Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 42

   

        సుబ్బారావు గోడమీద నీళ్ళు జల్లుతూ "దొంగనాయాలు. నేను ఈ రోజు తొందరగా రాబట్టి సరిపోయింది. లేకపోతే చీకట్లో నేనూ చూసేవాణ్ని కాదు. పొద్దున్నకి అందరి కళ్ళలోనూ పడి వుండేది. ఈ లోకులకేముంది - కాకులు. ఇద్దరు స్నేహంగా వుంటే ఓర్వలేరు" అన్నాడు. "పైగా ఒకే గూటి పక్షులట తొంగిచూశాడు కాబోలు... వీడి మొహానికి కవిత్వం ఒకటి."
   
    సోమయాజికి ఏడుపు వస్తోంది. వెక్కి వెక్కి ఏడవాలన్న కోర్కె పెరుగుతూంది. ఆపుకోలేకపోతున్నాడు. ఈలోపులో సుబ్బారావు గోడ మీద నీళ్ళు జల్లి, చెంబు క్రిందపెట్టి చీపురుకట్టతో తుడుస్తూ "ఈ రోజు కూడా ఆలస్యమై వుండేది. కానీ ఆటలో డబ్బులు బాగా వచ్చాయి. దాంతో లేచిపోయాను. పేకాడేవాడు ఎవడూ అలాంటప్పుడు నిభాయించుకోలేడు. వచ్చిందంతా పోయేవరకూ ఆడతాడు. కానీ నేనలా కాదు. అందుకే లేచిపోయాను. వచ్చేసరికి ఇదిగో వీడీపని చేస్తూ కనబడ్డాడు. అన్నట్టు వీడికీ నీకూ ఏమన్నా గొడవుందా?.... వెధవ! చిన్నపిల్లాడి జీవితం నాశనం చేస్తున్నానని కూడా ఆలోచించలేదనుకుంటా" అన్నాడు.
   
    నేను చిన్నపిల్లాన్నా! నేను ... నే ...ను.
   
    "అదేమిటి అలా నిలబడిపోయావు. కాస్త సాయంపట్టవోయ్ - కాస్త నీ పేరన్నా చెరుపుకో" అవతల్నుంచి హాస్యంగా అన్నాడు సుబ్బారావు. ఒక్కోమాటా బాణంలా వచ్చి తగులుతూంది సోమయాజికి. చెంపమీద జలజలా కారే నీటిని భుజం చివర్ల తుడుచుకుని, వంగి గుడ్డ తీసుకుని తుడవసాగాడు. గోడమీద రాతదేముంది తుడిస్తే పోతుంది!
   
    "ఎందుకు నువ్వలా వున్నావ్! మళ్ళీ ఆ చంద్రగాడు ఏమన్నా చేస్తాడనా! అలాంటి భయం ఏమీ పెట్టుకోకు ఇప్పుడంటే పేకాటలో పడి యిలా అయిపోయాను గాని ఒకప్పుడు నేను పెద్ద ఆటగాడ్ని, ఎడమకాల్తో ఒక "కిక్" యిచ్చాడంటే వెళ్ళి "గోలు" లో పడతాడు. ఇప్పుడిప్పుడే యెంతో బెదిరిపోయాడు, ఇంకేమీ చేయడ్లే తప్పు చేసిన వాడికి  ఆ మాత్రం పిరికితనం వుంటుంది. నీకేం భయం? నువ్వు ధైర్యంగా వుండు."
   
    అక్షరాలు పూర్తిగా చెరిగిపోయినయ్. కాస్త రంగుమాత్రం మిగిలిపోయింది. సుబ్బారావు చీపురుకట్ట దూరంగా విసిరేస్తూ "రేప్రొద్దున్న ఏమైనా వెలుగులో కనబడుతుందేమో! మళ్ళీ ఒకసారి చూడాలి. అంత తొందరగా నేను లేవలేను కానీ కాస్త నువ్వే ముందు లేచి చూడు. ఏమైనా వుంటే తుడిచెయ్యి అన్నట్టు ఈ సంగతి యెవరికీ చెప్పకు. మా ఆవిడ క్కూడా దాని మనసు అసలే సున్నితం నువ్వూ మనసులో ఏమీ పెట్టుకోకు. మామూలుగా వచ్చిపోతూ వుండు. ఈ కుక్కలకేముంది? అరుస్తూనే వుంటాయి. అన్నట్లు నువ్వు ఏకసంథాగ్రాహివటగా తను చెపుతూ వుంటుంది. దీన్ని నువ్వు కూడా పూర్తిగా మర్చిపో-" అన్నాడు.
   
    కంటికి అడ్డుగా ఏర్పడిన నీతి పొరల్లోంచి అతడి ఆకారం అస్పష్టంగా కనబడుతూంది. అతడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి తలుపు తట్టాడు. లోపల్నుంచి వచ్చి మందాకిని తలుపు తీసింది. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. తలుపు మూసుకుపోయింది.
   
    చుట్టూ చీకటి మిగిలింది.
   
    కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వెళ్ళి తిరిగి పక్కమీద పడుకున్నాడు. జరిగిందంతా ఏదో కలలాగా వుంది.
   
    అతడేగాని ఆ రాత్రి ఆ వ్రాతల్ని చూడకపోయివుంటే ప్రొద్దున్న కల్లా ఏమై వుండేది? ..... తల్చుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అతడికి నిద్రపట్టలేదు. అటూ ఇటూ పొర్లుతున్నాడు. రేపు తన పుట్టినరోజు రేపటినుంచీ కొత్త సంవత్సరం మరో ఏడు వయసు పెరిగింది.
   
    వెనక్కి తిరిగి చూసుకుంటే -
   
    ఎంత వ్యధాభరితమయిన సంవత్సరం ఇది! తాతయ్య మరణం - - తను ఈ పట్నంలో వచ్చి పడడం - - ఇక్కడ యిమడలేకపోవటం - - ఆఖరికి ఈ చివరిరోజు తన ఏకైన హితోభిలాషితో యిలా ప్రవర్తించడం.
   
    ఈ పుట్టినరోజు ఇంత హీనమైన పరిస్థితుల్లో వస్తూందేమిటి...ఇప్పుడే ఇలా వుంటే ఇక ముందు ముందు ఎలా వుంటుంది? క్రితం సంవత్సరం యిదే రోజు యెంత గొప్పగా ప్రారంభమయ్యింది. తాతయ్య దగ్గరుండి తలస్నానం చేయించాడు. కొత్త బట్టలు కుట్టించాడు. ఆ రోజు ఇంటిలో ఒక పండగలా జరిగింది! అంత శుభప్రదంగా జరిగిన ఆ సంవత్సరమే అల గడిస్తే - ఈసారి మరెన్ని కష్టాలు తీసుకురాబోతుందో ఈ పుట్టినరోజు.
   
    చాలా రోజుల తర్వాత అతడికి తాతయ్య గుర్తొచ్చాడు. ఈ మధ్య మందాకిని నీడలో ఆ వ్యధ అంతగా తెలియలేదు. మళ్ళీ ఈ రోజు ఇన్నాళ్ళకి గుర్తొస్తున్నాడు తాతయ్య... తాతయ్యా... నేనీ యిబ్బందిలోంచి బయటకు రావాలనుకుంటున్నాను తాతయ్యా... ఎలా...? నాక్కాస్త ఓదార్పు కావాలి. మందాకిని ఒడికోసం చంద్రం అడిగిన ఓదార్పు కాదు, స్పర్శకి అతీతమైన తీర్పు. ఆ మాటకొస్తే మనసుకన్నా అతీతమైన ఓదార్పు అవును తాతయ్య! ఒక విశ్వజనీయమైన సత్యం యిప్పుడే నాకు అర్ధం అయింది. ప్రేమ ఇంద్రధనుస్సు అయితే అందులో మొదటి ఆరు రంగులు ఆకర్షణ, అవగాహన, క్షమ, తాదాత్మ్యత, స్పర్శ, కామం ఆఖరిదీ, ఏడోదీ అన్నిటికన్నా ప్రాముఖ్యమయినదీ "ఓదార్పు" ఎవరివలన నీ సుఖం రెట్టింపు అగునో, ఎవరివలన దుఃఖం సగమగునో అట్టివారితో నీకున్నది ప్రేమ. ఈ నిజం ఒక రెండు రోజులు ముందు తెలిసివుంటే ఎంతబావుణ్ణు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఎలా ఈ కాలాన్ని వెనక్కి జరిపి ఆ స్వచ్చదనాన్ని తిరిగి నిర్మించను?
   
    ఆలోచనలతోనే కలత నిద్రపట్టింది. ఎంతోసేపు కాలేదు. ఒక గంట గడిచి వుంటుందేమో! అంతలోనే తెల్లవారింది. ఇంకా యింట్లో ఎవరూ లేవలేదు. తూర్పు అప్పుడే కాస్త ఎర్రబడుతోంది. అతను కళ్ళు విప్పాడు. దూరంగా యెక్కడో తొలికోడి కూస్తూంది. నిన్నటిరోజు యెండ తాకిడినుంచి రాత్రి తాలూకు చలివల్ల భూమి బాగా చల్లబడింది.
   
    అతడు వెల్లకిలా పడుకుని వున్నాడు. కళ్ళు విప్పి నిద్రలేచాడు.
   
    కళ్ళు నెమ్మదిగా విప్పుతూంటే పదాల మధ్యనుంచి - కాస్త దూరంగా ఒక గుండ్రటి వస్తువు కనబడింది. అప్పుడప్పుడే ఆకాశం మీద నుంచి వీస్తున్న ఎర్రటి వెలుగుకి సముద్ర గర్భంలోంచి లేస్తున్న సూర్యుడిలా అది గోచరమవుతూంది. అతడికి ముందు అర్ధం కాలేదు. లేచి కూర్షున్నాడు. ఒక క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.
   
    సరికొత్త రిబ్బనుతో కట్టిన పాకెట్టు...దానిపై ఎర్రటి కాగితం లేత వెలుగులో నిగనిగా మెరుస్తుంది. చప్పున వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
   
    దానిమీద ముత్యాల్లాంటి అక్షరాల్తో వ్రాసి వుంది -
   
    "జన్మదిన శుభాకాంక్షల్తో - మందాకిని" అని.
   
    అది చదివి అతడు ఆనందంతో కేక పెట్టాలనుకున్నాడు. నాట్యం చెయ్యాలనుకున్నాడు. నవ్వాలనుకున్నాడు. ఆనందంతో ఏడవాలనుకున్నాడు. కానీ తమ తమ సంతోషంలో వున్నా జ్ఞానేంద్రియాలేవీ అతడితో సహకరించలేదు. మందాకిని తనని క్షమించింది అన్న ఆనందం అతడిని నేలమీద నిలువనీయలేదు.
   
    మనసు గురించి కవిత్వం చెప్పటంలో తెలుగున పెద్దన మించిన కవి లేడు. కాని ఒక చోట మాత్రం భట్టుమూర్తి అతడిని మించిపోయాడు. "ప్లవమాన కైరవ చవమాన రజము మైనంట దెవురు...." అన్నాడు వసుచరిత్రలో. కనులనుంచి కారే నీటిని పద్మమందలి మకరందపు పుప్పొడితో తుడుచుకోవాలనే కోర్కె అట అది. దుఃఖానికి, మితిమీరిన సుఖానికి తేడా లేకపోవటమట ఆ స్థితి!! అంత గొప్ప వర్ణన చేసిన భట్టుమూర్తి కూడా ఆ క్షణం సోమయాజి ఆనందాన్ని వర్ణించలేడనుకుంటా.
   
    అతడు దాన్ని విప్పబోతూంటే అప్పుడే తలుపు తీసిన చిన్నక్క బయటకు వస్తూ "అదేమిట్రా సోమూ ఇంకా అలాగే వున్నావూ ఈ వేళ నీ పుట్టినరోజు కదా! తలంటు పోసుకోవా ఏమిటి?" అంది తొందర పెడుతూ.
   
    అతడికి తల మునలకలయ్యేటంత ఆశ్చర్యం వేసింది. చిన్నక్కఅంత ఆప్యాయంగా మాట్లాడటం!
   
    ఆ రోజు చిన్నక్కస్వయంగా తలంటుపోసింది. పాయసం కూడా వండింది. రంగారావు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడాడు. పెద్ద బావగారు (మావయ్య) బజారుకి తీసుకెళ్ళాడు. కాబోయే అల్లుడ్ని మంచిచేసుకోవటం గురించి సరసాలు ఆడారు కూడా అతడికా మాటలు అదోలా వున్నా ఎక్కువ సిగ్గే వేసింది. మొత్తంమీద ఇంట్లో వచ్చిన మార్పు అతడిని సంతోషంతో ముంచెత్తింది. మళ్ళీ పల్లెటూరి వాతావరణం తిరిగి వచ్చినట్టూ వుంది. అంత శుభప్రదంగా మొదలైన ఈ సంవత్సరం మరెన్ని శుభాల్ని తెస్తుందో అని సంబరపడ్డాడు.
   
    మధ్యాహ్నానికి అతడికి తీరిక దొరికింది. ఎంత వీలు చేసుకుందామనుకున్నా అప్పటివరకూ సమయం చిక్కలేదు. ఇటిల్లిపాదీ అతడితో ఎన్నడూ లేనంత సఖ్యతతో మాట్లాడుతూ వున్నా అతడి మనసు మాత్రం వేరేచోట వుంది. వీలు దొరకగానే అక్కడికి వెళ్ళాడు. ఆమె ఉత్తరమేదో వ్రాస్తోంది. అలికిడికి ఆమె కదల్లేదు. అతడు వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాడు.
   
    "నువ్విచ్చిందేమిటో ఇంకా చదవలేదు. ముందు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను" అన్నాడు. "నువ్వు ఇచ్చింది డైరీ కదూ!"
   
    కానీ ఆమె నిర్లిప్తంగా కళ్ళెత్తి చూసి, తిరిగి తలదించుకుని "నేను మాట్లాడదల్చుకోలేదు" అంది.
   
    ఈ కోపం కృత్రిమమని తెలుసుకున్న వాడిలా నవ్వి, "ఎప్పటి వరకూ" అని అడిగాడు. అంతలోనే తన ఊహ తప్పని అతడికి తెలిసిపోయింది. ఆమె నిస్తేజమయిన మొహంలో కాఠిన్యత కొట్టవచ్చినట్లు కనపడుతూంది.
   
    "ఎప్పటికీ." అంది.
   
    అతడు ఆమెవైపు అయోమయంగా చూశాడు. ఈ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది.

 Previous Page Next Page