గుండె గబగబ కొట్టుకుంది. "అయ్యో" అనుకుంటూ ముందూ, వెనుకా చూడకుండా పరిగెత్తింది.
ఆ మసక చీకట్లో...
కల్యాణి నేలమీద పడివుంది. పమిట చెదిరివుంది. జాకెట్టు ఊడి...
మతి పోయినట్లయింది. క్రిందకి వంగి "కల్యాణీ! అంటూ భుజంమీద చెయ్యివేసి అటూ, ఇటూ కుదిపింది.
ఒకటి రెండు నిమిషాలకు కల్యాణి కళ్ళు తెరిచింది. ఎక్కడుందో అర్థంగాక పిచ్చి చూపులు చూస్తోంది.
"కల్యాణీ! నేను. భయంలేదు."
కల్యాణి ఆమె చెయ్యి ఆసరాగా లేచికూర్చొని గట్టిగా కావిలించుకుని ఏడ్చేసింది.
"ఛీ. ఏమిటిది కల్యాణీ? ఏం జరిగింది?" ఆమెను దగ్గరిగా పొదుపుకుని ఓదారుస్తూ అంది మాధవి.
చివరకు చెప్పలేక చెప్పలేక జరిగిందంతా చెప్పింది కల్యాణి వెక్కిళ్ళ మధ్య.
మాధవికి ఆవేశంతో శరీరం వణికిపోయినట్లయింది. "నీచులు! ఎంతకు తెగించారు? ఎంత అసభ్యంగా ప్రవర్తించారు!" ఆమె గొంతుకోపంగా ధ్వనించింది.
"ఇప్పుడేం చెయ్యాలి మాధవీ! ఈ అవమానం భరించలేను. నలుగురిలో తలెత్తుకుని తిరగలేను. కాలేజి మానుకుని వెళ్ళిపోతాను."
మాధవి దీర్ఘంగా ఆలోచించింది.
"చూడూ! ఈ గొడవ నీకూ, నాకూ అది చేసినవాళ్ళకూ తప్ప ఎవరికీ తెలీదు. కాలేజిలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఎవరూ గమనించలేదు. నేను చెప్పినట్లు నువ్వు కదలకుండా వుంటే ఇదంతా జరిగివుండేది కాదు. ఇప్పుడు మనకి మనమే రభస చేసుకోవటం మంచిదికాదు. గప్ చిప్ గా వెళ్ళిపోయి ఏమీ జరగనట్లే వుందాం. ఇరవై నాలుగు గంటల్లోపల ఆ రాజామీద పగ తీర్చుకోకపోతే నేను మాధవిని కాదు!
కల్యాణిని బుజ్జగించి, మెల్లిగా లేవదీసి జాకెట్ సరిచేసి ఇవతలకు తీసుకొచ్చింది.
* * *
రాత్రి...
కల్యాణికి ఎంతకూ నిద్రపట్టడం లేదు. ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లయింది.
ఆమె తల్లిదండ్రులకు గారాబు తనయ. పెదవులుదాటి మాట రానఖ్కర్లేదు. కనుసైగచేస్తే చాలు క్షణంలో అనుకున్నవన్నీ నెరవేరిపోతాయి. కాలు కడపనఖ్కర్లేకుండా కూర్చున్నచోటుకే అన్నీ అమరిపోతాయి. అటువంటిది ఇంత జరిగాక ఇహ బ్రతుకెందుకు?
ఆమె చాలా సెన్సిటివ్. ఎంత ప్రయత్నించినా ఈ సంఘటనకు తట్టుకోలేక పోతూంది. గుండెను ఎవరో పిండివేస్తోన్నట్లయింది. కళ్ళనుండి నీళ్ళు జలల కారిపోతున్నాయి.
తలత్రిప్పి మాధవివైపు చూసింది. గాఢనిద్రలో వుంది. మెల్లగా మంచంమీద నుండి లేచింది. అప్పుడు టైము పన్నెండయి వుంటుంది.
* * *
మాధవికెందుకో మెలకువ వచ్చి, ప్రక్కకు ఒత్తిగిలి చూసేసరికి ప్రక్కమీద కల్యాణి లేదు. ఉలికిపడి "కల్యాణీ!" అంటూ లేచి కూర్చుంది. గదిలో ఎక్కడా ఆమె కనిపించలేదు.
తలుపులు దగ్గరగా వేసివున్నాయి. తీసుకుని కారిడార్ లోకి వచ్చింది.
గోడకున్న లైటువల్ల వరంగా పొడవునా కొంత క్రాంతి ప్రసరిస్తోంది. బయట చీకట్లో చెట్లు గాలిలేకపోవటంవల్ల రాక్షస విగ్రహాల్లా స్తంభించి వున్నాయి. ఎక్కడా చీమ చిటుక్కుమనటం లేదు. మాధవి బాత్ రూమ్స్ దాకా వెళ్ళి చూసి వచ్చింది.
ఒకవేళ... మనసులో పెనుభూతంలాంటి అనుమానం ప్రవేశించింది. గుండె గబగబ కొట్టుకుంది. వళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. ఎక్కడలేని శక్తి తెచ్చుకుని ఇంచుమించు పరిగెత్తినట్లు ఆ గది వైపు పోయింది.
ఏ గది?
కొన్ని సంవత్సరాలక్రితం ఓ ఫైనలియర్ స్టూడెంట్ ఉరిపోసుకుని... అప్పట్నుంచీ నిర్మానుష్యంగా వున్నగది.
గదికి తాళంలేదు. దగ్గరగా వేసివున్నాయి. అంత ధైర్యంగల మాధవి నిలువునా వణుకుతోంది. చేతులు ఎలాగో స్వాధీనంలోకి తెచ్చుకుని తలుపులు త్రోసింది.
లోపలంతా చీకటిగావుంది. కాని వరండాలోని కాంతి కొద్దిగా పడటంవల్ల ఏమున్నదీ తెలుస్తోంది.
మొదట దూలంవంక చూసింది.
ఒక్క నిట్టూర్పు. ధ్యాంక్ గాడ్! అక్కడ ఎదురుచూసిన దృశ్యం కనిపించలేదు.
లోపలకు వెళ్ళింది.
గది మధ్యగా నేలమీదపడివుంది కల్యాణి. ఒళ్ళు ఝల్లుమంది. ఒక్క ఉదుటున దగ్గరకువెళ్ళి "కల్యాణీ!" అంటూ తలమీద చెయ్యి వేసింది.
మళ్ళీ గొప్ప రిలీఫ్. కల్యాణి బ్రతికే వుంది. ఏదో అఘాయిత్యం చేద్దామని ఇక్కడికి వచ్చింది. కాని షాక్ తట్టుకోలేక స్పృహ తప్పి క్రింద పడిపోయింది. మాధవి కర్థమయింది.
ఆమె ఎన్నోసార్లు పిలిచాక కల్యాణి మెల్లిగా కదిలి, తర్వాత కళ్ళు విప్పింది.
"కల్యాణీ! ఏమిటిది?"
ఆమె ఒక్కక్షణం స్తబ్ధుగా వూరుకుని తర్వాత బరువుగా ఊపిరి పీల్చుకుంది. మాధవి చేతిని గుండెలమీదకు లాక్కుని "నేను చచ్చిపోతాను. ఇంత జరిగాక ఇంక ఈ జీవితం దేనికి" అంటూ ఏడవసాగింది.
"ఛీ ఊరుకో. అసలేం జరిగింది? జరగబోయి తప్పిపోయిందానికి ఇంత శిక్ష విధించుకుంటున్నావా? పిచ్చిపిల్లా!"
"కాదు, నీకు తెలీదు. నా మనసు..."
"నాకన్నీ తెలుసు. పద. మొదట ఇక్కడ్నుంచి పోదాం. ఎవరన్నా చూస్తే మనకి మనమే అల్లరి చేసుకున్నవాళ్ళమవుతాం" అంటూ ఆమెని లేవదీసి రూంకి తీసుకెళ్ళింది.
ఆ రాత్రంతా స్నేహితురాల్ని బుజ్జగీస్తూ, ఓదారుస్తూనే వుంది.
4
రాజా క్లాస్ రూంలోనుండి బయటికి వచ్చాడు. ఎదురుగా ఆడపిల్లలమధ్య మాధవి కనిపించింది వరండాలో. ఇద్దరి మధ్యా వందగజాల దూరముంటుంది. అతని కళ్ళు కల్యాణికోసం వెదికాయి. ఎక్కడా కనబడలేదు.
"హు. కాలేజి ఎగ్గొట్టి వుంటుంది" అనుకుంటూ క్రిందకు దిగి బయటకు వెళ్ళటానికి నాలుగడుగులు వేశాడు.