తమ కులం వాళ్ళకి రాంకు లివ్వటంలోనూ, ఇంటికి కూరగాయలు మోసేవాళ్ళకి డాక్టరేట్ లివ్వటంలోనూ నరసింహం తరువాతే ఎవర్నయినా చెప్పుకోవాలి.
వెతికి, వెతికి సింహం అతడిని పట్టుకున్నాడు. తమ కోరిక చెప్పేసరికి నరసింహానికి మొదట మతిపోయింది. అది తిరిగి సర్దుకోవడానికి ఒకరోజు పట్టింది. పడుతుందని తెలిసి మరుసటి రోజు సింహం అతడిని మళ్ళీ కలుసుకున్నాడు. రెండు లక్షలు తక్కువ సొమ్ము కాదు. ఇదిగాక మిగతా ఇద్దరు ఎగ్జామినర్లకి, 'వైవా' ఏర్పాటు చేయడానికి మరో లక్ష.
వీళ్ళు పట్టుకున్న కుర్రవాడి పేరు శేఖర్. అమితమైన తెలివి తేటలున్నవాడు. సంవత్సరానికి రెండు థీసెస్ లు వ్రాయగలిగే మెదడున్న వాడు. తిండి దినదిన గండమైనవాడు. అతనూ మొదట్లో వప్పుకోలేదు. కానీ ఆకలి నిజాయితీని జాయించింది. అతడికో లక్ష. రిసెర్చి అయ్యాక కూడా అంత సంపాదించటానికి ఒక జీవితకాలం సరిపోదనే వాస్తవం ఎదురుగా కనబడుతూంది. అదీగాక అంతకన్నా మంచి సబ్జెక్టుతో ఆర్నెల్లు తిరిగేసరికల్లా మరో డాక్టరేట్ ఇప్పిస్తానన్న నరసింహం వాగ్దానం! చివరికి శేఖర్ వప్పుకొన్నాడు. మొత్తానికి దాదాపు ఎనిమిది లక్షల ఖర్చుతో పదిరోజుల్లో డాక్టరేట్ వచ్చింది.
కానీ ఇక్కడే ఒక మోసం జరిగింది.
నరసింహాన్ని అయిదు సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్ ఇలాగే మొసం చేశాడు. ఆయనగారికి ఒక స్కూటర్ బహుమతిగా ఇవ్వటంతో అతడికి డాక్టరేట్ వచ్చి, ఉద్యోగం కూడా దొరికింది. ఆర్నెల్లయ్యాక క్షేమం కనుక్కోవటం కోసం ఇంటికొచ్చి, ఏదో పని వున్నట్టు స్కూటర్ అడిగి తీసుకుని అదే పోత పోయాడు. టాక్సులు కట్టటం కోసం కక్కుర్తిపడి "సి" బుక్కు అడగటం నిర్లక్ష్యం చేసినా నరసింహం లోలోపల ఉడికి పోయినా ఇది యూనివర్శిటీ అంతా పాకింది. అది వేరే సంగతి, అప్పుడు తను మోసపోయాడు.
ఇప్పుడు తనే అలా ఎందుకు చెయ్యకూడదనుకున్నాడు నరసింహం. శేఖరం దగ్గర రిపోర్టు తీసుకుని చివరికొచ్చేసరికి లక్షా ఎగ్గొట్టాడు. ఏమీ చేయలేని ఆ కుర్రవాడు సభలో గొడవచేసి పోలీసులతో అరెస్టుకాబడ్డాడు.
అదీ జరిగిన సంగతి.
........
"నువ్వు వెంటనే రమ్మనిపిలవగానే అనుమానం వచ్చింది. ఇంతలో సభలో జరిగిన గొడవ సంగతి తెలిసింది. వెంటనే తెర వెనుక విషయం పూర్తిగా తెలుసుకుని రావటంతో ఆలస్యమైంది" చెప్పటం పూర్తి చేసి అన్నాడు సింహం. కథంతా విన్నాక అతడు వెంటనే మాట్లాడలేదు. చేతిలో పేపర్ వెయిట్ తిప్పుతూ వుండిపోయాడు. అతడి మొహంలో కఠినత్వం చూసి సింహానికే భయం వేసింది. అంతకన్నా పెద్ద విషయాల్లో మోసం జరిగినప్పుడు కూడా ఇంతగా కదిలిపోలేదు.
"ఈ వ్యవహారంలో మనం మొత్తం ఎంత ఖర్చు పెట్టాము సింహం?"
"ఏడున్నర లక్షలు దాదాపు".
"అదంతా నరసింహం దగ్గర వసూలుచేసి సగం శేఖరానికివ్వు. ఆ ముసలి ప్రొఫెసర్ కి సరదాగా చిన్న శిక్ష కూడా వేస్తే సంతోషిస్తాను" తాపీగా అన్నాడు.
అర్థమైనట్టు "నేను వెళ్ళివస్తాను" అంటూ సింహం లేచాడు.
"మంచిది"
సింహం వెళ్ళిపోయాడు.
అతడలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు. చీకటి అతడిమొహం మీద మసగ్గా పడుతూంది. టేబిల్ మీద కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
"కాగితాన్ని సరస్వతి అంటారు. అమ్మా! సరస్వతీ!! ఒకప్పుడు చదువుకోనందుకు నేను సిగ్గుపడేవాడిని. ఇప్పుడు చదువు లేనందుకు గర్వపడుతున్నాను! ఒకప్పుడు రోడ్డు పక్కన నిలబడి, రకరకాల రంగురంగుల సంచులు భుజాన వేసుకుని స్కూళ్ళకి వెళ్ళే పిల్లల్ని కళ్ళప్పగించి చూసేవాడిని. సింహం అన్నట్టు నాలో ఎక్కడో ఏమూలో ఒక శాడిస్టుదాక్కొని వుండి వుంటే - ఇదుగో ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళని చూసి వాడు కూడా సిగ్గుపడుతున్నాడు. నరసింహంలాటి వాళ్ళు చెప్పే ఈ చదువూ- ఈ యూనివర్శిటీలు ఇచ్చే ఈ డాక్టరేట్లూ నాకక్కర్లేదు. ఎన్నాళ్ళనుంచో నా మనసులో వున్న కోర్కె ఈనాడు పూర్తిగా నశించింది. నన్ను క్షమించు".
ఏడు లక్షలా పాతికవేలు ఖర్చుపెట్టి - కేవలం అహాన్ని సంతృప్తి పరుచుకోవటం కోసం సంపాదించిన డాక్టరేట్ కాగితం సిగరెట్ లైటర్ నీలి వెలుతురులో ఎర్రగా మంది బూడిదయింది.
.........
(ఇది జరిగిన పదిరోజులకి నరసింహాన్ని బయట చెట్టుకి నగ్నంగా కట్టేసి దొంగలు ఇల్లు దోచుకుపోయారు. యూనివర్శిటీ కాంపస్ లో ఊరి చివర ఇల్లు - ప్రొద్దున్నే రన్నింగ్ కి వెళ్ళిన విద్యార్థులు కట్లువిప్పారు. అది అక్కడితో ఆగలేదు. మూడురోజుల తర్వాత బ్రోతల్ హౌస్ లో అతడిని అరెస్టు చేశారు. ఇల్లుదోచుకోబడి మూడు రోజులు కాకముందే బ్రోతల్ హౌస్ కి వెళ్ళిన అతడిని చూసి అందరూ నవ్వుకోసాగారు. అతడి నెత్తీనోరుకొట్టుకుని నిజం చెపుతానన్నా వినే ఓపిక ఎవరికుంది? ఇది ఇక్కడ కూడా ఆగలేదు. ఒక రాత్రి అతడు యూనివర్శిటీ రికార్డులు తగలబెట్టే ప్రయత్నం చేస్తుంటే వాచ్ మెన్ పట్టుకున్నాడు. మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంటు పరీక్షచేసి అతడికి మతిభ్రమించినట్టు సర్టిఫై చేశాడు. ఉద్యోగం పోయింది. ...సింహం దృష్టిలో చిన్న శిక్ష అంటే అంతే మరి!
5
ఫంక్షన్ అయిపోయాక ప్రభుత్వ కార్లో ఫాస్టస్ హోటల్ లో దింపబడ్డాడు.
అతడు తన రూమ్ తలుపు తీసి వుండటం గమనించి విస్మయంతో లోపలికి వెళ్ళాడు.
"రండి మిత్రమా రండి. మీ కోసమే చూస్తున్నాను" అంటూ ఆహ్వానించాడు. అది తన గదే అయినట్టూ, వచ్చినవాడు గెస్టు అయినట్టు.
"...లోపల్నుంచి నెపోలియన్ బ్రాందీ వాసన ఎదుటి రూంలోకి దూసుకొస్తుంటే ఆగలేకపోయాను. న రూమే అనుకుని ఈ గది తాళాలు ఇచ్చారు రిసెప్షన్ లో. మీరేమీ కంగారు పడలేదు కదా".
"లేదు" అన్నాడు ఫాస్టస్. "నిజానికి సంతోషంగా వుంది కూడా"
ఇద్దరూ చెరో రెండు పెగ్గులూ పూర్తిచేసేసరికి పన్నెండయింది. మూడో పెగ్గు పోస్తూ వుండగా ఎదురు రూమ్ లోంచి ఫోను మ్రోగింది.
"నిశ్చయంగా మా ఆవిడే. నేను లేనని చెప్పండి". ఫాస్టస్ రిసీవర్ ఎత్తాడు.
"ఆయన అక్కడ ఉన్నారా!"
అతడు వెంటనే అబద్ధం చెప్పలేకపోయాడు.
"ఒకసారి ఫోను ఆయనకిస్తారా" అట్నుంచి అభ్యర్థనగా వినిపించింది. రిసీవర్ అందించాడు. ఆమె అట్నుంచి ఏం చివాట్లు పెట్టిందో గానీ అతడు లేచినిలబడి, తూలబోయి నిలదొక్కుకుని "నేను సాయంత్రం చెప్పింది నిజమే" అన్నాడు.