అనూరాధ జీవితానికి కాస్త ఎక్స్ టెన్షన్ భార్గవి తల్లి జీవితం. అయితే అనూరాధలో వున్నా తెగింపు ఆవిడలో లేదు. సమాజం దృష్టిలో పదహారణాల హిందూ ధర్మపత్ని. భార్గవికి మాత్రం తల్లిని చూస్తే జాలి, కసి, కోపం అన్నీ!
వాళ్ళకు ఇద్దరు పిల్లలు. పెద్దది భార్గవి, ఒక సంవత్సరం చిన్నవాడు వినోద్. వాళ్ళను పెంచడంలో కూడా తండ్రి మాటే నెగ్గాలి. వాడు మగపిల్లవాడు, చిన్నవాడు కాబట్టి తండ్రిలా మరోరకం అధారిటీ చెలాయిస్తుంటాడు. తండ్రి అతడిని నెత్తి నెక్కించుకుంటాడు.
పదో తరగతి పాసయ్యేవరకు యీ వాతావరణంలోనే పెరిగింది భార్గవి. భార్గవిని హాస్టల్లో చేర్పించడం ఇందుమతి కేమాత్రం ఇష్టంలేదు. భర్తకు ట్రాన్స్ ఫర్ అవడంతో ఆమెకూడా తప్పనిసరిగా ట్రాన్స్ ఫర్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు భార్య ఎల్లవేళలా పక్కనే వుండాలి. ఇరవై నాలుగ్గంటలూ అతడి అవసరాలను కనిపెట్టుకుని మసలుతూండాలి. అలాగని ఇంట్లోనే కూర్చోకూడదు, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి.
"వయసు వచ్చిన పిల్లను పరాయి ఊళ్ళో వదిలేస్తే ఎలాగండీ?"
"అయితే చదువు మానిపించేద్దాం. మనతోపాటే వుంటుంది. కాని ఆ ఊళ్ళో కో-ఎడ్యుకేషన్ కాలేజీలో మాత్రం చేర్పించను" అన్నాడు మొండిగా.
భార్గవికి చదువంటే వున్న ఇంట్రెస్టు తెలిసిన ఆవిడ మరి మాట్లాడలేదు. కొద్దిరోజులు దిగులుగా అనిపించినా త్వరగా ఆ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడింది. ఇంటికంటే హాస్టల్ బాగున్నట్లనిపించింది. మంచి స్నేహితురాళ్ళు దొరికారు. సరదాగా గడిపేవారు. విశాల అంటేనే ఆమెకు కాస్త పడేదికాదు. హాస్టల్లో ఉండి చదువుకునే అమ్మాయిలంతా బరితెగించినవాళ్ళని విశాల ఉద్దేశ్యం. ఆమెను ఏడిపించడానికి భార్గవి అన్నీ కట్టుకథలల్లి చెప్పేది. రోడ్డుమీద వెళ్ళే అబ్బాయిల్ని హాస్టల్ గోడ అవతల్నుంచి కన్నుకొట్టి పిలుస్తాం - అని కోసేది. విశాల మొహం గంటు పెట్టుకుని మూతి ముడుచుకుంటే తెగ నవ్వేది. రెండేళ్ళు అతి సరదాగా గడిచిపోయాయి. డిగ్రీ కూడా అక్కడే చదవాలనుకుంది. కాని తండ్రికి మళ్ళీ గుంటూరు ట్రాన్స్ ఫరవడంతో వెళ్ళిపోయింది.
ఇంటి పరిస్థితిని గురించి అప్పటికే ఆ అమ్మాయికి ఒక అవగాహన వుంది కాని, ఆ తీవ్రతను పూర్తిగా అర్ధం చేసుకునే వయసూ, బుద్దీ యిప్పుడే వచ్చాయి. తల్లి పరిస్థితిలో ఇంకా ఏ మార్పూ లేదు. ట్యూషన్లు చెప్పి మరికొంత డబ్బు సంపాదించడం తప్పా? తండ్రి సంపాదనలో కొరతలేదు. పై సంపాదన కూడా చాలా ఉంటుందని వింది. సంపాదించడంలోనూ తప్పు లేదు. కాని అది అనుభవించడానికి హక్కులేదు. పైసా ఖర్చు పెట్టాలన్నా పదే పదే అలోచిస్తున్నాడాయన. చెరో నాలుగు జతల బట్టలతోటే అందరూ గడుపుతున్నారు. అలాగే వుండాలని శాసిస్తాడు. ఇంటర్ వరకు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. డిగ్రీలో చేరాక భార్గవి చాలా బాధపడవలసి వచ్చింది. తమ్ముడికున్న స్వేచ్చ ఆమెకి లేదు ఫిజికల్ గానూ, ఆర్ధికంగానూ.
ఆమె హైదరాబాద్ నించి తిరిగి వచ్చిన రోజునే ఒక ఘర్షణ జరుగుతోంది. భార్యను సినిమాకు వెళదాం రమ్మని గొడవ చేస్తున్నాడు తండ్రి. "కూతురు ఆ రోజే ఊర్నించి వచ్చింది. ఆమెను వొదిలి సినిమాకు వెళితే ఏం బావుంటుంది. అందరం కలిసే వెళదాం" అంటుంది ఇందుమతి. అది కుటంబంతో చూసే సినిమా కాదు. అందులోనూ వయసులో వున్న ఆడపిల్లలతో చూసేది అసలే కాదు అని అతడి వాదన. అలాంటి సినిమాకు వెళ్ళకపోతేనేం, ఇంట్లో పనికూడా ఏమీ కాలేదు-అని తప్పించుకోవడానికి చూసింది.
"బావుంది దానికోసం నేను సినిమా చూడ్డం మానేయాలా? నాకా సినిమా చూడాలని వుంది. ఈరోజు కాకపోతే కుదరదు" అని అరిచాడు ఎప్పటిలాగే ఆయన వాదనే నెగ్గింది బయలుదేరుతూ భార్గవికి చెప్పడానికి కూడా సిగ్గుపడిందావిడ. ఆయనే చెప్పాడు.
"భార్గవీ! సినిమాకు వెళుతున్నాం ఈ పూట వంట చేసేసి వుంచు, తమ్ముడికి బంగాళాదుంపలు ఇష్టం. అది చేసి పప్పుచారు చెయ్యి చాలు" అని తండ్రి అంటూంటే ఆశ్చర్యపోయింది.
ఆమెకు వంట చేయడం అసలు రాదు.
"దానికేం చాతనవుతుందని? నేను వచ్చి చేస్తాలే" అంది ఇందుమతి.
"తెలియకపోతే తెలుసుకోవాలి. ఆడపిల్ల కదూ ఇంత వయసు వచ్చి వంటరాదని వూరుకుంటారా? ఏదో ఒక రకంగా చేసెయ్" తండ్రి ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. వెనుకే లేగదూడలా తల్లి.
ఆడపిల్ల, మగవాడు అనే ఈ అంతర్యం స్వంత తల్లి దండ్రులతోటే మొదలవుతోంది. స్త్రీలమీద గౌరవం లేని మగవాడిని పెళ్ళి చేసుకున్న ప్రతి స్త్రీ జీవితం తన తల్లిలాగే అవుతుంది కాబోలు.
భర్గవి అన్నం వండింది. అది మెత్తగా చిమిడిపోయింది. బంగాళాదుంపలు ఉడకబెట్టింది. అవి సరిగ్గా ఉడకలేదు. పై తోలు తీస్తే ఎంతకీ రాలేదు. అలాగే కోసి వేపుడు చేసింది. ఉప్పు, కారం ఎంత వెయ్యాలో తెలియదు. మొదటిది తక్కువా, రెండోది ఎక్కువా అయ్యాయి. పప్పులోనే ఉప్పు-కారం వేసి ఉడకబెట్టింది. అదెంతకీ ఉడక్కపోవడంతో దింపి అలాగే వుంచేసింది.
వేడివేడిగా అన్నంలో పచ్చడి కలుపుకుని తినేసింది. ఆమెకేం బాధలేదు. హాస్టల్లో భోజనం రుచి చూశాక ఏదయినా బాగానే అనిపిస్తుంది. అప్పుడు వచ్చాడు బజారులో షికారు తిరగడానికి వెళ్ళిన ఇంటిసుపుత్రుడు.
"అమ్మా, అమ్మా" ఇంట్లోకి అడుగు పెడుతూనే కేకలు వేశాడు. భార్గవి మాట్లాడలేదు.
"అమ్మేది? అంతలా అరుస్తుంటే వినిపించుకోవేం?" అంటూ చదువుకుంటున్న ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు.
"లేరు సినిమాకు వెళ్ళారు" ముక్తసరిగా జవాబిచ్చింది.
"వచ్చి అన్నం త్వరగా వడ్డించు, ఆకలి దంచేస్తుంది" బాత్రూంలోకి వెళుతూ ఆజ్ఞాపించాడు. భార్గవికి వొళ్ళు మండిపోయింది. కుర్చీలోంచి కదల్లేదు.
"ఏమిటి మొద్దులా కూర్చున్నావ్? అన్నం వడ్డించమంటే" ముఖం తుడుచుకుంటూ వచ్చాడు వినోద్.
"నేను చదువుకుంటున్నాను కనుపించటంలా? వెళ్ళి వడ్డించుకుతిను, అన్నీ టేబుల్ మీద వున్నాయి" విసురుగా అంది.
"పెద్ద గొప్పగా చదువుకున్నావులే అయ్యేయెస్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదూ" ఎగతాళిగా అన్నాడు.
"డిటెక్టివ్ నవల చదువుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. ఆకలయితే వడ్డించుకు తిను" అంతే కామ్ గా అంది.
"నాన్న రానీ, నీ పని చెప్తాను" కోపంగా వెళ్ళిపోయాడు. పళ్ళాలు, గిన్నెలు కిందా మీదా పడుతున్న చప్పుడు.
రెండు నిముషాల్లో మళ్ళీ.
"ఎవరు వంట చేసింది?" అని అరిచాడు.
"నేనే చేశాను బాగాలేదా?"
"నీ మొహంలా వుంది".
"నాకు చాతనయినట్లు చేశాను. నచ్చకపోతే నువ్వే వండుకో".
"ఇంకా నయం అంట్లు కూడా తోమమన్నావు కాదు".
"తప్పేముంది? హాస్టల్లో అవసరం అయితే నీ ప్లేటు నువ్వు కడుగుకోవడంలా?"
"నీకు బాగా పొగరెక్కింది" అంటూ దగ్గరకు వచ్చాడు. మీదకు రాబోయిన చేతిని పట్టుకు ఆపింది భార్గవి.
"నా మీద చెయ్యిపడితే ఆ వెంటనే నా చేతి దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది" అంది.
వినోద్ చెయ్యి లాక్కుని విసురుగా వెళ్ళిపోయాడు.
తల్లిదండ్రులు ఆలోచనారహితంగా ప్రవర్తించే తీరు పిల్లలమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆ అమ్మాయికి తెలిసివస్తుంది. అక్క అనే ఆప్యాయత లేదు. అమ్మ అనే గౌరవం లేదు. తండ్రి గారాబం అతడినో పశువుని చేసేస్తుంది. భవిష్యత్తులో ఎంతమంది స్త్రీలు అతడి వల్ల బాధ పడవలసి వస్తుందో?
తల్లీ తండ్రీ సినిమానుంచి రావడం, వినోద్ ఎదురుగా వెళ్ళి జరిగిన విషయం గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం వినిపిస్తూనే వుంది. కాని భార్గవి కదల్లేదు. హాస్టల్ జీవితం చాలా ధైర్యాన్ని నేర్పిందామెకు.
ఎవరో వెనకనుంచి జుట్టు పట్టుకుని లేపడంతో బాధతో కెవ్వున అరిచింది.
"ఎంత పొగరేనీకు? మగవాడి మీదే చెయ్యి చెసుకుంటానంటావా? ఏదీ నన్ను కొట్టు చూద్దాం. డొక్క చీల్చేయగలను రాస్కెల్! ఆడదానివి అణిగిమణిగి వుండాలి" అంటూ విసురుగా ఆమెను కిందకు తోసేశాడు తండ్రి.
"నేను వాడిని కొట్టలేదు, అబద్దం చెపుతున్నాడు. అయినా నేను చేసిన తప్పేమిటి? వంట చెయ్యడం రాకపోయినా నాకు తెలిసినట్టు చేసే పెట్టాను. వడ్డించుకు తినలేడా?" అంది. కోపం బాధని మింగేస్తుంది.
"ఏం వడ్డిస్తే అరిగిపోతానా? డిటెక్టివ్ నవలలూ, సెక్స్ నవలలూ చదువుతావా? పైగా ఎదిరించి అడుగుతున్నావా?" అంటూ ఆమె చెంప అదిరిపోయేలా కొట్టాడు.
భార్గవి తలెత్తి తండ్రివైపు చూసింది. క్షణంసేపు కన్నార్పకుండా చూసింది. ఆ తరువాత నెమ్మదిగా తమ్ముడి దగ్గరకు నడిచింది. వాడి మొహంలో చిరునవ్వు సన్నగా, గర్వంగా కదలాడుతూంది. క్షణం ఆగింది. ఆ తరువాత ఆమె చెయ్యి మెరుపుకన్నా వేగంగా కదిలి వాడి చెంపల్ని అటూ ఇటూ వాయించేసింది. అప్పటికప్పుడే బూరెల్లా వూరేయి అవి.