Previous Page
అశోకవనంలో సీత పేజి 31


    "మరీమంచిది. ఎలాపంపాలి? ఎన్నింటికి పంపాలి? వివరంచెప్పిపో."
    పోలీసువెంకటస్వామి అరటిపండువలిచి నోట్లోపెట్టినట్లుగా బహువివరంగా చెప్పాడు.
    "సరే, ఇక నీ వెళ్ళి పిల్లకుదిరిందనిచెప్పు. ఎందుకైనా మంచిది. ముందే చెప్పివుంచు,  అది పిల్లకాదు పిడుగు. చావగొట్టి చెవులుమూయగాలదని."
    "సరే, చెపుతాను, ఆముండాకొడుక్కి అలాంటిదే కావాలట." అంటూ  లేచాడు పోలీసువెంకటస్వామి,
    "నువ్వొకడివేరా, ముత్తయిదు నాకొడుకువి. నలభై ఐదుదాటాయి తలనెరిసింది మళ్ళీ పదిహేనేళ్ళ పిల్లకి తాళికడితివి. ఎంతసేపు ఆడినీ యీడు, ఈడినీ ఆడు తిట్టుకోమంటే మాలావు మగాళ్లుతిట్టుకు చస్తారు. ధూ....వెధవబుద్థులు," సతీఅనసూయ అనుకుని పోలీసువెంకటస్వామిని సాగనంపి మేడఎక్కింది.
    "పోలీసోడికి లంకె పెడితేగాని సీతసంగతి తెలియదు." అనుకుంది సతీఅనసూయ. ఆపై.....సీతతో రాత్రికి లవంగానికి బుక్కయ్యావని చెప్పాలని మహాఆతృతపడి సీత గదితలుపులు తెరిచించి.
    సీత సోఫాకడ్డంగాపడి హాయిగా నిద్రపోతున్నది.
    "అసినీ?" అనుకుంది సతీఅనసూయ ముక్కుమీద కుడిచేయి చూపుడువేలేసుకుని.
                                            30
    మొగల్ రాజపురానికి ఓ మూలగా పెద్ద కాంపౌండులో అందమైన బుల్లి బంగళా వుంది. గవర్నమెంటు ఆఫీసర్లు, బాగా డబ్బున్నవాళ్ళు అప్పుడప్పుడూ అక్కడికొచ్చి ఒకరోజో, రెండురోజులో, లేక వారం ఉండి వెళుతుంటారు. దానికి అద్దెకూడా ఎక్కువ కట్టాలి. అందుకే తక్కువవాళ్ళెవరూ అక్కడికి రారు.
    గేటు వాకిలిముందు గుర్ఖా వుంటాడు. భోజనం సప్లయికి పై పనులకీ మనుషులుంటారు. వాళ్ళు టైం ప్రకారం వచ్చిపోతుంటారు.
    లవంగరాజు ఆ బంగళాలో దిగాడు. గుర్ఖా అందరి గూర్ఖాల లాంటివాడు కాదు. విజయవాడలో పుట్టినవాడు, మామూలు మనిషి, లంచాలు తింటాడు. బంగ్లాలో జరిగే మంచీ, చెడూ చూసీ చూడనట్లు పోతుంటాడు, వాచ్ మాన్  అంటే మరీ బుద్ధి తెలిసిపోతుందేమో అని అందరితో గుర్ఖానని చెప్పుకుంటాడు. వాచ్ మాన్ గూర్ఖా అయిపోయాడు.
    రాత్రి తొమ్మిది గంటలప్పుడు, చేతులు వెనక్కి విరిచికట్టి నోరు తెరవటానికి పిలులేకుండా నోటికి టేపంటించి సీతని బుల్లికారులో కూలేసి బంగ్లాకి తీసుకొచ్చింది సతీఅనసూయ.
    సీతని ఓ గదిలోకి తోసి......అది పడగ్గది. అలా అలంకరించివుంది పొరపాటు అది  పడగ్గడీకాదు.....శోభనంగది.....ఎందుకంటే అలంకరణ అలా వుంది. పరుపై మల్లెపూలు, మంచం పక్కనే ప్లేటులో యాపిల్స్, చక్రకేళీలు, సెంటుసీసా, అగరొత్తులు, గోడకి నిలువుటద్దం, చూడగానే పరుపుపై దొర్లాలనిపించేటట్లు రంజుగా వుంది.  సతీఅనసూయ "ఓయబ్బో మాలావు రసికుడే." అని గూడలెగరేసి......చూశావా నా తడాఖా? అన్నట్లు సీతవైపు ఓ చూపు చూసి "ఇదిగో, నీ చేతికట్లు మూతి మీసం తియ్యాను. అదేదో ఆయనగారొచ్చి చూసుకుంటారు, మరినే వెళుతున్నాను, మళ్ళీ రేపే కనబడతాను. ఎలావుంటావో ఏమిటో, పిచ్చి వేషాలేసి పిచ్చేక్కించుకోకు. నా మాట విని. హాయిగా బతకటం నేర్చుకో." అని నీతులు జాగ్రత్తలు చెప్పి గదిలోంచి బైటకొచ్చి గడియ బైట వేసింది.
    సతీఅనసూయ కెదురొచ్చాడు ధర్మారాజు, లేక లవంగరాజు.
    "భోజనం కాగానే అలా కాసేపు నడిచిరావటం నా అలవాటు. అలా వెళ్ళి వస్తున్నాను. జర్దా కిళ్ళీ ఒకటి కట్టించుకొచ్చేతప్పటికీ రావటం ఆలశ్యం అయింది. పిల్లని తెచ్చావా? సరే, సాయంత్రం నీమాటలిన్న తర్వాత నీ మాటలమీద నమ్మకం కుదిరింది. పిల్ల గట్టిదేగా? మాటతప్పితే ఊరుకోను. నేపాలీసువాడిని జాగ్రత్త." లవంగరాజు హుషారుగా మెత్తగా ముందు మాట్లాడి  తర్వాత నే నెవరనుకున్నావో అన్నట్లు ముఖం పెట్టాడు.
    "తుమ్మల్లో పొద్దుకూకిన ముఖమూ నీవు, పోలీసోడట.....పోలీసోడు ఉద్యోగం ఊడినా ఫోజులకేం తక్కువలేదు." అనుకుని....సిగ్గుపడుతూ నవ్వి......" అదేంటిబాబూ? మీ విషయం మీరు చెప్పాలా నాకు తెలియదూ? అనక మాటొస్తే ఎవరికి కష్టం? నాకుకాదూ? పిల్లంటే పిల్లకాదు పులిపిల్ల చూస్తారుగా? నా అంతటిదానికి అలింగాక నోరుమూసి, చేతులుకట్టి,  మరీ తీసుకొచ్చాను." అంది సతీఅనసూయ ఆ తర్వాత స్వరం తగ్గించి రహస్యంగా...." బాబుగారూ! ఎందుకయినా మంచిది. ముందే నోరు, చేతులు విప్పకండి. ఓసారి కానిచ్చి.....ఆ......అదే.....నే చెప్పాలేంటి? పిల్ల పిల్లకాదు రాక్షసి, అదీ నా భయం." అంది.
    "లవంగరాజని నాకెందుకు పేరోచ్చిందంటావ్? డ్యూటీ చేసినా, ఏపని చేసినా చాలా ఘాటుగలవాడినని ఆ పేరువచ్చింది. అది రాక్షసయ్యేది పులిపిల్ల అయ్యేది, నాముందు మేకపిల్ల కావలసిందే, డబ్బులు ముట్టాయిగా రేపు మళ్ళీ టిప్పేదన్నా ఇస్తాలే, ఏదీ.......?పిల్ల గట్టిదయితేనే."
    "రేపు ఉదయం ఎన్నింటికి రమ్మంటారు?"
    "తెల్లవారుతూనే వచ్చేవు? తొమ్మిదికాందే పక్క దిగను నేను. ఎనిమిదిన్నరకి రా." అన్నాడు లవంగరాజు.
    సతీఅనసూయ నమస్కారంపెట్టి, సెలవుతీసుకుని వెళ్ళిపోయింది.
    "దీంతో షికారుకని చెప్పక నోరు తడుపుకోటానికి వెళ్ళొచ్చానని చెపుతానేమిటి? ఒళ్ళు ఉత్తుత్తిగా వేడెక్కితే ఏం బాగుంటుంది? వేడెక్కించుకోవాలి! అంటే నోరు తడుపుకోవాలి. అప్పుడు రెండువేడులూ కలిసి మూడోవేడికోసం తొందరపెడతాయి. అప్పుడుగాని......గాని......?" లవంగరాజు గడియ తియ్యటానికి గడియమీద చెయ్యి వేశాడు. వెంటనే చెయ్యి తీసేశాడు.
    "సార్! సార్?" పోలీసు వెంకటస్వామి మామూలు దుస్తుల్లో అల్లంత దూరాన్నుంచి కేకేశాడు.
    "ఏంటోయ్! ఇప్పుడొచ్చావ్ దేనికి?"
    "చిన్నమాట సార్?" పోలీసు వెంకటస్వామి దగ్గరకొస్తూ అన్నాడు.
    "రేపటి సంగతి రేపు. ఇంకా లోపలికి వెళ్ళలేదుగా సార్! చెప్పిపోతాను."
    "ఊ.....అదేదో తొందరగా కానియ్యి." చిరాకుపడ్డాడు లవంగరాజు.
    "ఇప్పుడొచ్చిన కొత్త ఇన్ స్పెక్టరుగారికి వెయ్యి కళ్ళు, లక్ష అనుమానాలు శ్రీరామచంద్రుడిలా ఈ విజయవాడని రామరాజ్యం చేద్దామనుకుంటున్నాడు. సార్?"
    "నీ బుర్రకథ ఏమిటి? వాడికథ నాకెందుకు?"
    "అమ్మ.....అంతమాటనకండి. సాయంత్రం మీగురించి ఇన్ స్పెక్టరు గారు, సబ్ ఇన్ స్పెక్టరుతో ఏదో అనటం విన్నాను."
    "ఏదో....? అంటే?"
    "అదేనండి. లవంగరాజంటే ధర్మరాజు. కొన్ని కేసులు ఆయన మీద ఉన్నాయిగా? అవి తుడిచేసుకోవటానికి ఈ వూరు వచ్చాడు. మనమో కంట కనిపెట్టాలి." అని చెప్పుకుంటున్నారు. అన్ని మాటలూ వినపడలేదు. ఈదఫా చూసుకోవచ్చు. రేపెళ్ళిపోండి సార్, మరోసారి వచ్చి చూసుకుందురుగాని.....మీ పనులు."
    "సరే. నీ మాటమీద నాకు గురి వుంది. తెల్లారి వెళ్ళిపోతాను, ఇంక నువ్వెళ్ళు."
    టప్పున గాడాంధకారం అయిపోయింది.
    "ఏంటయింది?"
    "కరెంటు పోయిందిసార్, మళ్ళీ వస్తుందిలేండి. మరినే వెళ్లోస్తాను మీరు మర్చిపోవద్దు సార్? రేపెళ్ళిపోండి."
    "అలాగే."
    పోలీసు వెంకటస్వామి చీకట్లో వెళ్ళిపోయాడు.
    కరెంటు వస్తుందేమో అని కాలుగాలిన పిల్లిలా లవంగరాజు, వరండాలో అరగంట పచార్లు చేశాడు.
    కరెంటు రాలేదు. అంటే లైట్లు రాలేదు.
    లవంగరాజు నిలవలేకపోతున్నాడు. కరెంటు కోసం టైమ్ వెస్ట్ చేయటం ఏమిటి? అనుకున్నాడు. గుర్ఖాని పిలిచాడు. వాడు వాడి పెళ్ళాం దగ్గరకు పోయాడేమో పలకలేదు.
    లవంగరాజు గడియతీసి గదిలోకి వెళ్ళి లోపల గడియ వేశాడు. చేతులతో తడుముకుంటూ మంచం దగ్గరకెళ్ళాడు. మంచంమీద కూర్చున్న సీత మెత్తగా తగిలింది.
    లవంగరాజు సీత జబ్బలు తడిమి అలా ఆ చేతుల్ని ముందుకు రానిచ్చాడు.
    సీత కాళ్ళకి కట్లులేవు. ఫెడేల్ మని తన్నింది. లవంగరాజుకి కింద పడ్డట్టయింది. దెబ్బ  గట్టితనం కూడా తెలిసింది.
    "ఇంతలావు......ఇంత పొడుగు....ఇంత ఇన్ స్పెక్టర్ ని......ఓపిల్ల కాకి తంతుందా? దీన్ని.....దీన్ని....."
    లవంగరాజు సీత మూతి మీద అంటించిన ప్లాస్టర్ లాగేశాడు.
    "నాజోలికొచ్చావంటే ప్రాణం తీస్తా." అంది సీత నోరు తెరిపిడిపడగానే.
    లవంగరాజు "ఇదిగో నోరు తెరిచాకదా, అని పేలకు. ఈ లవంగరాజంటే ఏమిటో చూద్దువుగాని చేతి కట్లుకూడా విప్పుతాను. పడుదువుగాని కుస్తీ." అన్నాడు.
    చేతికట్లు విప్పుతానన్నాడు గాబట్టి సీత మాట్లాడదల్చుకోలేదు. "నోరు, చేతులు, కాళ్ళు నా ఆధీనంలో వుంటే నా ముందు నీ తఢాకా చూపుతాను." అనుకుంది.
    సీత చేతులు బంధవిముక్తి అయ్యాయి.
    ఆంబోతంత లవంగరాజు అమాంతం సీత మీద పడ్డాడు సీత మంచం మీద పడింది.
    నేలపై మంచం, మంచంపైపరుపు, పరుపుపై మల్లెపూలు, మల్లె పూలపై సీత, సీతపై లవంగరాజు.
    సీత పెనుగులాడుతున్నది, తిడుతున్నది, అందిన చోటల్లా కొరుకుతున్నది, కాళ్ళతో తంతున్నది. కాళ్లు మాత్రం ఎడం చేయటంలేదు.
    లవంగరాజుకి ఇదే  బాగున్నది. ఎప్పుడూ వెలుతురులో పెనుగులాడే కేసులే. ఇప్పటిది చీకటిలో చిందులాట కొత్తకరంగా, మాంచి హుషారుగా, మిస్టరీ కేసులా వుంది.
    సీత కొడితే కొట్టింది, తిడిడే తిట్టింది, తంతే తన్నింది. ఉజ్జీ సమానంగా వుంది. తిరిగి తను అందిన చోటల్లా కొరికాడు, బూతులు కూశాడు, చేత్తో వాయగొట్టాడు. 'కాళ్ళదగ్గర చోటివ్వదేమిటి? కాళ్లు కాస్త ఎడం చేయగలిగితే ఇది, దీనమ్మ దిగొస్తారు. అనుకుని సీత తోడమీద ఈడ్చి తన్నాడు. అది పోలీసోడి తన్ను. బొమికిరిగిపోవాల......
    సీతకి బొమిక విరిగిపోయిందో లేదో గాని "అమ్మా...." అని అరిచి ఈడ్చి ముఖం మీద చరిచింది.
    లవంగరాజు ముక్కు అదిరిపోయింది. కోపం, పౌరుషం, వేడి, అన్నీ ఎక్కాయి. సీత మీదనుంచి లేవకుండా సీత చేతులు పైకి రావటానికి వేలులేకుండా, సీత మోచేతుల మీద తన చేతులు గట్టిగా నొక్కిపట్టాడు. సీత చేతులు తీసుకోలేకపోయింది. సీత మొహం మీద మొహం గట్టిగా అనించాడు, కాళ్ళమీద కాళ్ళు ఆనాయి గాని చీర అడ్డం వచ్చింది. కాళ్ళు ఎడం ఎడం కావటం లేదు. లవంగరాజు కాళ్ళతోనే చీరని పైకి లాగి రెండు కాళ్ళమధ్య కాలు దూర్చి కాళ్లు ఎడం చేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తూన్నాడు.
    సీతకీ ఊపిరాడటం లేదు. రోప్పొస్తున్నది. కాళ్లు తన అధీనం తప్పిపోతాయనిపిస్తున్నది. చాచివుంచిన చెయ్యి పైకి తీయలేక అలా, అలా చేతులతో తడిమింది, చేతికేమయినా దొరుకుతుందేమో అని. కుడిచేతికి మంచం ప్రక్కనే వున్న బల్ల తగిలింది. అంతేకాదు, బల్లపై యాపిల్ కాయలు దొరికాయి. వదిలేసింది. ఆ యాపిల్కోసే చిన్నకత్తి అందింది. తడిమిచూసింది కత్తి.
    "కాలు మడుస్తావా? విరగొట్టి మడిచుంచనా?" ఓడిపోవటం ఇష్టం లేక బెదిరించాడు లవంగరాజు.
    "నా చేతిమీద చెయ్యి తీయ్! ఒక కాలేం రెండు కాళ్లు మడుస్తాను. నీకు.....నీకు....." సీత హీన స్వరంతో అంది. అప్పటికే ఓ కాలు అధీనం తప్పింది.
    లవంగరాజు సీత చేతుల మీద  తన చేతులు తొలిగించాడు. "ఊఁ, చెప్పు! నాకు...... నాకు....." ఏం ఇస్తా......?"
     సీత చెయ్యి విసురుగా కత్తి తోసహా గాలిలో లేచింది. కన్నుమూసి తెరిచేలోపల ఒకటి, రెండు కత్తిపోట్లు ఎక్కడ తగిలాయో, లవంగరాజుకి తగిలాయి.
    లవంగరాజు "ఇస్తా......." వరకే ఆగిపోయాడు. "....వా?" బదులు "అమ్మా......" అన్నాడు ఎప్పుడో చచ్చిన తల్లిని పిలుస్తూ, "అబ్బా....." అన్నాడు అంతకు క్రితమే చచ్చిన తండ్రిని పిలుస్తూ.
    అమ్మ రాలేదు, అబ్బ రాలేదు, కరెంటు వచ్చింది, గదంతా వెలుగుపరుచుకుంది.
    సీత కత్తిని చేతిలోనే విడవకుండా వుంచుకుని లవంగరాజుని తన మీద మంచి తోసేసి గబుక్కున మంచం పై నుంచి దూకింది క్రిందికి. లవంగరాజు మంచం మీద అడ్డంగా పడిపోయాడు. లవంగరాజు కంఠం  పక్కగాను, డొక్కాలోను కత్తి దిగింది. నెత్తురుతో సీత తెల్లచీర ఎఱ్ఱనయింది. లవంగరాజు కొసప్రాణంతో సీతని చూశాడు. సీత ప్రపంచంలో వున్న కసినంతా ముఖాన నింపుకుని అతన్నిచూసింది. లవంగరాజు పాపపు రక్తం కత్తి పోట్ల నుంచి బడ బడ కారుతున్నది, మల్లెలు ఎఱ్ఱబారాయి.
    "సీతా! నువ్వు....ను....వు...." అంతే లవంగరాజు  ప్రాణం పోయింది.
    "చిన్నాన్నా___" భీకరంగా అరిచింది సీత. చేతిలో కత్తి జారి కిందపడింది.
    ధర్మరాజంటే సీత ఆఖరి చిన్నాన్న. బ్రతికుండగా సీత ముఖం, సీత అమ్మా నాన్నల ముఖం సరిగ్గా చూడలేదు. అవసరం అయినప్పుడు ముఖం చూపించి, ఏదో మాట్లాడాలి కదా! అని రెండుముక్కలు మాట్లాడి పోయేవాడు. ఇంత క్రితం సీత ముఖం చూడకపోయినా చాలా ముక్కలే చీకటిలో మాట్లాడి, వెలుతురు రాగానే ముఖం చూడలేక- తన  ముఖం చూపిస్తూ వుండిపోయాడు.
    సీత నెమ్మదిగా వంగింది. కత్తి చేతిలోకి తీసుకుంది. కత్తివున్న చెయ్యి బాగాపై  కెత్తింది. తనని తాను పొడుచుకోబొయింది.....ఎందుకో ఆగింది. ఎర్రబారిన ఆ కత్తిని చూస్తూప 'నేనెందుకు చావాలి.....? నేనెం తప్పు చేశాను? నేను చావను. చస్తే, లోకానికి నా కథ తెలియక చరిత్ర హీనురాలినవుతాను. బ్రతికుండి- ఈ అశోకవనాలు, ఈ శీతల పాట్లు, ఈ ధర్మరాజుల నయ్య పరిపాలన......లోకానికి చాటు తాను! అప్పుడు, అశోకవనా లుండకపోవచ్చు! ధర్మరాజులు ముందే ఈ లోకం నుంచి సెలవు పుచ్చుకోవచ్చు! కాబట్టి  నేను చావను..... నేను చావను......" మూసి వున్న తలుపు తెరిచే వారికోసం ఎదురుచూస్తూ సీత చేతిలో కత్తి పట్టుకుని అలా నుంచుంది.
    వాకిట్లో బూట్లశబ్దం..... తలుపు తట్టిన చప్పుడు.....
    సీత తలుపు తీయటానికి ముందడుగు వేసింది.
                                                                           (శుభం)   

 Previous Page