దేవుడు చేసిన బొమ్మలు
వసుంధర
పేదరికమన్నా, ముష్టి వాళ్ళన్నా .....నాకు అసహ్యం. ఈ సృష్టిలో పేదరికానికి మించిన జుగుప్సాకర అనుభవం లేదు. పేదరికానికి ప్రతినిధులుగా కనబడే కారణం వల్ల ముష్టి వాళ్ళంటే ఏహ్యభావం నాకు.
సృష్టిలో ఏ ఒక్కరూ డబ్బుతో పుట్టడు. భగవంతుడు మనిషికి తెలివితేటలను ఇచ్చాడు. అవి ఉపయోగించుకుని మనిషి పేదరికాన్ని అధిగమించాలి. పేదరికాన్ని అధిగమించడం ఎంతో కష్టం కాదు. కొద్దిపాటి తెలివి, శ్రమ, ఇవేమీ ఉపయోగించదలచినవాడు ముష్టివాడౌతాడని నా అభిప్రాయం. నా అభిప్రాయలు నేను ఎవరి తోనూ చర్చించను. నాకు తప్పు అభిప్రాయాలుండవని నా నమ్మకం. అందుకే ఆఖరికి నా భార్యతో కూడా నా అభిప్రాయాలు చర్చించను నేను.
నా భార్య పేదరికంలోంచే వచ్చింది గానీ ముష్టిది కాదు. ఆమె నన్నాకర్షించింది. ఆమె నావంటి వాడి భార్యగా ఉండతగ్గది అనిపించింది. వెంటనే పెళ్ళి చేసుకొన్నాను. ఆమె పేదరికంలో ఉన్న కారణంగా నేను అడగ్గానే ఒప్పుకుంది. ఐతే నా భార్య అయ్యాక ఆమె నా అభిప్రాయాలతో ఎన్నడూ అంగీకరించలేదు. నేను చెప్పే ప్రతిదీ ఖండించేది. కానీ నన్ను ప్రేమించేది. ఆమె నన్ను ఖండించినప్పుడల్లా నాకు ఉక్రోషం వచ్చేది. ఆమె ప్రేమ లాలనలో ఆగిపోయేది.
"నా మాట రైటని ఎందుకు ఒప్పుకోవు?" అన్నాను ఎన్నో సార్లు.
"రైటు కాదు కాబట్టి !"
"మరైతే నన్నెందుకు ప్రేమిస్తున్నావు?" అన్నాను చాలాసార్లు.
"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా?" అందామె అన్ని సార్లూ. అంటూనే ప్రేమగా లాలించేది. ఎంత ప్రేమగా లాలించేదంటే మా సంభాషణ అక్కడితో ఆగిపోయేది.
ఈ సృష్టిలో తెలివితేటల కంటే కృషి కంటే కూడా ముఖ్యమైనది మరొకటుంది. అది అదృష్టం. అదృష్టవంతుడు తెలివైన వాడినని గర్వపడకూడదు. దురదృష్టవంతుడికి సాయం చేయాలి చేయూత నివ్వాలి.
ఇది నా భార్య అమూల్యాభిప్రాయం. ఆమెతో వాదించి ప్రయోజనం లేదు. వాదనలో నన్నోడించే తెలివి ఆమెకు ఉంది. అందుకే ఆమెకు చెప్పేశాను. "నా అభిప్రాయాల్ని ఖండించడానికి ప్రయత్నించకు. నాకు నచ్చదు>"
ఆమె నవ్వి "మీ మాటలు వినక తప్పదు. మగాడిగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టానికి నేను తలవంచక తప్పదు" అంది.
ఆ మాటల్లో చురక ఉంది. అది నేను పట్టించుకోలేదు.
నా భార్య తరచుగా నా గురించి అనేదేమిటంటే కళాహృదయం లేని మనిషి జన్మ వ్యర్ధమట!
ఈ విషయమై నేను నా భార్యను ఖండించలేదు. ఎందుకంటె ఇవే మాటలు చాలామంది పెద్దలు, గొప్పవారు అన్నారు. అందువలన నేను నాకూ కళా హృదయమున్నదని నా భార్య దగ్గర ఋజువు చేసుకోవాలని అనుకున్నాను. ఐతే అనుకోగానే ఇలాంటి పనులకు తలపడడానికి నేను సామాన్య మనవుడినా? ధనిక వర్గానికి చెందినవాడిని. నా తెలివి తేటల్ని డబ్బుగా మారుస్తూన్న వాణ్ణి!
ఏమైతేనేం ఒకరోజు నాకు అవకాశం రానే వచ్చింది.
ఆర్ట్ ఎగ్జిబిషన్ కు నాకు ఆహ్వానం వచ్చింది. నేను శ్రీమతి దానికి కార్లో వెళ్ళాం. అక్కడ చేరిన వాళ్ళంతా నాకులాగే గొప్ప గొప్ప వాళ్ళు.
ఆర్ట్ ఎగ్జిబిషన్లంటే అందుకే నాకు చాలా ఇష్టం. అక్కడికి అంతా ఉన్నవాళ్ళే వస్తారు. అకలి ముఖాలు మచ్చుకైనా కనబడవు. ఆకలి ముఖాలన్నా నాకు చిరాకే!
శ్రీమతి కళాఖండాల్ని చూస్తోంది. నేను వచ్చిన జనాల్ని చూస్తున్నాను. అలా కొంతసేపు గడిచింది.
"మీరు పెయింటింగ్స్ చూడడం లేదు." అంది శ్రీమతి.
నేను నవ్వాను "అలా ఎందుకనుకుంటున్నావు?"
శ్రీమతి కూడా నవ్వింది. "నేను అనుకుంటున్నది చెప్పలేను. చూసింది చెప్పాను."
వెంటనే నేను మాట్లాడలేదు. ఆ క్షణం నుంచీ పెయింటింగ్స్ చూడడం ఆరంభించాను. అప్పుడు గ్రహించాను . ఎంత బాగున్నాయి అవి? అన్నింటిలోనూ జీవకళ ఉట్టి పడుతోంది. వాటిని చూస్తుంటే నా హృదయంలో ఏదో తెలియని అనందం కలుగుతోంది. ఆ విషయం గుర్తించగానే అనందం కలిగినండుక్కూడా అనందం కలిగింది.
నా భార్య నాకు కళా హృదయం లేదన్నది. ఇప్పుడు కళను చూసి నా హృదయం స్పందిస్తున్నది. అటువంటప్పుడు నాకు కళా హృదయం లేకుండా ఎలా పోతుంది?
ఈ విషయం నా భార్యకు చెప్పాను.
"చిత్రాల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. వీటిని చూసి ఆనందించడానికి అవసరమైన స్పందన కంటే కొనడానికే ఎక్కువ స్పందన కావాలి ' అంది శ్రీమతి.
ఇలా చురకలు వేయడం ఆమెకు అలవాటే. ! ఇలాంటి చురకలు ఆమె నుంచి చాలా పొందాను. అయితే ఇప్పుడామె నన్ను సవాలు చేస్తున్నది. బొమ్మ చూసి ఆనందించడం కాదు , కొనగలవా? అని అడుగుతున్నది.
ఏబొమ్మ ఖరీదు అయిందంకెలకు తక్కువలో లేదు. నాది డబ్బును వృధా చేసే మనస్తత్వం కాదు. కానీ కళాపోషణ డబ్బును వృధా చేయడం అవుతుందా?"
మా తాతగారు పేదరికంలో పుట్టి మధ్యతరగతి దశకు ఎదిగారు. మా నాన్నగారు మధ్యతరగతి దశ నుంచి మరికాస్త పైకి ఎదిగారు. అయన నాతొ తరచుగా అంటుండేవారు. "కారున్నంత మాత్రాన ధనిక వర్గంలో చేరిపోము . ఇంటి నిండా ఖరీదైన ఆయిల్ పెయింటింగ్స్ వేలాడే పరిస్థితికి ఎదిగినప్పుడే మనం ధనికులమనిపించుకుంటాము."
ఇప్పటి నా స్థితి బాగానే ఉంది. కానీ మనసే ఇంకా ఎదగాలనుకుంటాను. అందుకే ఇంతకాలమూ కళాపోషణ మీదకు దృష్టి మరలలేదు. ఈరోజు ఏ బొమ్మను చూసినా హృదయం స్పందిస్తోంది. బహుశా నేను మానసికంగా కూడా ఎడుగుతున్నానేమో?
ఈరోజు కళాపోషణకు శ్రీకారం చూట్టాలనుకున్నాను. అందుకోసం అపురూపమైన తైల వర్ణచిత్రం కొనాలనుకున్నాను. ఈ అభిప్రాయంతో ఎగ్జిబిషనంతా కలయతిరిగాను. నన్నొక బొమ్మ ఆకర్షించింది.
"జీవకళ నింపుకుని ఉన్నదది. చూడగానే దృష్టి మరల్చుకోలేక పోయాను. ఎముకల కతుక్కు పోయిన చర్మంతో, కళ్ళలో దైన్యంతో చేయి చాచి దేహీ అంటున్న బిచ్చగాడి బొమ్మ అది. నాకు పేదరికమన్నా, ముష్టి వాళ్ళన్నా అసహ్యం కావచ్చు. కానీ ఈ బొమ్మ ఎంత గొప్పగా ఉంది.
"ఇది కొంటాను ....' అన్నాను శ్రీమతితో.
ఆమె ఆశ్చర్యంగా , "దీని ఖరీదు పద్నాలుగు వేల అయిదు వందలు...." అంది.
'స్పందించే కళా హృదయం డబ్బుకు చూడదు " అన్నాను గర్వంగా.
శ్రీమతి మాట్లాడలేదు. నేనా బొమ్మ కొన్నాను. అది కార్లోకి చేరేలోగా అక్కడ కొందరు నా అభిరుచిని అపరిమితంగా అభినందించారు.
తిరుగు ప్రయాణంలో కారు ట్రబులిచ్చింది. మధ్యలో కారు దిగాల్చోచ్చింది. డ్రైవర్ ట్రబులేమిటో చూస్తున్నాడు.
"ఎప్పుడూ ఇలా ట్రబులివ్వలేదు కారు." అన్నాను చిరాగ్గా.
"ఈరోజు విచిత్రాలు ఇంకా జరుగుతాయేమో " అంది శ్రీమతి.
నాకిలా చురకలు వేయడంలో ఆమె అనందం ఏమిటో? నేనేమీ అనలేదు కానీ సంభాషణ మార్చడం కోసం, "నీకు దేవుడి మీద నమ్మకముందా ?" అన్నాను.
"ఇప్పుడా విషయమెందుకు? అందామె.
"నేను దేవుణ్ణి నమ్ముతాను. నాకే ఇబ్బంది వచ్చినా అయన ఆదుకుంటాడు. అందుకని ఏ ఇబ్బందులు నన్ను బాధపెట్టవు. మరి చిరాకుపడడమంటావా? అది మానవ సహజం. మనమిక్కడిలా ఆగవలసి రావడమే మంచిదేమో ?" అన్నాను.
శ్రీమతి ఏమీ మాట్లాడలేదు.
నా ముందుకు ఏదో చేయి వచ్చింది. ఉలిక్కిపడ్డాను.
అది ఒక బిచ్చగాడిది. మొలకు చిన్న మాసిన గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. మనిషి పూర్తిగా ఎండిపోయి ఉన్నాడు. వాడి కళ్ళలో ఆకలి.
"నాలుగు రోజుల్నుంచీ తిండి లేదు బాబూ?" అన్నాడు వాడు.
ఎప్పుడూ లేనిది నాకీ రోజు వాడంటే జాలివేసింది. చటుక్కున జేబులోంచి ఓ అయిదు రూపాయల నోటు తీసిచ్చి "పో, వెంటనే ఏదైనా కొనుక్కుని తిను" అన్నాను. వాడు నమ్మలేనట్లు నా వంక చూసి ఆ అయిదు రూపాయల నోటు తీసుకుని వెళ్ళిపోయాడు.
శ్రీమతి నావంక విచిత్రంగా చూసింది. తర్వాత ఏమనుకుందో హడావుడిగా కార్లోకి తొంగి చూసి వచ్చి "హమ్మయ్య' అంది.
"ఏం జరిగింది ?" అన్నాను ఆశ్చర్యంగా.
"ఏం లేదు . బొమ్మ పటంలోంచి వెళ్లిపోయిందేమో ననుకున్నాను. అయినా పద్నాలుగువేల అయిదువందలకొన్న బొమ్మ అయిదు రూపాయలుచ్చుకు పారిపోతుందా? పారిపోతే మీరూరుకుంటారా? ఈ ఆలోచన ముందే వస్తే కార్లోకి తొంగి చూసి ఉండేదాన్ని కాదు....'
మళ్ళీ చురక అంటించింది. నిజంగా ఉలిక్కి పడ్డాను ఈసారి. నాదగ్గర అయిదు రూపాయలుచ్చు కున్న బిచ్చగాడు అచ్చం ఫోటోలో బొమ్మలాగే ఉన్నాడు . వాడేనేమిటి అలాంటి వాళ్ళీ ఊళ్ళో చాలా మంది ఉన్నారు.
'అయితే ఏమంటావు? వాడినీ పద్నాలుగువేల అయిదువందలిచ్చి కొని డ్రాయింగ్ రూం గోడకు తగిలించాలాంటావా?" అన్నాను చిరాగ్గా.
'అయ్యో! నేనలా ఎండుకంటాను? మీరు దేవుణ్ణి నమ్ముతారు కదా! మనిషి వేసిన బొమ్మలకు లాగే దేవుడు చేసిన బొమ్మలకు మాత్రం విలువ కట్టలేరా?' అంది శ్రీమతి.
నా కళా హృదయం గురించీ, హృదయస్పందన గురించి పడుతున్న గర్వమంతా ఒక్కసారి మంచులా కరిగిపోయింది. శ్రీమతి నాలో ఆశించిన హృదయస్పందన ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఆ విధంగా నా హృదయం స్పందిస్తుందా అన్నది వేరే సంగతి!
దేవుడు చేసిన బొమ్మలను చూసి స్పందించే హృదయం మనుషుల కంటే మనుషులలో ఇన్ని తరగతులుండేవి కాదేమో!
***