Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 11

    అప్పుడు నాకు మా బరంపురం   తల్లి దండ్రులు  శ్రీ బచ్చు నరసింహమూర్తిగార్ని  పద్మావతిగార్ని  చూడతప్పదన్న  పరిస్థితి  ఏర్పడింది. ఇక్కడ వాళ్ళ విషయం  రాయడం నా ధర్మం. కారణం_ముందు ముందు శ్రీశ్రీగారి జీవితంలో  ముడిపడిన  సంఘటనలు  శ్రీశ్రీగారి అత్తవారిల్లు  కూడా అదే కావడం.

    బచ్చు నరసింహమూర్తిగారు, పద్మావతమ్మగార్ల  పెంపుడు  ముద్దుబిడ్డను నేను. ఆ దంపతులిద్దరికీ  ఇద్దరు కూతుళ్ళూ, ఇద్దరు కొడుకులూ వున్నా వాళ్ళకన్నా  అత్యధికంగా నన్నే అభిమానించేవారు.

    నా విద్యాభ్యాస  విషయంలో, నా హరికథా  కాలక్షేపాల్లో  మేము  ఆర్ధికంగా ఇబ్బందులు  పడుతున్న సమయంలో ఆయన ఎంతో ఆదుకున్నారు. వాళ్ళ బిడ్డగా నన్ను చిన్నతనం నుండీ  ఆదరించారు. వాళ్ళ పిల్లలకి నేనంటే ఆప్యాయత.

    బరంపురంలో  నన్ను అందరూ బచ్చుబాబు కూతురనీ, శ్రీశ్రీగారిని బచ్చుబాబు అల్లుడని అంటూంటారు. బచ్చుబాబుగారిల్లు  శ్రీశ్రీగారి అత్తవారిల్లుగా  నేటికీ పేరుపడి వుంది.

    బరంపురం  వెళుతున్న  ప్రస్తావనని  శ్రీశ్రీగారి దగ్గర తెచ్చాను.

    "వెళ్ళు సరోజా! వాళ్ళతో  సంప్రదించడానికే వెళుతున్నావని  నాకు తెలుసు"

    "కేవలం  అందుకనే అనుకోకండి. మా తల్లిదండ్రులు  ఓకే అనకుండా నేను ఏపనీ చెయ్యను. అదీకాకుండా  అప్పట్లో  ఓ సంవత్సర కాలంలో ఎనిమిదినెలలు  బరంపురంలోనే వుండేదాన్ని. నాలుగు నెలలే నన్ను కన్నవారింట్లో  వుండేదాన్ని" అన్నాను.

    "వాళ్ళింటికి  తప్పకుండా  వెళ్ళు" అన్నారు. అన్ని విషయాలతో  బరంపురానికి  ఉత్తరం రాస్తూ  నేను వస్తున్నానని కూడా తెలియచేశాను. వెంటనే వారి దగ్గర నుండి ఉత్తరం  వచ్చింది.

    "మేమే బయలుదేరి  అక్కడికి  వస్తున్నాం. అందరూ అక్కడే వుంటారు  గనుక కలిసి మాట్లాడుకోవడానికి  బాగుంటుంది. మాతో చెప్పకుండా మా అనుమతి లేకుండా  నువ్వీ పని చెయ్యవని మాకు తెలుసు. శ్రీశ్రీగారు మహాకవి. మన ఆంధ్రదేశంలో  అటువంటి  మహానుభావుడు  పుట్టినందుకు  మనమందరం గర్వించాలి. ఏమయినా  ముఖాముఖి అన్నీ తేల్చుకుందాం" అని వుందా ఉత్తరంలో.

    ఆ ఉత్తరం  శ్రీశ్రీగారికి  చూపించాను.

    "అంటే__మా ఇంకో మామగారూ, అత్తగారూ వస్తున్నారన్నమాట" అని నవ్వారాయన.


                                             నేను శ్రీశ్రీకే స్వంతం


    ఇప్పుడు నాకు పెళ్ళివద్దని  నేను, చేసుకోక తప్పదని  మా వాళ్ళూ! ఇంట్లో పేచీలు  ప్రారంభం అయ్యాయి.

    ఇంతలో  నేను కారు కొనుక్కుంటానని  శ్రీశ్రీగారితో  చెప్పాను. నీ ఇష్టం అన్నారు. మారీస్ మైనర్ టైపులో  వున్న ఆనాటి ఫోర్డ్ కారు ఎనిమిది వేలు పెట్టి  కొనుక్కున్నాను. నేనే డ్రైవ్ చేసుకొనే దాన్ని. నేను కారు కొనటంతో, శ్రీశ్రీగారు తన కారులో మా ఇంటికొచ్చి, దిగేసిన  తర్వాత  తన కారుని ఇంటికి పంపించేవారు.

    అప్పటికీ శ్రీశ్రీగారంటే  పడి ఛస్తున్నానని మాత్రం చెప్పగలను కాని, వారిని పెళ్ళి చేసుకుందామన్న ఉద్దేశం నాలో ఏకోశానాలేదు. వారిని చేసుకోవాలని కలలో కూడా అనుకోలేదు. అలాగని ఇంకొకర్ని  చేసుకొని  శ్రీశ్రీగారిని వదులుకోవడం  ఇష్టంలేదు.

    "పని  చేసినంత  కాలం చేద్దాం. ఎంతకాలం సాగుతుందో  సాగనీ చూద్దాం. ఇప్పుడంత అవసరం ఏం వుందని" అంటాను నేను. మా వాళ్ళు "ఆడపిల్లవి, ఆర్జించింది  చాలు, త్వరగా  నీకు పెళ్ళయితే....నీ వెనకింకా  ముగ్గురు పెళ్ళి కావలసిన  వాళ్ళున్నారం"టారు. ఇలాంటి గొడవలతో మా ఇల్లు ఒక నరకంలా తయారైంది.

    బరంపురం  నుండి మా బచ్చునాన్నగారూ, అమ్మారాలేదు. వరిపంట కోతలూ, అవీ వున్నాయి_ వచ్చే  ముందు వైరిస్తామనేశారు. వాళ్ళు వెంటనే వచ్చినా  సరే పెళ్ళి ప్రశ్నే లేదని మొండికేశాను.

    ఒకరోజు నేనూ, శ్రీశ్రీగారూ  కంపెనీలో  కూర్చొని  పాటలు రాస్తున్నాం.

    "స్టేండర్డ్  కారు  రిపేరుకిచ్చేను  సరోజా" అన్నారు శ్రీశ్రీగారు.

    "అలాగా" అన్నాను.

    "అంత మతిమరుపుగా  వున్నావన్నమాట. ఎందులో వస్తున్నారు? ఎలా గొస్తున్నారు? అని అడగనైనా  అడిగేవా" అన్నారు.

    "రోజూ మా ఇంటికొచ్చాక మీ కారుని  ఇంటికి పంపించేస్తారన్న సంగతి తెలిసిందేగా. అలా  అనుకొనే అడగలేదు" అన్నాను.

    "కారు రెండు రోజుల్లో  తయారవుతుంది. రిపేరు  కోసం  కంపెనీకిచ్చి  వారం అయింది. రిపేరు ఖర్చులు  మూడువేలు  అవుతాయి" అన్నారు.

    "ఎక్కడిచ్చేరేమిటి?" అన్నాను.

    "స్టాండర్డ్ కంపెనీలో" అన్నారు.

    "అలాగా?"

    "మనమే వెళ్ళి  తెచ్చుకోవాలి" అన్నారు.

    "ఏం డ్రైవరు లేడా?"

    "డబ్బు  కట్టాలి సరోజా"

    "అలాగేనండి. వెళ్ళి తెచ్చుకుందాం" అన్నాను.

    వారికి  తనకారంటే  చాలా ఇష్టం  అన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ రోజు  రానే వచ్చింది. కంపెనీ  నుండి ఇద్దరం  నాలుగ్గంటలకి  బయలుదేరి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి  రవణమ్మగారూ, సుబ్బారావు (డ్రైవరు)_ ఇద్దరూ  అక్కడే వున్నారు.

 Previous Page Next Page