Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 6

   
    ఆఫీసుకి ఎందుకు పిలుస్తున్నారో, ఏం పనో నాకు తెలీదు. దాని గురించే ఆలోచిస్తూ, మళ్ళీ మధ్యలో ఈ పెద్దవాళ్ళతో ఎందుకులే గోల - అనుకున్నా.
    మేనేజర్ సుబ్బారావుగారు ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్ళారు.
    "చలపతిరావుగారు చెప్పామా. ఇప్పుడే స్టూడియోకి వెళ్ళారు. 'అమరదీపం' తెలుగు పిక్చర్ కి సెన్సార్ స్క్రిప్ట్ మూడు కాపీలు మీరు రాయాలి. డీటైల్స్ మీకు చెప్తాను. మీరు మొదట ప్రారంభించండి. తర్వాత శ్రీశ్రీ గారు వచ్చి చూస్తారు"
    'చచ్చాన్రా బాబూ! చుట్టు తిరిగి మన కథ శ్రీశ్రీ గారి దగ్గరికే వస్తోందేవిట్రా నాయనా! మళ్ళీ ఆయన చేతిలోనే పడుతున్నామా! ఆయనో మతిమరుపు కేసులాగున్నారు. కానీ ఏం చేస్తాం! మన జీవనోపాధికి ఇదొక మార్గం' - అనుకున్నాను.
    త్యాగరాయనగర్లో, రంగనాధ స్ట్రీట్ ఉన్న మొదటింటిలోనే ఈ ఆఫీసు. రోడ్డు కనిపించేలా పెద్ద గది. పెద్ద సోఫా - పెద్ద టేబిల్, నాదో కుర్చీ, నా కెదురుగా రెండు కుర్చీలు.
    అమ్మని సోఫాలో కూర్చోమన్నా.
    టేబుల్ నిండా కాగితాలు, కార్బన్ పేపర్లూ, పెన్నులూ, పేపర్ వెయిట్లూ! అవన్నీ చూస్తూ వుండిపోయాను.
    కాసేపటికి షాట్లు నెంబర్లతో సహా రాసిన తెలుగు స్క్రిప్ట్ నా ముందు పడేశారు. విఘ్నేశ్వరుడ్ని తలచుకొని ధైర్యం, శక్తి, శ్రద్ద ఇమ్మని ప్ర్రార్ధించాను. ముందు చక్కగా టేబుల్ సర్దుకున్నాను. పబ్లిక్ పరీక్షలే జ్ఞాపకం వచ్చాయి.
    రెండు కార్బన్ పేపర్లు పెట్టాను.
    మొదటి పేజీ చదవడం, డైలాగ్స్ అర్ధం చేసుకోవడం - ఒకవైపు షాట్లు, యాక్షన్ రాసెయ్యడం, మరోవైపు డైలాగ్స్ రాయడం ప్రారంభించాను. అనుభవం లేదు. అంతా కొత్త.
    సందేహాలొస్తే మేనేజర్ ని అడగొచ్చు. కానీ ఎవర్నీ ఏమీ అడగకుండా 'తమిళ్ సెన్సార్ స్క్రిప్టు' ఎదుట పెట్టుకొని, అలాగే షాట్లు కాపీ చెయ్యడం, తమిళ మాటలకి బదులుగా ఆ చోట్లో మన తెలుగు మాటలు రాసెయ్యడం.... అదే సులువనితోచి ప్ర్రారంభించాను.
    ఇంకా సరిగ్గా బండి దారిలో పడలేదు. చాలా దీక్షగా జాగ్రత్తగా రాసుకుంటూ పోతున్నాను.
    సుబ్బారావుగారొచ్చి - "త్వరగా రాయాలమ్మా! మూడు రోజుల్లో కాపీలు రడీ అయిపోవాలి. నేను ల్యాబ్ కి వెళ్ళివస్తాను. మీకు కాఫీ టిఫిన్లు ఏం కావాలన్నా బాయ్ వున్నాడు, తెచ్చి పెడతాడు" అని చెప్పి వెళ్ళిపోయారు. అది చాలా పెద్ద బిల్డింగు అందులోనే రెండో భాగంలో 'భట్టి విక్రమార్క' వాళ్ళ ఆఫీసు కూడా పెట్టుకున్నారు.
    నాకు టైం తెలీడంలేదు. రాసుకుంటూ పోతున్నాను. మా అమ్మ బజార్లో వచ్చేపోయేవాళ్ళని కిటికీ దగ్గర నిల్చొని చూస్తూ కాలక్షేపం చేస్తోంది.
    చాలా సేపయ్యాక ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూశాను.
    ఎడంచేతి సిగరెట్టుతో, తెల్లని బట్టలతో శ్రీశ్రీగారు ఎదురుగా నిల్చున్నారు. "నమస్కారమండీ" అని లేవబోయాను.
    'కూర్చో, కూర్చో' -అన్నట్టు సౌంజ్ఞమాత్రమే చేసి రాసి పక్కన పెట్టిన పేజీలు  ఒక్కొక్కటే తిరగేస్తూ -
    "ఎంతవరకూ వచ్చింది?" అని అడిగారు.
    "ఇప్పుడే ప్ర్రారంభించాను సార్!" అన్నాను.
    టైమ్ చూసుకొని "పదకొండున్నర అయ్యింది" అన్నారు.
    "పదిగంటలకు ప్రారంభించాను" అన్నాను ఆయన భావం అర్ధమై.
    "అంతవరకూ ఏం చేశారు ఆఫీసుకొచ్చి?"
    "అన్నీ చూసి సర్దుకునేసరికి ఆలస్యం అయింది. ఇప్పటికి ఇరవై పేజీలు  పూర్తయ్యాయి.
    "అంతేనా?"
    ఏడుపొచ్చింది. వెధవది - ఈ కార్భను పేపరు పేజీ పేజీకి పెట్టడం. తియ్యడంతోనే టైమ్ వేష్టవుతోంది.
    "ఇంకా త్వరగా రాయడానికి ప్రయత్నిస్తాను".
    "ఏడురోజుల్లో అయిపోతుందా?"
    "తప్పకుండా పూర్తిచేస్తాను సార్?"
    "నేను మళ్ళీ యింటికి వెళుతూ చూసి వెళతా "పని దమ్ములాగుతూ వెళ్ళిపోయారు.
    "నమస్కారం" అన్నాను.
    వెనక్కి చూడకుండానే, కుడిచెయ్యిని మాత్రం ఎత్తి దించేశారు. అంటే - నా మాట వినిపించుకున్నారన్నమాట!
    నాలో కొంచెం ఉత్సాహం వచ్చింది.
    శ్రీశ్రీగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుందామన్నా కోరిక తీవ్రమయింది. దాంతో ఆటోమేటిక్  గా పట్టుదల ఎక్కువయ్యింది. అంతే చలిమిడి ముద్దలా ఆ కుర్చీకి అతుక్కు పోయాను.
    గబగబా రాన్లూ ఎప్పటికప్పుడు ఎన్ని పేజీలయ్యా అని చెక్ చేసుకుంటున్నాను.
    ఒంటిగంటన్నర అయింది.
    శ్రీశ్రీగారు రానే వచ్చారు. పేజీలు  చకచకా తిప్పారు.
    "ఫరవాలేదు వేగంగానే రాస్తున్నావు. ఇప్పుడు నేను ఇంటికి వెళుతున్నాను. మధ్యాహ్నం మూడు గంటలకి వస్తాను" అన్నారు.
    "దస్తూరీ బాగుందా సార్!" అని అడిగాను.
    ఏమీ జవాబివ్వకుండా వెళ్ళొస్తానని మాత్రం చెప్పి వెళ్ళిపోయారు.
    చిన్నబుచ్చుకున్నాననే చెప్పాలి.
    ఇక ఆ విషయం ఆలోచిస్తే స్క్రిప్టు త్వరగా పూర్తిచేయలేనని పనిలో పడ్డాను.
    ఓపక్క రాస్తున్నా - మనస్సు శ్రీశ్రీగారి గురించే ఆలోచిస్తోంది.
    "ఏమిటీ మనిషి! బాగుందని ఒక్కమాట అని ఎంకరేజ్ చేస్తే ఏమిటంట! కొంప మునుగుతుందా!" అనుకున్నాను.
    అన్న టైముకి అరసెకండయినా ఆలస్యం కాకుండా శ్రీశ్రీ గారు వచ్చేశారు రాస్తున్న పేజీ పేపర్ల మీద చెయ్యిపెట్టి తిరగవేసి టేబుల్ మీదరాసి ఉన్న పేజీలు  చూశారు.
    "ఇంకా 500 పేజీలు  రాయాలికదూ!"
    "అవునండీ!"

 Previous Page Next Page