ఆమె ఏమీ జవాబు చెప్పకుండా నిర్లక్ష్యంగా అలాగే నిలబడివుంది.
"ఇంకో ఇరవై నాలుగు గంటలు టైమిస్తున్నాను. మీరిద్దరూ అపాలజీ చెబుతే సరే సరి. లేకపోతే ఏం చేస్తానో చూద్దువుగాని" విసురుగా స్కూటర్ స్టాండ్ తీసి ఒక్క కిక్ తో స్టార్ట్ చేసి కూర్చున్నాడు. పెద్ద ఎత్తున శబ్దతరంగాలు సృష్టించుకుంటూ వెళ్ళిపోయింది స్కూటర్.
* * *
మర్నాడు సాయంత్రం ఆరయింది. బస్సురిపేరు కెళ్ళింది, ఆడపిల్లలందరూ బస్సుకోసం ఎదురుచూస్తూ క్లోక్ రూంలో కొంతమందీ, బయట చెట్లక్రింద అటూఇటూ తిరుగుతూ కొంతమందీ కాలక్షేపం చేస్తున్నారు. మాధవికోసం వాళ్ళ ఊరినుండి బంధువులెవరో వస్తే, వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇప్పుడే వచ్చేస్తాననీ, తాను వచ్చేదాకా కదలొద్దనీ కల్యాణితో చెప్పి వెళ్ళింది.
కల్యాణి ఒక్కతే- మిగతావారికి దూరంగా కూర్చునివుంది.
ఇద్దరమ్మాయిలు ఆమె దగ్గరకు వచ్చారు.
"మీరిక్కడ వున్నారా? మాధవి మీకోసం ఎదురుచూస్తోంది" అంది వారిలో ఒకమ్మాయి.
కల్యాణి వాళ్ళవంక చూసింది. కాలేజి స్టూడెంట్లులాగే వున్నారు. బహుశా సీనియర్సేమో. సీనియర్సయితే ఇంత నమ్రతగా మాట్లాడతారా అనుకుంది మళ్ళీ.
"ఎక్కడుంది తను?"
"వీధి మొదట్లో వుంది. వాళ్ళెవరితోనో మాట్లాడుతోంది. బస్సు ఇప్పుడిప్పుడే రాదుట. మీరొస్తే- అలా బజారుకెళ్ళి పనిచూసుకుని అక్కడ్నుంచి హాస్టల్ కు వెళ్ళిపోదామంది."
"మీరు...?" అంది కల్యాణి సంకోచంగా.
"ఈ కాలేజీ స్టూడెంట్స్ మే. డేస్కాలర్స్ ము. మీరు వంటరిగా వస్తే భయపడతారని తోడు వచ్చాము.
కల్యాణి ఇంక సంశయించలేదు. లేచి నిలబడి వాళ్ళవెంట బయల్దేరింది.
కొంతదూరం పోయాక ఒక ప్రక్కకి దారితీశారు.
"ఇటెక్కడికి? గేటు అటువైపు వుందిగా."
"ఇటు అడ్డదారివుంది. చిన్న గేటుగుండా పోతే తేలిగ్గా వెళ్ళిపోవచ్చు."
మెడికల్ కాలేజి బిల్డింగ్స్ ప్రక్కనుంచి పోతోంటే ఏదో సెంట్రల్ జైల్లోకి పోతున్న అనుభూతి కలిగింది కల్యాణికి.
ఆకాశం మబ్బు మబ్బుగా వుండి, వెల్తురు పల్చబడిపోయింది. అందులో అక్కడ చెట్లు గుబురు గుబురుగా వుండటంవల్ల చీకట్లు ముందుగా వ్యాపిస్తున్నాయి.
మనుషుల సందడికి బాగా దూరంగావచ్చారు.
ఉన్నట్లుండి కల్యాణిలొ వణుకు బయల్దేరింది. ఇదేమిటి? ఈ నిర్మానుష్య ప్రదేశంలోంచి ఎక్కడికు తీసుకు వెళుతున్నారు వీళ్ళు?
వాళ్ళవంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె సందేహం అర్థమయినట్లు "వచ్చేశాం" అన్నదో అమ్మాయి.
మరుక్షణంలొ రెండో అమ్మాయి "ఇదుగో యిటే" అంటూ కల్యాణి రెక్క పుచ్చుకుని బలంగా చెట్లతోపు లోపలకు గుంజింది.
ఆ అదుటుకు క్రిందపడబోయి, బాలెన్స్ చేసుకుంటూ ఎదురుగావున్న మనిషిని చూసి నిర్ఘాంతపోయింది.
అతనెవరో ఎప్పుడూ చూడలేదు. చూడ్డానికి స్టూడెంట్ లాగే వున్నాడుగాని, ముఖం కటువుగా వుండి.
"నేనెవరో మీకు తెలీదులే. రాజా ఫ్రెండ్ ని. ఇంత చిన్న విషయాల్లోకి రాజా రాడు. అందుకని నన్ను పంపించాడు. నీకు పెట్టిన ఇరవై నాలుగు గంటల గడువూ గంట క్రితమే పూర్తయింది. మరి నీ మొండితనానికి ప్రతిఫలం కావద్దూ? చూడూ! బుద్ధిమంతురాలివిగానీ మర్యాదగా విప్పెయ్యమ్మా. నీతో స్ట్రిప్టీస్ చేయించాలి."
అడిరిపడింది. ఒళ్ళంతా తడిసి ముద్దవుతోంది. అంతా కలలాగా, అభూత కల్పనలా వుంది. కాని... కాని... ఇది నిజం.
ఒణికేచేతుల్ని దగ్గరకు చేర్చి దణ్ణం పెట్టింది. ఎలాగో గొంతు పెగల్చుకుంది.
"నన్ను... నన్నొదిలేయండి... ప్లీజ్."
అతను వికటంగా నవ్వాడు "చూస్తారేం? కానియ్యండి" అన్నాడా అమ్మాయితో.
ఒకమ్మాయి ముందుకొచ్చింది. కల్యాణి రెసిస్ట్ చేసుకునేందుకు ప్రయత్నించి విఫలురాలయింది.
"ఫట్ ఫట్ ఫట్" మని జాకెట్ గుండీలు ఊడిపోయాయి.
"అయ్యో" అంటూ రెండు చేతులూ వక్షస్థలానికి అడ్డుగా పెట్టుకుంది కల్యాణి.
రెండో అమ్మాయి మెరుపులా ముందుకు జరిగింది. ఆమె చెయ్యి కల్యాణి చీర కుచ్చిళ్ళమీద పడింది.
కళ్యాణికి కళ్ళముందు ప్రపంచం గిరగిర తిరిగినట్లయింది.
కెవ్వుమని అరిచి క్రిందపడిపోయింది. మరుక్షణంలో స్పృహను కోల్పోయింది.
"చచ్చాం. ఇప్పుడేంచేద్దాం" అన్నది ఇద్దరిలో ఒకమ్మాయి భయం భయంగా.
ఆ యువకుడు గబగబ ఆలోచిస్తున్నాడు.
ఇంతలో దగ్గర్లో అడుగుల చప్పుడయింది.
"ఎవరో వస్తున్నారు" అన్నది రెండో ఆడపిల్ల మరింత భయంగా.
"పదండి. త్వరగా పారిపోదాం" అన్నాడా యువకుడు కంగారుగా. వెనువెంటనే ముగ్గురూ చెట్లతోపూల్లో దూరి, క్రమంగా మాయమైపోయారు.
కల్యాణిని ఆ ఇద్దరమ్మాయిలూ తీసుకుపోయిన రెండు మూడు నిమిషాలకు మాధవి క్లోక్ రూంలోకి వచ్చింది. ఆమెకు కల్యాణి ఎక్కడా కనపడలేదు. నలువైపులా కళ్ళతో వెదికాక "కల్యాణి ఏది?" అనడిగింది ఓ స్టూడెంట్ ని.
"ఎవరో వస్తే వెళ్ళింది" అన్నదా అమ్మాయి ముక్తసరిగా.
"ఎవరు వచ్చింది?"
"ఏమో! నాకేం తెలుసు?"
మాధవికేమీ అర్థం కాలేదు. వచ్చింది ఎవరై వుంటుంది? తానెక్కడికీ వెళ్ళవద్దని చెప్పిందే. ఆమెకు కొంచెం భయం వేసింది. ఆలోచిస్తూ ఇవతలకు వచ్చింది. గేటులోంచి వస్తే తనకు ఎదురైవుండేదే. నెమ్మదిగా నడుస్తూ, ఏదో అనుమానం మెదిలి ప్రక్కకితిరిగి పాడుపడిన తోటలావున్న ప్రదేశంవైపు మళ్ళింది.
చీకటి నల్లగా వ్యాపిస్తోంది. అలాగే కొంతదూరం నడిచింది. ఇటుకేసి ఎందుకు వస్తారు? తన పిచ్చిగానీ అనుకుంటూ వెనుదిరగబోతోంటే-
వినిపించింది కల్యాణి పెట్టిన కేక.