నాన్న అన్నది నిజమే ముందు వద్దనుకున్నా మహారాజశ్రీ సుబ్బారావుగారు ఈ మధ్య ఎందుకో మరీ మరీ గుర్తొస్తున్నారు.
.... .... ....
ఈ రోజే ఆ ఊరి నుంచి ముహూర్తం కోసం ఎవరో వార్త తీసుకొచ్చారు. అతడు వెళుతూంటే "నీక్కాబోయే ఆయనకి ఏదైనా కబురు పంపిస్తావా అమ్మా?" అడిగాడు నాన్న అందరూ నవ్వారు సిగ్గుతో లోపలికి పరుగెత్తాను. ఏమని కబురు పంపను?
నువ్వు వచ్చే దారంతా-
ప్రతి గడ్డి పరక చివరా దీపాలు వెలిగించి
నీ గురించి చూస్తూ వుంటాను మిత్రమా
రా వచ్చెయ్యి.
పచ్చిక కొసళ్ళు నీ లేలేత పాదాల్ని
కఠినంగా చీలుస్తాయేమోనని
నా రక్తంతో మెత్తగా అద్ది వుంచాను.
రా మిత్రమా... వచ్చెయ్యి...
నాకేం సిగ్గుగా లేదు తిరిగి చదువుకుంటూంటే నవ్వు కూడా రావటంలేదు. ఏం తప్పేమిటమ్మా? ఒక చిన్న ఇంటిని మేం యిద్దరం కూడి కట్టుకుంటాం డానికి నేను రాణిని, అతడు రాజు! ఎన్నో చర్చిస్తాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం నవ్వుకుంటాం మీకెందుకు?
14జ్యేష్టము
ఏమిటిది - ఏం జరిగింది?
నా జీవితంలో గ్రీష్మం ఎందుకింత తీవ్రంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవేశించింది?
ఎన్ననుకున్నాను? ఎన్ని వూహించుకున్నాను?
పెళ్ళయిన యిన్నేళ్ళ తరువాత మళ్ళీ వెనుదిరిగి చూసుకుంటే సాధించిందేమిటి? కారులు, కిరులు, కాసరములు యెండకి తాళలేక బురదలో పొర్లినట్లు పాత జ్ఞాపకాలు మాత్రం మిగిలినవి.
ఎందుకిలా జరుగుతూంది? మేమిద్దరం ఒక్కసారయినా కూర్చుని మా మనసులో ఏముందో ఒకరికొకరం ఎందుకు చెప్పుకోము? ఏదో యిబ్బందిగా వుంటుంది. మనసుకు సంబంధించిన ఇబ్బంది. రోజులు నిస్సారంగా గడిచిపోతున్న భావన లేవడం - వండుకోవడం - తినడం - ఇంతేనా? .... బహుశ! నేను ఎక్కువగా వూహించుకొన్నానేమో? లేదు లేదు ఏం? ఒక చిన్న పొదరింటిని అందంగా నిర్మించుకోవడంలో తప్పేముంది? ఇతడెందుకు నాతో సహకరించడు? ఏ మధ్య ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు కూడా. యాంత్రికమైన జీవితం నుండి బయటపడటం అంటే వ్యసనానికి అంకిత మవడమూ...! ఇందులో నా తప్పేం వుంది? స్త్రీలో ఆనందం దొరకని మొగవాడు మరో అలవాటులో ఆనందాన్ని వెతుక్కుంటాడట. నేనేం చేస్తే నా తప్పేమీ వుండకుండా వుంటుంది?
మేమిద్దరం కలిసి బయటకు వెళ్ళి ఎంతకాలమయ్యింది? అంత వరకూ యెందుకు? ఒక అణా మల్లెపూలు ఆయనంతట ఆయన కొని తెచ్చి ఎంతకాలమయ్యింది?
ఇక్కడ సమస్య మల్లెపూలూ, కొని తేవడం - ఇదికాదు. నువ్వు నాకు బయటకూడా జ్ఞాపకం వున్నావు సుమా! అన్న విషయాన్ని సున్నితంగా ప్రకటించడం. ఎప్పుడూ రాయిలా వుండే దేవుడు ఒక్కరోజు హఠాత్తుగా ఓ గుప్పెడు మల్లెపూలు ఇంటికి పట్టుకొస్తే నిశ్చయంగా ఆ రాత్రి మనసులోని కోరిక విజ్రుంభించదా! ఇంత చిన్న విషయం తెలుసుకోడెందుకు మొగవాడు? పైగా నీకేం తెలీదంటాడు - తనకు మహా తెలిసినట్లు.
నాకు ఒకటనిపిస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లలు ఉమ్మడి కుటుంబాల్లో కోడళ్ళు అయ్యేవారు. ఊపిరి సలపని పనితో సతమతమయ్యేవారు. ఆలోచనకే తీరిక వుండేదికాదు. ఇప్పుడు స్వంత కాపురాలు వచ్చాయి. ఇరవై ఏళ్ళు వచ్చేవరకూ చదువు, చదువు పూర్తయ్యాక పెళ్ళి.... పిల్లలూ.... వాళ్ళకు ఎనిమిది, పది సంవత్సరాలు వచ్చేవరకూ హడావుడి, ఆ తర్వాత ఒక్కసారిగా దొరికే "తీరిక" ఈ తీరిక అత్యంత ప్రమాదకరమైందనుకుంటాను. అప్పటివరకూ జలపాతంలా ప్రవహించిన జీవితం ఏమీ తోచనట్లు ఆగిపోతుంది.
నిజమేనా! నిజంగా ఇదేనా! ఇదే సమస్య అయితే ఒక చక్కటి చిత్రం గీస్తే సమయం గడిచిపోతుందే...! అక్కడ సమస్య ప్రేమ, అభిమానం వీటి గురించి....
29 కార్తీకము
ఈ మధ్య నాన్న మాటిమాటికీ గుర్తొస్తున్నాడు. ఈ ప్రపంచంలో యిమడలేక వెళ్ళిపోయిన నాన్న. రవ్వంత ప్రేమకోసం అలమటించిపోయిన నాన్న. నాకొక కొడుకు పుడితే వాడికి నాన్న పేరు పెట్టుకోను. పేరు కాదు ముఖ్యం. నాన్నలా తయారుచేయాలి. తరువాత కోడల్ని దగ్గిర కూర్చోపెట్టుకుని వాడి అలవాట్లేమిటో, అభిరుచులేమిటో చెప్తాను. అర్ధం చేసుకోవడంలో ఎంత ఆనందముందో కళ్ళారా చూపిస్తాను. (ఇదేమిటి... అప్పుడే నాలో వృద్దాప్యపు ఆలోచనలు వస్తున్నాయి?)
ఒక విషయం అర్ధమౌతోంది. నాన్నకి ప్రేమ యివ్వలేని అమ్మ నా నుంచి ప్రేమని తీసుకోలేని నా భర్తా, అంతా కలసి నన్ను భవిష్యత్తులో మిగిలి వున్న ఒకే ఒక ఆశ (సంతానం) వైపు ఆలోచించేలా చేస్తున్నారు అనుకుంటాను. అవును! అదే నిజం లేకపోతే ఈ నిస్సారమయిన జీవితం గురించి ఇంత ఎక్కువగా ఏ మధ్య ఆలోచనలు చెలరేగవు.
16 వైశాఖము
కొత్త ఇంటికి మారి ఒకరోజు అయింది. చాలా గమ్మత్తయిన కుటుంబం తండ్రి ఒక భాగంలో, ఇద్దరు కొడుకులూ చెరో భాగంలో.....
ఇల్లు బాగానే వుంది. నాలుగిళ్ళ లోగిలి, వెనుక పెరడు.
ఇల్లు సర్దుకోవటానికి గంట పట్టింది. పెద్దగా సామానులు ఏమున్నాయని? ఈ లోపులో అయిదు నిముషాలపాటు వర్షం వచ్చి వెలిసింది.
శరదృతువు వస్తూందంటేనే ప్రకృతి అంతా ఒక అద్భుతమైన అనుభవంకోసం ఎదురుచూస్తున్నట్టుంటుంది. చక్రవాకాలు, నిర్మలాకాశం, తెల్లమేఘాలు, వెగిసపూలు, కాంచన కుసుమాలు, మంకెనలు....అందుకేనేమో" శారదారాత్రులజ్వల లసత్తారక హార పంక్తులు" అన్నాడు నన్నయ్య. నాన్న వున్నప్పుడు వెన్నెల్లో కార్తీక భోజనాల కెళ్ళేవాళ్ళం. మనిషికీ మనిషికీ మధ్య....వాళ్ళెంత ఆత్మీయులైనా కానీ అనుబంధాన్ని పెంచేవి యివే! కోడలు, అల్లుడూ, పెద్దత్తా - ఎవరయినా సరే, అందరూ కలిసి పోవడానికే కదా ఈ కార్తీక భోజనాలు, శ్రావణమాస నోములూ.....కాలం క్రమక్రమంగా కొండ చిలువలా సాంప్రదాయాన్ని మింగేస్తూంది.
ఇల్లు సర్దుకున్నాక ఏం చేయాలో తోచలేదు. చుట్టుపక్కల వాళ్ళంతా కొత్త శ్రీహర్ష నైషధం మరోమారు చదివాను. పక్కమీద వెల్లకిలా పడుకుని గుండెలమీద అంత పెద్ద పుస్తకం పెట్టుకుని చదవడం (అందులోనూ శ్రీహర్ష నైషధం) చిలిపి అనుభవం!
నలుడికీ, దమయంతికీ మధ్య "సిగ్గు" అనే నది ప్రవహిస్తూ వుందట. అతడిని చేరాలంటే ఆమె దాన్ని దాటక తప్పలేదు. ఏం చేస్తుంది పాపం? ఈత రానివాడు కుండలను కట్టుకుని నదిని దాటినట్లు - తన రొమ్ములందు యౌవనంవల్ల నూతనంగా యేర్పడుతున్న కుంభముల జంట సాయముతో లజ్జ అనే నదీ మార్గాన్ని దాటి అతడి హృదయ సామ్రాజ్యాన్ని అధిష్టించిందట. ఎంత గొప్ప పోలిక? ఎంతో సునిశితమయిన పరిశీలనా దృష్టి, ఊహ వుంటే కాని ఈ వర్ణన చేయడం కవికి సాధ్యం కాదు. సాహితీ ప్రపంచంలో ఇంకా మరొక ఒక శ్రీహర్షుడు, ఒక శ్రీనాథుడు ఎందుకు పుట్టలేదు?
17 వైశాఖము
కొత్త ఇంటిలో చేరి ఒకరోజు గడిచింది. ఈ రోజు ప్రారంభమే అదోలా వుంది. ఏదో జరగబోతూందని మనసు పదే పదే చెబుతూంది. ఏం జరుగుతుంది? అవే మేఘాలు, అదే ఆకాశం! ఇంకేం జరిగుతుంది? ఆయన తొందరగా ఇంటికి వస్తారా? లేక ఆలస్యంగా వచ్చినా ఆనందంగా వచ్చి 'ఈ రోజు పేకాటలో చాలా డబ్బు వచ్చింది. రేపు ఎటన్నా బయటకు వెళదాం' అంటారా! రెండింటిలోనూ అద్భుతమైన ఆనందం ఏదీ లేదే! మనిషి ఆనందానికీ, విచారానికీ కారణం పేకాటలో గెలవడం, ఓడటం లాంటి చిన్న విషయాలవడం ఎంత దురదృష్టం.
అయినా ఏదో జరగాబోతూంది! మనసు పదే పదే చెబుతూంది.
అనుకున్నట్లే జరిగింది.
అతడిని చూశాను.
ఆ కుర్రవాడు -
ఆకాశం మీద నుంచి దేవతలు సముద్రంలోకి తాడుకట్టి అమృతాన్ని పైకి లాగుతూంటే వచ్చిన చంద్రుడిలా వున్నాడు. కానీ ఆ లేత కళ్ళలో ఏదో ఆర్తి స్పష్టంగా కనిపించింది ఎందుకో!
.......
అనుమానం నిజమైంది.
మాట వరుసకి నత్తి గురించిన కథ చెపుతే రాత్రంతా మేల్కొని దాన్ని సాధన చేసినట్లున్నాడు. అశువుగా పద్యం చెప్పాడు. వెన్నెల్లో అతడలా నిలబడి పద్యం చెపుతూంటే ఎందుకో తెలీదుగానీ నాన్న గుర్తొచ్చాడు. సందేహం లేదు. ఇతగాడో విజ్ఞానఖని. కానీ ఎందుకో పట్టాలు తప్పుతున్న బండిలా తోస్తూంది. ఎవరో కవి అన్నాడు - 'ఇది వరకు లోకం మీద రోషంతో కూడిన యేదో వాంఛ వుండేది. ఇప్పుడు దానిమీద కూడా నిరాసక్తత' అని....అతడి స్థితి కూడా అలానే వున్నట్టుంది. ఆ కళ్ళలో సంపూర్ణమైన విజ్ఞానంతోపాటూ లీలగా, ఇప్పుడిప్పుడే తయారవుతున్న నిర్లక్ష్యం, ఈ ప్రపంచం పట్ల రాక్షసత్వం తొంగిచూస్తున్నాయి. అవే పెరుగుతే ఎంత కష్టం! ఆఁ! ఇప్పుడు గుర్తొచ్చింది. నాన్న పోయిన కొత్తలో నా అనేవారు లేక, వున్నవారెవ్వరూ మనసుకి దగ్గరకాలేక, నాకూ ప్రపంచం ఇంత నిరాసక్తంగానే తోచింది. ఒంటరితనం ఎంత భయంకరమైనది! ఎడారిలో ప్రయాణం చేసే ఒంటరి వాడికి ఒంటె కూడా స్నేహితుడవుతుందట! ఆ మాటలలో ఎంత అర్ధముంది! ఇతగాడికి అందరూ వున్నారే. అయినా ఎందుకింత ఒంటరితనం?