Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 6

"అది కాదు ప్రియంవదా!"
"ఏది కాదు! మీకేం తెలియదు......మీరు ఊరుకొండి! అన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను" అని కొంగుతో కళ్ళు ఒత్తుకుంది ప్రియంవద.
"ఏం.......నేను మాత్రం ఆడదాన్ని కాదా? నాకు మాత్రం పిల్లాపాపా వుండాలని కోరిక వుండదా? వయసు మళ్ళిన వాడిని కట్టుకుని ఇప్పటికే చాలా కోల్పోయాను నేను. కడుపులో వున్న కళ్ళు తెరవని పసిగుడ్డుని చంపి పాతకిని కావడంకంటే నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం మేలు" అంది శోకాలు పెడుతూ.
గాభరాగా అటూ ఇటూ చూశాడు విశ్వనాధం. "ఉర్కో ప్రియంవదా...........ఊరుకో! నేను అలా ఏమీ అనలేదే!" అన్నాడు అనునయంగా నేప్ కిన్ తో ఆమె కన్నీరు తుడిచాడు . వెక్కిళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది ప్రియంవద.
గ్లాసులోకి మరికొంత విస్కీ ఓంపుకున్నాడు విశ్వనాధం. ఆమె మొహంలోకి చూడలేక, టీపాయ్ మీద వున్న ఒక మేగజైను చేతిలోకి తీసుకున్నాడు.
వెంటనే కమ్చితో కొట్టినట్లు అనిపించింది అతనికి.
ఆ పత్రిక కవర్ పేజీ మీద హరీన్ ఫోటో వుంది! హరీన్.........తన హరీన్! తన కొడుకు! తనను నిలదీస్తున్నట్లు సూటిగా చూస్తున్నాడు . హరీన్!
విశ్వనాధం కళ్ళల్లో పల్చటి నీటి పొర ఏర్పడింది.
"హరీన్!" అని మూలిగింది అతని హృదయం ఆర్తిగా. "హరీన్! నా హరీన్! ఎందుకు నాయనా నన్ను వదిలివెళ్ళి పోయావు? ఈ నాన్నని చూడాలని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నీకోపం  ఇంక ఎప్పటికి తగ్గదా నాయనా? ఎన్నాళ్ళు వేచి వుండాలి బాబూ నేను నీకోసం?"
వెంటనే చెళ్ళుమని చప్పుడు వినబడింది విశ్వనాధానికి.
ఉలిక్కిపడ్డాడు. ఆ దెబ్బ తను కొట్టిందే! సరిగ్గాపదేళ్ళ క్రితం తన చెయ్యి హరీన్ చెంపని తాకినప్పుడు వచ్చిందే ఆ చెళ్ళుమన్న శబ్దం!
ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గడిచినా ఈ రోజుకీ ఆ శబ్దం తన కర్ణపుటాలు పగిలిపోయేలా ఇంకా వినబడుతూనే వుంది.
తను కొట్టగానే బుసబుస పొంగింది హరీన్ చెంప. దానితో బాటే ఉప్పొంగింది అతని పసిమనసులో కసి.
ఆపుకోలేని క్రోధంతో తనని దహించేలా ఒక్క చూపు చూశాడు హరీన్. తర్వాత గిరుక్కున వెనక్కి తిరిగి, తన ఇంటి  గడపదాటి వెళ్ళిపోయాడు.
అంతే!
ఆ తర్వాత తన కొడుకు మొహం ఇనిమాల్లో , టీవిలో , పత్రికల్లో తప్ప చూడలేకపోయాడు తను!
హరీన్..........నా తండ్రి! నా నాన్న! నా కన్నా!
నిన్ను కొట్టిన ఈ చేతిని నరికేసుకోకుండా ఎందుకు ఉరుకుండిపోయాను నేను?
భర్త దృష్టి ఎక్కడుందో గమనించింది ప్రియంవద. భర్త మనసులో ఏం మేదులుతుందో చప్పున పసికట్టెసింది.
తక్షణం, చాలా లాఘవంగా విశ్వనాధం చేతిలో నుంచి మేగజైను లాగేసుకుంది ప్రియంవద. ఖాళీ అయిపోయిన అతని గ్లాసులో నిండుగా విస్కీ నింపింది మళ్ళీ.
వణుకుతున్న చేతులతో గ్లాసుని ఎత్తి పెదిమలకు అనించుకున్నాడు విశ్వనాధం.
"పత్రికను పక్కన పెట్టేసినంతమాత్రాన తన హరీన్ తన మనసులోంచి తొలగిపోతాడా? ఉత్త పిచ్చిది ఈ ప్రియంవద" అనుకున్నాడు అతను. "అసలు ఒక పత్రిక కనబడకుండా చేసినంత మాత్రాన లాభమేమిటి? ఏ పత్రిక చూసినా హరీన్ ఫొటోలే అయినప్పుడు?"
విషాదంగా గ్లాసు కింద పెట్టేసి, దినపత్రిక అందుకున్నాడు విశ్వనాధం.
మొదటి పేజీలోనే అతనికి కనబడింది హరీన్ ఫోటో.
దానికింద పెద్ద పెద్ద అక్షరాలతో ఒక వార్త.
"ప్రఖ్యాత సినీ హీరో హరీన్ దుర్మరణం!
అది చదివీ చదవగానే గుండెనొప్పి వచ్చింది విశ్వనాధానికి. గుండెని చేత్తో అదిమిపట్టుకుని కుర్చీలో వెనక్కి విరుచుకుపడిపోయాడు విశ్వనాధం.

                                                    6

వరదనీరు ముంచేసింది హరీన్ నీ, కరుణనీ కూడా. ఉపిరాడలేదు ఇద్దరికీ. ఉక్కిరిబిక్కిరయిపోయారు.
అప్పుడు హటాత్తుగా ఏదో చుట్టుకుంది హరీన్ ని. తడిమి చూశాడు అతను. అది ఒక వల. వరద రాకముందు ఎవరో జాలరి చేపలు పట్టడం కోసం నదిలో వలవేసి ఉండిఉంటాడు. వరదతో బాటు ఆ వల కొట్టుకొచ్చేసింది.
తక్షణం దాన్ని ఒడుపుగా ఒడిసిపట్టుకున్నాడు హరీన్. చాలా పెద్ద వల అది. వెంటనే వల వాళ్ళిద్దరి చుట్టూ లుంగలు లుంగలుగా చుట్టుకు పోయింది. హరీన్ కౌగిట్లో వున్నంత దగ్గరగా అతనికి హత్తుకుపోయింది కరుణ.
ఇంతలో ఒక్కసారిగా వాళ్ళని పైకెత్తేసింది వరదనీరు. తర్వాత ప్రచండవేగంతో వాళ్ళని జలపాతంలోకి నెట్టేసింది.
తేలికైన రబ్బరుబొమ్మల్లా జలపాతంతో బాటు కిందికి జారిపోయారు ఇద్దరూ. నీటిలోనే తలకిందులైపోయారు. పక్కకి ఆరిగారు .......దోర్లారు.
కింద రాతిబండలు వుంటాయి.
వాటిని తాకగానే తమ తలలు ముక్కలు చెక్కలయిపోతాయి.
ఇంకొద్ది క్షణాలు..........అంతే!
చటుక్కున ఎవరో తన షర్టుని పట్టుకు వెనక్కి లాగినట్లయింది హరీన్ కి. వరదనీరు ముందుకు సాగుతూ వాళ్ళని లాగుతోంది. కాని వెనక నుంచి ఎవరో బలంగా తమని గుంజుతున్నారు.
ఎవరు?
కొద్దిసేపటి తరువాత అర్ధం అయింది హరీన్ కి - జలపాతంతోపాటు కిందకు వచ్చేశారు తాము. ఆ పరిసర ప్రాంతాన్నంతటినీ ముంచేసింది వరద. ఆ లోయలో వుంది చిక్కటి అడవి. అడవి కూడా కొంత భాగం వరదలో మునిగిపోయింది. చెట్లపై నుంచి ప్రవహిస్తోంది వరదనీరు. అక్కడంతా బ్రహ్మాండమైన సరస్సులాగా వుంది.
తమని చుట్టుకున్న వల అదృష్టవశాత్తూ ఏదో చెట్టుకి తగులుకుంది. అందుకని అక్కడే ఆగిపోయారు తనూ కరుణా.
కానీ, ఈ తాళ్ళు తెగిపోకుండా ఎంతసేపు వుంటాయి? ఇంకెంతసేపు ఇలా తాము తమ ప్రాణాలను రక్షించుకొగలుగుతారు?
మృత్యుదేవతతో ముఖం ముఖిలాగా వుంది ఆ పరిస్థితి. చావుకీ, బతుక్కి మధ్య వున్న తేడా ఈ వలకి వున్న నైలాన్ దారాలు........అంతే!
నెమ్మదిగా చేతులు జాచాడు హరీన్. చుట్టుతా తడిమి చూశాడు. ఒక కొమ్మ తగిలింది అతని చేతికి. దాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. తర్వాత పాదాలు కదిలించాడు. ఇంకో కొమ్మ తగిలింది. దానిమీద భద్రంగా ఒక కాలు ఆనించాడు.
కొద్ది నిమిషాల క్రితం కంటే ఇప్పటి పరిస్థితి మెరుగ్గా వుంది. చేతికో ఆధారం, కాలికో ఆధారం.
థాంక్ గాడ్ - ఇప్పటికి ఈ మాత్రం ఆసరా చాలు.
కరుణ పట్టుదప్పి జారిపోకుండా ఆ అమ్మాయిని మరింత దగ్గరగా హత్తుకున్నాడు హరీన్. తర్వాత అన్నాడు ఆమెతో "ఈ వల మనల్ని చుట్టేసి మంచి పని చేసింది. లేకపొతే చెరో దిక్కుకి కొట్టుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వల చెట్టుకి తగులుకోవడం వల్ల కొట్టుకుపోకుండా ఆగాం."
"ఏమిటి?" అంది కరుణ.
జలపాతం హోరు లో ఒకరి మాటలు ఒకరికి సరిగా వినబడటం లేదు.
అదే మళ్ళీ పెద్దగా చెప్పాడు హరీన్.
"అవునవును" అంది కరుణ. తర్వాత భయంగా కళ్ళెత్తి జలపాతం వైపు చూసింది. నీరు అంత ఎత్తు నుంచి ఉదృతంగా కిందికి పడుతూ వుండటం వల్ల తుంపర్లు చాలా దూరం వరకూ పడుతూ అక్కడంతా పొగ వ్యాపించి వున్న భ్రాంతి కలుగజేస్తున్నాయి.
ఆ దృశ్యం చూడలేక భీతితో కళ్ళు మూసుకుంది కరుణ.
హరీన్ మాత్రం కళ్ళార్పకుండా జలపాతంవైపే చూస్తున్నాడు.
ఎంతసేపు ఇలా వుండగలుగుతాము? ఎంతసేపు?
అప్పుడు వున్నట్లుండి ఒక విషయం అతని గమనానికొచ్చింది.
ఇందాక గుండెలదాకా వున్న వరదనీరు ఇప్పుడతని నడుముదాకానే వస్తోంది.
అంటే...........అంటే.......వరద తగ్గుముఖం పడుతోందా?
ఉద్వేగంతో మళ్ళీ జలపాతం వైపు చూశాడు.
ఇందాక పడినంత నీరు పడటంలేదు. ఇప్పుడు ప్రవాహం మెల్లిమెల్లిగా పలచాబడుతోంది.
ఇది ఫ్లాష్ ఫ్లడ్! మెరుపులా వస్తుంది వరద. మళ్ళీ అంతే వేగంగా తగ్గిపోతుంది కూడా.
చూస్తుండగానే మోకాళ్ళదాకా దిగిపోయింది నీరు.

 Previous Page Next Page