అందరి మనసులలో లేనిపోని అనుమానాలు కల్పించినట్లు అవుతుంది.
శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే నేనేదో పిచ్చి పిచ్చి గా ఊహించుకొని పెళ్లి చెడగొట్టినట్టవుతుంది.
ఈ సమయంలో ఇంకేమి చెయ్యాలో పాలుపోలేదు.
దేవుడు మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందిలే అన్న ఆశావాదంతో నాలోని అనుమానాల్ని సమాధి చేసాను నిస్సహాయంగా.
****
జీవితంలో మొదటిసారి ఒక వింత సమస్య ఎదురైంది నాకు.
ఇంత దూరం వచ్చిన ఈ పెళ్లి నాలో మొలకెత్తిన కేవలం అపోహల వలన ఆగిపోతే జీవితాంతం బాధపడాలి.
అమ్మో ఆ ఆలోచనే భరించలేనట్లుగా ఉంది.
సంశయాలు మెదడును తినేస్తుంటే ఎటూ తేల్చుకోలేక బరువెక్కిన ఆలోచనలతో కోర్ట్ కు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. మనసంతా గజి బిజీ గందరగోళంగా ఉంది.
ఎప్పుడూ మానకుండా కోర్ట్ కు వెళ్ళే శ్రీవారు ఇంట్లో ఉండటం చూసి శ్రీమతి ఆశ్చర్యపోయింది 'ఏంటి మీరు కోర్ట్ కు వెళ్లలేదా ' అని ఆశ్చర్యంగా అడిగింది నన్ను.
లేదోయ్. ఇవాళ అంత ఇంపార్టెంట్ మేటర్స్ ఏమీ లేవు శశి.
అందుకే మా వాళ్ళని వెళ్ళమని నేను పెండింగ్ పెళ్లి పనులు గురించి ఆలోచిస్తున్నాను.
సంజయ్ పెళ్లి ముహూర్తం దగ్గర కొచ్చేసింది కదా, కొంచెం స్పీడ్ పెంచాలి. నవ్వుతూ చెప్పాను అనుమానం రాకుండా.
అన్నీ బాగానే టైం ప్రకారం జరుగుతున్నాయి కదా. మీకెందుకు అంత సందేహం.
అదేం లేదులే. కొంచెం రెస్ట్ కూడా తీసుకుందామని అనిపించింది. అందుకే ఇంట్లో ఉన్నాను అని తప్పించుకున్నాను.
మనసు ఆగలేక ఎందుకైనా ఒక మారు ముకుందరావు తో మాట్లాడుదామని ఫోన్ చేసాను.
నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాక అడిగాను ఎక్కడ ఉన్నారు మీరు అని. ఇంట్లోనే ఉన్నాను సర్. క్యాంపు కెళ్ళి నిన్న రాత్రే విజయవాడ కి వచ్చాను. ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదు. ఇంకేంటి మీ దగ్గర పెళ్లి ఏర్పాట్ల కబుర్లు అంటూ అడిగాడు ఆయన.
వెడ్డింగ్ కార్డు అందిందా మీకు అని అడిగాను.
మీరు పంపారా. ఒక మారు కనుక్కుంటానుండండి అంటూ మంజరీ అని కేకేసారు. వెడ్డింగ్ కార్డు ఏమన్నా వచ్చిందా నిన్న అని అడుగుతున్నారు.
ఓహ్ మర్చిపోయాను డాడీ. నిన్న ఎవరో ఒక అంకుల్ వచ్చి ఇచ్చి వెళ్లారు అంటూ చెప్తోంది.
ఏంటి సర్ నిన్న ఎవరో వచ్చి ఇచ్చి వెళ్లారట, మా అమ్మాయి చెప్తోంది అన్నారు ముకుందరావు.
నేనే వచ్చానండి పర్సనల్ గా. మీ అమ్మాయి చెప్పలేదా అని అడిగాను.
మళ్ళీ కూతురు వైపు తిరిగి అడుగుతున్నారు ఆయన. మంజరి ఏదో చెప్తోంది.
సారీ సర్. మంజరి మీ పేరు మర్చిపోయినట్లుంది. నిన్నంతా బిజీ గా ఉందట. ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తోంది. ఆ వర్క్ లో బిజీ గా ఉన్నట్లుంది. ఏమీ అనుకోకండి అని నొచ్చుకున్నాడు.
ఫరవాలేదండి. నిన్న తన కజిన్ కూడా ఎవరో వచ్చినట్లున్నాడు అంటూ అడిగాను.
కజినా. ఎవరే మంజరి అంటూ అడుగుతున్నాడు.
అదే నాన్న. మీ దూరపు చుట్టం సుబ్బారావు గారున్నారుగా. వాళ్ళబ్బాయి. నా ఎం టెక్ నోట్స్ కోసమని వచ్చాడు అంటూ చెప్తున్న మాటలు వినిపిస్తున్నాయి.
ఓహ్ ఆ అబ్బాయా అంటున్నాడు ముకుందరావు.
మంజరి చెప్పిన విషయం మళ్ళీ ఫోన్ లో నాకు చెప్పాడు.
మా చుట్టపు కుర్రాడేనండి లాయర్ గారు. సబ్జెక్టు లో డౌట్స్ ఉంటె మంజరి దగ్గరికొచ్చి క్లియర్ చేసుకుంటుంటాడు అప్పుడప్పుడు అన్నాడు.
సరే అని ఫోన్ పెట్టేసాను ఏమీ అర్ధంకాక.
వాళ్ళ సంభాషణతో ముకుందరావుకు నేను ఎందుకు ఫోన్ చేసానో కూడా మర్చిపోయాను.
ఇక ఆ విషయం అంతటితో మార్చిపోయి, అపోహలు, అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రొటీన్ లోకి తల దూర్చాను.
అనుకున్నట్లే పెళ్ళికి నాలుగు రోజులు ముందే పెళ్ళికొడుకు సంజయ్ వచ్చాడు. అన్ని ఏర్పాట్లు ఉత్సాహంగానే సాగుతున్నాయి.
అందరూ తమ పనులు వియజయవంతంగా పూర్తి చేసి విజయవాడ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
పెళ్లంటే ఆ ఉత్సాహమే వేరు.
ఎంతో సందడి.
బంధు మిత్రులు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అంతా కోలాహలంగా మనసు తేలిపోతున్నంత హాయిగా ఉంటుంది.
శ్రీరామ్ బాగా బిజీగా ఉన్నాడు డాడీ, పెళ్ళికి రాలేడు అని మధుకి సర్ది చెప్పాడు సంజయ్.
మధుకి కోపం వచ్చినా సర్దుకున్నాడు పరిస్థితులు అర్ధంచేసుకుని.
అమ్మయ్య అనుకున్నాను.
అదే విషయం నేను చెప్తే బుంగమూతి పెట్టి, చిన్న పిల్లల్లా అలిగి, నాలుగు రోజులు మాట్లాడేవాడు కాదు.
సంజయ్ పెళ్లికి కావాల్సిన బట్టలు, సూట్లు అన్నీ కొనుక్కున్నాడు.
అమెరికా నుంచే కాబోయే పెళ్ళానికి అంటే పెళ్లి కూతురికి ఖరీదైన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ గిఫ్టుగా పంపాడు.
ఇక రోజూ వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
పర్సనల్ గా కలవడం కుదరలేదు.
ఇంక ఒకే సారి పెళ్లిపీటలపైనే కలవడం.
సంజయ్ ని అడిగాను. ఎలా ఉందిరా మంజరి. నీకు నచ్చిందా. హ్యాపీగా ఉన్నావా అని.
యస్ అంకుల్. తను ఓకే. కొత్త కదా. కొంచెం తక్కువగా మాట్లాడుతుంది. నాకు నచ్చింది. మరి మమ్మీ డాడీ వాళ్లకు నచ్చిందా అని అడిగాడు.
వాళ్లకు చాలా బాగా నచ్చిందిరా. మీ అమ్మకు మంజరి ఎంతో నచ్చింది. ఇక శృతి కి కూడా బాగా నచ్చింది. మీ వాళ్ళందరూ హ్యాపీనే.
థాంక్స్ అంకుల్. మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు పెళ్లి ఏర్పాట్లలో అన్నాడు.
వీపు మీద ఒక్కటిచ్చాను. నాకు నువ్వు, శృతి, శ్రీరామ్ అందరూ సమానమేరా.
శృతి అయితే మన రెండు కుటుంబాలకు ఒక్కతే ఆడపడుచు అంటూ నవ్వాను.
రేపు శ్రీరామ్ పెళ్లి మీరే దగ్గరుండి చెయ్యాలి.
తప్పకుండా అంకుల్. నేనే లీడ్ తీసుకుంటాను. ఫర్ ష్యుర్ అన్నాడు.
సంజయ్తో మాట్లాడిన తరువాత చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను.
పెళ్ళికొడుకును, పెళ్లికూతురును చెయ్యడం విజయవాడ మ్యారేజ్ హాల్ లోనే అని చెప్పాడు ముకుందరావు.
సరే అన్నాం.
విజయవాడకి బయలుదేరే రోజు వచ్చింది.
****
పెళ్లి ఆదివారం ఉదయం కావడంతో అందరికీ బాగా అనుకూలంగా ఉంది. ఎండాకాలం అయిపోయి వాతావరణం కూడా చల్లగా, హుషారుగా ఉంది.
శనివారం పొద్దున్నే హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి అందరం తినేసి నాలుగు బస్సుల్లో విజయవాడకి బయలుదేరాం.
సంజయ్, వాడి ఫ్రెండ్స్, శృతి, తన ఫ్రెండ్స్ ఒక బస్సు, పెద్దవాళ్లందరికి ఒక బస్సు, మిగతావాళ్ళం రెండు బస్సుల్లో సెటిల్ అయ్యాము.
మాతో పాటు పురోహితులవారు, వీడియోగ్రాఫేర్ కూడా బయలుదేరారు.
మా జూనియర్స్ ని ఫామిలీస్ తో రమ్మన్నాను.
వాళ్ళూ వచ్చారు.
మనోహర్ చెప్పాడు భాస్కర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడని. వాకర్ సహాయంతో ఇంట్లోనే తిరుగుతున్నాడని.
నిన్ననే మాట్లాడాను భాస్కరుతో అని మనోహర్ కి చెప్పాను.
భాస్కర్ చాలా ఫీల్ అయ్యాడు అప్ప చెప్పిన ముఖ్యమైన విషయం చెయ్యలేనందుకు.
నేను సర్ది చెప్పాను. నీ ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు భాస్కర్.
నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని. డబ్బులేమైనా కావాలా అని అడిగాను.
వద్దు సర్ అన్నాడు. అతని మొహమాటం నాకు తెలుసు.
అందుకే గూగుల్ పే లో పది వేలు అతని అకౌంట్ కి పంపాను.
అన్ని బస్సులు ఏ సి బస్సులు, అంతేగాక పెద్ద బస్సులు కావడంతో అందులోనూ కొన్ని సీట్స్ ఖాళీగా ఉండటంతో అంతా రిలాక్స్డ్ గ కూర్చున్నారు ఎంజాయ్ చేస్తూ.
టి వి లో లేటెస్ట్ సినిమా వేస్తున్నారు.
మా జూనియర్స్ అఖండులు. వచ్చేప్పుడు మంచి సినిమాలు పట్టుకొచ్చారు. వాటిని ప్లే చేస్తున్నారు ఓపిగ్గా.
ఆడవాళ్లు చీరలు, నగలు గురించి ముచ్చట చేస్తున్నారు.
పది రోజుల క్రితం మంజరి, వాళ్ళ అమ్మ గారు వాళ్ళ అక్క ఇంటికి హైదరాబాద్ వచ్చారట.
చీరలు, నగలు సెలెక్షన్స్ కోసం ఇద్దరూ వచ్చారు.
మధు, ప్రవల్లిక వాళ్లింటికి వెళ్లి కలిశారు మర్యాదపూర్వకంగా.
మా శ్రీమతి, ప్రవల్లిక, మంజరి, వాళ్ళ అమ్మ, అక్క అందరూ కలిసి రెండు రోజులు బిజీగా షాపింగ్ చేశారు.
చీరలు, నగలు అన్నీ కొన్నారు.
వాళ్ళు వద్దు వద్దు అంటున్న ప్రవల్లిక కొంచెం ఎక్కువగానే కొందట.
కోడలి కోసం ప్రవల్లిక తెగ హడావిడి పడుతోంది అని మా ఆవిడ బోల్డు జోక్స్ వేసింది.