Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 39

    మనోళ్ళు సుదువుకుంటే అన్నీ తెలుస్తాయంట! అమ్మ సెపతాంది."    
    'అమ్మ!' పేరు వినగానే శకుంతల మనసు చెదిరింది. అమ్మ అంటే తన తల్లి కావచ్చు. ఇప్పుడు అందరికీ అమ్మ అయిపోయింది. మళ్ళీ మనసులో దిగులు పేరుకుంది. దిగులుతో పోలేదు_ ఏదో అవ్యక్తమయిన ఆందోళన....    
    'అక్కడి అందరూ ఈ విధమైన చర్చలలో లేరు కొందరు బాగా తాగి అర్ధంపర్ధం లేకుండా పాడుతున్నారు ఇష్టంవచ్చినట్లు గెంతుతున్నారు రాజూ, మిగిలినవాళ్ళూ వీళ్ళని మార్చలేరా? అది అంత తేలికకాదేమో ఏ సంఘంలోనయిణా, చుట్టూ పరిస్థితులు ఎంత ఘోరంగాఉన్నా - తమ వినోదాలూ, విలాసాలూ, తాము చూచుకొనేవారు లేరా? ఆ పూటకు ఒక కల్లు ముంత దొరికితే చాలు! తామూ, తమవాళ్ళూ ఏమయిపోతున్నారనే ఆలోచనే లేదు.'    
    రాజుకాక మిగిలిన వాళ్ళంతా ఎవరెవరో? ఇక్కడ ఎవరిపేరూ వినపడడంలేదు. రాజునికూడా "గురూగారు!" అంటున్నారు.    
    అకస్మాత్తుగా స్ఫురించింది.    
    వీళ్ళెవరికీ రాజుపేరుగానీ, మిగిలినవాళ్ళ పేర్లుగానీ, చివరకు తన తల్లి పేరుకానీ తెలియదేమో!    
    ఇదంతా ఏదో అతిచాతుర్యంతొ, అతిజాగ్రత్తతొ పన్నిన వ్యూహంలా ఉంది. కానీ తనతల్లి ఎలా వచ్చింది, వీళ్ళ మధ్యకి?    
    రాజుకోసం చూసింది, కనపడలేదు. గర్ల్ గైడ్స్ కూడా కనపడలేదు. వీళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎలా వెళ్ళిపోయారు?    
    "మనం పోదాం, రా!" అంది శామి.    
    "నేను రాను-ఇక్కడే ఉంటాను."    
    "హమ్మో! మీ అమ్మమ్మగారూరుకోరు. మీ మూలంగా ఇక్కడికి పోలీసులూ, తుపాకులూ వస్తాయి, నడవండి. బుద్దితక్కువయి తీసుకొచ్చాను"    
    శామి ముఖంలో దిగులుచూసి శకుంతల నవ్వింది. విధిలేకలేచింది.
    
                                                            24
    
    యూనియన్ ఆర్గనైజర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కూలీలంతా సమ్మె ప్రారంభించారు. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళూ, అందరూ బారులుతీరి ప్రభాకర్ చెప్పిన నినాదాలు చేస్తున్నారు-గట్టిగా!    
    "చట్టప్రకారం జీతాలు చెల్లించాలి!"    
    "పనివేళలు దాటిపోయినా పని చేయించకూడదు."    
    "ఇప్పుడు పనిలో ఉన్న కూలీలందర్నీ పర్మనెంట్చేసి కనీసావసరాలు కల్పించాలి!"    
    "పెట్టుబడిదారీ జులుం నశించాలి!    
    "అక్రమాలూ, అన్యాయాలూ అరికట్టాలి!"    
    ఈ ఆందోళనచూసి మొదట శకుంతల చాలాసంతోషించింది, కానీ మేనేజ్మెంటు వారంతా తమ ఇంట్లో సమావేశమయి మాట్లాడుకొన్న మాటలు విన్న తరువాత ఆ సంతోషం ఎగిరిపోయింది.    
    "రాస్కెల్స్! రోజురోజుకీ శ్రుతి మించిపోతున్నారు. ఇప్పుడే తగినట్టు బుద్దిచెప్పకపోతే, మరీ నెత్తికెక్కుతారు."    
    "ఈ పాడురోజులొచ్చాయి. ఇదివరకెప్పుడైనా ఈ తొత్తుకొడుకులు నోరెత్తి ఎరుగుదురా? చిత్తం! చిత్తం! అంటూ మనం పారేసే ఎంగిలి మెతుకులు కోసం బానిస చాకిరీ చేసేవాళ్ళు"    
    "డి యస్ పి మనోడే గదా! వాడికో నాలుగు బుడ్లు పంపండి. మనకో పటాలాన్ని పంపుతాడు"    
    "ఒట్టి బుడ్లేనా?"    
    "ఏం కావలసినా తగలేద్దాం! ముందు ఈ గాడిద కొడుకులికి బుద్ది చెప్పకపోతే మనని బతకనియ్యరు."    
    "ఆర్మ్ డ్ పోలీసుల్ని పంపమని చెప్పాను రేపటికల్లా వచ్చేస్తారు. దొంగెధవలు ఏవైనా గొడవ చేశారంటే, కాల్చి పారేస్తారు. ఒకళ్ళిద్దరు చస్తేగాని మిగిలినోళ్ళకి బుద్దిరాదు."    
    చివరి మాటలు వింటూ అదిరిపడింది శకుంతల 'ఎంత తేలిగ్గా వున్నాయి_ మనుష్యుల ప్రాణాలు వీళ్ళకి? కేవలం వాళ్ళలో భయం రేకెత్తించడానికి ప్రాణాలు తీసేస్తారా?'    
    శకుంతల కళ్ళముందు ముక్కుపచ్చలారని పసిపిల్లలు, వయసుకు సహజమైన చిలిపితనం లేకపోగా, వయసుకు మించిన బరువు మోస్తూ పసితనంలోనే వృద్దాప్యం ఆవరించినట్లుగా ఉన్నవారు దీనంగా కదిలారు. ఆ పసివాళ్ళ మీదకు తుపాకు లెక్కుపెట్టబోతున్నారు ఆర్మ్ డ్ పోలీస్! పసిపిల్లలు! ఆడవాళ్ళు-బతుకుతెరువుకోసం శక్తికిమించి పాటుపడుతున్న అభాగ్యులు!    
    మనసులో ఆందోళన! ఏదో చెయ్యాలనే తపన ఏం చెయ్యాలో చెప్పేవాళ్ళు లేరు. తనకు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి ఏదిఏమైనా ఆ పసివాళ్ళు బలికాకూడదు.    
    శామిని తోడు తీసుకొని, తిన్నగా ఫ్యాక్టరీ ముందుకు వచ్చేసింది. అక్కడ ప్రభాకర్ లేడు. ఈ కూలీలనందర్నీ రెచ్చగొట్టి ఇక్కడ నినాదాలు చేయిస్తూ అతడు ఏం చేస్తున్నట్లు? కూలీలనడిగితే అతడు యూనియన్ ఆఫీస్ లో ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ కూడా ప్రారంభించారా? అదెక్కడో అడిగి తెలుసుకొని అక్కడికే వెళ్ళింది. అక్కడ రమేష్ ని చూసి గతుక్కుమంది. 'మేనేజ్ మెంట్ ఆర్మ్ డ్ పోలీసులని పిలిపించాలని నిశ్చయించుకున్నప్పుడు రమేష్ అక్కడే వున్నాడు ఇతడు ఎవరివేపు? నిజంగా ఎవరి మేలు కోరుతున్నాడు?'    
    రమేష్ వంక చూడకుండానే ప్రభాకర్ తొ మాటలు ప్రారంభించింది.     
    "మీరు ఈ సమ్మె ఎలా అయినా ఆపుచేయించాలి."    
    ప్రభాకర్ కనుబొమ్మలు చిట్లించి నిరసనగా నవ్వాడు.    
    "ఇలా మాట్లాడక మీరింకెలా మాట్లాడతారు?"    
    "అంటే?"    
    "ఫ్యాక్టరీలు మీవి. కూలీలు సమ్మెచేస్తే నష్టం. మీకు రామచిలుకలా అప్పుడప్పుడు అభ్యుదయం గురించి మాట్లాడినా మీకుకావలసింది....."    
    వాట్ నాన్సెన్స్? నాకు కావలసింది ఆ అభాగ్యుల క్షేమం. రేపటికి తుపాకులతో పోలీసులు దిగుతున్నారు. స్త్రీ, బాల విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతారు,"    
    ప్రభాకర్ రమేష్ వైపు చూశాడు. అతను మాట్లాడలేదు. శకుంతలనే చూస్తున్నాడు. శకుంతల అతడిని చూడటంలేదు. రమేష్సైగ అందుకుని ప్రభాకర్ అన్నాడు__    
    "పోలీసులని రానియ్యండి. తుపాకులు కాల్చనియ్యండి. ప్రాణాలకు భయపడి ఈ పోరాటం వదిలిపెట్టడంకంటే కొందరు మరణిస్తే ఆ విషయం వార్తాపత్రికల కెక్కుతుంది. అప్పుడు మా పోరాటం మరింత పటిష్టమవుతుంది."

 Previous Page Next Page