"ఇప్పటికైనా ఆలస్యం కాలేదు,"
"మరేం...."
"నువ్వాస్థాయి మనిషివి కాబోతున్నావు."
"తప్పకుండా"
"అయితే ఎలా ప్రారంభం జరపాలనుకుంటున్నావు?"
"ఏదన్నా ఉద్యమం నడిపి బస్సుల్ని, బేంకుల్ని తగలబెడుతూ పోలీసు కాల్పుల్లో ప్రజలు చచ్చేట్టుచేస్తాను"
"అప్పుడు నువ్వెక్కడుంటావ్"
"వెనుకవుంటాను....ఆ తర్వాత కాల్పుల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీసి..."
"నిలదీసి?"
"పెట్టుబడి నాదికాదు కాబట్టి మృతుల కుటుంబంఒక్కింటికి కోటిరూపాయల నష్టపరిహారం చెల్లించమంటాను..."
"శభాష్" అభినందించాడు పరమహంస మరి ఏ ఉద్యమం ప్రారంభించాలనుకుంటున్నావ్."
"మతకల్లోలం"
"అది ఇప్పటికే వుందిగా"
"కులాల మధ్య గొడవలు..."
"దానివలన నువ్వుకొన్ని కులాల సపోర్టుని కోల్పోతావ్"
"మరేంచేయాలి...."
"అసలుఉద్యమంతో ఏం సాధించాలనుకుంటున్నావ్"
ఉలికిపడ్డాడు బ్రహ్మాజీ.
నిజమే రూలింగ్ పార్టీలో వుంటూయిలాంటి వెధవపనిచేస్తే రేపు పార్టీ నుంచి బహిష్కరింపబడతాడు....
"బ్రహ్మాజీ" పరమహంస బాటిల్ తోనేగడగడా తాగేశాడు.... "నువ్వు పార్టీ దృష్టిలో చెడుకాకూడదు.... కాని ఉద్యమంలేవాలి....ఆ ఉద్యమానికి చాలామంది ఆహుతికావాలి. అలా రాష్ట్రంలో శాంతిభద్రతలు విచ్చిన్నం కావాలి.... ఆ విషయంలో నువ్వు కేంద్రంలో వున్న నీ పార్టీ ప్రధానికి నువ్వుకూడగట్టుకున్న ఎమ్మెల్యేలతో రుజువు చేయాలి....."
"ఇప్పటికే అంతా మంత్రులైతే మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలతో నేను ఏం చేయగలనని....."
"బ్రహ్మాజీ.....ఓసారి మంత్రి పదం రుచిచూసిన వాడు ఆ తర్వాతయిక మామూలు ఎమ్మెల్యేగా బ్రతకలేడు. అలా వున్న మంత్రుల్ని విచ్చిన్నమైపోయిన శాంతిభద్రతలగురించి బెదిరించాలి...అది రేపు రాష్ట్రపతి పాలనకి అవకాశమిచ్చి మంత్రిమండలి మొత్తం బర్తరఫ్ అయ్యే అవకాశముందని కంగారుపెట్టి....."
"కంగారుపెట్టి?"
"ఓ సమర్దుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కబడవని కేంద్ర ప్రభుత్వానికి తెలియచెప్పాలి..... అలా అయితే మాత్రం నీకే ఆ పదం వస్తుందని గ్యారంటీ ఏమిటి అనకు.... అప్పటికే ప్రజల్లో నువ్వొ మహానాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోతావు. ఇలాంటి వ్యక్తిమాకు ముఖ్యమంత్రికాని నాడు యీ రాష్ట్రానికి విముక్తిలేదు అని నిరూపించుకుంటావు...."
మందెక్కువైన బ్రహ్మాజీ వాక్యాలతో మరింతమత్తు ఆవహించిందేమో అమాంతం పరమహంసకాళ్ళు చుట్టేశాడు"చెప్పండి.....ఏ ఉద్యమం ప్రారంభించాలి. అదికూడా మీరే చెబితే నా వెనుకనున్న జనానికి కల్లు సీసాలు, సారా పేకెట్లు యిచ్చి రేపే, రేపు కాదు యిప్పుడే మొదలుపెడతాను"
"ఆవేశపడకు...." పైకి లేవదీశాడు పరమహంస "మనం ప్రారంభించాల్సిందివారంపాటు చేసి మరిచిన రవీజాబి ఉద్యమంలాంటిదో, లాకప్ హత్యతో పోలీసులపైటెంపరరీగా సాగించే తిరుగుబాటులాంటిదోకాకూడదు. రావణ కాష్టంలా పరిష్కారం దొరక్కుండా చిరకాలంమండేది కావాలి"
అదిగో.....సరిగ్గా అప్పుడు వినిపించింది ఫిరంగి మోత....
గభాలున వెనక్కి జరిగాడు బ్రహ్మాజీ...
మరోసారి తూటాల చప్పుడు అది పక్క గదిలో వుందని బోధపడి ముకుందం అప్పటికే బాత్ రూంలోకి పరుగెత్తాడు ఆందోళనగా...
పరమహంస చలించలేదు.......నెమ్మదిగా నడిచిప్రక్కగది కిటికీని చేరుకున్నాడు.....
"రూదర్ ఫర్డ్" గదిలోని టి.వి. స్క్రీన్ పై రక్తసిక్తమైన దేహంతో తూలుతూప్రచండ భానుడిలా ముందుకు నడుస్తున్నాడు అల్లూరి సీతారామరాజు... "రాజీకని రప్పించి పిరికిపందలా కాల్పులు సాగిస్తావా..... కాల్చరా... యింకా కాల్చు...అగ్నిగోళనేత్రంలా భీకరతుఫానులా నీ తెల్లజాతిని భస్మీపటలంచేయాలనుకున్న ఈ తెలుగుబిడ్డ..."
జరిగిందేమిటో అప్పటికి అర్ధమైన బ్రహ్మాజీ ఆవేశంగా గదిలోకి దూసుకుపోయి అంత వాల్యూమ్ పెంచి సినిమా చూస్తున్న నౌకరుని చాచి కొట్టాడు.
"దొంగరాస్కెల్.....అవతల మేముపెద్ద మనుషులతో సీరియస్ గా చర్చల్లో వుంటే యిక్కడ నువ్వు టి.వి. ఆన్ చేసి డిస్టర్బ్ చేస్తావా..." మరోసారి యీడ్చి తన్నేవాడే....
అమాంతంముందుకొచ్చిన పరమహంస బ్రహ్మాజీ వారించాడు.
టి.వి. ఆఫ్ చెయ్యనివ్వకుండా యింకా ఏకాగ్రతగా తెరవేపేచూస్తున్నాడు.
"కాల్చరా.....మహోష్టభీకర జ్వాలాజ్వలితమా మహగ్ని పర్వతాన్ని తట్టుకోగల శక్తి వుంటే కాల్చు.....నరరూపరాక్షసుడా..... మాతృగడ్డ కోసం ఆత్మ బలిదానానికి సిద్దపడ్డ తెలుగుబిడ్డనిరా.....రేయ్..... ఒక్క సీతారామరాజు రుధిరతర్పణతో నువ్వు మా ఉద్యమాన్ని ఆపలేవు....నా తెలుగునేలపై చిందేనా రక్తపు బొట్లనుంచికోటాను కోట్ల సీతారామరాజులు ఉద్భవించి నిన్నూ నీశ్వేతజాతిని ఎదుర్కొనేవిప్లవగీతాలు ఆలపించి...." మరోతూటా సీతారామరాజు గుండెల్ని చీల్చింది...
"అ.....మ్మా" లావాలా రక్తం చిమ్ముతుంటే దుర్గమారణ్యం ప్రతిధ్వనించేట్టు ఆక్రందన చేస్తూ నేల కొరిగాడు "వందేమాతరం.....వందేమాతరం..." టి.వి. ని ఆపేశాడు బ్రహ్మాజీ....
ఇంకాతేరుకోలేదు పరమహంస "ఎంతదారుణం" అన్నాడు బాధగా...
"ఏమిటి.....టి.వి.ని ఆపేయడమా"
"కాదు.....యుద్దనీతి మరిచి సంధికని సీతారామరాజుని రప్పించిన రూధర్ ఫర్డ్ అంత దారుణంగా ఓ తెలుగు విప్లవకారుడ్ని చంపడం...." స్వప్నంలోలా అంటూ యిందాక తను కూర్చున్న సీటు దగ్గరికి వచ్చాడు.