Previous Page Next Page 
అశోకవనంలో సీత పేజి 8


    "నే చేసిందిపూర్తిగాఅన్యాయం. ఏంచేయను? న్యాయంగాపోతే నాకు జరిగేది న్యాయంకాదు- అన్యాయం. హొటల్లో పనికాకపోతే కూలిపని చేసుకుంటాను. ఇటికలు మోస్తాను. కూరగాయలు అమ్ముకుంటాను, లేకపోతే అడుక్కుతింటాను.  అది ణా ఇష్టం. పల్లెత్తుమాట వీళ్ళని నే అనంది, ఇష్టమొచ్చినన్ని బూతులు....కారుకూతలు ...నన్నెందుకనాలి? చెల్లుకి చెల్లు. ఒక్కమాట అనకపోతే నేనూ వాళ్ళతో సవ్యంగా వుండేదాన్ని ణా థప్పులేదు.... ణా తప్పులేదు..."
    తృప్తిగా ముందుకు సాగింది సీత.
    సీతకి చీకటంటే భయంలేదు.
    సీతకి జీవితం అంటే భయం లేదు.
    సీతకి మనుషులంటే భయంలేదు.
    అందుకే సీత నిర్భయంగా చకచకా అడుగులేస్తూ ముందుకు బయలుదేరింది.
                                                                                             7
    డాక్టర్ వెంకటరావుగారింట్లో పనికి కుదిరింది సీత. అంటే సీత వంటమనిషి అయింది.
    డాక్టరు వెంకటరవింట్లో, వెంకటరావుగాక ఇంకావుంది నలుగురు. భార్య శాంతకుమారి, కొడుకు శరత్ బాబు, కూతురు నీరద , శాంతకుమారి పినమామగారు రాఘవేంద్రరావు-అంతే!
    రాఘవేంద్రరావుకి పెళ్ళాంలేదు. బిడ్డలులేరు. వయసు యాభై పైన అరవైలోపు వుంటుంది. మాంచి భారీ మనిషి, దృఢంగావుంటాడు. బుద్ధిమాత్రం వెర్రితలలు వేసేది. అది ఆయన తప్పుకాదు. ఆయన బుద్ధిది.
    సీతవని ఇంట్లో అందరికీ నచ్చింది. సీతకూడా నచ్చింది.
    సీతకి వంటవచ్చు, సరదాగా నేర్చుకున్న పిండివంటలొచ్చు, హొటల్లో కుదిరింతరువాత ఎంతమందికి ఎంత వంట చేయాలి? ఎలా చేయాలి? తెలుసుకుంది. అదిప్పుడుపయోగపడింది.
    "సీత కాఫీ, టిఫెన్లు ఏమిటి, వంటకూడా రుచిగా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి తినలేదు.... చప్పిడికూడుగాని, ఉప్పూ, కారం ఎక్కువయిన కూడాగాని తినలేక చచ్చాను." వెంకటరావుగారు మెచ్చుకుంటూ అనేవారు.
    "చిన్నదానివయినా చాలాబాగా వంటచేస్తున్నావు సీతా! నీ మాటలలో వున్న పదును,, వంటలో వుండదేమో అనుకున్నాను. నామాట అబద్దమయింది." శాంతకుమారి రోజుకి ఓ సారయినా అనేది.
    "సీతా! నువ్వు చూడటానికి బాగుంటావు. అచ్చం కాలేజీలో అమ్మాయిలా వుంటావు. నిన్ను చూస్తే ఎవరూ వంటమనిషి అనుకోరు.  ఈమధ్య ఓఫ్రెండ్ నిన్ను చూసి...." ఆ అమ్మాయి, నీ కొత్తఫ్రెండా! చుట్టాలమ్మాయా?" అని అడిగింది." నీరద తరుచూ అనేది సీతతో.
    సీత నవ్వి ఊరుకునేది. "నేనూ చదివాను. కాలేజీ ముఖం ఎరుగుదును, వంటదాన్ని కాదు." అనుకునేది.
    శరత్ బాబు పుస్తకాలు పురుగు. మంచివాడు. సీతతో చనువుగా మాట్లాడేవాడు. పుస్తకాల సైత్యం తలకెక్కి ఆదర్శాలు వల్లించేవాడు మాటకుముందు.
    రాఘవేంద్రరావు అందరిముందూ ఓవిధంగా ఎవరూ లేనప్పుడు మరోవిధంగా సీతని చూసేవాడు.
    సీత ఆ ఇంట్లో పూర్తిగా ఓనెలన్నావంటచేయలేదు-ఏమనిషిఎలాంటి రకమో పూర్తిగా అవగాహన చేసుకుంది. రాఘవేంద్రరావుకి నిక్ నేమ్ తగిలించింది. "కీచకుడు." అని.....
    సీతకి హాయిగా జరిగిపోతున్నది. మనసులో బాధపడుతున్నది. "వంటదానిగానే నా బ్రతుకు తెల్లవారుతుందా? ఉహుఁ .... అలా జరగటానికి వీలులేదు. ఏదయినా ఉద్యోగం దొరికితే హాయిగా బ్రతకవచ్చు. ఉద్యోగం  ఎవరిప్పిస్తారు? శాంత కుమారిగారి  నడిగితే? వెంకటరావుగారినే అడిగితే? ఉగ్యోగంమాట దేముడెరుగు. ఈకాస్త ఆధారంకూడా పోతుందేమో? ఏం చేయాలి?" ఈ ఆలోచనే తరుచూ బాధిస్తుంటుంది.
    శాంతకుమారికి అనుమానం రాకుండా వుండటానికి మధ్య మధ్య అంటే మూడురోజులకి నాలుగురోజులకి ఓసారి మా యింటికెళ్లొస్తానని చెప్పి ఓ రెండుగంటలు బజారంతా తిరిగొచ్చేది. రాగానే తనింటి విషయాలు చెపుతుండేది సీత.
    శాంతకుమారికి అనుమానం రాలేదు.
    సీత; నీరద ఎప్పుడయినా వాదనేసుకునేవారు. నీరద డాక్టరుగారి అమ్మాయి. ఇంటి యజమానురాలి కూతురు కాబట్టి గట్టిగా మొండిగా వాదించేది. సీత ఆ ఇంట్లో తన స్థానం గుర్తుంచుకుని మెత్త మెత్తగా  ఆ వాదనని ఖండించేది.
    ఓరోజు నీరద తన ఇద్దరి ఫ్రెండ్స్ తో తీవ్రంగా వాదిస్తూ కూర్చుంది. నీరదకు నీరద ఫ్రెండ్స్ కు కానీ  పట్టు కెళ్ళింది సీత.
    "సీతా! పనుందా?" అంది నీరద కాఫీ కప్పులు ఫ్రెండ్స్ కందిస్తూ.
    "ఉహు! రాత్రికి  వంటచేయటమే, ఖాళీగానే వున్నాను. ఏం చేయాలి?" ఫ్రెండ్స్ కోసం ఉప్మాగాని, పకోడీలుగాని చేయమంటుందేమో అని అడిగింది సీత.
    "కూర్చో?" అంది నీరద.
    "ఎందుకు?" అంది సీత నుంచునే.
    "కూర్చోమన్నాకదా! కూర్చో! పని చెపితే చెయ్యావు. ఇదీ అలాగే ఓపని అనుకో."
    సీత కూర్చుంది.
    "నా ఫ్రెండ్స్ నేనూ వాదనేసుకున్నాము, ఎంతకీ ముగియటం లేదు. ఈ ఫ్రెండ్ పేరు శారద, ఈఫ్రెండ్ పేరు నీపేరే, కాస్త మార్పు జానకి. అసలు విషయానికొస్తాను. ముగ్గురం రామాయణం చదివాము- రామాయణంలో ఏపాత్ర గొప్పది, అని తేలక తలలు బద్దలుకొట్టుకుంటున్నాము." నీరద అంది.
    "రామాయణం మీరు చదివారా? అదేం ప్రేమ నవలా? సినిమా నవలా?" సీత ఆశ్చర్యంగా అంది.
    "రామాయణ, భారతాలు మాకెందుకు? ఈమధ్య ఓస్త్రీల మాసపత్రిక భారత, రామాయణాల్లో స్త్రీ పురుష పాత్రలు- వాటి స్వరూప స్వభావాలు, బలాలు, బలహీనతలు, వ్యాసరూపంలో రాయమని కాలేజీ విదార్థినులను కోరుతూ ప్రచురించారు. మేము తలో వ్యాసం రాయాలని నిర్ణయించుకున్నాము. రామాయణము, ఎందుకొచ్చిందిరా ఖర్మ అనుకుంటూ చదివాము."
    "ఖర్మంటూ చదవకూడదు. వ్యాసం రాయాలనుకున్నారు కాబట్టి విమర్శించుకుంటూ ... ఆలోచించుకుంటూ .... ఆగి, ఆగి....చదవాలి." నెమ్మదిగా, మృదువుగా అంది సీత.
    "హాయ్....హాయ్." సంతోషం ప్రటించారు. జానకి, శారదలు.
    "మా సీతంటే ఏమనుకున్నారు? పేరుకి వంటమనిషన్న మాటేగాని బ్రిలియంట్ బుర్ర." నీరద మెచ్చుకుంది.
    "వంటమనిషి...." సీత మనసు చివుక్కుమంది.
    "ఆ....అసలు విషయానికొద్దాము. రాముడు గొప్పవాడా! రావణాసురుడు గొప్పవాడా? సీత గొప్పదా? మండోదరి గొప్పదా? ఊర్మిళ గొప్పదా?" నీరద అంది.
    "రాముడు బలహీనుడు. గుడ్డెద్దు చేలోపడ్డట్లు రాజ్యం కాదని అడవులకెళ్ళటం ఏమిటి? ఒకరోజా? రెండురోజులా. పోనీ వన్నియరన్నా కాదు. పధ్నాలుగేళ్లు అంటే యావజ్జీవకారాగరశిక్షలా, నేను రాముడి గురించి వ్యాసం రాయను. రావనాసురుణ్ని గురించి వ్యాసం రాస్తాను. రాజంటే వాడు రాజు, ధైర్యంగా కావలిసిన ఆడదాన్ని ఎత్తుకెళ్ళాడు. ఒక్కాడదానికోసం యుద్ధం చేయటానికి వీరుడిలా సిద్దమయాడు...." అంది జానకి.
    జానకి మాటలని ఖండించింది నీరద.
    "నో....నో.... రావణాసురుడు! దొంగ  సీనుగ. లోకంలో ఆడవాళ్ళే కరువయినట్లు సీతని ఎత్తుకెళ్ళటం ఏమిటి? చక్కని పెళ్ళాం వుంది. హాయిగా రాజ్యం చేసుకుంటూ కాపురం వెళ్ళబెట్టక యుద్దము, నానాగందర గోళం, బుర్రలేకపోతేసరి...." అంది నీరద.
    "రాముడి బుర్ర, రావణాసురుడి బుర్ర అవతలపెట్టండర్రా. రామాయణంలో సీతది గొప్ప పాత్ర, సీతలేకపోతే రాముడు, రావణాసురుడు కొట్టుకుచచ్చేవారుకాదు కదా?" అంది శారద.
    "వెనకటికెవరో రామాయణమంతావిని రాముడికి సీత ఏమవుతుందీ? అన్నాట్ట వాడు.... అంటే....ఆ అన్నవాడు నీ బ్రదర్ అయివుంటాడు. సీత మెయిన్ పాత్ర. సీతలేని రామాయణం ఛీ...ఛీ....ఛీ...." అంది జానకి. శేరు ఆముదం తాగినట్లు ముఖంపెట్టి.
    రాముడన్నా, సీతన్నా  ఈ జానకీదేవికి ఒళ్ళు మంటలావుంది." అనుకుంది సీత.
    "నేను సీత గొప్పది అని రాస్తాను. ఉదాహరణలు చూపుతూ." అంది శారద.
    "నేను రాముడు గొప్పవాడిని రాస్తాను." అంది జానకి.
    "జానకీ! నీకీ పేరెవరు పెట్టారోగాని  పక్కా ఆడ రౌడీవే, రావణాసురుడు గొప్పవాడని రాస్తావా? రేపు నీ వ్యాసం ఆ ఎడిటర్ కి  నచ్చి ప్రచురించాడంటే గ్యారంటీగా మన కాలేజీలో రావణుడెవడైనా నిన్నెత్తు కెళ్ళటం  ఖాయం." అంది శారద. 

 Previous Page Next Page