Previous Page Next Page 
రాక్షసుడు పేజి 11


    కంఠం తగ్గించి తనతో మాట్లాడుతున్న వ్యక్తి వంక తలతిప్పి చూశాడు. పేపరు చాటుగా పెట్టుకుని మాట్లాడుతున్న ఆ వ్యక్తి... లోహియా!

 

                                    *    *    *

 

    అతడు తన జీవితంలో ఎప్పుడూ అంత కోపంగా, అసహనంగా లేడు. ఇంటర్ కమ్ లో "రాబోట్..." అని పిల్చాడు. "నాకు సింహం కావాలి. వెంటనే... అయిదు నిముషాల్లో".

 

    "కానీ సింహం... వేరే ఆపరేషన్ లో ఉన్నాడు సర్. మీరు ఇచ్చిందే".

 

    "ది హెల్ విత్ ఇట్. అతడు నాక్కావాలి. అంతే" విసురుగా పెట్టేసి, అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అంతలో అతడి దృష్టి వాణి ఇచ్చిన పేపర్ల మీద పడింది. రివాల్వింగ్ ఛెయిర్ లో కూర్చొని ఆ పేపర్లని చేతిలోకి తీసుకుని చదవసాగాడు.

 

                            డాక్టరేట్ సంపాదించడం ఎలా ?
                                           మూడు పద్ధతులు

 

    డాక్టరేట్ మూడు రకాలుగా ఇస్తారు.

 

    ....మామూలుగా చదువు తరువాత ఉన్నత స్థాయిలో ఒక విషయం మీద రిసెర్చ్ చేస్తే ఇచ్చేది. ....ఏదో ఒక రంగంలో బాగా కృషి చేస్తే గౌరవ పట్టాగా ఇచ్చేది. వెండితెర మీద ఆడపిల్లల్తో గంతులేసే వారి నుంచి, బాగా డప్పు వాయించే వాడి వరకూ కాస్త పలుకుబడి ఉంటే ఎవరైనా దాన్ని పొందవచ్చు. మనకి కావల్సింది లిమ్నాలజీలో డాక్టరేట్ కాబట్టి ఈ పద్ధతి లాభం లేదు.

 

    ఒక వ్యక్తి ఏ డిగ్రీలూ లేకపోయినా, ఒక అంశంలో విపరీతమైన నాలెడ్జితో ఉపన్యాసం ఇచ్చినప్పుడో, లేక వ్యాసంగా ప్రచురించినప్పుడో అంతకు ముందు ఎవరూ కనుగొనని కొత్త విషయం అందులో వున్నట్లయితే, మంచి ఆదర్శాలున్న డైనమిక్ వైస్ ఛాన్సలర్ దానిని చదివి, లేదా విని, Its a rare contribution to the particular subject అని భావిస్తే... అప్పటికప్పుడు అతడికి డాక్టరేట్ డిగ్రీ అనౌన్స్ చేయవచ్చు. ఏ చదువులు లేకపోయినా, సైన్స్ లోగానీ ఆర్ట్సులో గానీ అద్భుతమైన విద్యని ప్రదర్శిస్తే దానికి గుర్తింపు దొరకవచ్చు. కానీ, అంత గొప్ప నిర్ణయాలు తీసుకునే వైస్ ఛాన్సలర్ వుండటం మనదేశంలో అసాధ్యం. తమ పీకలమీదికి ఎక్కడొస్తుందో అని భయపడతారు. ఇక పోతే -

 

    ఒక పెద్ద పొలిటీషియన్ గానీ, మంత్రిగానీ అతడికి కావల్సిన వాళ్ళకి నాలుగు రోజుల్లో అర్జెంటుగా డాక్టరేట్ కావల్సివస్తే, వైస్ ఛాన్సలర్ కి ఫోన్ చేసి 'నాలుగు రోజుల్లో మా వాడికి డాక్టరేట్ డిగ్రీ కావాలోయ్' అని అడుగుతారు. వైస్ ఛాన్సలర్ తను చెప్పినట్టు వినే ఏ మాత్రం వ్యక్తిత్వంలేని ప్రొఫెసర్ కి ఈ పని అప్పగిస్తాడు. ఆ ప్రొఫెసర్ మరీ చేతకాని వాడయితే తన స్వంత "వర్క్" ఏదైనా వుంటే ఇవ్వటం, లేకపోతే తనే అప్పటికప్పుడు వ్రాయటం లాటివి చేస్తాడు. కొంచెం తెలివైనవాడయితే...

 

    1. తన దగ్గర రిసెర్చ్ చేస్తున్న విద్యార్థికి ఉద్యోగం ఆశ చూపించి, అతని థీసెస్ తీసుకుంటాడు. (ఆర్థిక ఇబ్బందులు వున్నవాళ్ళు ఉద్యోగం దొరకనప్పుడు సంవత్సరాల తరబడి రిసెర్చ్ చేయడం కంటే, సగం చేసిన దాన్ని అమ్ముకుని ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు.)

 

    2. లేకపోతే అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇంకో దాన్ని ఇప్పిస్తానని చెప్పి అతడి వర్క్ తీసుకొని, దానికి వేరే వాళ్ళ పేరు పెట్టడం.

 

    3. ఒక రిసెర్చ్ స్టూడెంట్, గైడ్ కి సమర్పించిన రిపోర్ట్ లో నుంచి మంచి పాయింట్స్ కొట్టేసి ఏ విషయమూ చెప్పక "ఇంకా వర్క్ చెయ్యి" అని ఆలస్యం చేయటం... ఆ పాయింట్ తనకి కావాల్సిన వాళ్ళకి అందజెయ్యడం, అదేదో జర్నల్ లో ప్రచురింపబడితే అసలు విద్యార్థిని "ఎందుకు కాపీ చేశావు" అని ఎదురు దబాయించటం (ఇలాటివి ప్రస్తుతం అసంఖ్యాకంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సైన్సులో, విద్యార్థి రిసెర్చ్ చేసిన విషయాలకి తమ పేరు పెట్టుకొని బహుమతులు తీసుకునే ప్రొఫెసర్స్ కూడా వున్నారు). ఈ విధంగా తయారుచేసిన థీసెస్ ని ఒక స్వదేశీయుడు, ఒక విదేశీయుడు పరిశీలించాలి రూల్ ప్రకారం! కానీ విదేశీ పరిశీలకుడి విషయంలో సరి అయిన ఏర్పాటు జరగని కారణంగా ఇక్కడి వాళ్ళనే రెండో ఎగ్జామినర్ గా నియమిస్తున్నారు. ఒక తెలిసినవాడు ఇంకో తెలిసిన వాడిని ఏర్పాటు చేస్తాడు. మొత్తంమీద ఇదంతా చేసేది ప్రొఫెసరే కాబట్టి తను చెప్పినట్టు వినేవాళ్ళని ఇద్దర్ని నియమించే బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి మనకేం పర్లేదు.

 

    ఏదో ఒక యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకోవటం పెద్ద కష్టం కాదు (ఆ లైనులో కావాలంటే). లేదా ఏదో ఒక బాబాగార్ని పట్టుకొని మనమే ఒక యూనివర్శిటీ స్థాపించుకోవచ్చు.

 

    ఆ తరువాత్ పై చెప్పిన మూడు మార్గాల్లో థీసెస్ పూర్తి చేసి 'వైవా' ఏర్పాటు చేయాలి. పెద్ద అట్టహాసంగా ఒక సభలో ఈ డాక్టరేట్ తీసుకోవాలంటే కాన్వొకేషన్ ఏర్పాటు చేయాలి. ఉన్నట్టుండి ఒక యూనివర్శిటీ కాన్వొకేషన్ పది రోజుల్లో ఏర్పాటు చెయ్యాలంటే కష్టమే. కానీ డబ్బు సాధించలేనిది ఏముంది? దీనికన్నా ఏ యూనివర్శిటీలో, వచ్చే పది రోజులలో కాన్వొకేషన్ లు వున్నాయో చూసుకుని మన ప్రయత్నం అక్కడి నుంచి మొదలు పెడితే మంచిది. మొత్తం దీనికంతటికి అయ్యే ఖర్చు అయిదారు లక్షలదాకా వుండవచ్చు. ఇన్ల్ఫుయెన్సు ఉపయోగిస్తే ఈ ఖర్చు రెండు లక్షలదాకా తగ్గవచ్చు. పది రోజులలో డాక్టరేట్ సంపాదించాలి అంటే యివీ పద్ధతులు. బెస్ట్ ఆఫ్ లక్- వాణి.

 

    అతడు చదవటం పూర్తి చేసి కుర్చీ వెనక్కి వాలి, కళ్ళు మూసుకున్నాడు. అంతలో తలుపు చప్పుడయింది. సింహం వచ్చాడు. అతడి జుట్టు దగ్గిర రంగు ఇంకా చెరగలేదు. తెల్లగా వుంది.

 

    "పిలిచావుట?"

 

    "అయిదు నిముషాల్లో రమ్మన్నాను. పిలిచి పావుగంట అయింది".

 

    "వెంటనే వచ్చానే".

 

    "లేదు. రాబోట్ ని కారణమడిగావు. సభలో జరిగిన సంగతి చెప్పాడు. అసలేం జరిగిందో కనుక్కుని వస్తున్నావు. అందుకే ఆలస్యమైంది. అవునా".

 

    "మైగాడ్. నీకు జ్ఞాన చక్షువులు కానీ వున్నాయా".

 

    "నా ప్రశ్నకు సమాధానం అదికాదు సింహం".

 

    "నరసింహం అని ఒకడున్నాడు. వాడు చేశాడు ఇదంతా".

 

    "ఎవడు వాడు?"

 

    .......

 

    ప్రొఫెసర్ నరసింహం! నల్లకోటు, పీలికలా వేలాడే టై, లూజుపాంటు.... మొహం మీద వెకిలి నవ్వు, ఇవీ ఆభరణాలు.

 

    పవిత్రమైన విశ్వవిద్యాలయములో చేరగానే కుర్రవాడికి ఎమ్.సి., ఎమ్.ఏ.ల గురించి బోధిస్తారు సీనియర్ స్టూడెంట్లు. ఎమ్.సి. అంటే మన కాస్ట్. ఎమ్.ఏ. అంటే మన ఏరియా. అప్పటివరకూ స్వచ్చంగా వున్న రక్తంలోకి కులతత్వం, ప్రాంతీయతత్వం ఇంజెక్టు చేయబడుతుంది. ఇదంతా కేవలం యూనియన్ ఎన్నికలకోసం! వెలిగిన ఈ అగ్గిపుల్ల తరువాత దావానలంలా మారుతుంది. ఒకే కులం వాళ్ళందరూ యేర్పాటు చేసుకున్న ఫంక్షన్లకి, పిక్నిక్ లకి ఆ కులం ప్రొఫెసర్లు హాజరవటం ఈ తుచ్చ రాజకీయాలకి క్లెయిమాక్సు.

 Previous Page Next Page