అధ్యాయం - 7
బస్ స్టాప్ లో నిలబడిన మదన్ కి హృదయం తేలిపోతున్నట్టు వుంది. ఎదురుగా లంగా, ఓణీ వేసుకున్న అమ్మాయి అతడివైపు ఓరగా చూసి నవ్వుతూ, అతను చూడగానే తల తిప్పుకుంటోంది. మొహంమీద నవ్వు మాత్రం అలాగే వుంది.
ఇదొక కొత్త అనుభవం.
బస్ లో అమ్మాయిల వెనుక చేరి, సున్నితమైన ప్రదేశాల పై చెయ్యి వేయటం...వాళ్ళు కోపంగా చూస్తే ఏమీ ఎరగనట్టు తల తిప్పుకోవటం, వాళ్ళు భయంతో పైకి చెప్పలేక కుదించుకుపోతోంటే మరింత విజ్రుంభించి పైశాచికానందం పొందటం మాత్రమే అతడి కంతవరకూ అనుభవం.
పొట్టిగా, సన్నగా, పీలగా- చామనఛాయకన్నా ఒక్క పిసరు తక్కువ రంగులో, పీక్కుపోయిన మొహంతో వుండే అతడిని చూసి ఇంతవరకూ ఏ అమ్మాయీ ఇష్టపడలేదు. అతడిలో ఇటువంటి మనస్తత్వం పెరగటానికి బహుశా ఇదే కారణమేమో!
అతడు ఆలోచనల్లో వుండగానే బస్ వచ్చింది. ఆమెతోపాటే ఎక్కాడు.
రెండు స్టాపుల తర్వాత ఆమె దిగుతూ అతడివైపు చూసింది. అందులో ఆహ్వానం వున్నట్టు తోచింది. ఆలస్యం చెయ్యకుండా అతడూ దిగాడు.
వేనుగ్గా నడుస్తూ "హలో" అన్నాడు.
ఆమె కూడా "హల్లో" అంది.
"నిన్ను... నిన్ను ఎక్కడో చూశాను."
"ప్రతీరోజూ ఈ బస్ లోనే కాలేజీ నుంచి ఇంటికి వస్తూ వుంటాను."
"నేనూ ఈ రూట్ లోనే తిరుగుతూంటాను"
"తెలుసు."
"చూస్తూ వుంటావన్నమాట."
"చేతులు కూడా వేయించుకుంటూ వుంటాను."
మదన్ అర్ధంకానట్టు "...అంటే?"
"రెండు మూడుసార్లు నొక్కావులే. అదే నాకు నచ్చింది."
మదన్ కి అర్దమైంది కాస్త ధైర్యం కూడా వచ్చింది. "ఎటైనా వెళ్దామా?" అన్నాడు.
"మా ఇంటికే వెళ్దాం అన్నయ్యా వదినా లేరు"
మదన్ హుషారుగా విజిల్ వేశాడు. అయిదు నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. "కాఫీ తాగుతావా?" అడిగింది.
"పాలు కావాలి" అన్నాడు కన్నుకొట్టి. అర్ధం చేసుకునే వయసు లేని ఆ అమ్మాయి..... "తలుపేసి వస్తాను. నువ్వు బెడ్ రూమ్ లోకి వెళ్ళు" వంటింట్లోకి వెళ్తూ అంది.
మదన్ పడగ్గదిలోకి ప్రవేశించాడు. అక్కడ మంచంలేదు, అసలే వస్తువూ లేదు. ఆమె తలుపు వేసింది.
లోపలికి రాలేదు.
"-ఇదేమిటి ఈ తలుపు వేసావు?" అన్నాడు అర్ధంకాక.
ఆ అమ్మాయి కిటికీ వద్దకు వచ్చి బయట్నుంచి అంది- "కొన్ని రోజులక్రితం బస్ లో ఒకామె నీ బారినుంచి నన్ను రక్షించింది. నీ గురించి రిపోర్ట్ చేద్దాం రమ్మంది. ఆ రోజు భయపడి, వద్దన్నాను. ఇప్పుడు నా బాధ్యత ఏమిటో నాకు తెలిసింది. అందుకే అప్పటి ఋణం తీర్చుకుంటున్నాను."
"ఏమిటి నువ్వు చెప్పేది? తలుపు తియ్యి."
"మా అన్నయ్య వచ్చి తీస్తాడు."
"అతనెవడు?"
"నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి తన్నిన ఇన్ స్పెక్టర్."
మదన్ సన్నగా వణికాడు. కానీ క్షణం సేపే.
"ఇదంతా ఏమిటి? నన్నిక్కడికి ఎందుకు పిల్చుకువచ్చావు?" కోపంగా అరిచాడు.
"ధరణిగారి పిల్లల్ని ఎక్కడ దాచారో చెప్పించాలని" అని వినిపించింది. స్వరం ఆ అమ్మాయిది కాదు, మొగగొంతు "ఎంత తొందరగా చెప్తే అంత మంచిది." ఇన్ స్పెక్టర్ విక్రమ్ కిటికీ దగ్గిరకొచ్చి అన్నాడు.
మదన్ మొహం పాలిపోయింది "ధరణి ఎవరు? పిల్లలేమిటి?"
"అది నువ్వే చెప్పాలి."
"నాకు తెలీదు."
"రేపు గుర్తొస్తుందిలే రేపు కాకపోతే నాల్గయిదు రోజుల్లో.... ఎవరూ అప్పటివరకూ డిస్టర్బ్ చేయరు. తీరిగ్గా గుర్తుతెచ్చుకో."
"అంటే నన్ను బంధించి వుంచుతారా అప్పటివరకూ"
"ఒక రకంగా అంతే."
"మా వాళ్ళకి తెలుస్తే ఊరుకోరు. ఇది ఇల్లీగల్."
"మీ వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. ఇది మొదటి పాయింటు. ఇక లీగాలిటీ విషయానికొస్తే- నువ్వేమీ నిరూపించలేవు. ఎందుకంటే నిన్ను అసలు ముట్టుకోను కాబట్టి." విక్రమ్ అన్నాడు. "....పోలీస్ స్టేషన్ లో అయితే ఇరవైనాలుగ్గంటల్లో హాజరు పర్చాలి. ఇక్కడ ఆ అవసరం లేదుకదా."
"అయినా ఇది..." అంటూ ఏదో చెప్పబోయాడు.
"చట్టవిరుద్దం నాకు తెలుసు న్యాయం వేరు, చట్టం వేరు అన్నది పాత డైలాగు. న్యాయమూ చట్టమూ ధర్మమూ ఒకటే. సాక్ష్యమే వేరు అన్నది కొత్త డైలాగు. దాని ఆధారంగానే సాక్ష్యం చెప్పలేని ఆడపిల్లల్నీ, అభం శుభం తెలియని చిన్న పిల్లల్నీ మీ అవసరానికి వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదే బాణాన్ని మీమీద ప్రయోగించదల్చుకున్నాను."
కిటికీ తలుపు మూసేసేడు విక్రమ్. మదన్ కి ఏం జరగబోతోందో అర్ధంకాలేదు. చుట్టూ చూసాడు. గదిలో చాప దిండు తప్ప ఏమీ లేవు. బాత్ రూమ్ కూడా లేదు.
ఏం చెయ్యదల్చుకున్నారు తనని?
పస్తుల్తో చంపుతారా?
నాల్గయిదు రోజుల ఉపవాసంతో తను లొంగిపోయి అన్నీ చెప్పేస్తాడని ఎలా అనుకున్నారు?
శారీరకంగా హింసిస్తారా?
అది చాలా డేంజరస్ అని వాళ్ళకీ తెలుసుండాలే! ఒక పోలీసు ఇన్ స్పెక్టర్ ఈ విధంగా చేస్తే అది చాలా దారుణమైన పరిణామాలకి దారితీస్తుందని అతడికి తెలియకుండా వుంటుందా? అదీగాక- తనని ముట్టుకోనన్నాడుగా.
మరేం చేస్తాడు?
ఈ పాటికే యోగీవాళ్ళు తనకోసం వెతకటం ప్రారంభించి వుంటారు. కానీ వాళ్ళకి కించిత్ అయినా తనిక్కడ బంధింపపడ్డానని అనుమానం రాదు. వాళ్ళ పిల్లల్ని తాము కిడ్నాప్ చేస్తే తమ మనిషిని వాళ్ళు కిడ్నాప్ చేసారన్న అనుమానం యోగికి కలగకపోవచ్చు.
అంటే-
తను కిడ్నాప్ కాబడ్డాడా? ఎంతకాలం?
'మా పిల్లల్ని వదిలిపెడితే మీ మనిషిని వదులుతాం' అని బేరం పెడతారా వీళ్ళు? యోగి దానికి ఒప్పుకోడన్న విషయం వీళ్ళకి తెలీదూ? అందులోనూ పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే మనిషికి! అయినా బయట ఈ పాటికి ఏం జరుగుతూ వుండి వుంటుంది?
అతడు ఈ విధంగా ఆలోచిస్తూ వుండగానే- కిటికీ తలుపు తెరుచుకుంది. ఒక పళ్ళెం నిండా భోజనం, గ్లాసుతో నీళ్ళు లోపల పెట్టింది విక్రమ్ చెల్లెలు. అది చూసి అదిరిపడ్డాడు. అతడికి భరించలేనంత ఆశ్చర్యం కలిగింది. చికెన్ కర్రీ, మంచి కూరలు...
అతడు ఆశ్చర్యంగానే భోజనం ముగించాడు.
'కంచమూ గ్లాసూ కిటికీ దగ్గిర పెట్టు' కిటికీలోంచి అంది ఆ అమ్మాయి అతడు ఆ విధంగా చేస్తూండగా ఒంటిమీద చిక్కగా ఏదో పడింది.
మొహం మీదా.....చేతుల మీదా....
అతడు దాన్ని చూసుకున్నాడు.
ఎర్రగా వుంది.
"ఏమిటిది?" అరిచాడు.