మరి అంతే కదా. రేపు నీకూ కోడలు వస్తే ఇంతకంటే డబల్ గా హైరానా పడతావు అన్నాను నేను నవ్వుతూ.
మా శశిరేఖకి కూడా మంజరి బాగా నచ్చింది.
పెళ్లి చూపులప్పటి ముక్తసరి, ముభావం లేవట.
సరదాగా అందరితో కలిసి చక్కగా జోక్స్ వేస్తూ మాట్లాడిందట.
తన కాలేజీ విషయాలు, ఫ్రెండ్స్ సంగతులు బోల్డు కబుర్లు చెప్పిందట.
శశికి కూడా తెగ ముచ్చటేసింది ఆఅమ్మాయిని చూసి.
ఇవన్నీ విన్న నాకు మనసు తేలికయింది.
హమ్మయ్య. ఏమోలే. నేను ఆరోజు చూసింది తప్పుగా అనుకున్నానేమో.
మా మధుకి అంతా మంచే జరగాలి అని మనసులో పదే పదే అనుకున్నాను.
మధు చిన్నపిల్లాడిలా జోక్స్ వేసి అందరిని నవ్విస్తున్నాడు.
మా వాడు మంచి హుషారు.
వాడి జోక్స్ కి మా జూనియర్స్ వంత పాడుతున్నారు.
పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు.
మధ్య మధ్య లో తినుబండారాలు తీసి అందరికి ఇస్తున్నారు మహిళామణులు.
హైదరాబాద్ కి విజయవాడ కి మధ్యలో సూర్యాపేట దగ్గర సెవెన్ ఫుడ్ కోర్ట్ అని పెద్ద హోటల్ ఉంది.
నేను విజయవాడ కి వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అక్కడ ఆగి కాస్త రిలాక్స్ అవుతాను.
ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. కాఫీ ఇంకా బాగుంటుంది.
బస్సు డ్రైవర్స్ అందరికి చెప్పాను అక్కడ ఆపమని.
అందరూ కాసేపు రిఫ్రెష్ అయి బయలుదేరొచ్చు .
అందులో పెద్దలు, పిల్లలు, ఆడవాళ్ళకు అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. అందరు డ్రైవర్స్ కి మరీ మరీ చెప్పాను స్పీడ్ ఎక్కువ వెళ్లొద్దు అని.
మధుకి చటుక్కున సందేహం వచ్చి అడిగాడు అడగడం మర్చిపోయానురా రూమ్స్ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాయా అని.
నిన్ననే ఫోన్ చేసాడురా హోటల్ వాడు.
మనం అడిగిన ఇరవై రూములు బుక్ చేసి ఉంచాడు.
మనవాళ్ళందరూ బస్సుల్లో డైరెక్టుగా హోటల్ కి వెళ్లొచ్చు.
మన కుటుంబాలు ముకుందరావు పెళ్లి మండపం లో బుక్ చేసిన రూమ్స్ కి వెళదాం.
బస్సులు ఎలాగూ మన కంట్రోల్లోనే ఉంటాయి కనుక హోటల్ లో బస చేసిన మన వాళ్ళని సాయంత్రం ఫంక్షన్ టైం కి పెళ్లి మండపానికి తీసుకొస్తారు .
అన్నీ వివరంగా చెప్పాను మధుకి.
నవ్వుతూ చెయ్యి నొక్కాడు మధు థాంక్స్ రా అన్నట్లుగా.
విజయవాడ హోటల్ వాడు నా క్లయింట్.
పెళ్లిళ్ల టైం కదా రూమ్స్ కి బాగా గిరాకీ గా ఉంది వాడికి.
నేను ముందే చెప్పి ఉంచాను ఆఖరి నిముషం లో ఇబ్బంది లేకుండా.
మా ప్రయాణం జోరుగా సాగుతోంది.
టైం అస్సలు తెలీలేదు.
నేను చెప్పిన హోటల్ దగ్గరికి అన్ని బస్సులు చేరుకున్నాయి.
ఇన్ని బస్సులు చూసేసరికి హోటల్ వాడు మనిషిని పంపాడు.
అందరం ఒక వైపు టేబుల్స్ వద్దకు చేరుకున్నాం.
అందులో నేను రెగ్యులర్ గా అక్కడికి వస్తుంటాను కాబట్టి ఆ హోటల్ వాడు బాగా పరిచయం.
నవ్వుతూ పలకరించాడు.
ఎవరెవరికి ఏమేమి కావాలో నోట్ చేసుకున్నాడు సప్లయర్.
నేను, మధు వాష్ రూమ్ కెళ్ళి బయటకొచ్చాం.
ఇంతలో అక్కడ చిన్న గొడవ జరుగుతోంది.
నేను అటువైపు దారితీసాను.
నలుగురు యువకులు హోటల్లోకి వద్దామని ప్రయత్నిస్తుంటే హోటల్ వాళ్ళు వాళ్ళని అడ్డగిస్తున్నారు.
ఎందుకు వాళ్ళని రానివ్వట్లేదు అని అడిగాను నాకు బాగా పరిచయం ఉన్న హోటల్ యజమానిని.
వాళ్ళందరూ ఆకతాయి కుర్రాళ్ళు సర్.
కేవలం లేడీస్ ని ఏడిపించేందుకు ఇక్కడికొస్తుంటారు.
అందుకే అలాంటి వాళ్ళని ఇక్కడికి రానివ్వం.
వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం అన్నాడు.
ఎవరా ఆ పోకిరీలు అని అటువైపు తిరిగాను.
ఒక్కమారు ఉలిక్కిపడ్డాను.
అందులో ఒకడు ఆరోజు మంజరి వాళ్ళింట్లో కనిపించిన కుర్రాడు.
మంజరి అతనిని కజిన్ అని పరిచయం చేసింది కూడా.
హోటల్ సెక్యూరిటీ ఆకుర్రాళ్ళని బలవంతంగా అక్కడినుంచి పంపించేశారు.
హోటల్ యజమాని దగ్గరికెళ్లి వాళ్ళగురించి మాట్లాడాను. అతనికి తెలుసు నేను లాయర్ అని.
ఇంతకు ముందు ఇలానే అల్లరి చేస్తుంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయించాము సర్.
నా దగ్గర కాపీ ఉంది. ఇస్తాను రండి అంటూ అతని రూంలోకి తీసుకెళ్లాడు.
ఆ ఫైల్ నా ముందు పెట్టాడు.
దాంట్లో ఆ కుర్రాడి ఫోటో, పేరు కూడా ఉన్నాయి. అతని పేరు మురళీకృష్ణ. ఇంటిపేరు, అడ్రస్ తో సహా అన్నీ వివరాలు ఆ రిపోర్ట్ లో ఉన్నాయి.
అతను, అతనితో పాటు ఇంకో ముగ్గురు గ్యాంగ్.
వీళ్లకిదే పని అని చెప్పాడు హోటల్ యజమాని తలపట్టుకుంటూ.
కాపలా కాయలేక చస్తున్నాం అన్నాడు.
బిజీ టైములో దూరుతారు హోటల్ లోకి.
సిగ్గులేని మనుషులు అంటూ తిడుతున్నాడు.
హోటల్ యజమానిని అడిగి ఆ రిపోర్ట్, ఫొటోస్ అన్నీ నా మొబైల్ లో ఫోటో ఇమేజెస్ తీసుకున్నాను.
ఇంతలో మధు వచ్చాడు వెతుక్కుంటూ. ఇక్కడేమి చేస్తున్నావురా. అందరూ నీకోసం అక్కడ వెతుకుతున్నారు. నీకు ఆర్డర్ చేసిన టిఫిన్ కూడా చల్లగా అయిపోయింది. ఇంకోటి ఆర్డర్ చేద్దాం రా అంటూ తీసుకెళ్లాడు.
****
అబ్బా ! కథ మళ్ళీ మొదటి కొచ్చింది.
ఈ సమస్య మొదటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది.
ఈ మురళీకృష్ణ అనే వాడు మళ్ళీ నాకు కనిపించాడు.
అందులోనూ ఒక జులాయి గా.
అతని ఇంటిపేరు మిగతా వివరాలు ఎక్కడా ముకుందరావు ఫామిలీ కి సరిపోవడంలేదు.
ఇదో పెద్ద పజిల్ గా తయారయ్యింది నాకు.
ఐరన్ సేఫ్ లో పెట్టిన ఆలోచనలు మళ్ళీ బయటికొచ్చాయి వెక్కిరింపు నవ్వుతో. ఏంటి లాయర్ గారు మీ సామర్ధ్యం. ఇప్పుడేం చెయ్యబోతున్నారు అంటూ వికటాట్టహాసం చేస్తున్నాయి.
అమ్మ బాబోయ్ ఇక తట్టుకోవడం నా వల్ల కాదు.
అందరూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటె నేనేమో ఈ ఆలోచనలతోటి సతమతమవుతూ ఏమి చెయ్యాలో తోచక బలహీనపడుతున్నాను.
పెళ్ళికి ఇంకొద్ది గంటలే వ్యవధి ఉంది.
ఇప్పుడు ఈ తర్కమేమిటి తిరుమలేశా అనుకుంటూ మనసులో ఏడుకొండల వేంకటేశ్వరునికి కోటి నమస్కారాలు చేసి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకున్నాను.
నేను మూడీగా పరధ్యానంలో ఉండటం గమనించినట్టున్నాడు మా మధు. ఏంటిరా లాయరు నీ మనసు కోర్టులో పెట్టొచ్చావా. పోనీ ఒక పాట పాడనా. అది వెనక్కి వస్తుంది మళ్ళీ నీలోకి అంటూ జోక్ చేసాడు.
వద్దురా బాబోయ్ నీ పాట వింటే ఇక్కడి జనం పారిపోతారు అంటూ బిగ్గరగా నవ్వేసి ఈ లోకంలోకి వచ్చాను.
కాలేజీ చదివే రోజులలోనూ అంతే .
మా మధు గొంతు సవరించుకున్నాడు అంటే అందరు ఎదో పని ఉన్నట్లు అక్కడనుంచి వెళ్లిపోయేవాళ్లు.
నాకు మాత్రం తప్పేది కాదు. ఆహా ఓహో అంటూ వాడిని ఎంకరేజ్ చేస్తూ ఆరాధనగా చూస్తూ కోర్చొనుండేవాడిని.
ఆ విషయాలు మళ్ళీ గుర్తుకొచ్చి హాయిగా నవ్వుకున్నాను.
అందరం బస్సెక్కి చలో విజయవాడ అంటూ బయలుదేరాము.
బస్సులన్నిటినీ విజయవాడ లో హోటల్ కి డైరెక్ట్ గా వెళ్ళమని చెప్పాను.
హోటల్ రూమ్స్ అందరికి తెగ నచ్చేసాయి.
హ్యాపీగా సెటిల్ అయ్యారు.
అందరికి రూమ్స్ కే భోజనాలు తెప్పించాము.
కుర్రకారు టిఫిన్స్, నార్త్ ఇండియా స్టఫ్ అంటూ ఏదేదో ఆర్డర్ ఇచ్చారు .
ఎవరి ఇష్టాను ప్రకారం వారికి ఆర్డర్ చేసి ముకుందరావు కి ఫోన్ చేసాము. హోటల్ లో ఉన్నట్లు చెప్పాము.
ఆయన ఒక గంటలో వచ్చి మమ్మల్ని తీసుకు వెళతానని చెప్పారు.
పెళ్లి కొడుకు కుటుంబం మరి కొద్దీ మందికి మ్యారేజ్ హాల్ లోనే రూమ్స్ ఆరెంజ్ చేశారు.
పెళ్లి సామాను అక్కడే ఉంచి పెళ్ళికి వాడాలి కాబట్టి.
మేము తీసుకున్న హోటల్ కూడా అక్కడికి దగ్గరే కాబట్టి ఇబ్బంది లేదు.
రాక పోకలకు సౌకర్యంగా ఉంటుంది.
మేము ఏమీ తినకుండా ముందు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని బయలు దేరాము.
నేను, మా ఆవిడ, మధు, ప్రవల్లిక. సంజయ్ శ్రుతికూడా వస్తామన్నారు మాతో. స్పెషల్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసి ఉంచాను.