Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 6

    "నా ప్రభ...... నీ ప్రభ..... అంతులేని ప్రభ..... ఆకాశమంత ప్రభ......" అమల చేతివేళ్లు లెక్కపెడుతూ తనలో తను అనుకోసాగింది.

    జాలిగా అమలను చూస్తూ ముగ్గురూ గదిలోంచి వెళ్ళిపొయ్యారు.

    అమల ఆలోచిస్తూ కూర్చుంది.

    ఆ భగవాన్ గాడు చెప్పినట్లు నటిస్తే తన తల్లితండ్రులకు తనకి ఏ అపాయం వుండదు. ఇలా ఎంతకాలమో? దీని వెనుక కధా సూత్రధారి ఆపై పరమాత్ముడికే ఎరుక. తను క్షేమంగా వున్నట్లు రాత్రిపూట లెటర్ రాసి కిటికీ సందులో వుంచింది. తన తండ్రి తనకు రాసిన లెటర్ ఆ మర్నాడు కిటికీ సందులో వుంది. ఎవరు ఎట్లా యీ ఇంద్రజాలం చేస్తున్నారు? నాన్నగారు? నాన్నగారు లెటర్ లో 'తల్లీ అమలా! నీ క్షేమమే మాకు కావలసింది. నీవు రాసిన ఉత్తరం అందినది. మళ్ళి ఇంకో ఉత్తరం రాస్తాను. ఇరుగుపొరుగుతో నీవు ఊరికి వెళ్ళినట్లు చెప్పాము. అమ్మ కులాసా?'

    ఇది నాన్నగారి లెటర్ లో సారాంశం. నాన్నగారి హాండ్ రైటింగ్ తనకి బాగా తెలుసు. ఈ భగవాన్ గాడు ఈ విషయంలో తన్ని మోసం చేయటం లేదు.

    భగవాన్ చెప్పిన ప్రకారం ఆరోజు తను చినిగి పీలికలైన చీర కట్టుకుని రోడ్డుపక్కగా కూర్చుంది. కూరలు తెస్తున్న నౌకరు తన్ని చూచి భుజంగరావు కూతురు సరోజగా గుర్తించాడు. తను పిచ్చిదానిలా రాను రాను అంటున్నా బలవంతాన రిక్షా ఎక్కించి, ఈ ఇంటికి తీసుకొచ్చాడు. నౌకరు కంట తను పడేటట్లు ప్లాన్ పన్ని భగవాన్ చేశాడా? లేక నౌకరు కూడా ఈ విషయంలో వాడా?

    "సరోజమ్మగారూ! తల దువ్వుతాను," అంటూ దాసీ నర్సమ్మ నూనెసీసా, దువ్వెన, అద్దంతో గదిలోకి వచ్చింది.

    "ఎవరి తల?" అంది అమల.

    "మీ తలేనమ్మగారూ!"

    "సరే దువ్వు. జాగ్రత్త, సరిగా పది జడలెయ్యాలి."

    "మీరెట్టా చెపితే అట్టాగే ఎస్తానమ్మగారూ?"

    "మంచి పిల్లవు, నీవు నాకు నచ్చావ్" అంది అమల యాభయ్యో పడిలో వున్న నర్సమ్మతో.

    తన్ని పిల్ల అంటుంటే నర్సమ్మకి ఏడ్వాలో, నవ్వాలో అర్ధం కాలేదు. జాలిగా అమలని చూసి అమల జడ విప్పుతూ కూర్చుంది.

    అమల అద్దం తీసుకుని తన ముఖం చూసుకుంది అద్దంలో, ఆశ్చర్యపోయింది.

    గడ్డం దగ్గర గంటు, మెడమీద పైసా అంత పుట్టుమచ్చ. కనుబొమలు తనకి వత్తుగా వుంటాయి. కాని ఇప్పుడు సన్నగా వున్నాయి. తను అమలేకాని పోలికల్లో కొంత తేడా వుంది.

    "అమ్మగారూ! అద్దంలో చూసుకుంటున్నారా?" అంది నర్సమ్మ.

    "ఊ చూస్తున్నాను...... చూస్తున్నాను...... ఈ అద్దంలో పిల్ల నేను కాదు, నీవూ కాదు, ఎవతి? కోతిముఖంది......" అంది అమల.

    "పూర్వ జన్మలో ఏ పాపమో గాని, బంగారంలాటి తల్లి బ్రతుకు యిలా అయింది" అంది నర్సమ్మ.

    అమల మాట్లాడలేదు. అద్దంలో తన రూపం చూసుకుంటూ కూర్చుంది.
   

                               5


    "తల్లీ అమలా!

        నీవు రాసిన ఉత్తరం అందింది. అమ్మ కులాసా! నిన్ను ఒక్కసారి చూద్దామని వుంది. కాని..... నీ గురించి దిగులు పడవద్దని రాశావు. ఆ ధైర్యంతో వున్నాను. భగవాన్ అనే అతను నాకు పదివేలు వద్దంటున్నా యిచ్చాడు. మా పని త్వరలో పూర్తి అవుతుంది. మీ అమ్మాయిని జాగ్రత్తగా మీకప్పగిస్తామని అర్ధరాత్రి వచ్చి చెప్పాడు. నీ ఫ్రెండ్ మోతీ కులాసాగానే వుంది. మోతీతో కూడా నీవు ఊరికెళ్ళినట్లు చెప్పాము. ఉత్తరాలు రాస్తూ వుండు. నువ్వసలే దుడుకు పిల్లవి. తెలివిగా ఏదో చేయబోయి ఆపదలో యిరుక్కోకు, నీకు అపకారం జరిగితే నేనూ, అమ్మా భరించలేము. ఉంటా! అమ్మ నిన్ను అడగమంది.

                                                                                                                                        మీ నాన్న,
                                                                                                                                     పరంధామయ్య."

 Previous Page Next Page