Previous Page Next Page 
నెగెటివ్ అప్రోచ్! పేజి 15

                                 


                                       నెగెటివ్ అప్రోచ్!

                                                                                                  వసుంధర

                             
         
        
    రామనాధం సినిమా తీయాలనుకున్నాడు. సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. చేతిలో ఒకటో, రెండో లక్షలుంచుకుని పెద్ద స్టార్సు కాల్షీట్స్ సంపాదిస్తే మిగతా వ్యవహారమంతా ఫైనాన్సియర్స్ ద్వారా నడిపించవచ్చు. కానీ రామనాధం అయిడియా అది కాదు. ఎన్నో మూస చిత్రాల మధ్య ఓ శంకరాభరణం వచ్చి డబ్బుకు డబ్బూ, కీర్తికి కీర్తినీ - నిర్మాతకు తెచ్చి పెట్టింది. తనూ అలాంటి విశిష్టమైన , విలక్షణ మైన చిత్రాన్ని తీయాలని అతడను కుంటున్నాడు.
    రామనాదానిది అయిదారు లక్షల ఆస్తి. అతడికి భార్య నుంచి మరో అంత కలిసింది. ఇటీవలే ఓ వేలు విడిచిన మేనత్త పోయి అతడి ఆస్తికి మరో అయిదు లక్షలు జత పడింది. పైనాన్సియరు లేకుండానే చిత్రం తీసే ఉద్దేశ్యంలో అతడున్నాడు.
    అయితే చిత్రాన్ని విలక్షణంగా తీయడం ఎలా?
    అతడికిద్దరు సలహాదారులు దొరికారు. ఒకడు రామారావు, ఇంకొకడు కృష్ణారావు.
    "వరుసగా పది ఫెయిలయిన చిత్రాలు చూడు. ఆ చిత్రాలు ఏ కారణంగా ఫేయిలయ్యాయో పాయింట్లు తీసి అవి నీ సినిమాలోకి రాకుండా చూడు. ఫెయిలయిన చిత్రాలంటే ఫార్ములా చిత్రాలు కావు. పత్రికల్లో పేరు తెచ్చుకుని ప్రజల నుంచి డబ్బు రాబట్టు కొనివన్న మాట" అన్నాడు రామారావు.
    "రామారావు ది నెగెటివ్ అప్రోచ్ ! దేనికైనా పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. ఫార్ములా లేకుండా హిట్టయిన పది చిత్రాలు శ్రద్దగా చూడు. వాటిలోని మంచిని గ్రహించి ప్రజలెం కావాలనుకుంటున్నారో తెలుసుకో. నీ చిత్రానికి ఉపయోగించుకో " అన్నాడు కృష్ణారావు.
    "క్రుష్ణారావుది పాజిటివ్ అప్రోచ్ కాదు, కానీ అప్రోచ్" అన్నాడు రామారావు. "వాడి సలహా తీసుకున్న వాళ్ళ గతి ఏమయిందో నాకు తెలుసు. ఒకడు తను అంత గొప్పగా కొత్త తరహ చిత్రాలు తీయలేననుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొకడు చిత్రాన్ని పూర్తిగా కాఫీ కొట్టి తీసి - అటు డబ్బు నష్టపోవడమే కాకుండా కోర్టు పాలు కూడా అయ్యాడు. మరొకడికి అన్ని చిత్రాలు నుంచీ ప్లస్ పాయింట్లు తీసేసరికి చివరికి మళ్ళీ పార్ములా పిక్చరే వచ్చింది. అదీ హిట్టు కాలేదు.'
    రామారావు చెప్పిందే నిజమని రామనాదానికి అనిపించింది. హిట్ పిక్చర్లు చూస్తె కాఫీ కొట్టాలని పించడం ఎవరికైనా సహజం! మాములుగా సినిమా చూడడం వేరు, సినిమా తీయాలన్న శ్రద్ధతో చూడ్డం వేరు !
    రామనాధానికో ఫైనాన్షియరు కూడా అనుకోకుండా లభించాడు. నాలుగు లక్షల దాకా అతడు సాయం చేస్తానని అన్నాడు. ఆ ఫైనాన్సియరు పేరు శివరావు.
    "నా పిక్చరు కి ఫైనాన్సియరు దొరకడనే అనుకున్నాను" అన్నాడు రామనాధం ఆశ్చర్యంగా."
    "నేనో చిన్న ప్రయోగం చేస్తున్నాను లెండి" అన్నాడు శివరావు.
    కృష్ణారావు, రామారావు ల వద్ద సలహాలు తీసుకుని సినిమాలు తీసిన వాళ్ళందరూ ఒకే ఒక్క సినిమా తీసి ఆ తర్వాత కృష్ణా, రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటున్నారుట. లోపల వాళ్ళ సలహాలదా, ఆయా నిర్మాతలదా అన్న విషయం చివరావుకు వంట బట్టలేదు. అయితే అతడికి ఖచ్చితంగా తెలిసిన విషయమొకటుంది. కృష్ణారావు సలహాలను తూచా తప్పకుండా పాటించిన వారైతే ఉన్నారు కానీ - రామారావు సలహాలను అలా పాటించిన వారెవ్వరూ లేరు. ఇన్నాళ్ళకు రామనాధం అతడి సలహాలను యధాతధంగా పాటిస్తున్నాడు.
    తను ఏయే సినిమాలను శ్రద్దగా చూడాలో లిస్టు కూడా రామారావునే అడిగి తీసుకుని ఆ ప్రకారం శ్రద్దగా ఆయా సినిమాలు చూసి పాయింట్లు నోట్ చేసుకుని తనకున్న కొత్త అయిడియాలతో ఓ కొత్త కధను తయారు చేసి - ఓ కొత్త  కధను తయారు చేసి - ఓ కొత్త రచయిత చేత డైలాగులు రాయించి - సినీ రంగంలో అడుగు పెట్టినట్లే పెట్టి - మరుగున పడిపోయిన కొందరు నటీమణులను పెట్టి - బుక్ చేసి- కొత్త వారితో కొత్త తరహ సినిమా - అంటూ అతడు ప్రచారం ప్రారంభించిన తర్వాతే శివరావు ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్రతికి బట్టకడితే తనూ రామారావూ పద్దతే అనుసరించి స్వయంగా ఓ సినిమా తీయాలని అతడనుకుంటున్నాడు.
    రామనాధం చిత్రం ప్రారంభమయింది. చిత్రానికి అతడు "ఇది ఆభరణం కాదు ?" అని పేరు పెట్టాడు. అందుకు కారణం అతడిది పూర్తిగా నెగెటివ్ అప్రోచ్ కావడం కావచ్చు.
    'ఇది చాలా గొప్ప సూత్రం. ఈ ప్రపంచంలో మనమేం చేయాలని కాక ఏం చేయకూడదని ఆలోచించాలి. అప్పుడు సహజంగానే మనం ముందడుగు వేయగలుగుతాం.' అని రామారావు తరచుగా శివరావుతో అంటుండేవాడు.
    ఇరవై నాలుగు రోజుల్లో రామనాధం చిత్రం పూర్తి అయింది. చిత్రం తనకు తృప్తి కలిగించే విధంగా వచ్చిందని రామనాధం అన్నాడు. అతడి వద్ద డబ్బు తీసుకున్న వారంతా ఆ చిత్రం గురించి పత్రికల్లో గొప్పగా రాశారు. అయితే చిత్రాన్ని విడుదల చేయడం రామనాధానికి కష్టమే అయింది. తయారైన ఆర్నెల్లకు ఎలాగో అతడు తన చిత్రాన్ని విడుదల చేయగలిగాడు.
    చిత్రం విడుదలైన రెండు వారాలకు శివరావు రామారావుని కలుసుకుని కొన్ని ప్రశ్నలడగాలనుకున్నాడు. అతడు రామారావు ఇల్లు చేరుకునే సరికి గుమ్మంలో ఓ కొత్త నిర్మాత ఎదురయ్యాడు. అతడు చూచాయిగా శివరావుకు తెలుసును.
    "హలో! రామారావు దగ్గరకు సలహా కొచ్చారా ?' అనడిగాడు శివరావు.
    'అవును, అయన సలహా నాకు బాగా నచ్చింది కూడా " అన్నాడా కొత్త నిర్మాత.
    అప్పుడు చూశాడు శివరావు - కొత్త నిర్మాత చేతిలో ఓ కాగితం అదేమిటని అడగ్గా అతడు చెప్పాడు - అది సినిమా తీయబోయే ముందు తాను చూడవలసిన చిత్రాల జాబితా అని!
    శివరావు చూశాడు - అందులో "ఇది ఆభరణం కాదు!" పేరు కూడా ఉన్నది.
    అతడు కొత్త నిర్మాతను వెళ్ళనిచ్చి తను లోపలకు వెళ్ళి రామారావును కలుసుకుని - "మీరు మీ నెగెటివ్ అప్రోచ్ ను వదిలిపెట్టి నట్లుందే! కొత్త నిర్మాతకు హిట్ చిత్రాలు జాబితా ఇచ్చారు" అన్నాడు.
    "నేను నెగెటివ్ అప్రోచ్ వదలలేదు. హిట్ చిత్రాలు చూసి కూడా ఏం చేయకూడదో తెలుసుకొనవచ్చునని నాకు కొత్తగా తెలిసింది " అన్నాడతడు.
    'అంటే ?"
    "సినిమా చూడ్డమంటే - ఒక్క సన్నివేశాలు మాత్రమే కాదు. దాని చరిత్ర అంతా చూడాలి.  రామనాధం ఫెయిల్యూర్ ఫిక్చర్ విషయంలో ఆ పని చేశాడు. కాని హిట్ పిక్చర్స్ విషయం పట్టించుకోక దెబ్బతిన్నాడు." అన్నాడు రామారావు.
    "అంటే?"
    "ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తీసినప్పుడు , డబ్బు తిరిగి రాకపోయినా పేరు వస్తే చాలు అనుకున్నప్పుడు - చిన్న రిస్కు తీసుకోవాలి. అది రామనాధం చేయలేదు."
    'అంటే?"
    "ఇది ఆభరణం కాదు ......చాలా చాలా పెద్ద హిట్టవుతోంది. నిర్మాతకు కనక వర్షం కురిపిస్తోంది. కానీ రామనాధం ఆ చిత్రంపై పూర్ణ హక్కులు అయిదు సంవత్సరాల పాటు మరొకరికి అమ్ముకున్నాడు - అదీ కేవలం యాభై వేల రూపాయల లాభం మీద "
    శివరావు అవాక్కయిపోయాడు. అయితే మర్నాడతడి కింకో విశేషం తెలిసింది. రామనాధం కొత్త చిత్రం ప్రారంభించాడు. అది ఫార్ములా పిక్చరు. పెద్ద స్టార్సు కాల్షీట్లు అతడికి దొరికాయి. ఇప్పుడు ఫైనాన్సియరు అతడి చుట్టూ తిరుగుతున్నారు.

                                          ***

 Previous Page Next Page