Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11


    8. అగ్నీ! నేను మంచి సంతానము కలదానను. మంచి భర్త కలదానను. నీవు శత్రునాశకుడవు. ఇతరులు నిన్ను తిరస్కరించ జాలరు. అట్టి నిన్ను నేను సేవించుచున్నాను.

    9. సుజ్ఞానియగు సవిత బంధించిన వరుణ పాశమును విప్పుచున్నాను. ధాతకు స్థానమును పుణ్యఫలమును అగు ఉత్తమ లోకమునందు భర్తృసహితముగా సుఖములను ఆర్జించినాను.

    (త్రాటిని విప్పివేయును.)

    10. అగ్నీ! నాకు ఆయువు, సంతానము, వర్చస్సు కలిగినవి. నేను నాభర్తను మరల మరల కలసి కొనుచున్నాను. నా శరీరమునందు జీవము చిరకాలము నిలిచి ఉండును గాత.

    (యాజమాన పత్ని నడుమునుండి విప్పిన త్రాడుగల తనదోసిలియందు పూర్ణకుంభమును ధరించవలెను.)

    11. ఆజ్యమా! నీవు ఆవు పాలనుండి వెడలిన దానవు. ఓషధరస స్వరూపవు. నాశరహితవు. యాగము కొరకు నిన్ను పాత్రయందు ఉంచుచున్నాను.

    (అధ్వర్యుడు పాత్రలో నేయిపోయవలెను.)

    12. ఆజ్యమా! నీవు ఆవుపాలనుండి వెడలినావు. ఓషధరస స్వరూపవు. సంతానము కొరకు నిన్ను సౌమ్య దృష్టితో చూచుచున్నాను.

    (యజమాని భార్య ఆజ్యమును చూడవలెను.)

    13. తేజోసి - నీవు తేజస్సువు.

    14. తేజోను ప్రేహి - తేజమును పొందుము.

    15. నీ తేజస్సును అగ్ని అధిగమించకుండును గాత.

    16. ఘృతమా! నీవు అగ్నికి జిహ్వవు. దేవతల సుఖకారణమవు. కావున దేవతల ప్రతి స్థానమందును, ప్రతి మంత్రము నందును ఉపయోగపడుము.

    (స్ఫ్యచే గీతగీసి అందు నేతి గిన్నెనుంచవలెను.)

    17. శుక్రమసి - దీప్తి కలదానవు.

    18. జ్యోతిరసి - జ్యోతివై ఉన్నావు.

    19. తేజోసి - తేజస్సువై ఉన్నావు.

    20. "దేవో వస్సవితో త్ఫునా త్వచ్చిద్రేణ పవిత్రేణవసోసూర్యస్య రశ్మిభిః"

    (అర్థమునకు 5.1. చూడగలరు. ప్రోక్షణీపాత్ర యందలి ఉదకమును పవిత్రముచేత శుద్ధిచేయవలెను.)

    21. ఘృతమా! నీవు ప్రకాశించుదానవు.నిన్ను దేవతల నిమిత్తము - స్థానస్థానమునకును, మంత్ర మంత్రమునకు గ్రహించుచున్నాను.

    (జుహువును నేతి యందుంచవలెను.)

    22. ఆజ్యమా! నీవు జ్యోతిస్స్వరూపవు. ఉపభృతమను పాత్ర జ్యోతిస్స్వరూప. నిన్ను స్థానస్థానమునకు మంత్ర మంత్రమునకు సరిపడునట్లు తీసికొనుచున్నాను.

    (ఆజ్యమును ఉపభృతము పోయవలెను.)

    23. కాంతి స్వరూపమగు ఆజ్యమా! నిన్ను దేవతల నిమిత్తము స్థాన స్థానమునకు - మంత్ర మంత్రమునకు సరిపడునట్లు కాంతి స్వరూపయగు ధ్రువపాత్ర యందు తీసికొనుచున్నాను.

    (ఆజ్యమును ధ్రువ పాత్ర యందు పోయవలెను.)

                             పదకొండవ అనువాకము

        (ఇధ్మబర్హి పూర్వక హవిరాసాదనము చెప్పబడుచున్నది.)

    1. ఇధ్మమా! నీవు నల్లనిదానవు. వనస్పతి రూపమవు. నిన్ను అగ్ని కొరకు ప్రోక్షించుచున్నాను.

    (ఇధ్మము మీద మూడు మారులు నీరు చల్లవలెను.)

    2. వేదిప్రదేశమా! నీవు దర్భమున్నగునవి ఉంచుటకు ఆధార ప్రదేశమవు. నిన్ను ప్రోక్షించుచున్నాను.

    (వేదిని మూడుమారులు ప్రోక్షించవలెను.)

    3. దర్భా! నీవు వేదియందు పరచబడిన దానవు. స్రుక్కు మున్నగు హోమ సాధనములు ఉంచుటకు నిన్ను ప్రోక్షించుచున్నాను.

    (ప్రోక్షించవలెను.)

    4. దర్భలారా! మిమ్ము స్వర్గలోక, అంతరిక్షలోక, భూలోకము కొరకు ప్రోక్షించుచున్నాను.

    (ప్రోక్షించవలెను.)

    5. ఉదరమా! నీవు పితృదేవతల అన్నమవు. దర్భల మీద చల్లబడినావు. దర్భయందు పితృదేవతల కొరకు రసరూపమవగుము.

    (ప్రోక్షించగా మిగిలిన నీటిని నేలమీద పోయవలెను.)

    6. ప్రప్తరమా! నీవు విష్ణువునకు స్తూపమవు.

    7. దర్భలారా! మీరు ఉన్నివలె మెత్తనివారు. దేవతలకు సుఖము కలిగించువారు. మిమ్ము వేదిమీద పరచుచున్నాను.

    (పరచవలెను.)

    8. మధ్యమపరిధీ! నీవు విశ్వావసు గంధర్వ రూపమవు. యజమానిని సర్వహింసలనుండి రక్షించుదానవు. అన్నరూపవు. స్తుతించవలసినదానవు.

    (మోదుగు పుల్లను అగ్నికి తూర్పున వేయవలెను.)

    9. దక్షిణపరిధీ! నీవు ఇంద్రుని బాహువు వంటి దానవు. యజమానిని దక్షిణ దిక్కున రక్షింపుము. అన్నరూపవు. స్తుత్యవు.

    (మోదుగు పుల్లను దక్షిణమున వేయవలెను.)

    10. ఉత్తరపరిధీ! మిత్రావరుణులు నిన్ను ఉత్తరమున ఉంచుదురు గాత. నీవు నిత్యధర్మమును యజమానిని రక్షింపుము. నీవు అన్నరూపవు. స్తుత్యవు.

    (సమిధను ఉత్తర దిక్కున ఉంచవలెను.)

    11. ఆహవనీయాగ్నీ! తూర్పున సూర్యుడు నిన్ను సమస్త హింసల నుండి రక్షించును గాత.

    (అగ్నిని అభిమంత్రించవలెను.)

    12. అగ్నీ! నీవు విద్వాంసుడవు. సమృద్ధహోమవంతుడవు. ప్రకాశించువాడవు. ఘనుడవు. నిన్ను యాగము కొరకు మండించుచున్నాను.

    (సమిధను పై నుంచి వేయవలెను.)

    13. విధృతులారా! మీరు ప్రజలకు నియంతలు.

    (1. వేదియందు పరచు దర్భలజత విధృతి. 2. వేది మీద విధృతిని పరచవలెను.) 

    14. ప్రస్తరమా! విధృతి వసు, రుద్ర, ఆదిత్యులకు స్థానమగును. నీవు విధృతి యందు నిలువుము.

    15. నీ పేరు జుహువు అగును. ప్రియనామమున ఘృతాచి, నేయి నిండినదానవు అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందు నిలువుము.

    నీ పేరు ఉపభృతము అగును. ప్రియనామమున ఘృతాచివి అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందు నిలువుము.

    నీ పేరు ధ్రువ పాత్రము. ప్రియనామమున ఘృతాచివి అగుచున్నావు. నీకు ప్రియమగు విధృతి యందుండుము.

    16. విష్ణువా! జుహువు మున్నగునవి పుణ్యస్థానమగు ప్రస్తరము నందు ఉంచబడినవి. నీవు యజ్ఞమును, యజమానిని, అధ్వర్యుడనగు నన్ను రక్షింపుము.

    (పాత్రలను అభిమంత్రించవలెను.)

                            పన్నెండవ అనువాకము

        (అఘోర హోమము చెప్పబడు చున్నది.)

    1. అగ్నీ! నీవు యాగ నిర్వాహకుడవు. భువన కారణమవు. వర్థిల్లుము. ఇదిగో నీకు నమస్కారము.

    2. జుహువా! దేవయాగము జరుగుచున్నది. అగ్ని నిన్ను పిలుచుచున్నాడు. ఏహి - రమ్ము.

    (జుహు పాత్రను అందుకొనవలెను.)

    3. ఉపభృతమా! సవితా దేవత నిన్ను దేవయజనమునకు పిలుచుచున్నాడు. ఏహి.

    (ఉపభృత్తును అందుకొనవలెను.)

    4. అగ్ని, విష్ణు దేవతలారా! నేను ఆఘోర హోమము చేయుటకు సాగినాను. కాలు తా కనీయక మీ ఉభయుల మధ్య నుండి వెళ్లుదును. మీరు విడిగా ఉండండి. నాకు వెళ్లుచోటు ఇవ్వండి.

    (కుడి పాదమున ప్రస్తరమును దాటవలెను.)

    5. భూమీ! నీవు యజ్ఞమునకు స్థానమవు. నీ స్థాన బలముననే ఇంద్రుడు అసురవధాది వీర కృత్యములను చేయ కలిగినాడు.

    (అధ్వర్యుడు ఆహవనీయాగ్నికి దక్షిణ భాగమున నిలువవలెను.)

    6. ఆఘోర హోమము నైరుతిన మొదలగును. ఈశాన్యమున సమాప్తమగును. ఇది ఎడతెగనిది. వంకర ఎరుగనిది. ఇంద్రుడు దేవతగా గలది. యజ్ఞపతి యజ్ఞమునకు స్వాహా.

    7. అగ్ని, ఆఘోర హోమమున తేజోవంతుడై వెలుగొందుచున్నాడు.

    (జుహువును పైకి తీసికొనవలెను.)

    8. పాహిమాగ్నే దుశ్చరితా దామా సుచరితే భజ. అగ్నీ! నన్ను దుశ్చరితము నుండి కాపాడుము. సుచరితునిగా చేయుము.

    (జుహువు, ఉపభృత్తులను తాకకుండ వెళ్లుచు జపించవలెను.)

    9. ఆఘోర హవిశ్శేషమా! నీవు యజ్ఞమునకు శీర్షమవు. ధ్రువపాత్రయందలి ఆజ్యరూప తేజస్సుతో కలిసికొనుము. జ్యోతిషాజ్యోతిరజ్తామ్.

                          పదమూడవ అనువాకము

        (స్రుగ్ వ్యూహనాది మంత్రములు చెప్పబడుచున్నవి.)

    1. జుహువు అన్నహేతువు. నేను దానిని ఎత్తిపట్టుకొనుచున్నాను. అందువలన ఇంద్రుడు నన్ను పైకి కొనిపోవును.

    (జుహువును ఎత్తిపట్టవలెను.)

    ఉపభృత్తును క్రిందుగ ఉంచినాను. ఇంద్రుడు నా శత్రువులను నికృష్టులను చేసినాడు.

    (ఉపభృత్తును క్రిందుగ ఉంచవలెను.)

    నేను జుహువును పైకెత్తియు, ఉపభృత్తమున క్రిందుగ ఉంచినాను. అప్పుడు బ్రహ్మాది దేవతలు నాకు ఉత్కర్ష కలిగించినారు. నా శత్రువులకు అపకర్ష కలిగించినారు.

    (జుహువును తూర్పునకు కదిలించవలెను.)

    ఇంద్రాగ్నులు నా శత్రువులను స్థాన భ్రష్టులను చేయుదురు గాత.

    (ఉపభృత్తును ఎడమచేత వెలుపల ఉంచవలెను.)

    2. మధ్యమ పరిధీ! నిన్ను వసువుల కొరకు తుడుచుచున్నాను.

    దక్షిణ పరిధీ! నిన్ను రుద్రుల కొరకు తుడుచుచున్నాను.

    ఉత్తర పరిధీ! నిన్ను ఆదిత్యుల కొరకు తుడుచుచున్నాను.

    3. ఘృతమున తడిసిన దక్షిణాగ్రమును పక్షులు నాకి పైకి ఎగురును గాక. భార్యను, సంతానమును రక్షింతురు గాత.

    (జుహువును దర్భలతో తుడవవలెను.)

    4. జలములు ఓషధులు వర్థిల్లును గాత. దర్భలారా! మీరు వాయు ప్రేరిత వర్ష బిందువులు వలన పుట్టినవారు. మీరు స్వర్గమునకు చేరండి. మాకు వర్షము కలిగించండి.

    (పలాశ శాఖను, ప్రస్తరమును అగ్నియందు వేయవలెను.)

    5. అగ్నీ! నీవు ఆయువును రక్షించువాడవు. నా ఆయువును రక్షించుము. నేత్రములను రక్షించువాడవు. నా నేత్రములను రక్షించుము.

    (ఆహవనీయాగ్నిని అభిమంత్రించవలెను.)

 Previous Page Next Page