Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్.  పేజి 1

                                 

           

                             మిస్ మేనక ఐ.పి.యస్.

            
                                                                     - కొమ్మనాపల్లి గణపతిరావు

 

                         

 


    కాలిపోతున్న వర్తమానపు నగ్న సౌందర్యానన్ని చూస్తూ  విశ్రాంతికి సిద్ధపడుతున్న సూర్యుడు పశ్చిమాద్రికి  జారుతున్న అసురసంధ్యవేళ-

 

    " సారే జహాసే అచ్ఛా" ఔన్నత్యాన్ని భూతకాలానికి నైవెద్యంగా అర్పించిన భారతదేశ తెలుగు రాష్ట్ర్రంలోని ఓ పట్టణంలో- బాగ్ పీట్  నడిరోడ్డులో వివస్తగా కామకేలలకి బలైన మాయాత్యాగి చరిత్రలకి మేమేం తీసిపోమని చెప్పే ఓ పోలిస్ స్టేషన్ లో-

 

    ఉన్నట్టుండి ఫోన్ రింగయింది.

 

    " హల్లో!" రిసీవర్ అందుకున్న ఓ కానిస్టేబుల్ క్షణంలో అలర్టయి వెంటనేయస్సైకి అందించాడు - " సర్...ఎమ్మేల్యే అప్పారావుగారు..."

 

    యస్సై రమణ అమాంతం లేచి నిలబడి   " సర్"! అన్నాడు అవసరానికి మించి కంగారు ప్రదర్శిస్తూ . " గుడీవినింగ్ సర్. నేను రమణ్ణి హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చారు సర్?"

 

    "నేను రాలేదు.ఇప్పుడు హైదరాబాద్ నుంచి నీకొచ్చింది నా ఫోన్ మాత్రమే" ఈసారి  నిజంగా కంగారుపడ్డాడు యస్సై.ఏక్షణంలో అయినా మినిస్టరైపోయే ప్రమాదమున్న అప్పారావు,అంత దూరంనుండి తనకెందుకు ఫోన్ చేశాడో భోదపడక ఆందోళన పడుతుండగా  వినిపించింది మళ్ళీ.

 

    "ఇప్పుడు టైమెందత"

 

    మూడు తరాల రాజకీయానికీ, ముప్పైతరాల ఆస్తికీ వారసుడైన అప్పారావు అలా టైము గురించి అడిగేది, తనటైం బాగోలేదనిపించినప్పుడే అని తెలిసి రమణ   "సాయంకాలం అయింది సర్" అన్నాడు.

 

    " మా గెస్ట్ హౌస్ వుంది చూశావ్?"

 

     "చూడకపోవడమేమిటి సర్" తమని చాలా సార్లు దర్శనం చేసుకున్నది అక్కడే  గద్సర్, ఎంత బాగుంటుందని! పట్టణానికి నాలుగుమైళ్ళ దూరంలో నా జూరీస్ డిక్షన్ లోనేఉన్న ఓ పల్లెటూరు లాంటి ప్రాంతం. ఆఊరు చుట్టూ పొలాలు మన స్టేట్ లోనే నంబర్  వన్ అనిపించుకునే తమ ఎస్టేట్... ఆ ఎస్టేట్ లో  తమరి గెస్ట్ హౌస్..."

 

    " ఆ గెస్ట్ హౌస్ కి కాపలాగా రాజయ్యనే ఓ ముసలి నౌకరు..."

 

     "  వాడితోబాటు ఓ బొచ్చుకుక్క కూడాను."

 

     " ఒకనాడు ఆ కుక్క మీ డియస్సీ మీద  కలియబడటం..."

 

      "అప్పుడు తమరు సమయానికి రక్షించడం..." ఎడాపెడా పరామర్శించుకున్న తరువాత అన్నాడు రమణ-" ఇప్పుడాయన ట్రాన్స్ ఫరైపోయారు గదర్స్. ఇంకా మా  డివిజన్ కి చెందిన సబ్ డివిజన ల్ ఆఫీసరుఛార్జీ తీసుకోలేదు. అంటే ... మరేంలేదు సరి, మా సర్కిల్ గారు ఎప్పుడూ ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి, స్టేషన్ హవుస్ ఆఫీసర్ గా ప్రస్తుతం అంతా నేనే చూసుకుంటున్నాను. "

 

     " అంటే..  మాగెస్ట్ హౌస్ ప్రాంతపు వ్యవహారాలు డీల్ చేసేది  నువ్వే అన్నమాట."


    "యస్సర్. చూడటానికి రూరల్ ఏరియాలా వున్న ఆ ప్రాంతం అర్భన్ ఏరియాలో అందులోనూ- నా జూరీసి డిక్షన్ లో వుండటం నా అదృష్టం."

 

     "అసాధ్యుడివయ్యా రమణా!" చాలా బాగా పసిగట్టేసిన పోలీస్ మెదడని ఫోన్ లోనే అభినందించిన అప్పారావు- " మీకు తెలుసుగా...శాంతిభద్రతలు విచ్ఛిన్నం కావడాన్ని నేను చస్తే అంగీకరించను" అన్నాడు సూటిగా పాయింటుకి వస్తూ...

 

    "తమరికి తెలీనిదేముంది?  నాదీ తమరి అభిప్రాయమే."

 

    "రాజయ్యకి పెళ్ళి కాని పెద్దెనిమిదేళ్ళ కూతురుంది."

 

    శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావడానికీ, రాజయ్య కూతురికీ కనేక్షనేమిటో ముందు  అర్ధంకాలేదు.అయినా పద్దెనమిదేళ్ళమ్మాయి అనేసరికి పదిరోజుల క్రితమే పెళ్ళాన్ని పుట్టింటికి పంపిన రమణ గుట్టుగా రొట్టలు వేశాడు. " అలాగా సర్, రాజయ్య కూతురికి పద్దెనిమిదేళ్ళా?"

 

     " పైగా చాలా అందంగా వుంటుంది కూడానూ."

 

    మరీ ఉత్సాహం అనిపించింది . "పాపం..ఎవరైనా అల్లరి చేశారా?"

 

    " మరేం.. అమ్మాయిని చూసి ముచ్చటపడిన ఓ యువకుడు ఆపిల్ల చెయ్యి పట్టుకున్నాడు."

 

     " ఘోరం సర్."

 

     " కదా! అంతే 'మల్లి' అబ్బాయి చెంపమీద చాచికొట్టింది."

 

    "పేరు కూడా బాగుంది కాబట్టి మల్లి మళ్ళీ మళ్లీ కొట్టాల్సింది సర్."

 

    " కొట్టిందేమో కూడా. అయితే అబ్బాయికి మరింత కోపమొచ్చింది."

 

    "  వాడి బొంద..వస్తే ఏమిటి?"

 

    "అలా అనే మల్లి ఊరుకుంది రెండురోజులు. "

 

    " అప్పుడేమైంది స్తర్?" ఉత్సుకతగా అడిగాడు మల్లి అందాన్ని అర్జెంటుగా ఊహించేసుకుంటూ "మళ్ళీగొడవైందా?"

 

     " ఈ రోజు మధ్యాహ్నం మూడైంది.అప్పుడు మూడింది."

 

    "ఎవరికి?"

 

    " అమ్మాయికి."

 

    "ఎంత ఘోరం!"

 

     "పొలంలో ని గడ్డివాము దగ్గర మల్లిని అబ్బాయి రేప్ చేశాడు."

 

    మరెవడో ఇలా బోణీ చేసేయడం భరించలేని రమణ ఉక్రోశపడిపోయాడు.


"ఘోరాతిఘోరం! అసలు ఆ అబ్బాయిని..."

 

    " మా అబ్బాయ్ ?"

 

    పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడిన రమణ క్షణం తొట్రుపడి వెంటనే తేరుకున్నాడు."ఆ.. అలాగా సర్? అవునూ..అది ఘోరమెలా అవుద్ది?"

Next Page