సుజా అదో మాదిరిగా నవ్వింది. "పొద్దుట జామచెట్టు మీద కాకి అరుస్తుంటే 'ఎవరో వస్తారే"అంది అమ్మ. అలాగే నువ్వు రావటం గమ్మత్తుగా ఉంది" అంది భోజనాలన్నీ ముగిసి తీరిగ్గా కూర్చుంటూ. పార్వతి రైలు దిగేసరికి రాత్రి తొమ్మిది దగ్గరైంది. పడకలకు సిద్దపడుతున్న వాళ్ళంతా సంతోషంగా , పార్వతీ చుట్టూ కబుర్లాడుగుతూ కూర్చున్నారు. కామేశ్వరమ్మ చాలా మారింది. ఎప్పటి లా తిరుగుతూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంది. తెలిసిన వాళ్ళకు ఆవిడ కళ్ళలో ఏవో ఆవేదన అలలు కనిపించక పోవు.
"నేను వెళ్ళి పడుకుంటానండీ!" అని సెలవు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి; చంటి బిడ్డ తల్లి.
"పిన్నిగారూ, మీరు కూడా పడుకో కూడదూ? పొద్దు పోయింది. " అంది పార్వతి కామేశ్వరమ్మ ను ఉద్దేశించి.
"అమ్మకి మాత్రలిచ్చి వస్తానుండు పార్వతీ!' అంటూ సుజా అలమారు లోంచి రెండు నిద్ర మాత్రలూ , గ్లాసుతో నీళ్ళూ తెచ్చి తల్లికిచ్చింది. కామేశ్వరమ్మ మాత్రలు మింగి లేచి, "కబుర్లు వేసుకు కూర్చోక మీరు కూడా పడుకోండి" అంటూ హెచ్చరించి వెళ్ళింది.
"నాన్నగారు పోయిన దగ్గర్నుంచీ అమ్మకీ నిద్ర మాత్రలు వేసుకోటం బాగా అలవాటై పోయింది, పార్వతీ! అవి వేసుకుంటేనే నిద్రే పోలేదు. నేనేరోజూ తీసి యిచ్చి అలమారు కి తాళం వేస్తూ ఉంటాను." అంది సుజా పార్వతి దగ్గర కూర్చుంటూ.
"పోనీలే. ఇలాగైనా కాస్త శాంతిగా నిద్ర పొతే అదే చాలు" అంది పార్వతి.
కాస్సేపు మాటలేమీ జరగలేదు. సుజా లేచి పక్కలు సర్దింది. "నీకు నిద్ర వచ్చేస్తోందా , పార్వతీ? పడుకుంటావా?"
పడుకోటానికేంలే. కాస్సేపు కూర్చో మాట్లాడుకుందాం. నువ్వా మధ్యేదో పెద్ద ఉత్తరం వ్రాశావు కదూ? ఎందుకింత చిత్రంగా వ్రాసిందా అని చాలా ఆలోచించాను. నాకేం తోచలేదు" అంది ఉపోద్ఘాతం లా.
సుజా మాట్లాడలేదు.
"చెప్పు సుజా! ఏమిటి విశేషాలు?"
సుజా ఏదో నిరాశ తో నవ్వినట్టు నవ్వింది. "ఏం విశేషాలున్నాయి, పార్వతీ?"
"అలాక్కాదు . నీ ఉత్తరం చూసి ఏమో అనుకున్నాను గానీ నిన్ను చూస్తె ఏదో విశేషం ఉండాలనే అనిపిస్తోంది . అవునా?"
సుజా మౌనంగానే ఊరుకుంది.
"నీ పెళ్ళి సంబంధాల మాటేమైంది?"
"ఏం చెప్పమంటావు , పార్వతీ! నీకేన్నో చెప్పుకోవాలనే ఇప్పటికీ నా మనస్సు తహతహ లాడుతోంది గానీ చెప్పుకుని మాత్రం ప్రయోజనం ఏమిటి? అనిపిస్తోంది కూడా. కాని, నా మనస్సు విప్పి చెప్పుకోవాలంటే నీతో గాక ఇంకెవరితో చెప్పుకుంటాను?" సుజా కంఠస్వరం భారమై మాటలు గాద్గిదికమయ్యాయి.
ఆశ్చర్యంగా చూసింది పార్వతి సుజా మొహంలోకి. "ఏమిటి, సుజా? ఎందుకంత బాధ పడుతున్నావు? నీ మాటలేమిటో నాకు కొత్తగా ఉన్నాయి. ఏమందసలు?"
సుజా కాస్సేపు ఊరుకుని అంది ; "ఎలా చెప్పాలో తోచటం లేదు, పార్వతీ! నాలా అక్కయ్య ఇంత కొట్టుకులాడి ఉండదు. ఇన్ని విధాల వెనకాముందు లాలోచించగలిగితే అంత సాహసం చేసి ఉండదు."
"సుజా!" విస్మయంగా చూస్తూ సుజా చెయ్యి పట్టుకుంది పార్వతి. "ఏమిటి?.... నువ్వు...."
సుజాత మాట్లడలేకపోయింది.
"నిజం చెప్పు, సుజా! నా దగ్గర జంకుతున్నావా? నిజంగా నువ్వేదేనా గొడవలో చిక్కు కున్నావా?"
"పార్వతీ!' నిస్పృహగా అంది సుజా. "తప్పంతా నాదే. మొట్టమొదటి ల్లోనే నన్ను నేను అదుపులో పెట్టుకోవలసింది. కఠినంగా మనస్సును మందలించుకోవలసినది. ఎందుకంత పిచ్చిదాన్నై పోయానో ఇప్పటికీ అర్ధం కావటం లేదు."
పార్వతి సుజా కళ్ళలోకి చూస్తూ అనునయంగా అడిగింది; "నాకు చెప్పవూ , సుజా?'
నీటి ఆవిరితో నిండిన కారు మబ్బులకు చల్లటి గాలి సోకి వర్షించినట్లు, నెలల తరబడీ భరించలేని వేదనతో భారమైపోయిన సుజా హృదయాన్ని ఆ లాలన ద్రవింప జేసింది. కళ్ళలో తిరుగుతున్న నీళ్ళు తుడుచుకుంటూ పార్వతికి సమీపంగా జరిగి కూర్చుంది.
* * * *
సుజా జీవితంలో చంద్రశేఖరం అడుగు పెడతాడని పార్వతి ఎలా అనుకుంటుంది? ముందు అది సంభవమే అంటే సుజా మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది?
జానకి స్నేహితురాలు వసుంధర పెళ్ళి నిర్ణయమైందని నెల్లాళ్ళ క్రిందటే ఉత్తరం వచ్చింది. ముహూర్తం నిర్ణయించాక కామేశ్వరమ్మ పేర కూడా శుభలేఖ పంపింది వసుంధర. వసుంధరకూ, జానకికీ ఉన్న స్నేహం చిన్ననాటిది మాత్రమే యినా ఆ అనురాగం చాలా చిత్రమైనది గా తోస్తుంది. చూసేవాళ్ళకు. కాలేజీ లో చేరి బి.ఎ పాసైన వసుంధర , ధర్డు ఫారం తోనే చదువు చాలించుకున్న జానకిని మాత్రం మరిచిపోలేదు. జానకి పెళ్ళిలో అంతా తనె అయి తిరిగింది. జానకితో పాటు అత్తవారింటికి కూడా వచ్చింది. ఉన్న నాలుగు రోజుల్లోనూ కామేశ్వరమ్మ ప్రేమాభిమానాలు పొంద గలిగింది విశేషం గానే.
అలాంటి వసుంధర తన పెళ్ళికి కామేశ్వరమ్మ ను కూడా రమ్మంటూ మరీ మరీ ప్రాధేయ పూర్వకంగా వ్రాసింది. స్నేహితురాలి పెళ్ళికి తాను బయల్దేరట మే కాకుండా ఆడబిడ్డను కూడా బయల్దేర దీస్తున్న కోడల్ని వారించలేక పోయింది కామేశ్వరమ్మ. వసుందర పెళ్ళికి ఎవ్వరూ వెళ్ళకపొతే నొచ్చుకుంటుందేమోనన్న శంకే కామేశ్వరమ్మ ను మరేమీ ఆలోచించనివ్వలేదు. విజయశాస్త్రి ని కూడా బయల్దేరమని జానకి అడిగితె ఏవేవో కేసులూ, వ్యవహారాలూ అప్పజెప్పబోయాడు.
మొత్తంగా వసుంధర పెళ్ళికి వదినా ఆడబిడ్డల ప్రయాణం మాత్రం ఖాయమైంది.
సుజా కాలేజీ మానివేశాక బయటికి వెళ్ళటమే అరుదు. చుట్టాలిళ్ళకు , బంధువు లిళ్ళకు రాకపోకలేనాడో బందయ్యాయి. చాలా కాలం తర్వాత అంత దూర ప్రయాణం సుజా కేదో భయంభయంగా తోచింది.
మండు వేసవి లో పెళ్ళిళ్ళ రోజుల్లో రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో అలాగే జరిగిందా ప్రయాణం. "హాయిగా ఇంట్లో ఉండవలసిన దాన్నిలా లాక్కు వచ్చావ్ . వెధవ రైళ్ళు. నిలబడ్డానికి కూడా చోటు లేదు" అంటూ ఎప్పటి కప్పుడు వదిన గారి మీద విసుక్కుంటూనే ఉంది సుజాత.
"ఏమిటంత సున్నితం నీకు? ఇంత శ్రమపడి ప్రయాణం చేయకపోతే ఈ అనుభవం ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉండి చస్తుంది? ఫర్వాలేదు లే . అలా కిటికీ వారకు నించో." స్నేహితురాలి పెళ్ళికి బయల్దేరాలని అనుకున్నప్పట్నుంచీ జానకి హుషారుగానే ఉంది.
మూతి ముడుచుకు కిటికీ దగ్గరగా నించుంది సుజాత. పెళ్ళి పెద్దల్ని ఆహ్వానించి తీసు కెళ్ళటానికి స్టేషన్ కు వచ్చాడు చంద్ర శేఖరం; వసుంధర అన్నగారు. జానకి కూడా చంద్ర శేఖరాన్ని అన్నయ్యా అంటూ పిలుస్తుంది చిన్నతనం నుంచీ. "ఈవిడ మా ఆడబిడ్డ. పేరు సుజాత. పేరులాగా తనూ అందంగా ఉంటుందని మహా గర్వం లే" అంటూ చిలిపిగా పరిచయం చేసింది ఇద్దరికీ.
సుజా వదిన గారి కేసి కోపంగా చూస్తుంటే నవ్వుతూ అన్నాడు చంద్ర శేఖరం -- "అందంగా ఉండేవాళ్ళు గర్వపడటం సహజమేగా, జానకీ!" అని.
సుజాకు నిజంగానే కోపం వచ్చింది. సామానంతా జట్కా లో వేయిస్తుంటే మొహం తిప్పుకు నించుంది.
"మీ ప్రయాణం సుఖంగా జరిగిందా, అమ్మా?" బండి వెనక నడుస్తూ పరామర్శించాడు చంద్రశేఖరం, జానకిని ఉద్దేశించి.
"అ అంతా బాగానే అయింది. ఈవిడ గారి సణుగుడు మాత్రం భరించలేక చచ్చాను. చూడన్నయ్యా! అసలే పెళ్ళిళ్ళ రోజులు. రైళ్ళు రద్దీగా ఉంటాయి కదా? ఏదో కాస్త చోటు చూసి ఈవిణ్ణి మట్టుకు కూర్చో బెట్టాను. నేనలా నిలువు కాళ్ళ మీద నిలబడే ఉన్నాను. తనకి పడుకోవటానికి కూడా చోటు కావాలంటుంది పెద్ద మనిషి. ఏం చెయ్యాలంటావ్?"
జానకి ఆడబిడ్డను ఎడిపిస్తుందన్న విషయం గ్రహించగలిగిన చంద్రశేఖరం అతి సహజంగా అన్నాడు. "సుకుమారంగా ఉండే వాళ్ళని అంత బాధ్యతా యుతంగా తీసుకు రావాలని తెలీదే,మిటి నీకు? నీ పీనాసితనం కాకపొతే ఆ ధర్డు క్లాసు ప్రయాణ మేం ఖర్మ?"
సుజా చురుగ్గా చూసింది. "చేప్పేవాళ్ళకి చాదస్తమైతే వినే వాళ్ళకి వివేకం ఉండాలంటారు." అంది ఘాటుగా.