'ట్రిక్'
వసుంధర
'అలా ఉన్నావెం?" అని పలుకరించాను గురుమూర్తిని.
"నా భార్యకు తలనొప్పి" అన్నాడు గురుమూర్తి దిగులుగా.
నాకు నవ్వు వచ్చింది. అతడలగనడంలో ఈ ప్రపంచంలో జరగరాని ఘోరపచారం జరిగిపోయిన బాధ , ప్రపంచంలో ఇంతమంది మనుషులుండగా తలనొప్పి తన భార్యకే రావాలా అన్న ఆవేదన ధ్వనించాయి.
"తలనొప్పి పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు. దానికి దిగులెందుకు ?" అన్నాను. అన్నాను కానీ అతడు క్రొత్తగా పెళ్ళయిన వాడని తెలిసుండీ ఈ ప్రశ్న వేసినందుకు కాస్త నోచ్చుకున్నాను.
"తలనొప్పి ప్రమాదకరమైనది కాదని నాకు తెలుసు. కానీ అది రోజూ వస్తుంది " అన్నాడు గురుమూర్తి.
"రోజూ వస్తుందా? అయితే ముందు కంటి డాక్టరుకు చూపించలేక పోయావా?" అన్నాను.
'చూపించాను. కళ్ళలో ఏ లోపమూ లేదని పంపించేశాడాయన."
'అయితే మరింకే డాక్టర్ కీ చూడలేదా?"
'చూశాను. మొత్తం నలుగుర్ని చూశాను. అందులో ముగ్గురు స్పెషలిస్టులు. ఒక్కరు కూడా నాకు సహకరించలేకపోయారు."
'చాలా ఆశ్చర్యంగా ఉందే?" అన్నాను.
"రోజూ ఉదయం అయిదింటికి ప్రారంభమవుతుంది. పది గంటల దాకా ఉంటుంది. అంతసేపూ నొప్పి భరించలేక ఒకోసారి ఏడుస్తుంది కూడా."
"పోనీ - అస్రో. అనాసిన్, శారిడాన్ లాంటివి ప్రయత్నించి చూడలేకపోయావా?"
"ప్రయత్నించాను. ఏరోజు బిళ్ళ వేసుకుంటే ఆరోజు తగ్గిపోతుంది. కానీ మర్నాడు మళ్ళీ మామూలే. రోజూ బిళ్ళలు మింగడం ఆరోగ్యానికి ప్రమాదమని భయం నాకు." "పాపం - గురుమూర్తి ." అనుకున్నాను మనసులో. పెళ్ళైన కొత్తలో మగాడు ఆడదానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తాడు. భార్యలు అది అలుసుగా తీసుకుని రకరకాలుగా ఏడిపిస్తారు. ఇలాగని నేను గురుమూర్తికి చెప్పదలచుకోలేదు.
'అమృతాంజనం , నోపెన్ లాంటివి వాడలేకపోయావా?" అన్నాను.
'ఆమె తలనొప్పికి బొత్తిగా పని చేయడం లేదు."
అప్పుడు నాకు అప్పలరాజు గుర్తుకొచ్చాడు.
రోజూ ఉదయమే వచ్చి ఆ తర్వాత కాసేపటికి తగ్గిపోయే తలనొప్పి పార్శ్వపు నొప్పి అంటారు. పార్శ్వపు నొప్పి నాకూ ఓసారి వచ్చింది. ఆ బాధ అనుభవించిన వాడికే తెలియాలి. అప్పలరాజు ఏదో ఆకూ పసరు తెచ్చి నా నుదుటి మీద మూడు రోజులు పట్టుగా వేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకూ నా కది రాలేదు. అప్పలరాజు పట్టు వేసి నందుకు పైసా కూడా తీసుకోడు. నేను గురుమూర్తికి అప్పలరాజు పేరు చెప్పాను.
ఒకవారం రోజుల తర్వాత గురుమూర్తి నాకు చెప్పాడు. 'అప్పలరాజు వైద్యం పనిచేయలేదు."
"ఆశ్చర్యం గా ఉందే?"
"పట్టు వేసేముందు అప్పలరాజు తల నొప్పి లక్షణాలు అడిగాడు. నా భార్యకు పార్శ్వపు నొప్పి కాదు . అతడి వైద్యం పార్శ్వపు నొప్పికే పని చేస్తుందిట. అయినా ఎందుకైనా మంచిదని ప్రయత్నిస్తే - పని కరుగలేదు."
'అయితే నువ్వు అలక్ష్యం చేయడానికి వీల్లేదు. నీకు అభ్యంతరం లేకపోతె మా ఫామిలీ డాక్టర్ ఉన్నది. ఒకసారి నా భార్యను తోడుగా పంపిస్తాను. ఆమె వద్దకు పంపు"అన్నాను.
'ఆవిడ వివరాలు చెప్పండి. మీ కెందుకు శ్రమ? మేమిద్దరం వెళ్ళి వెచ్చేస్తాం" అన్నాడు గురుమూర్తి. నేను అతడికి వివరాలివ్వడమే కాక మా ఫామిలీ డాక్టర్ కి గురుమూర్తి భార్యను శ్రద్దగా పరీక్షించవలసిందిగా ఫోన్ చేసి చెప్పాను.
ఆవిడ నాకు నా చిన్నతనం నుంచీ తెలుసు. ఏ జబ్బుకైనా లక్షణాలు వినేసి మందిచ్చే దురలవాటు ఆవిడకు లేదు. ఆవిడ ఊహాశక్తి చాలా గొప్పది. రోగానికి మూలకారణం బయటపెట్టడానికి ఎటువంటి ప్రశ్నలు వేయాలో ఆవిడకు బాగా తెలుసు.
వారం రోజులు తర్వాత మళ్ళీ గురుమూర్తి కనిపించాడు.
"తలనొప్పి ఏదయినా దారికి వచ్చిందా?"
అతగాడి గురించి నాకంత ఆత్రుత ఎందుకంటె - అతడు నా స్నేహితుడి చిట్టి తమ్ముడు. అతడికీ ఊళ్ళోఉద్యోగం రాగానే నా స్నేహితుడు నాకుత్తరం రాశాడు. ఆ తర్వాత గురుమూర్తి పెళ్ళికి వెడుతూ మంచి ఇల్లు చూసి పెట్టమని నన్నే అడిగాడు. ఇప్పుడతడి భార్యకు తలనొప్పి వచ్చింది. నేను సాయపడవద్దూ?
"ఏమీ లాభం లేదు, అందరు డాక్టర్లకిలాగే ఈవిడకీ కేసు అంతుపట్టలేదు." అన్నాడు గురుమూర్తి. మా డాక్టర్ కి కేసు అంతు పట్టక పోవడమా? ఏదో తిరకసుందనిపించింది.
వెళ్ళి మా డాక్టర్ని కలుసుకుని గురుమూర్తి గురించి అడిగాను. డాక్టర్ నవ్వి - 'అదా, అది కొత్త దంపతుల కేసు ?" అన్నది .
'అంటే ?"
'ఆమెకు చిన్నతనం నుంచీ ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు . ఏడు లోపలే నిద్ర లేస్తే ఆమెకు తలనొప్పి వస్తుంది. అంతవరకూ పడుకోనిస్తే ఏ బాధా ఉండదు. కానీ అతని గురించి ఆమె రోజూ అయిదింటికి లేచి పోతున్నదట. ఆ అలవాటు మార్చుకోవాలని సలహా యిచ్చాను." అన్నది డాక్టర్.
విషయం నాకు అర్ధమయింది. పాపం - ఆ పిల్లకు నిజంగానే తలనొప్పి వస్తున్నది. ఈ విషయమై గురుమూర్తిని హెచ్చరించడం మంచిదనిపించింది. కానీ ఎలా?
ఒక నిర్ణయానికి వచ్చాను. గురుమూర్తి ఇంటికి, మా యింటికి ఒక కిలో మీటరు దూరం ఉన్నది. గురుమూర్తి భార్య అప్పుడప్పుడు మా ఇంటికి సలహా సంప్రదింపులకు వచ్చి వెడుతుంటుంది. వాళ్ళింటికి నా భార్య వెళ్ళడానికి టైముండదు.
ఈసారి గురుమూర్తి భార్య వచ్చినపుడు విషయం ఆరాతీసి తెలుసుకోమన్నాను. ఇలాంటి విషయాలు ఆడవాళ్ళు - ఆడవాళ్ళు మాట్లాడుకున్నంత చనువుగా మగవాళ్ళు మాట్లాడుకోలేరు.
రెండు రోజుల తర్వాత నా భార్య నాకు చెప్పింది.
"మన డాక్టరు చెప్పింది నిజమే. కానీ కారణం మీరను కున్నది కాదు."
"అంటే ?"
"గురుమూర్తికి రోజూ అయిదు గంటలకల్లా నిద్రలేచే అలవాటున్నదట." అన్నది నా భార్య.
"నీ అదృష్టం- నాకలాంటి అలవాటు లేదు .' అన్నాను.
'సరేలెండి ! మీకు మంచమెక్కితే నిద్రాదేవే భార్య ....' అని గునికి - 'సరిగ్గా అయిదింటికి కాఫీ తాగే అలవాటున్నది అతడికి' అన్నది .
'అయితే ?"
'అందుకోసం భార్యను నిద్ర లేపుతాడు. ఆ సమయంలో నిద్రా భంగం కావడం వల్ల ఆమెకు తలనొప్పి వస్తున్నది."
'పోనీ - తను కలుపుకోవచ్చుగా?" అన్నాను.
"పెళ్ళాం లేనప్పుడు ఎలాగూ తప్పలేదు. ఆమె వచ్చేక కూడా తనకా బాధ ఎందుకూ అంటాడట"
"అయితే రాత్రి కలుపుకుని ప్లాస్కులో పోసుకుంటే సరి!"
"పెళ్ళాం వచ్చేక కూడా ప్లాస్కూ;లో కాఫీయేనా అని అతడికి పట్టుదల. అతడికి ప్రేష్ గా కాఫీ తాగడం ఇష్టం. అందుకని ఆమె లేచి కాఫీ కలిపి ఇవ్వాలి ."
పెళ్ళాం తలనొప్పి కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటే ఎంత ప్రేమో అనుకున్నాను. తను కాస్త చిన్న త్యాగం చేస్తే వదిలి పోయేదానికి . ఇంత హడావుడి చేస్తున్నాడు.
"పాపం! ఆ అమ్మాయి తలనొప్పి కధ అంతే! అసలు మగ వాళ్ళంతా యింతే. స్వసుఖంలో కూడా సద్దుకోరు. అతనా డాక్టర్ల చుట్టూ తిరిగి పెళ్ళాం మీద ప్రేమ చూపించే బదులు , రోజూ ఉదయం తన కాఫీ తను కలుపుకోవచ్చుగా?" అన్నది నా భార్య.
"మగాళ్ళంతా యింతేనని గురుమూర్తి తో పాటు నన్నూ కలపకు. నేను అతడి భార్య సమస్యను పరిష్కరిస్తాను " అన్నాను.
మర్నాడు గురుమూర్తిని నేనే ప్రత్యేకంగా కలిసి - "నీ భార్య తలనొప్పి గురించి లేడీ డాక్టరు నాకు చెప్పింది. నా మాట విని ఆమె తలనొప్పి గురించి నువ్వింక ఎవరికీ చెప్పుకోకు. నవ్వుల పాలవుతావు." అన్నాను.
"ఎందుకని ?"
"స్త్రీకి దాంపత్య జీవితంలో అసంతృప్తి వుంటే రోజూ ఉదయం అలా తలనొప్పి వస్తుందిట. రోజూ తలనొప్పి వస్తున్నదంటే కారణం అదేనట....' అన్నాను.
గురుమూర్తి తెల్లబోయాడు.
'ఈ విషయం డాక్టర్లకే కాదు, చాలా మందికి తెలుసు. ఆమె తలనొప్పి గురించి పదిమందికీ చెప్పుకోకు" అన్నాను మళ్ళీ. ఉదయం కాఫీ కోసం భార్యను వేధిస్తున్న అతగాడిని లొంగదీయడం కోసం కాకపోతే - నేను అంతలా అతడితో మాట్లాడి వుండేవాడ్నికాదు. నా ట్రిక్కు పని చేసింది. గురుమూర్తి ఆ క్షణంలోనే నాతో బయల్దేరి బజారుకి వచ్చి ఫ్లాస్కు ఒకటి కొన్నాడు.
***