చి నీ కెప్పుడు పోతుంది తరళా' అని ఆ క్షణం నిజాయితీగానే అన్నారు. కానీ అది ఒక క్షణం మాత్రమే తరువాత మామూలే.
    
    ఇప్పుడు చెప్పండి. ఇంతగా ప్రేమించే భార్య వుండగా ఇంతమంది ఆడవాళ్ళని మోసం చేయటం, చాటుగా కాపురాలు పెట్టటం-
    
    ఏ శిక్ష విధించాలి?
    
    ప్రబంధ్ తప్ప ఇంకెవరూ నాకు సాయం చెయ్యలేరు.
    
    అన్నట్టు ప్రబంధ్ గురించి మీకు చెప్పలేదు కదూ.
    
    ప్రబంధ్ నా కొడుకు. నా కడుపున పుట్టినవాడు.
    
    మీకు అనుమానం రావొచ్చు. ముందు ఇద్దరు కూతుళ్ళే అంది. తరువాత మళ్ళీ 'కొడుకు' అంటుందేమిటి అని. మా వివాహమైన తొమ్మిది నెలలకు పుట్టాడు ప్రబంధ్. ఒక రకంగా చెప్పాలంటే వాడు పుట్టాకే ఈయణ మారేరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు. ప్రబంధ్ మీద ఒక్క పైసా కూడా "నాది" ఖర్చు పెట్టనివ్వలేదు ఆయన. తరళా ఫైనాన్స్ విషయాలన్నీ చూస్తున్నందుకు జీతం తీసుకునేవారు. దాంతోనే వాన్ని చదివించారు. హాస్టల్లో చేర్పించారు. చివరికి 'లా' చదివించారు. నేనేమైనా అంటే "నీ డబ్బుతో ముంచేస్తే వాడూ అడ్డగాడిదలా తయారవుతాడు. నీ పిచ్చి వాడిక్కూడా అంటకుండా వుండాలంటే వాడు దూరంగా వుండటమే మంచిది" అనేవారు. చెప్పానుగా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి అని ఆయన డబ్బుతోనే వాణ్ణి చదివించారు. కేవలం వాడికోసమే బ్రతుకుతున్నట్టు ప్రవర్తించేవారు. తాగుడు మానేశారు. క్లబ్బులు బంద్.
    
    అంతకన్నా నాకు కావల్సిందేముంది? నా మొండితనాన్నీ, ప్రేమనీ ఆయన పిచ్చిగా అర్ధం చేసుకోవటం నా దురదృష్టం. ఏది ఏదైనా ప్రబంధ్ పుట్టాక మా జీవితాలు ఒక గాడిలో పడ్డాయి. ఆయన మామూలు మనిషి అయ్యారు. కొడుకుని దూరంగా వుంచటం నాక్కొద్దిగా బాధగా వున్నా ఈ ఆనందంలో దాన్ని పట్టించుకోలేదు. ఆ తరువాత మళ్ళీ మరో ఏడెనిమిది సంవత్సరాల వరకూ నా కడుపు పండలేదు. ఆ తరువాత సాహితీ, సంకేత... మరోవైపు ప్రబంధ్ ఎప్పుడూ ఫస్ట్ రాంకే. శలవులకి ఇంటికొస్తూ వుండేవాడు. ఒక అతిథిగా ఇంటికొస్తున్నా-వాడికి నేనంటే చాలా ప్రేమ. ఈ విధంగా మా కుటుంబం నెమ్మది నెమ్మదిగా సర్దుకుంది. ఈ రోజు మా సంసార నౌక పూర్తిగా తిరగబడి పోయేవరకూ. చాలా అన్యోన్యమయిన దాంపత్యమనే చెప్పాలి. పోతే మొదటి సంవత్సరం మాత్రం ఒక దురదృష్టకరమైన కల అంతే!
    
    వచ్చే నెల ప్రబంధ్ పెళ్ళి లా పాసవ్వగానే వాడికి ఉద్యోగం కూడా వచ్చింది. ఏదో ప్రమదా ఇండస్ట్రీస్ లో లా ఆఫీసర్ గా నేను తీసుకోబోయే నిర్ణయం నాకు తెలుసు. ఈ విషయమై సంకేతగానీ, సాహితిగానీ ఏ సలహా ఇవ్వలేరు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు. ఒక్క ప్రబంధ్ నే అడగాలి. నావైపు వుంటాడో, వాళ్ళ నాన్న గారివైపు వుంటాడో.
    
    ఇప్పుడు నా సమస్య ఏమిటంటే - ఈ వ్యవహారం ఈ రోజే తేల్చెయ్యాలా? ప్రబంధ్ పెళ్ళయ్యేవరకూ ఆగాలా అని.

 Previous Page Next Page