Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 7


    "ఇంత స్పీడుగా రాస్తున్నావు కనుక, వారం రోజుల్లో అయిపోతుందిగా!" నేను మాట్లాడలేదు. రాస్తున్న పేపర్ల సీరియల్ నెంబర్లు చూసి-
    "మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళేముందు వస్తాన"ని ఎంత స్పీడుగా వచ్చారో అంత స్పీడుగా వెళ్ళిపోయారు.
    వారిముఖం నేను చూడలేదు - నా ముఖం వారు చూడలేదు. ఏదో అడుగుతున్నారు - సమాధానం చెప్తున్నాను. వస్తున్నారు - వెళుతున్నారు.
    వారి రాకపోకల మీద దృష్టి నిలవక స్క్రిప్ట్ లోనే పూర్తిగా నిమగ్నమై పోయాను. త్వరగా, బాగా రాశాననిపించుకోవాలనే పట్టుదల ఒక్కటే నాలో వుంది.
    ఇంటికి వెళ్ళి రాయాలంటే కుదరదని నాకు బాగా తెలుసు. అందుకే ఏం రాసినా ఆఫీసులోనే చకచకా రాసెయ్యాలి.
    డ్రైవర్ని పిలిచి, "రాత్రి ఇంటికి వచ్చేసరికి రెండు గంటలౌతుంది భయపడవద్ద"ని కబురు పెట్టేశాను.
    తొమ్మిది గంటలకి శ్రీశ్రీగారు వచ్చారు.
    "ఇంకా రాస్తున్నావా - యింటికి వెళ్ళలేదా?"
    "మీరు మళ్ళీ వచ్చి చూస్తానన్నారుగా" అన్నాను.
    రాసినంతవరకూ పేజీలు  తిప్పి "రేపు ఉదయం వస్తా"నని వెళ్ళిపోయారు. ఈ విధంగా రాత్రింబవళ్ళు కూర్చొని మూడు రోజుల్లో మూడు కాపీలు పూర్తి చేసి టేబుల్ మీద పెట్టేశాను.
    నాతోపాటూ మా అమ్మని కూడా కష్టపెట్టాల్సి వచ్చింది.
    శ్రీశ్రీగారు చాలా మెచ్చుకుంటారనుకున్నాను. నాతో ఏమీ అనలేదు. "పూర్తి చేసేశావన్నమాట. గుడ్" అని మాత్రం అనేసి వెళ్ళిపోయారు.
    "ఉద్ధండురాల్లాగుందయ్యా?  వారం రోజులు అవుతుందనుకున్నాను. ఉన్నచోటు నుండి కదలకుండా మూడు రోజుల్లో పూర్తిచేసి పారేసింది. పట్టుదల, ఓపిక కూడా ఉన్నాయి. 500 పేజీల చొప్పున మూడు రోజుల్లో మూడు కాపీలు పూర్తి చెయ్యటం చాలా కష్టం. బాగానే రాసింద"ని శ్రీశ్రీగారు తనతో అన్నారని, తర్వాత చలపతిరావుగారు చెప్పారు.
    "ఆ మాట నతహో అనకూడదా! నాకూ ఉత్సాహంగా ఉండదా!" అని చలపతిరావుగారిని అడిగాను.
    "నాతో అన్నదానికే నేను ఆశ్చర్యపోతూంటే, నువ్వేవిటి? అసలు శ్రీశ్రీ నోటంట అంతంత మాటలు రావడమే! నిన్ను ఆయన మెచ్చుకున్నారంటే సంతోషించు. నీ రాతమీద, పనిమీద శ్రీశ్రీగారి కన్నుపడింది. అవకాశం వుంటే - నీకు తప్పకుండా సాయం చేస్తారు. మరేం బెంగపడకు. ఈ స్క్రిప్ట్ సంగతి ఫీల్డంతా పాకిపోతుంది. నెలకి రెండు మూడు అవకాశాలు వచ్చినా చాలు - హాయిగా కాలం గడిచిపోతుంది" -అని చెప్పారు.
    పోనీలే నా పనిపట్ల తన అభిప్రాయం చలపతిరావుగారితోనైనా చెప్పారు. అదే చాలని తృప్తి పడ్డాను. ఆ స్క్రిప్టు రాసినందుకు 500 రూపాయలిచ్చారు. అందరూ చాలా మెచ్చుకున్నారు.
    పెద్ద చెల్లి పాటలు పాడి తనూ సహాయంగా వుంటోంది. ఆఖరి చెల్లెల్ని అరండేల్ రుక్మిణీ కళాశాలలో జాయిన్ చేశాను.
    తరువాత చలపతిరావుగారు, రాజేశ్వరరావుగారు, కీ.శే. అశ్వత్థామగారు తమవద్ద మ్యూజిక్ అసిస్టెంట్ గా కావలిస్తే అవకాశం ఇస్తామని చెప్పారు. చలపతిరావుగారింటితోపాటూ అశ్వత్దామగారింటికీ, రాజేశ్వరరావుగారింటికీ కూడా వెళుతూ వుండేవాళ్ళం. కానీ వాళ్ళు పాటలుపాడే అవకాశం యివ్వలేదు. చలపతిరావుగారొక్కరే అవకాశాలిస్తూ వుండేవారు.
    ఒకరోజు అమ్మతో కలసి చలపతిరావుగారింటికి వెళ్ళాను.
    "రా అమ్మా! నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను - వెయ్యేళ్ళాయుష్షు" అన్నారాయన.
    "ఎందుకన్నయ్యా దండక్కి" - అన్నాను. నవ్వేశారు -
    "సరోజా! నిన్న శ్రీశ్రీ వచ్చారు. మీ సంగతి అడిగారు. చెప్పాను. నీ అడ్రస్ అడిగేరు ఇచ్చాను"
    "నా అడ్రస్సా? ఆయనకెందుకు?
    "అబ్బా.... అడిగారు - ఇచ్చాను. అదీ తప్పేనా! ఇలాగైతే నువ్వు సినీ ఫీల్డుకి పనికిరావు. విజయనగరం వెళ్ళి మళ్ళీ హరికథలు చెప్పుకోవాల్సిందే"
    "చూద్దాం! దారి చూపించారు కదా! మీరే చూద్దురుగానీ - "అని వూరుకున్నాను.
    
                             *    *    *
    
                                     శ్రీశ్రీ మా ఇంటికి వచ్చిన వేళ
    
    ఇంటికి చేరుకొనేసరికి నాన్నగారు ఆ రోజు వచ్చిన లెటర్ అందిస్తూ - "అమ్మా! నీ మృదంగం కోర్సుకి స్కాలర్ షిప్ ఇస్తామని ఢిల్లీ నుండి లెటర్ వచ్చింది. మీ గురువుగారు కారెక్కూడి ముత్తయ్యర్ గారి వల్ల నీకీ అవకాశం దొరికింది. ఏం చేస్తావు?" అని అడిగారు.
    మృదంగం కోర్స్ పూర్తిచెయ్యడానికి మూడువందల రూపాయల స్కాలర్ షిప్ ఇస్తామని, జాయిన్ అవమని ఆ లెటర్ లో వుంది.
    చలపతిరావుగారు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్ట్ గా సెటిల్ అవమంటున్నారు. ఫీల్డులో ఛాన్సు దొరికినప్పుడే చేరిపోవాలి. అసలు ఛాన్స్ దొరకడమే కష్టం. అలాంటిది చలపతిరావుగారు, రాజేశ్వరరావుగారు అశ్వత్దామగారు - ఈ ముగ్గురూ కూడా సంగీత దర్శకత్వంలో పనిచేసే అవకాశాలు కల్పించడం మంచిదే!
    అయితే - నే నెవరికీ మాట యివ్వలేదు.
    కాలేజీకి కూడా రిప్లయి ఇవ్వకుండా - ఎవరికీ సమాధానం చెప్పకుండా ఆలోచనలతోనే కాలయాపన చేస్తున్నాను.
    ఎంతకీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను.
    నాన్నగారిని అడిగితే "నీ యిష్టం" - అంటున్నారు.
    స్కాలర్ షిప్ అయితే మూడువందలే వస్తుంది. సినీ ఫీల్డులో నెలకి నాలుగయిదవకాశాలొస్తే చాలు - అంతకంటే ఎక్కువ సంపాదనే అందుకోవచ్చు. నాకు దైవభక్తి చాదస్తం కొంచెం ఎక్కువే! మా ఇంట్లో అందరికంటే ఎక్కువ పాళ్ళు చాదస్తం నాది. ఉపవాసాలు, మహానైవేద్యాలు మొదలైనవన్నీ చేస్తాను.

 Previous Page Next Page