"అయ్యో గురూజీ! మీ ఆర్టుని అమ్మాలనడం లేదండీ బాబూ! గుర్తింపు కోసం పంపాలనుకుంటున్నాను.
"కమర్షియల్ ఆర్టిస్టులు నా కళను గుర్తించే దశలో నేనున్నాననుకున్నారా? ఎవరూ గుర్తించకపొయినా పోలేదు. నేను వేసిన చిత్రాలు చెదలు తినేసినా ఫర్వాలేదు. ఆర్టుకి కొలబద్ద డబ్బుకాదు."
అభినవ్ అసలైన వ్యక్తిత్వం నెమ్మదిగా అర్థం కాసాగింది.
"ఆర్టుకి కొలబద్ద డబ్బు కాదుసరే. కనీసం డబ్బు అవసరం మీకు లేదంటారా?" సూటిగా అడుగుతున్న కావ్య మాటకు జవాబు చెప్పలేకపోయాడు అభినవ్. మళ్ళీ రెట్టించి అడిగింది కావ్య.
"చూడండి గురూజీ! రంగుల్ని రంగులుగానే, గీతాల్ని గీతలుగానే గుర్తించే సమాజం మనది. గొప్ప పెయింటింగ్ ను రోడ్డుమీద పెడితే ఆంజనేయ స్వామి బొమ్మకు చిల్లర వేసినట్టుగానే విసిరేసి వెళ్ళిపోతారు మనవాళ్ళు. అదే పెయింటింగ్ ని ఆర్ట్ గ్యాలరీలో పెడితే అందులో ఏదో వుందని పొగడడానికి ప్రయత్నిస్తారు. మీకో తమాషా చెప్పనా?" అతని కనుపాపల్లోకి చూస్తూ అడిగింది కావ్య.
"చెప్పండి,"
"ఓ గొప్ప ఆర్ట్ ఎగ్జిబిషన్ కి హై సొసైటీ జనం వచ్చార్ట. ఆ ఆర్టు ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేసిన హై సొసైటీకి చేమడిన వ్యక్తి వరసగా పెయింటింగ్స్ ని చూస్తూ ఒక పెయింటింగ్ ముందు నిలబడి నేను లండన్ గానీ, ఇటలీగానీ, రష్యాలోగానీ, అమెరికాలోగానీ ఎక్కడా యిలాంటి దాన్ని చూడలేదని పొగడ సాగాట్ట. పక్కనున్న వంది మాగథ జనం.... అవును సుమా! నిజం సుమా! అన్నట్టు చూడసాగారట!
అంతట్లో సదరు పెయింటింగ్ వేసిన ఆర్టిస్టు వ్యక్తి దగ్గరకొచ్చి పరిచయం చేసుకుని సారీ సర్! చిన్న మిస్టేక్. అని అడ్డంగా గోడకు వేలాడదీసిన ఆ చిత్రాన్ని తీసి నిలువుగా వేలాడదీసి ఈ పెయింటింగ్ వ్యూ పాయింట్ యిది అని చెప్పి వెళ్లిపోయాడట.
ఆ హై సొసైటీ జనాలకు తమ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలీలేదట" మంచి ఎక్స్ ప్రెషన్స్ తో అందంగా చెప్పింది కావ్య.
అభినవ్ మొట్టమొదటిసారి హాయిగా నవ్వడం గమనించింది కావ్య విరామంలేని ఆ నవ్వు వేపే అలా చూస్తూ ఒక్కక్షణం వుండిపోయింది కావ్య.
"గురూజీ! మీ నవ్వు బాగుంటుంది. మీరు నవ్వుతుంటే అందమైన పువ్వును చూస్తున్నట్టుంది."
కావాలనే కావ్య అభినవ్ ని పొగిడింది.
అలా ఒక ఆడపిల్ల తనెదురుగా కాంప్లిమెంట్ చెయ్యటం అదే మొదటిసారి. చిన్నగా సిగ్గుపడ్డాడు అభినవ్.
ఆ సిగ్గును కూడా గమనించింది కావ్య.
"మనిషిలో కల్మషం లేనప్పుడు మనిషి నవ్వే అందంగా పువ్వులా వుంటుందట. ఎక్కడో చదివాను" మళ్ళీ తనే అంది కావ్య.
"మిమ్మల్ని పెయింటింగ్ వెయ్యమనడం మీ చెల్లెలు నందిని ఆరోగ్యం కోసం, మీ కోసం కాదు. మీ చెల్లెలు కోసం మీ రూల్స్ అన్నీ కాసేపు పక్కన పెట్టలేరా" ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది దెబ్బ. రెండు నిమిషాలయ్యాక అడిగాడు అభినవ్.
"ప్రయిజ్ మనకొస్తుందంటారా?"
అది చాలు కావ్యకి. అభినవ్ కి తనవేపు తిప్పుకోడానికి ఎట్టకేలకు అతను వప్పుకోవడం, మంచి మూడ్ కోసం పాండిచ్చేరికి వెళ్ళటం జరిగిపోయింది.
* * *
సరిగ్గా తొమ్మిది నలభై నిమిషాలు......
కెనిటిక్ హోండాను పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో వున్న యాడ్ ఏజెన్సీ మెట్లెక్కుతోంది కావ్య.
లైట్ బ్లూ కుర్తా, పైజమా, పెదవులకు స్కిన్ కలరు లిప్ స్టిక్ ఐబ్రో పెన్సిల్ తో తీర్చిదిద్దిన కనుబొమలు. వరండా మీద నడిచొస్తూ యాడ్ ఏజెన్సీ లోకి అడుగుపెట్టబోయిన కావ్య విజిటర్స్ హాల్లో తలొంచుకుని కూర్చున్న అభినవ్ ని చూసి చిన్నగా విజిల వేసి-
"హల్లో గురూజీ! వాటే సర్ ప్రైజ్! చడీ చప్పుడు లేకుండా వచ్చేశారే. డోన్ట్ వర్రీ! మూడ్ రాకపోయినా ఫర్వాలేదు. పెయింటింగ్ వెయ్యక పొయినా ఫర్వాలేదు. ఈవెనింగ్ ఫ్లైట్ కి టిక్కెట్స్ బుక్ చేయించాను. సాయంత్రం లోపల మీకు మూడ్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను" హుషారుగా నవ్వుతూ అంది కావ్య.
"లేదండీ! పెయింటింగ్ వేశాను. రాత్రి టైన్లో" అమాయకంగా చెప్పి హేండ్ బ్యాగ్ లోంచి చుట్టలు చుట్టిన కేన్వాస్ ని బయటకు తీసి టీపాయ్ మీద పరిచాడు.
ఆ పెయింటింగ్ వేపు చూస్తూ అప్రతిభురాలై నిలబడిపోయింది కావ్య. గొప్ప మనుషులకు అద్బుతమైన పరిమళం వుంటుంది. వ్యక్తులకు, పుస్తకాలకు, కళకు అద్బుతమైన పరిమళం ఏమిటని తెలియనివాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోవడం సహజం.
ఆ పరిమళాన్ని ఆస్వాదించడానికి అద్భుతమైన హృదయ సంస్కారం కావాలి!
"ఈ పెయింటింగ్ మీరు ట్రైయిన్లో వేశారా?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"ఏం బాగోలేదా?"
"నేను పెయింటింగ్ ని పొగడగలను. పెయింటింగ్ లో వున్న గొప్పతనాన్ని గురించి చర్చించలేను."
ఆ పెయింటింగ్, ఆ పెయింటింగ్ లో అంతర్లీనంగా వున్న అద్భుతమైన భౌతిక దృష్టి, కలర్ కాంబినేషన్, ఏళ్ల తరబడి ఒక చిత్రకారుడు చిత్రించినట్టుగా వుందే తప్ప ట్రైన్లో వేసినట్టుగా లేదు. అద్భుతమైన సృష్టి జరగడానికి ఒకే ఒక క్షణం చాలు.
"గురూజీ! మనదే ఫస్ట్ ఫ్రైజ్. సాయంత్రం ఐదు గంటలకు మిమ్మల్ని మీ యింటి దగ్గర పికప్ చేసుకుంటాను."
"మనం ఢిల్లీలో ఎన్ని రోజులుంటాం?"
"నాలుగైదు రోజులు."
"అన్ని రోజులా" అతనిలో చెప్పుకోలేని ఆందోళన.
"ఏం?"
"నందిని ఇంట్లో వంటరిగా వుంటుంది" అసలు విషయం చెప్పాడు అభినవ్.
"ఇంట్లో మూడో వ్యక్తి అవసరం చాలా వుంది" అతని ఉంగరాల జుత్తు వేపు చూస్తూ నర్మగర్భంగా అన్నది కావ్య.
"కనీసం పనిమనిషినైనా పెట్టమని నందిని పోరుతోంది. నెలకో వంద రూపాయలు ఇవ్వందే పనిమనిషి రాదుగా" ఎప్పుడూ తన బాధలు బయటకు చెప్పుకోడు అభినవ్.