"ఇటు రండి" సౌదామిని గొంతు.
ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చింది అతనికి.
"సౌదామినీ!" అన్నాడు ఆర్ద్రంగా అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాల చుట్టూ బిగుసుకుపోయాయి.
"అందరూ చూస్తున్నారు" అంది సౌదామిని యిబ్బందిగా.
ఆమెను గాఢంగా ఊపిరాడనంత బిగువుగా కౌగిలించుకొని, "ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ" అని అంతులేనన్నిసార్లు కలవరిస్తున్నట్లు చెప్పాలని అన్పిస్తూన్నా అప్పుడప్పుడే చీకటికి అలవాటు పడుతున్న కళ్ళకు చుట్టూవున్న మనుషులు కనబడి, ఆ కోర్కెను బలవంతంగా ఆపుకున్నాడు.
సున్నితమైన చేతులు అతన్ని గ్రీన్ రూంలోకి నడిపించుకెళ్ళాయి. గ్రీన్ రూం తలుపు వేసేశాడు బాలు.
"సౌదామినీ!"
తన పక్కటెముకలు విరిగిపోతాయేమో ననిపించింది సౌదామినికి.
నెమ్మదిగా అతని కౌగిలి వదిలించుకుని అంది, "వీణకి మీరు పెట్టిన అరేంజ్ మెంట్ వల్ల షాక్ తగలదు. ప్రాణం పోయేంత షాక్ తగలాలంటే వేరే పద్దతి వుంది. వైర్లని..." తన పెదిమలతో ఆమె నోటిని మూసేశాడు బాలూ. "సౌదామినీ!" అతని పిలుపు ఆమె చెవులకు వినబడటంలేదు. పెదిమలకు మధురంగా తాకుతోంది. మళ్ళీ పట్టు వదిలించుకుంది సౌదామిని.
"మీకు సరిగా చేతకాలేదని ఈసారి ఏర్పాట్లు నేనే చేశాను నా ప్రాణాలు పోవడానికి".
"నన్ను క్షమించడానికి వీలవుతుందా సౌదామినీ!" అన్నాడు బాలూ బొంగురుపోతున్న గొంతుతో.
కళ్ళెత్తి అతని మొహంలోకి సూటిగా చూసింది సౌదామిని. "ఎందుకూ క్షమించండి ఎందుకంత పెద్ద పెద్ద మాటలు! మీరేం తప్పు చేశారనీ! అనుమానించి అవమానించడం మగవాళ్ళ జన్మహక్కు కదా!"
"నువ్వు చాలా కోపంగా వున్నావు సౌదామినీ! నేను రాక్షసుడిలా ప్రవర్తించాను. నిజమే! దానికి ప్రాయశ్చిత్తంగా నాకు నేనే ఘోరమైన శిక్ష విధించుకోనా!"
"వద్దు. మీకేమన్నా అయితే నాతోబాటు జానకి కూడా విలవిల్లాడి పోతుంది".
కప్పు విరిగి తన నెత్తిమీదే కూలిపోయినట్లు అనిపించింది బాలూకి. నేల చీలి తను అధఃపాతాళంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది ఏమిటి? ఏమంటోంది సౌదామిని!
ఏదో అడగడానికి నోరు తెరిచాడు అతను. పెదిమలు అల్లల్లాడుతున్నాయి కానీ మాటలు బయటకు రావడం లేదు. స్వేదంతో షర్టు తడిసిపోతోంది.
"సౌ...దా....మి....నీ....!" అన్నాడు అతి ప్రయత్నం మీద సంతోషంలేని చిరునవ్వు నవ్వింది సౌదామిని.
"జానకితో మీ పరిచయం చనువుగా, చనువు అతి చనువుగా మారటం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నారా! అతి రహస్యం ఎప్పుడూ బట్టబయలే అవుతుంది బాలూ! ఇలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా! నాకు బాగా తెలుసు".
"ఏం తెలుసు సౌదామినీ" అన్నాడు బాలూ హీనస్వరంతో.
"జరగవలసిన చెడు అంతా జరిగిపోయిందని నాకు తెలుసు బాలూ! మీరు తప్పుచేసి తప్పించుకు తిరగడమేకాక, అలాంటి తప్పే నేను చేశానని వూహించుకుని చంపుకు తిన్నారు! చంపి పారేద్దామని చూశారు. ప్రయత్నాలు చేశారు...."
తల వంచుకున్నాడు బాలు.
"జానకితో" మీకు వున్న సంబంధం నాకు ఎప్పుడు తెలిసింది-ఎలా తెలిసింది-అని మీరు అడగకండి. నేను నా నోటితో చెప్పలేను. అసహ్యకరమైన వివరాలు అవి, ఇకపొత౫హె ఆంజనేయులుతో నాకు వున్న సంబంధం ....ఏమిటంటే..." పెదిమలు కొరుక్కుంటూ దుఃఖాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకుంది సౌదామిని. "వాడు నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలెట్టాడు".
"బ్లాక్ మెయిలా! ఏమని?" విస్తుబోయి అడిగాడు.
"మీరు చేసిన తప్పుకి నాకు శిక్ష! మీరు జానకితో కలిసి ఉండగా ఫోటోలు తీశాడు ఆంజనేయులు. వేలకువేలు గుమ్మరించకపోతే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించేవాడు" ఆమె ఆగి నెమ్మదిగా చెప్పింది. "బయటపడితే ఏమవుతుంది బాలూ! మీ భవిష్యత్తు బూడిదైపోతుంది. ఇంత కష్టపడి మీరు తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు మంటగలిసి పోతాయి. మీకో చెడ్డపేరు వస్తే ఎవరికి బాధ! నాకే కదా! మీ మీద నాకు వున్న వెర్రి ప్రేమను అలా ఎక్స్ ప్లాయింట్ చేశాడు ఆంజనేయులు... అందుకే వాడు అడిగినప్పుడల్లా పదివేలు, పదివేలు చొప్పున యిచ్చాను. ఒక అబద్దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్దం చెబుతూ నరకం అనుభవించాను బాలూ! ప్రత్యక్ష నరకం అనుభవించాను. మీకు జానకితో చనువు రోజు రోజుకీ పెరిగిపోతుంటే నా మనసు మసిలిపోయేది. ఆ రహస్యాన్ని ఆధారం చేసుకుని ఆంజనేయులు నన్ను బెదిరిస్తూంటే గుండె మండిపోయేది. వాడికి డబ్బు ఇవ్వడం కోసం అబద్దాలాడటం చిన్నప్పటినుండీ అలవాటులేదు బాలూ ఎప్పుడూ కూడా!" సౌదామిని గొంతు వణికింది. "అయినా మీతోనే అబద్దాలు చెప్పాను బాలూ! మీ కోసం రహస్యంగా ఆంజనేయులు వచ్చిపోతూ వుంటుంటే మీకు అనుమానం వచ్చేసింది. ఇంకేముంది! నన్ను చంపితే కానీ కసి తీరదనుకున్నారు. రకరకాల ప్లానులు వేశారు. కానీ, మీకు తెలుసా బాలూ! మీ ప్లాన్ లు విజయవంతం కావాలని మీకంటే ఎక్కువగా కోరుకున్నది నేనని. ప్రియుడే ప్రాణాలు తియ్యాలని నిశ్చయించుకున్న తర్వాత యింక నాకు బ్రతుకుమీద ఇంట్రెస్ట్ ఎందుకు వుంటుంది బాలూ!"
దుఃఖం ఆపుకోలేక సౌదామిని చేతులు తన చేతుల్లోకి తీసుకుని వాటిల్లో మొహం దాచుకున్నాడు బాలూ! గాద్గదికంగా అన్నాడు.
"అడగటానికి సిగ్గుగా వుంది సౌదామినీ! నన్ను క్షమించమని అడిగే అర్హతకూడా నాకు లేదని తెలుసు! అయినా అడుగుతున్నాను. కాదు చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నన్ను క్షమించగలవా సౌదామినీ!"
మరుక్షణం ఆమె అతని కౌగిలిలో వుంది.
"ఈ క్షణం మళ్ళీ రాదేమోనని ఎంత దిగులుపడ్డానో తెలుసా?" అంది సౌదామిని అస్పష్టంగా.
"నేను మరీ దారుణంగా ప్రవర్తించాను కదూ!"
"లేదు! లేదు!" అంది. కానీ సౌదామిని మొహంలో విచారం ఇంకా తొలిగిపోలేదు. కాసేపు ఆగి మళ్ళీ అన్నది తను.
"ఒక పనిచేద్దామా!"
"ఏమిటి?"
"జరిగినదంతా ఒక పీడకల అనుకుందాం. దాన్ని ఇప్పుడే యిక్కడే మర్చిపోదాం. ఇంకెప్పుడూ దాన్ని గుర్తుంచుకోకూడదు మనం. దాన్ని గురించి ఇంకెప్పుడూ మాట్లాడుకోవద్దు. ఇంకెప్పుడూ ఇలా జరగాకూడదు. ఇది మన అగ్రిమెంటే సరేనా?"
"థాంక్స్ మై డియరెస్ట్ సౌదామినీ!" అన్నాడు బాలూ.
ప్రక్షాళితమైన అతని మనసే ఒక మందిరంగా మారగా అందులో అధిష్టాన దేవతగా సౌదామినిని తిరిగి పునః ప్రతిష్ట చేసుకున్నాడు.
అప్పుడు చటుక్కున అడిగింది సౌదామిని "బాబు! బాబు ఏడీ?" మనసులో మరోసారి బాధ సుళ్ళు తిరిగింది. బాబు! ఎవరి బాబు?
సౌదామిని కడుపునా పుట్టిన బిడ్డ కళ్ళు తెరవకముందే కన్ను మూశాడని, ఇప్పుడు తన కొడుకుగా పెరుగుతున్నది ఏ తల్లి కన్న బిడ్డో తనకే తెలియదనీ సౌదామినికి చెప్పాలా వద్దా!
తన అనుమానంతో యిప్పటికే ఆమెకి గుండెకోత కలిగించాడు. ఇప్పుడీ విషయం కూడా చెప్పి కడుపుకోత కూడా కలిగించాలా! కానీ తప్పదు.
తను రాక్షసుడిలా ఎలా మారాడో ఎందుకు మారాడో సౌదామినికి తెలియాలంటే ఆంజనేయులూ, మృదులా, జానకీ తదితర బృందం అంతా కలిసి ఆడిన నాటకం అంతా వివరంగా చెప్పాలి. వివరంగా చెబితే బాబు తను కొడుకు కాదన్న విషయం కూడా బయటికి వస్తుంది.
అయినా చెప్పక తప్పదు. చెప్పడం తమ ధర్మం సౌదామినిని చీకట్లో ఉంచడం తనకు నచ్చదు.
అతను ఒక్కొక్క సంగతీ చెబుతుంటే స్థంభించిపోయి విన్నది సౌదామిని. చివరికి బాబు విషయం కూడా చెప్పి, "మృతశిశువు అని చెప్పింది ఆ రాక్షసి! కానీ నా ఉద్దేశ్యం, నీకు అబార్షన్ చేసి, ఏడు నెలల గర్భస్థ శిశువుని చంపేసి వుంటారు. అంతటి నరరూప రాక్షసులే వాళ్ళు తరువాత ఇంకొక బిడ్డని తెచ్చి పడుకోబెట్టారు".
బాబు తన కొడుకు కాదని తెలియగానే ఆమె షాకైపోతుందేమో అనుకున్నాడు బాలూ అందుకు విరుద్దంగా చిరునవ్వు నవ్వింది సౌదామిని. "చూశారా ఎంత చిత్రమో! అంతా ఊహలో ఉందన్నమాట అన్నాళ్ళనుంచి వాడు నా కొడుకనుకుంటే కొడుకయ్యాడు. ఇప్పుడు కాదనుకుంటే కొడుకు కాకుండా పోతాడు. కానీ ఎలా అనుకోగలను అలా! వాడు నేను కన్నకొడుకు కాకపోవచ్చు. కానీ ఈ చేతులతో పెంచిన కొడుకండీ! ఇప్పుడు మన అగ్రిమెంటులో యింకొక క్లాజు.... బాబు మన కొడుకు కాదని ఇంకెప్పుడూ తల్చుకోకూడదు. అలా అని చెయ్యండి ప్రామిస్.." అంది చెయ్యి జాస్తూ.
"ప్రామిస్!" అన్నాడు బాలూ ఆ చేతిని తన పెదవులకు రాసుకుంటూ ఆ రోజు ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది.
ఆటోగ్రాఫులిచ్చి కారు దగ్గరికి వచ్చారు. డోర్ తెరవబోతూ ఇదేమిటి? అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది.
కారు విండో స్క్రీన్ మీద, వైపర్ కింద పెట్టి ఉంది ఒక ఉత్తరం. తీసి చదవటం మొదలెట్టింది సౌదామిని.
"సౌదామినీ!
నేను ఆడించిన నాటకం చివరి అంకంలో రసాభాస అయిపోయిందని నీకు తెలుసా తల్లీ? సంతోషిస్తున్నావా అమ్మా?
వద్దమ్మా, అంత ఆనందం వద్దు.
ఇతరులు...ముఖ్యంగా తననుంచి దూరమైన వాళ్ళు- అంత ఆనందంగా వుండటాన్ని ఈ బ్రహ్మానంద కలలో కూడా ఊహించలేడన్న విషయం నీకు తెలుసుగా తల్లీ.
ఇప్పుడు నీతో ఇక కొత్తరకం కొరియన్ గేమ్ ఆడదల్చుకున్నాను. నీ కొడుకుని నాతోపాటు తీసుకెళ్తున్నాను. నేనాడేగేమ్ లో అతి మొదటి ఎత్తు నీ భర్త. నికృష్టుడు. కాల్ గ్యాస్ తో, కుక్కగొడుగులతో, వీణతీగెల్తో-ఇలా రకరకాలుగా నిన్ను చంపాలనుకున్నవాడు.
అటువంటి వాడితో కలిసివుంటావో- నా దగ్గరికి తిరిగి వచ్చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఇదే నీ జీవితపు చివరి ఎత్తు అనుకో వచ్చేస్తే నా కోట తలుపులు నీకు స్వాగతం పలుకుతాయి. లేదూ, పతికి పతియే ప్రత్యక్షదైవం అనే మూఢాచారంలో వుండదల్చుకుంటే.....క్షమించు తల్లీ! నీ కొడుకు నా దగ్గరే వుంటాడు.
చిలుక చచ్చిపోయిందమ్మా! నాకూ ఏమీ తోచటంలేదు. పంజరం ఖాళీగా వుంది. నీ కొడుకును అందులో పెంచుతాను.
అదిష్టం లేదంటే నువ్వు నాతో నిజంగా కొరియన్ గేమ్ ఆడాలి. అటో ఇటో తేల్చుకుందాం- నీ ... నాన్న
ఉత్తరం చదివిన బాలూ మొహం వాడిపోయింది.
తన స్వరూపానికి అద్దంలా వుంది ఆ ఉత్తరం. అయినా ఇప్పుడు అదికాదు సమస్య. తమ కొడుకు ప్రాణాపాయంలో వున్నాడు.
"నేను వెళతాను" అంది సౌదామిని ఒక నిర్ణయానికి వచ్చినదాన్లా-