Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 40

              

                                         9
   
   
    మదన్ యోగి గదిలోకి కంగారుగా వచ్చి, "బయట చాలా గొడవగా వుంది. పేరెంట్స్ చాలామంది కట్టకట్టుకు వచ్చారు. అసలు రంగు బయటపడిందనీ, అంతు చూస్తామనీ అరుస్తున్నారు" అన్నాడు.
   
    యోగి కంగారుగా లేచి, "నివేదితని పిలువు" అన్నాడు.
   
    జనం గూర్ఖాని తోసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. వెనీషియన్ బ్లెండ్స్ జరిపి చూసాడు యోగి. ఆడా, మగా, చీమల బారుల్లా గేట్లోంచి అరుస్తూ లోపలి వచ్చేస్తున్నారు. అందరికన్నా ముందు కనిపిస్తోంది ధరణి!
   
    ఈ లోపులో నివేదిత గదిలోకి వచ్చింది.
   
    "ఇక్కడ జరిగే విషయాలు బయటికి పొక్కకుండా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాను గుర్తుందా?" కోపంగా అడిగాడు.
   
    ఆమె మరింత చిరాగ్గా, "నేను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. ఆ మదనే ప్రియ విషయంలో తొందరపడ్డాడు" అంది.
   
    "సర్లే.....సర్లే ఆ స్వీటీ ఏమైంది?"
   
    "నోరు విప్పటానికి భయపడుతోంది. ఈ విషయాలు ఇంట్లోవాళ్ళకి చెప్పితే ఏం జరుగుతుందో చెప్పాను. రాజేష్ కీ తనకీ మధ్యనున్న ప్రేమ వ్యవహారం మనకి తెలుసునని చెప్పగానే బెదిరిపోయి ఏడ్చేసింది. ఏ విషయమూ ఎక్కడా చెప్పనని పవిత్ర గ్రంధం మీద ఒట్టేసింది."
   
    "గుడ్.... ముందు నువ్వూ, ఆ మదన్ కలసి కెమేరాలూ క్యాసెట్లూ దాచెయ్యండి." అంటూ ఆమె వెళ్ళగానే, ఫోన్ చేసి చెప్పసాగాడు. "నిరంజన్.....నువ్వు వెంటనే చెయ్యాల్సిన పన్లు రెండున్నాయి. డాక్టర్ పరిమళ నర్సింగ్ హోం, ధరణీ, శ్రీధర్ ఇళ్ళు అడ్రసులు చెప్తాను వ్రాసుకో."
   
    అతడు చెప్తూండగా కలకలం దగ్గిరైంది. అతడు దాన్ని పట్టించుకోకుండా నిరంజన్ కి సూచన్లు ఇవ్వసాగాడు.
   
    బయట "యోగి బయటకు రావాలి!" అని అందరూ ముక్తకంఠంతో అరిచారు.
   
    ధరణి ఆవేశంగా "పసిపిల్లల శరీరాలతో మీరు తీస్తున్న అశ్లీల చిత్రాల గురించి మాకు తెలిసిపోయింది. మీ అసలు రంగులు బయటపడ్డాయి. మర్యాదగా బయటికి రండి. చట్టానికిలొంగిపోండి" అంది.
   
    నివేదిత తెల్లనిచీరలో ఆశ్రమవాసిలా వచ్చింది. "యోగిగారులేరు. ఢిల్లీ వెళ్ళారు. పిల్లల ప్రశాంతతని పాడు చెయ్యకండి. మీరు విన్న గాలి వార్తలని నిజం అని నమ్మి దేవుడులాంటి ఆయనను దూషించకండి" అంది.
   
    విసురుగా ఓ రాయి వచ్చి ఆమె నుదుటికి తగిలింది.
   
    ధరణి వెనక్కి తిరిగి చెయ్యి ఊపుతూ జనాన్ని కంట్రోల్ చెయ్యాలనుకుంది. ఆమె మాట వినే స్థితిలో జనం లేరు. టోనీ ఆగ్రహంతో నోటి కొచ్చినట్లల్లా తిడుతూ ముందుకి వెళ్ళబోతున్నాడు.
   
    పోలీసులు రంగప్రవేశం చేశారు.
   
    జనాన్ని అదుపులోకి తీసుకురావడానికి లాఠీలు ఝుళిపించారు.

    యోగి ఏ.సీ. రూంలో కూర్హ్సుని కాఫీ త్రాగుతూ ఇదంతా చూశాడు. పోలీసులు జనాన్ని చెదరగొట్టాక నిర్మాత ఏడుకొండలికి ఫోన్ చేశాడు.
   
                                   *    *    *
   
    పోలీస్ స్టేషన్ ధరణీ, శ్రీధర్ మిగతా కాలనీవాసులు తాము యోగి గురించి తెలుసుకున్నదంతా చెప్పి కంప్లెయింట్ రాసిచ్చాక వారిని వదిలిపెట్టారు.
   
    ధరణీ, శ్రీధర్ ఇంటికి వెళ్లేసరికి అక్కడి దృశ్యం వారిని నిశ్చేష్టులని చేసింది.
   
    ఇంటి తాళం బద్దలు కొట్టబడి వుంది! ఇంట్లో అన్ని వస్తువులూ టి.వి., ఫ్రిజ్ తో సహా విరగ్గొట్టబడి ఉన్నాయి. ఫోన్ కనెక్షన్ కట్ చేసేసి వుంది. ముక్కలై చెల్లాచెదురుగా పడిన సోఫా సెట్ నీ, గాజు వస్తువుల్నీ చూస్తూ ధరణి డుగు ముందుకి వేసింది. కాలికి చల్లగా తగిలింది. తల కిందికి వంచి అదేవిటో చూసి 'కెవ్వు'మని అరిచింది.
   
    శ్రీధర్ హడలిపోతూ పరిగెత్తుకొచ్చాడు.
   
    "ఏవైంది ధరణీ?" అన్నాడు.
   
    "రక్తం.... రక్తం...." కళ్ళు మూసుకుంటూ అంది ధరణి.
   
    శ్రీధర్ కిందికి చూశాడు.ఎర్రగా చిక్కగా గడ్డ కట్టినట్టుగా వుందది.
   
    "పిల్లలు..... నా పిల్లలు.. ఏమైపోయారో!" ఏడుస్తూ హిస్టీరిక్ గా అరుస్తోంది ధరణి.
       
    అప్పటివరకూ ఆమె పళ్ళబిగువున అదిమి పెట్టిన ధైర్యమూ, పట్టుదలా-ఆ ఎర్రగుర్రం చూడగానే జారిపోయాయి. మాతృహృదయం ఉవ్వెత్తున ఎగిసి ఆక్రోశించింది.
   
    "ధరణీ....రక్తం కాదు. టొమెటో సాస్! కావాలంటే చూడు. ఖాళీ బాటిల్ కూడా పక్కనే వుంది" శ్రీధర్ ఆమె కళ్ళముందు పెట్టి చూపించాడు.
   
    ధరణి కాస్త కుదుటపడింది. "పిల్లలు ఎక్కడో చోట క్షేమంగా వున్నారంటారా?" అంది.
   
    "కనుక్కుందాం.... ముందు పోలీస్ స్టేషన్ కెళ్ళి విక్రమ్ కి చెప్పొస్తాను" అన్నాడు.
   
    "పదండి. నేనూ వస్తాను" అంది ధరణి.

    ఇద్దరూ ఇంటి బయటికి రాగానే టోనీ కంగారుగా ఎదురొచ్చాడు.
   
    "డాక్టర్ పరిమళ కారుని లారీ గుద్దేసిందట. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది. ఇదంతా వాళ్ళపనే!" అన్నాడు పళ్ళు నూరుతూ.
   
    ధరణి ఆ వార్తకి సమ్మెట దెబ్బతిన్నదానిలా అయిపోయింది. మనసు మొద్దుబారింది.
   
    "ప్లీజ్.... ధరణీ" అన్న పరిమళ వేడికోలు చెవుల్లో గింగురు మనగా అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. కేవలం తన మాటలవల్లే ఆమెలో మానవత్వం మేలుకుందని తెలుసు. కానీ డానికి ఇంత పెద్ద పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని మాత్రం వూహించలేదు.
   
    "మాకు సాక్ష్యం లేకుండా చెయ్యాలన్నదే వాళ్ళ ప్లాన్. నీలూ మతిస్థిమితంగా లేదు. తన సాక్ష్యం ఎలాగూ పనికిరాదు!" కసిగా అన్నాడు టోనీ.
   
    "పోలీస్ స్టేషన్ కి కాదు ముందు మనం మంచి లాయర్ దగ్గరికి వెళ్ళాలి" అంది ధరణి.
   
    శ్రీధర్ ఆశ్చర్యంగా, "లాయర్ దగ్గిరకా?" అని అడిగాడు.
   
    "అవును మన పాపల్ని కిడ్నాప్ చేస్తే మనం భయపడతామనుకున్నారు ఆ దుర్మార్గులు ఆధారం లేకుండా ఏమీ చేయలేమంటున్నారు పోలీసులు ఈ పరిస్థితుల్లో కోర్టు ఒక్కటే మనని రక్షించగలదు. కాస్తయినా న్యాయం నిలిచేది అక్కడ అనిపిస్తోంది."
   
    "నువ్వూ, టోనీ వెళ్ళండి. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను." అన్నాడు శ్రీధర్ క్షణం ఆలోచించి.
   
    "నాకు తెలిసిన లాయర్ ఒకాయన ఉన్నారు" అని టోనీ శ్రీనివాసరావు అనే ఎడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
   
    శ్రీనివాసరావు కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్నాడు. ధరణినీ, టోనీని చూడగానే "ఎస్..." అన్నాడు. ధరణి ఆయన ఎదురుగా కూర్చుని కేసంతా మూడు నిముషాల్లో ఎక్స్ ప్లెయిన్ చేసింది.
   
    అంతా విని "యోగిగారిమీదా..." అన్నాడు. ఆ తర్వాత తల గోక్కుంటూ "నేను క్రిమినల్ కేసులు తీసుకోను. మీరు రామతీర్ధంగారి దగ్గరికి వెళ్ళండి" అన్నాడు.
   
    "మీరు లాయర్ గా సమన్లు పంపించండి చాలు! నా కేసు నేనే కోర్టులో వాదించుకోగలను!" అంది ధరణి.
   
    "అమ్మా.....యోగిగారు పూర్వాశ్రమంలో ఏమిటో, ఆయనకి ఎంతవరకూ పలుకుబడి ఉందో నాకు తెలుసు. భార్యా బిడ్డలు గలవాడిని నన్ను వదిలెయ్" దండం పెట్టాడు.
   
    ధరణి అసహనంగా "పోనీ ఆ రామతీర్ధంగారి ఎడ్రస్ ఇవ్వండి" అంది. శ్రేనివాసరావు ఆయన కార్డు వెతికి ఇచ్చాడు. ధరణీ, టోనీ మోటార్ సైకిల్ మీద రామతీర్ధం దగ్గరికి వెళ్లారు. రామతీర్ధం బోర్డు తళతళలాడ్తోంది. జనం బయట కిటకిటలాడుతున్నారు. "బాగా పేరు మోసిన లాయర్ అనుకుంటా" అన్నాడు టోనీ. ధరణికి సమయం గడుస్తున్నకొద్దీ చాలా అనీజీగా ఉంది. మధ్యాహ్నానికి వాళ్ళకి లోపలికి ప్రవేశం దొరికింది.
   
    ధరణి ఆయనకి పరిస్థితి వివరించింది. మధ్య మధ్యలో టోనీ కూడా ఆయనకి వివరించాడు.
   
    అంతా కామ్ గా విన్నాక "యోగి ఎవరో తెలుసా?" అడిగారాయన.
   
    "తెలుసు. శుభోదయా స్కూల్స్ ప్రిన్సిపాల్!" అంది ధరణి.
   
    "ఆ స్కూల్ ఎవరిదో తెలుసా?" మళ్ళీ ఆయన అడిగాడు. ధరణి మాట్లాడకుండా ఆయన చెప్పేదానికోసం చూసింది.
   
    "సాలగ్రామంగారిది!" అన్నాడు.
   
    "అంటే..." అసంపూర్తిగా ఆగిపోయింది ధరణి.
   
    "ఔను.... మినిష్టర్గారిదే. ఆయన భార్య పేరుమీద పెట్టారు. అటువంటి ఘరానా వ్యక్తులు తమ పేరుకి మచ్చవస్తే ఊరుకోరు. ఎంతదాకా అయినా వెళ్తారు. అనవసరంగా ఇందులో ఇరుక్కోకండి. మీ పిల్లల్ని వేరే స్కూల్లో వేసుకోండి. ఇప్పటికే వాళ్ళు మచ్చుకి రుచి చూపించారంటున్నారుగా!' అన్నాడు.
   
    ధరణి ముఖంలో ఆవేశం పొంగుకొచ్చింది. "ఇందుకామీరు 'లా' చదివింది. హోదా, పదవీ, డబ్బూ ఉన్నవాళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేసినా పట్టించుకోకండి. అనుభవించండి! అడ్డం తొలగడం చేతకాకపోతే చావండి అని చెప్పడానికా?" అంది.

 Previous Page Next Page