"వెళుతున్నారా?" దీనంగా అడిగింది. అతడు వెళ్ళే దెక్కడికో ఆమెకు తెలుసు. ఆమె అడిగే దేమిటో అతనికీ తెలుసు.
"తప్పదు" అన్నాడు.
మసక వెలుతురులో ఆమె నేత్రాంచలాల్లో ఉబికిన నీళ్ళు అతణ్ణి కలవర పెట్టాయి.
"రేపు కలుద్దాం." ఆలస్యమవుతుంటే వెళ్ళబోయాడు.
తల అడ్డంగా ఊపింది. "మీతో ఒక ముఖ్యవిషయం చెప్పాలి"
ఆగిపోయాడు. ఆమె అశ్రుపూరిత నయనాలకేసి చూశాడు ఏంటన్నట్టుగా.
"రేపు చెబుతాలెండి" తల వంచుకుంది.
మృదువుగా నవ్వేడు ఆమె తల నిమురుతూ.
ఆమె ఎవరో అతనికి తెలుసు. కాని, తననెందుకుకోరుకుందో అతనికి తెలీదు. ముప్పయ్యేళ్ళ బ్రహ్మచారి అయిన నట్వర్ సింగ్ తొలిసారి మానసికమయిన స్పందనికి గురయ్యాడు ఆమె సన్నిధిలోనే. ఒకనాడు అడవిలో తిరుగుతున్న వనకన్యలా దర్శనమిచ్చిందామె. మాటాడాలన్నంత తమకంతో అతడు ముందుకురాగానే, తొలి ఉషస్సూలా అతణ్ణి కదిలించిన ఆ కన్య మలిసంధ్యలా మాయమయ్యింది. వెర్రిచూపులు చూస్తున్న అతణ్ణి వాగు అంచున నిలబడి కిన్నెరసాని కిలకిలలతో మైమరపించింది.
క్రూరమృగాల వేటతో రాటుదేరిన సింగ్ మనసును తూటాతో పనిలేకుండా లొంగదీసుకుంది. మాటలతో కోటి జన్మల బంధాన్ని మూటగట్టింది. వాగులా అతణ్ణి పెనవేసుకుని జలపాతంగా మారింది. బంధం పెరిగాక, నర్మగంభీరమైన నదిలా నిశ్చలంగా పారుతూ అతణ్ణి కాపాడు కోవాలని అహర్నిశలూ ప్రయత్నిస్తోంది.
ఏదో చెప్పాలని పెదవి విప్పుతుంది. చెప్పలేక మరలిపోతుంది నిస్సహాయంగా ఆమె కంట తడిపెట్టుకోగానే ఆరాధనాభరితమైన ఆనంద భాష్పాలు అనుకుంటాడు తప్ప అంతకంటే మరో ముఖ్య విషయాన్ని ఆమె చెప్పలేక నలిగిపోతోందని ఏనాడూ గ్రహించలేదు.
'వీలయినంత త్వరగా ఈ ప్రాంతం విడిచి వెళ్ళండి; ఇంతకు మించి ఆమె ఏనాడూ అసలు రహస్యాన్ని విప్పి చెప్పలేక పోయింది.
"వెళ్ళనా?" అడిగాడు వెళ్తూనే.
"నేనూ రానా?"
తన దగ్గరికి రావటమే తెలిసిన నట్వర్ సింగ్ అనువుగాని వేళ రావడమేగాక, తనతోకూడా వస్తాననేసరికి విభ్రంగా చూశాడు.
"ఎప్పటికి తిరిగొస్తానో తెలీదు!"
అతని మాటలో ఏ అపశ్రుతి వినిపించిందోమరి _ "మీతోనే ఉంటాను" అంటూ బయలుదేరింది.
నచ్చచెప్పబోయాడు. వన్యమృగాలంటే భయంలేని తులసి వారించినా వినలేదు.
మరికొన్ని నిముషాలలో దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అప్పటికే చీకటి ఆవరించి చీకటి గుహలో అడుగు పెట్టినట్టుంది వారి పరిస్థితి. చప్పుడు చేయకుండా అంతకుముందు నిర్ణయించుకున్న మద్ది చెట్టును ఆమెతో సమీపించి, ఆమెను పైకెత్తి కొమ్మపై కూర్చోబెట్టాడు. రైఫిల్ ను టార్చిని ఆమె చేతి కందించి, సింగ్ కూడా చెట్టుపైకెక్కి గుబురుగాఉన్న కొమ్మల్లో కూర్చున్నాడు. ఓ గుడ్లగూబ టపటపాల రెక్కలు కొట్టుకుంటూ పైకెగిరింది.
ఫారెస్టు గార్డ్ తవిటయ్య తల్లి ఆరోగ్యం సరిలేదని వారంరోజుల క్రిందట ఊరు వెళ్లాడు. ఇప్పుడు అతనికి బదులు తులసికి అతని డ్యూటీ అప్పజెప్పాడు.
టార్చిని మాత్రం ఆమె చేతిలో వదిలి రైఫిల్ ను తను అందుకున్నాడు. టార్చిని ఎప్పుడు వెలిగించాలో ఆమెకు తెలుసు.
చీకటికి అలవాటైన సింగ్ కళ్ళకు అరవై గజాల దూరంలో సిరీస్ చెట్టును ఆనుకుని ఉన్న శవం అస్పష్టంగా కనిపిస్తోంది.
ఎత్తుగా ఎదిగిన చెట్లు భూతాలనీడల్లా భీతిని గొలుపుతూ రాకాసి లోయలో వున్నట్టుగా వుంది.
రేయి గడుస్తున్నా, పులి జాడలేదు.
చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం.
కళ్ళను మరింత చిట్లించి పరిసరాలను చాలా ఏకాగ్రతగా గమనిస్తున్నాడతను.
నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆకాశంలో తీతువు అరిచింది భయానకంగా ఉలికిపడిన తులసి గువ్వలా అతని గుండెలపై ముడుచుకుంది.
ఇంతలో ఏదో చప్పుడు నేలపైన....
పరిశీలనగా చూశాడు.
ఎంత దూరాన వున్న గాలిద్వారా శవం దుర్గంధాన్ని గుర్తించగల నక్కలు రెండు నిశ్శబ్దంగా వచ్చి శవం కాళ్ళు పీక్కుతింటున్నాయి. తులసి చూడలేనట్టు తల తిప్పుకుంది.
హఠాత్తుగా పరిసరాల్లోని నిశ్శబ్దం చెదిరి అడవిలో సంచలనం మొదలయింది. దూరంగా ఓ చెట్టుపైన వున్న లంగూర్ (ఓ రకమైన కోతి) కలవరపాటుతో కిచకిచమంది. గుట్టకు ఆవలి పక్కని ఓకణితి అరుస్తూ పరుగు తీసింది.
ఎండుటాకులు నలుగుతున్న చప్పుడికి నక్కలు ఊళలు వేస్తూ భీతిగా పొదల్లోకి దూరాయి.
పులివంటి క్రూరమృగాల రాకను సూచిస్తూ వేటగాళ్ళకు పరోక్షంగా సహకరించేవి ఈ కేరియన్ ఏనిమల్స్ (కుళ్ళిన మాంసాన్ని తినే మృగాలు).
బరువుగా అడుగులు వేస్తూ చీకటిలోంచి కదిలి వస్తున్నజంతువును పులిగా భవించిన సింగ్ రైఫిల్ మజిల్ ను పైకెత్తాడు.
మరికొన్ని సెకండ్ల వంవధిలో బలిష్టంగా వున్న ఓ ఆకారం శవాన్ని సమీపించి, మీద తుప్పల్ని పక్కకు జరిపి మాంసాన్ని చీల్చుతోంది.
టార్చి వెలిగించబోయిన తులసిని వారించాడు నట్వర్ సింగ్.
మాంసాన్ని చీల్చే పద్ధతినిబట్టి గ్రహించాడు అది దుమ్మలగొండని.
శవానికి సమీపంలో వుంటే కేరియన్ ఏనియల్స్ ని సైతం దరిచేరనివ్వదు పులి.
అర్దరాత్రి గడిచినా పులి వచ్చే సూచనలు కనిపించకపోయేసరికి అలసటగా కొమ్మకి జారిగిలబడి పోయాడు.
శవం పైనుంచి వచ్చే దుర్గందం భరింపశక్యంగాలేదు.
శవం చుట్టూ అడవి ఎలుకలు చేరి గాలిని మరింత దుర్గంధ భూయిష్టంగా మారుస్తున్నాయి.
అర్ధరాత్రి మొదలుకుని తెల్లవారు ఝామున సుమారు నాలుగు గంటల వరకూ అడవి పూర్తిగా సద్దుమణిగి ఉంటుంది. కారణం అడవిలో చిన్నా, పెద్దా అన్ని జంతువులూ విశ్రాంతి తీసుకొనే సమయం అది.
పులి ఇక రానట్టే అని నిర్ధారణ చేసుకున్న నట్వర్ సింగ్ చెట్టుపై నుంచి క్రిందికి దిగాడు. తులసితోపాటు నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు.
ఆమె సన్నిధిలో తనను తాను మరచిపోయే నట్వర్ సింగ్ ఆమెను పట్టుకుని నడుస్తూ తానెక్కడ వున్నదీ అన్న విషయం కూడా మరచిపోయాడు.
సాధారణమైన జంతువుల్ని వేటాడి పొట్టనింపుకునే పులికి, మనుష్యరక్తానికి అలవాటుపడ్డ మేనీటర్ కి గుణగణాలలో చాలా భేదమంటుందన్న విషయం నట్వరుసింగ్ కు తెలీనిది కాదు.
అనుభవమున్న వేటగాడిగా, వన్యమృగాల నడవడి గురించి క్షుణ్నంగా తెలిసిన ఫారెస్టు ఆఫీసరుగా నట్వరుసింగ్ ఆ క్షణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి మూల్యమెంత చెల్లించాల్సి వస్తుందో ఊహించి ఉండడు.
మూడువందల పౌన్ల బరువున్న ఆవుని నోట కరుచుకుని రెండువందల గజాల దూరం వరకూ సులభంగా లాక్కుపోగల మెడ శక్తిగల పులికి, అతి క్రూరమయిన అడవి పందిని ఒక్క పంజా దెబ్బతో రెండుగా చీల్చగల రాయల్ బెంగాల్ టైగర్ కి మనిషి ఓ లెక్కకాదు.