రామతీర్ధం తలుపు దగ్గర నిలబడ్డ నౌఖరుని పిలిచి "వక్కపొడి తీసుకురావోయ్!" అన్నాడు.
ధరణి రక్తం సలసలా కాగినట్లయింది. తను ఎంతో మధనపడీ, వ్యధ చెందుతూ న్యాయంకోసం వస్తే ఆయన టూత్ పిక్స్ తో పళ్ళు కుట్టుకుంటూ వక్కపొడి నమలడం ఆమెకు కోపాన్నిమించిన స్థితిని తెప్పించింది. కసిగా లేచి నిలబడి చెప్పింది- "సారీ! మీరు రిటైర్ మెంట్ ఎంజాయ్ చేస్తున్నారని తెలీక పొరపడి వచ్చాం!"
రామతీర్ధం ముఖం మామూలుగానే ఉంది. ఆమె ఆశించినట్లుగా అతనిలో ఏ మార్పూ రాలేదు.
టోనీతో కలిసి ఆమె బయటికి వస్తుండగా చాలా దిగులుగా, నీరసంగా అనిపించింది. వరండాలో మెట్లు దిగడానికి గోడ ఆసరా కావల్సి వచ్చింది. "మీరిక్కడే ఉండండి. నేను ఓసారి మళ్ళీ లోపలికెళ్ళొస్తాను!" అన్నాడు టోనీ.
"ఎందుకూ?" అడిగింది ధరణి.
"ముసలాడ్ని తుక్కు రేగొట్టాలనిపిస్తోంది" ఏమీ చెయ్యలేని ఉక్రోషం కనిపిస్తోంది అతనిలో.
"వద్దు ప్రత్యర్ధి ఉక్కుకోట అని తెలిసినప్పుడు మనం వుడుంపట్టు పట్టాలి. నిగ్రహం సడలకూడదు! చట్టంతో ఆడుకోవద్దు! వాడుకుందాం" అంది.
టోనీ ఆగ్రహాన్ని ఆపుకుంటూ "సరే!" అన్నాడు.
గేటు బయటకొచ్చాక "మళ్ళీ మొదటికొచ్చాం! ఎక్కడికి వెళ్దాం" అంది ధరణి.
టోనీ మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూండగా వెనుకనుంచి "సార్! ఆగండి" అని వినిపించింది. ధరణి ఆగి వెనక్కి చూసింది.
లాయర్ రామతీర్ధం దగ్గిర పనిచేసే నౌఖరు అతడు. గొంతు తగ్గించి రహస్యంగా, "మీరు తన దగ్గరికి వచ్చేసినట్టు లాయర్ గారు ఆ యోగికి చెప్పేసారు" అన్నాడు.
ధరణి నమ్మలేనట్టుగా చూసింది. అతనన్నాడు, "-ఆ స్కూలు యజమాని సాలగ్రామంగారు ఈ లాయరుగారికి దగ్గిర బంధువు. వీళ్ళ క్రింద పనిచేసేవాడే ఆ యోగి..." అన్నాడు భూషణ్.
ఆమె నిస్ప్రుహగా, "ఇప్పుడేమిటి దారి? మా కోసం పోరాడేందుకు ఈ యూనివర్శిటీలు ఒక్క న్యాయవాదిని కూడా సృష్టించలేదా?" అంది.
"విద్యాదేవిగారి దగ్గిరకి వెళ్ళండమ్మా. ఆ విషయం చెప్పటానికే వచ్చాను" భూషణ్ నమ్మకంగా అన్నాడు.
"ఆవిడెవరు?"
"లాయర్ విద్యాదేవి."
"హు. ఆవిడ మాత్రం ఈ కేసు ఎందుకు తీసుకుంటుంది? తను కూడా, 'నేనూ పిల్లలు కలదానిని. వదిలెయ్యండి' అంటుందేమో" ఉక్రోషంగా అన్నాడు టోనీ.
"ఖచ్చితంగా అనదు. ఎందుకంటే ఆవిడ భర్త ఈయనే కాబట్టి...."
శ్రోతలు ఇద్దరూ అదిరిపడి, "మరైతే ఆవిడెందుకు యీ కేసు తీసుకుంటుంది?" అని అడిగారు.
"సాలగ్రామంగారి విషయంలోనే విడిపోయారిద్దరూ!! సినిమాల్లో చూపిస్తారే-అట్లాటిదావిడ! మొగుడు గూండాలకీ రాజకీయ నాయకులకీ చీకటిసాయాలు చేస్తున్నాడని అతగాడినె వదిలేసిన గొప్ప మనసు కలది. మీకు తప్పక సాయం చేయగలదు. వెళ్ళండి."
"చాలా సాయం చేసావు-థాంక్స్."
"కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండమ్మా ఆ యోగి, పైకి కనిపించేటంత మంచోడు కాదు. వాడితో పెట్టుకుంటే మీకు చాలా ప్రమాదం."
ధరణి మనసులో విషాదంగా "ఇంకా కొత్తగా వచ్చేప్రమాదం ఏవుంటుందిలే" అనుకుంది.
టోనీ అనుమానంగా, "నువ్వు ఆవిడ తరపున సపోర్ట్ చేస్తూ ఇతడి దగ్గిర పనిచేస్తున్నావేమిటి?" అని అడిగాడు.
ఆ నౌఖరు వేదాంతిలా నవ్వి, "విభీషణుడికే తప్పలేదు కదండీ" అన్నాడు.
10
లాయర్ విద్యను చూడగానే ధరణికి ఎందుకో చాలా ధైర్యం కలిగినట్టు అయింది. ప్లెయిన్ కలర్ సిల్క్ శారీలో, జుట్టు ముడేసుకుని, చిన్నబొట్టు పెట్టుకుని ఆవిడ ఎంతో హుందాగా, ప్రశాంతంగ కనిపించింది.
ధరణి ఆవిడతో జరిగినదంతా చెప్పింది. చివరిరోజు రాత్రి- తను ఆ ఆశ్రమంలో చూసింది కూడా వివరించింది. "చిన్నపిల్లల మధ్యలైంగిక ఉత్సుకతని రేపి, దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు లాయర్ గారూ ఒకవేళ- ఆ దృశ్యాల్ని చూసి ఆవేశం వస్తే, తమ కోర్కెలు కూడా బలవంతంగా తీర్చుకుంటున్నారు. పధ్నాలుగేల్ల వయసొచ్చిన అమ్మాయి-ఆ విషయం ఇంట్లో చెప్పటానికి భయపడి-జ్వరంతో మరణించింది కూడా! తరతరాలుగా, యుగయుగాలుగా స్త్రీలమీద జరుగుతూన్న అత్యాచారాల ప్రతీకకి పరాకాష్ట ఇది! ఇంతకన్నా సోదాహరణ ఇంకొకటి వుండదేమో కూడా!" అంది ఆవేశంగా.
"మీ కూతుర్ని కూడా వాళ్ళు రేప్ చేశారని అనుకుంటున్నారా?" లాయర్ అడిగింది.
"ఆ పసిదానికి అదేమిటో తెలీదు లాయర్ గారూ! శారీరకంగా శీలం పోవటమే రేప్ అయితే, అంతవయసు డానికి రాకపోవటమే ఒక రకం అదృష్టంగా భావించాలి."
అయితే లాయర్ అడిగిన ఉద్దేశ్యం వేరు. ధరణి ఇలా చెప్పగానే ఆమె నిట్టూరుస్తూ, "-మరెవరు సాక్ష్యం చెపుతారు?" అంది.
ధరణి విస్తుబోయి, "-అదేమిటి?" అంది.
"సాక్ష్యం లేకుండా మనమేం చెయ్యగలం?"
ధరణి ఎంత బిత్తర పోయిందంటే-కొంచెంసేపు ఆమెకి మాట రాలేదు. అతికష్టం మీద తమాయించుకుని, "....ఒక అన్యాయాన్నీ, ఒక కళ్ళముందు జరిగిన దారుణాన్నీ ఎదిరించటానికి కూడా సాక్ష్యం కావాలా లాయర్?" అంది.
"-కోర్టుకి కావాలి" క్లుప్తంగా చెప్పి వాచీ చూసుకుంది విద్యాదేవి.
"నేను చూసింది చెప్తాను. చనిపోయిన అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు చెప్తారు. చాలదా?"
"చాలదు. అవన్నీ మీ భావాలకి ఊహ జోడించి చెప్పిన సాక్ష్యాలుగా కొట్టిపడేస్తాడు మేజిస్ట్రేటు...."
"కానీ ఒకమ్మాయి బలి అయిపోయింది లాయర్."
లాయర్ విసుగ్గా, "అప్పుడే పోలీసులకి రిపోర్ట్ ఇవ్వవలసింది" అంది.
"అప్పుడా విషయం మాకు తెలీదు" క్రోధంగా అంది ధరణి. ఆమెకి దుఃఖం గొంతులో సుడులు తిరుగుతోంది. నిస్సహాయత వల్ల వచ్చిన దుఃఖం అది. వరదలో కొట్టుకుపోతున్న మనిషిని చూస్తో-"ప్రమాదం తమ వరకూ రాలేదు కదా' అని సంతృప్తితో ఒడ్డున కూర్చున్న మనుష్యుల్ని చూస్తే కలిగే కసి అది!
"ఏ విషయం మీకు ఎప్పుడు తెలీదు?" క్రాస్ చేసింది.
"చనిపోయిన పాప రేప్ కాబడి మరణించిందని."
విద్యాదేవి లేస్తూ "క్షమించండి. నేనేం చెయ్యలేను" అంది- 'ఇక మీరు వెళ్ళవచ్చు' అన్నట్టు ధరణి కూడా నిస్సహాయంగా లేచి "మీరేమీ చెయ్యలేరా?" అంది ఆఖరిసారిగా.
"నేనేకాదు, ఏ లాయరూ చెయ్యలేరు. కనీసం మీ పాప సాక్ష్యమన్నా వుంటే ఏదైనా చెయ్యవచ్చు. కానీ అంత చిన్న పిల్ల ఏం చెప్పగలదు కోర్టులో....?"
"ఏమి చెప్పగలదో నాకు తెలీదు."
"అడిగి చూడండి."
"ఉంటే అడిగేదాన్ని లాయర్ గారూ కానీ ప్రస్తుతం మా పాప లేదు."
"ఎక్కడికి పంపారు?"
"పంపలేదు. ఆ క్రిమినల్స్ తీసుకెళ్ళారు."
విద్యాదేవి అదిరిపడి "వ్వాట్" అంది.
ధరణి విషాదంగా, "అవును నా నోరు నొక్కెయ్యటానికి వాళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేసారు" అంది.
విద్యాదేవి మౌనంగా వుండిపోయింది.
".....జరుగుతున్న అన్యాయం నలుగురికీ తెలియాలనీ, న్యాయం నాలుగు దిక్కులా ప్రవహించాలనీ, మీ దగ్గిరకు వచ్చాను. కానీ, దానికి కూడా చట్టం అనే ఆనకట్ట వుంటుందని ఇప్పుడే తెలిసింది" అని ఆమెకు నమస్కరించి అక్కడనుంచి కదలబోయింది.
"ఆగండి" వెనుకనుంచి అంది విద్యాదేవి. ధరణి ఆగి, వెనుదిరిగి ఆమెవైపు చూసింది.
"నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను."
-- * * * --