Previous Page Next Page 
శతఘ్ని పేజి 9

 

    బ్రహ్మాజీకాదు......ప్రారంభించాల్సిన ఉద్యమం సంగతి వదిలిపెట్టిరామాయణంలో పిడకలవేటలా యిప్పుడు సినిమా గురించి చర్చించడం ముకుందానికి నచ్చలేదు.
    
    "మనంటాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నట్టున్నాం" గుర్తుచేశాడు ముకుందం.
    
    "లేదుముకుందం......తెలుగువాడైన సీతారామరాజు దుర్మరణం తెలుగువాడిగా నన్నుకలవరపరుస్తుంది .....ఆ ఫిరంగుల మోత యింకా నాచెవుల్లో ప్రతిధ్వనిస్తుంది......యిప్పుడే ఆ విప్లవ నాయకుడు కొన్ని క్షణాల క్రితమే నా కళ్ళముందు చనిపోయినట్టుగాకాదు హత్యచేయబడినట్టుగా వుంది"
    
    "పరమహంసగారూ" తలపట్టుకున్నాడు బ్రహ్మాజీ" అదెప్పుడో జరిగిన సంఘటన..... ఇప్పుడు మీరుచూసింది టి.వి. ని స్క్రీన్ టెలికాస్ట్ చేసిన సినిమా మాత్రమే...."
    
    "అయితేనేం....ఓ తెలుగు బిడ్డకి అన్యాయం జరిగిపోయింది" ఉద్విగ్నంగా అన్నాడు పరమహంస.
    
    మందెక్కువై యిలా మాట్లాడుతున్నాడేమో అనుకున్న ముకుందంపరమహంస లాంటి సంఘ విద్రోహకశక్తి ఓ దేశభక్తుడి లా నివాళులు అర్పించడం అసహజంగానూ, అసహ్యంగానూ అనిపిస్తుంటే" మనం పాయింటుకొద్దాం" అన్నాడు.
    
    "వచ్చేసాసాం ముకుందం......మనకోపటిష్టమైన దారిదొరికి పోయింది"
    
    "ఏమిటది" బ్రహ్మాజీముకుందం ఒకేసారి అడిగారు.
    
    "తెలుగుజాతియిప్పటికి ప్రేమిస్తుంటారు. అమరవీరుడిలా పూజిస్తుంటారు."
    
    "అవును"
    
    "అందుకు అతడ్నే మనఉద్యమానికి వాడుకుందాం"
    
    హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.....
    
    పరమహంసకి మతి భ్రమించిందా అనుకున్నారిద్దరూ...
    
    ఎప్పుడో ప్రాణాలు కోల్పోయిన సీతారామరాజుని యిప్పుడు ప్రారంభం కావాల్సిన ఉద్యమానికి వాడుకోవడమేమిటో అర్ధం కాలేదు.
    
    "మీరుస్పృహలోనే ఉన్నారనుకుంటాను" ముకుందానికి అనుమానమేర్పడిపోయింది.
    
    మహర్షిలా నవ్వాడు పరమహంస.
    
    "ఆశ్చర్యపోకండి మిత్రులారా.....సంధికిరప్పించబడిన సీతారామరాజుని అలాతెల్లదొరలు కాల్చటం నేరమంటాం.....ఆ దారుణానికి ప్రతితెలుగువాడూ తల్లడిల్లితీరాలని ప్రజలకి ఉద్భోదించి యిప్పటికి తెల్లవాళ్ళు భారతదేశానికి వచ్చి క్షమాపణలు చెప్పాలని ఉద్యమం లేవదీస్తాం"
    
    "వ్వాట్" షాక్ తిన్నట్టుగా చూశాడు ముకుందం "నిజమా"
    
    "అవును" సాలోచనగా అన్నాడు పరమహంస.
    
    పిచ్చెక్కుతున్నట్టుగా వుంది బ్రహ్మాజీకి" ఆయన చచ్చిపోయి చాలా రోజులైందిగా"
    
    "అయితేనేం? తెలుగుజాతిగుండెలపై ఇంకా అది పచ్చిగాయంలాగే మిగిలివుంది "నచ్చచెప్పాడు పరమహంస "పైగా సమస్య ఎన్ని శతాబ్దాల క్రితందైనా కావాలనుకున్నప్పుడు అది తిరగతోడవచ్చనిమన రాజకీయాలు సోదాహరణంగా ఓ పక్క తెలియచెబుతూనే వున్నాయి.
        
    గుర్తుకొచ్చింది అతడుదేన్ని ఉద్దేశించి ఆ మాట అన్నది-
    
    సరిహద్దుల కోసం దేశాలు, ఆశయాలకోసం మతాలూ, రిజర్వేషన్ లకోసం కులాలూ, కొట్టుకుచావడానికి రాజకీయాలు ఎంతబలంగా దోహదంచేస్తున్నది స్ఫురించడంతో ముందుతేరుకున్న బ్రహ్మజీగురు భక్తితో మరోసారిపరమహంస పాదాల్ని చుట్టేశాడు.
    
    "బ్రహ్మాండం.......అమోఘం...." అనుమానంగా ఆగేడు క్షణంపాటు "కాని యిప్పుడు తెల్లవాళ్ళువచ్చి అప్పటికి రాతకానికి క్షమార్పణలు చెప్పాలనడం ఎంతవరకూ సమంజసం....అసలు అది సాధ్యమయ్యేపనేనా"
    
    "సాధ్యంకానిపని కాబట్టే అలాంటికండిషన్ పెట్టింది"
    
    "అలాంటప్పుడు ఇది పరిష్కారం కాదుగా? మనం ప్రారంభించాల్సింది పరిష్కారం కుదరని ఉద్యమమని ముందేచెప్పాను"
    
    ఇప్పటికిపూర్తిగా అర్ధమైపోయిన బ్రహ్మాజీ సాక్షాత్తు పరమాత్ముడే ప్రత్యక్షమై తనగదిలో పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్టు పరవశించి పట్టు మరింత బిగించాడు.    

    "ఇకలే..." స్వహస్తాలతో ఆయనే లేవదీశాడు "నీకున్న మందీ మార్బలాన్ని రంగంలోకి దింపు.....విప్లవశంఖాన్ని పూరించి ఉద్యమానికి శ్రీకారం చుట్టు..."
    
    "మరి....నన్ను ప్రత్యక్షంగా రంగంలోకి దిగొద్దన్నారుగా..."
    
    "పిచ్చివాడా...అదనుచూసుకొని రంగప్రవేశం చేయడంఅసలు రాజకీయం-వరదబాధితులకి పునరావాసం గురించి ఆలోచించాల్సింది వరద లొచ్చాకనేతప్ప ముందు కాదు కాకూడదు....ప్రజల్ని పీడితులుగా మార్చాకనే పీడిత ప్రజలముందు నీ స్పందన తెలియచేయాలి. అందుకని ముందు ఉద్యమం ప్రారంభించేది నువ్వుకాదు..నీ నియోజకవర్గంలోనివీ అనుయాయులు..."
    
    "బ్రిటిష్ జులుం నశించాలి. సీతారామరాజు అమర్ హై" ఉదయం పదిగంటలకల్లా మురికివాడల నుంచి మొదలయిన ఊరేగింపునగరం నడి బొడ్డుకుచేరుకుంది. వందలసంఖ్యలో జనంనడుస్తున్నారు. రోడ్డుమీద ట్రాఫిక్ అంతరాయంకలుగుతున్న పట్టించుకోలేదు. మురికివాడలకి చెందినఆడా మగా మాత్రమేకాదు పసిపిల్లలూ ఉన్నారు జనంలో.
    
    అనుమతిలేకుండా ప్రారంభించిన ఈ ఊరేగింపుకి అర్ధం తెలీని బీట్ కానిస్టేబుల్ జనాల చేతుల్లోని అట్టల మీద అక్షరాలని చదివి అసలు సంగతేమిటోతోచక తెల్లమొహంవేసుకు చూస్తున్నారు. జనం ముందు నడుస్తున్నాడు ఖద్దరు బట్టలు ధరించి నలభై అయిదేళ్ళ వయసున్న అప్పారావు.
    
    నగరంలోని గుడిసె వాసుల సంఘానికి అద్యక్షుడేగాక బ్రహ్మాజీకి ముఖ్యుడైనా అనుచరుడిగా కూడా అందరికీ తెలిసిన అప్పారావుకొంతకాలం జేబుదొంగగాజైలు జీవితంగడిపి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఏ పార్టీగుర్తించకపోవడంతో యిండిపెండెంట్ గానే కార్పొరేటర్ ఎన్నికై యీ మధ్యనే.
    
    రూలింగ్ పార్టీలోకి దూకేడు కూడా.
    
    నిన్నరాత్రి బ్రహ్మాజీ పిలిచి ఏం చేయాల్సిందీ చెప్పగానే మళ్ళీచేతికి పని తగిలినందుకు మహదానందపడటమేగాక ముకుందం ఇచ్చిన డబ్బుని సగం మింగి డబ్బుతోపనిలేని జనానికి కల్లు పోసి యీ వూరేగింపులో నడిపిస్తున్నాడు. కేకలతో అరుపులతో అదరహోలా ఉంది.
    
    అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. విషయమేమిటో బోధపడని ఓ డిసిపి ఊరేగింపుని లీడ్ చేస్తున్న అప్పారావుని నిలదీశాడు కూడా..... జవాబు చెప్పని అప్పారావు ఇంకా గట్టిగారంకెలు వేస్తూ ఆ రంకెల్ని నినాదాలుగా మార్చి ముందుకుసాగిపోతున్నారు. పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నడిసిపి అడ్డుపడలేదు. ఊరేగింపు శాంతిభద్రతల సమస్య కాకుండా చూస్తూవారివెంటే నడుస్తున్నాడు.

 Previous Page Next Page