Previous Page Next Page 
స్త్రీ పేజి 43

 

    నిట్టూర్చింది పార్వతి నిశ్శబ్దంగా. ఓపిక కూడగట్టుకుంటూ తిరిగి ప్రారంభించింది. "రుక్కూ! పెద్దా చిన్నా ఎంచకుండా నీ ధోరణి నీదే అంటే బావుండదు మరి. అత్తయ్య ఎందుకైనా మందలిస్తుందే అనుకో. ఏదో పెద్దది మన మేలు కోరే చెప్తుంది. తను అనవచ్చు. మనం పడావచ్చు. అంత మాత్రాన ఏం పోతుంది? మాటలు పది మాటలు అప్పగించేస్తే గొప్పవస్తుందా? అత్తా కోడళ్ళంటే తల్లీ బిడ్డలాగే మెలగాలి గానీ, రాద్దంతాలు పడుతోంటే ఎవరికేం బాగుటుంది? ఇంట్లో ఇలాంటి గొడవలు చూస్తోంటే తిరిగి తిరిగి ఇంటికి చేరే మగవాడికి ఎంత విసుగ్గా ఉంటుందో ఆలోచించావా?"
    రుక్కు వెనక్కు మొహం తిప్పి చిక్కులు విప్పుతున్న పార్వతి కేసి చిత్రంగా చూసింది. తనకేదో బోధించటానికే అక్కగారు పూను కున్నట్టు పసి గట్టేసింది.
    'అయితే ఎవరు చెప్పారేమిటి ఈ కబుర్లన్నీ?"
    కంగారు పడింది పార్వతి. "ఎవరు చెప్పటం ఏమిటి? నే చూస్తూనే ఉన్నాగా? అత్తయ్యా , నువ్వూ మాట్లాడుకోవటం లేదు. అదేమే? అని అడిగితె నువ్వేదో అన్నావు. ఆ మాట మీద నా ఉద్దేశ్యం చెప్తున్నాను."
    "కాదులే. నీకా పెద్దమనిషే నూరిపోసి ఉంటుంది. చూశావా కుక్క బుద్దులు?"
    "రుక్కూ!" కోపంగా చూసింది పార్వతి. రుక్కు ధోరణికి అణుచుకోలేనంత అసహ్యం కలిగింది. తీక్షణంగానే అంది: "పోనీ , ఎవరు చెప్తే నీకేం? నువ్వు కాస్త బుద్దిగా బ్రతకరాదూ? ఉన్నమాటే గానీ లేని వేప్పుడూ కల్పించి చెప్పలేరుగా? చిన్న తనం లోనే తల్లిని పోగొట్టుకుని ఎలాగూ కష్టాలనుభావించాం. అత్తయ్య కాబట్టే కానీ కట్నం అడగకుండా కడుపులో పడేసుకుంది. చేసిన మేలు మరిచి పోయే మనుషులకీ పశువు కీ భేదం ఏమిటి? శకుంతల వస్తే నానా గొడవలూ పెట్టావట . ఏం? ఎవరి పుట్టింటి ఆశ వాళ్ళకి ఉండదూ? దాన్నంత ఏడిపించి పంపటానికి నీకేం ధర్మ మనిపించింది? నిండా మునిగిన తర్వాత చలేమిటని మీ యింటి విషయాలన్నీ నాకు తెలిశాయి. ఇప్పుడిక దాపరికం ఎందుకూ? నువ్విలా పోయిన పొడుగునా కయ్యాలు పెట్టుకుంటూ కూర్చుంటే రామం కాస్తా మనస్సు విరక్తి పెట్టుకుని  ఎటో పోయేలా ఉన్నాడు.  తర్వాత నెత్తీ నోరు బాదుకుని ఎడుద్దాం ఇద్దరం కలిసి."
    రుక్మిణి కోపం అవధులు దాటిపోయింది. అక్కగారితో చెప్పి తన నిలా చివాట్లు పెట్టించటం, తగుదునమ్మా అంటూ ఈవిడిలా నీతులు చెప్పరావటం -- ఇదంతా అందరూ కలిసి చేసిన గూడు పుఠాణి అన్నమాట.
    "పదిమందిలోనూ మంచి అనిపించుకుని బ్రతకటం గొప్పతనం కానీ చెడ్డ పేరు వేసుకోవటానికెంత కావాలి? ఇంట్లో వాళ్ళంతా ఉసూరు మని ఏడుస్తుంటే నోరు పెట్టుకు బ్రతకటం నీకు మాత్రం ఏం సుఖం?"
    "అక్కయ్యా!' నిర్మొహమాటంగా అనేసింది రుక్మిణి. "నువ్వేదో నన్ను తల్లి తర్వాత తల్లిగా నిర్వాకం చేస్తా వనుకున్నాను గానీ ఇలా లేనిపోని కబుర్లు విని చివాట్లు వెయ్యటానికే బయల్దేరి వస్తావను కోలేదు. ఎవరింట్లో వాళ్ళకి సవాలక్ష గొడవ లుంటాయి. సంసారాల్లో కష్టసుఖాలు నీకెలా తెలిస్తాయి? పసిదాన్ని బెదిరించినట్టే బెదిరించాలను కున్నావు కాబోలు. ఎవరి వ్యవహారాలూ వాళ్ళే చక్కదిద్దు కుంటే బాగా ఉంటుంది."
    విభ్రాంతి తో చాలాసేపు మాట్లాడలేకపోయింది పార్వతి. "నీ మంచి చెడ్డలు ఆలోచించటానికి నేను తగనా , రుక్కూ?"
    "నువ్వంత కష్టపడి నా మంచి చేడ్డలెం ఆలోచించక్కర్లేదులే. నేనేం పారాడుతున్నానా? పాలు తాగుతున్నానా? అయినా నేనేమంత  కాని పనులు చేస్తున్నానని అడగవచ్చావు?"
    పార్వతి సిగ్గుతో దించిన తల ఎత్తుకోలేక పోయింది. రుక్కు ఇంత నిరభిమానంగా మాట్లాడుతుందని అనుకుని ఉంటె తానీ సాహసానికి పూనుకునేది కాదు. అవును. తనేవరు మధ్య? వాళ్ళ సంసారాన్ని చక్క దిద్దబోవటానికి తనకున్న తాహతేమిటి? ఎంత చెల్లెలై తే మాత్రం విమర్శిస్తే ఊరుకుంటుందని తనెందుకనుకోవాలి?"
    ఆ రాత్రే కాదు, మర్నాడు కూడా సరిగ్గా మాట్లాడనే లేదు రుక్మిణి అక్కగారితో. తను సాధించిన ప్రయోజనం గురించి మరిది అడుగుతాడేమో నని పార్వతి తప్పుకు తప్పుకునే తిరిగింది. చివరికి రామం ఎదుట పడక తప్పనే లేదు. బాబి గాడేవో వచ్చీ రాని మాటలు చెబుతుంటే పకపకా నవ్వుతూ కూర్చున్న రామం ఒక్కడూ కూర్చోక, 'వదినా! ఒక్కసారిలా వస్తావూ? వీడేలా కబుర్లు చెప్తున్నాడో విను. నవ్వలేక కడుపు చక్క లౌతోంది." అంటూ పిలిచాడు. రెండు మూడు పిలుపులు వినిపించుకోక పోయినా నాలుగో సారి లేచి వెళ్ళక తప్పలేదు. తప్పు తప్పులుగా సినిమా పాటేదో పాడుతున్న బాబి గాణ్ణి చూస్తూ పార్వతి కూడా నవ్వకుండా ఉండలేక పోయింది. "వెర్రి వెధవా! ఇప్పట్నుంచీ నీకు సినిమా పాటలు కూడానా? వేలెడు లేవు" అంటూ చటుక్కున దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. "ఈ వెధవ పాటలూ అవీ నేర్చు కోకపోతే ఎంచక్కా పాఠాలు చదువుకో రాదూ? నీకు ఆ ఆలు వచ్చునా? నాతొ వచ్చేస్తావా , నీకు బాగా చదువు చెప్తాను" అంటూ వాణ్ణి మాట్లాడిస్తూ జవాబులు విని నవ్వుకుంటూ కూర్చుంది.
    "ఒరేయ్ కోతి వెధవా! నిన్నెన్నిసార్లు పిలిచానురా? ఇంట్లో మాటా పలుకూ వినిపించుకోకుండా ఏవిటా వికవికలు?" ఈదురు గాలిలా వచ్చిన రుక్మిణి కొడుకు చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చు కేల్తూ , "ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పటానికి తయ్యారవ్వగా లేనిది ఎవరి లోపాలు వాళ్ళ కెందుకు తెలీవో? ఎవరేనా చూస్తె ముక్కు మీద వేలేసు కుంటారన్న జ్ఞానమైనా ఉండద్దూ? పైకి అందరూ బుద్ది మంతులే!" అంటూ అంత విసురుగానూ లోపలికి వెళ్ళిపోయింది. గుక్క పట్టి ఏడుస్తున్న బాబిగాడి వీపు మీద చెళ్ళు చెళ్ళున వేస్తూ , "నోరు ముయ్యవేంరా? ఎందుకా ఏడుపు ? ఇప్పటిదాకా కోతిలా ఆదావుగా?" అంటూ పెద్ద నోరుతో వాణ్ణి కేకలేయ్యటం మొదలెట్టింది.
    నిశ్చేష్టురాలై కూర్చుండి పోయిన పార్వతి కొంతసేపటి కి నోరు పెగుల్చుకుని లేచింది. "నేను సాయంత్రం బండికి వెళ్తాను, రామం."
    రామం మాట్లాడలేదు. ఆ మౌనం తోనే బయటికి వెళ్ళిపోయాడు. పార్వతి గబగబా సంచీ సర్దుకుంది. జుట్టు పై పైన దువ్వుకుని కాస్త మొహం కడుక్కుంది. సంచీ చేతిలోకి తీసుకు వంటింటి కేసి వెళ్ళింది. "రుక్కూ! నేను వెళ్తున్నానే!"
    "ఎక్కడికీ? ఇంటికే?" ఆశ్చర్యంగా అడుగుతూ లేచి వచ్చింది రుక్కు. "ఏం, అంత కంగారుగా బయల్దేరావు?"
    "కంగారు కేముంది? సెలవై పోతోంది. ఎలాగూ వెళ్ళాలి." అంతకన్నా మరేం మాట్లాడలేదు పార్వతి. "అత్తా! వెళ్ళొస్తానత్తా!"
    శాంతమ్మ కనుగుడ్లు ఒత్తుకుంటూ వెనకే నడిచి రోడ్డు వరకూ వచ్చింది. పార్వతి చటుక్కున శాంతమ్మ చెయ్యి పట్టుకుంది. "అత్తా! నీకేం చెప్పాలో నాకు తెలీటం లేదు. ఇలా అందర్నీ దూరం చేసుకుని అది ఎలా బ్రతుకుతుందో అర్ధం కావటం లేదు. తల్లివైనా అత్త వైనా నువ్వే. ఇంతకన్నా ఎక్కువేం చెప్పను?"
    "వెళ్ళిరా , అమ్మా! వెళ్ళగానే ఉత్తరం వ్రాయి. ఏ బెంగా పెట్టుకోకు."
    "నా సంగతికేమిలే, అత్తా! వాళ్ళిద్దరూ గొడవలు పడకుండా చూడు. నువ్వున్నావన్న ధైర్యంతోనే వెళ్తాను. పిల్లవాణ్ణి జాగ్రత్తగా..... వెళ్తాను."
    భుజం మీదుగా కొంగు లాక్కుని తల దించుకు గబగబా నడిచింది పార్వతి.

 Previous Page Next Page