Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 40

    నిర్ఘాంతపోయింది శకుంతల. 'సమ్మెచేస్తున్న కూలీలమధ్య నిలబడకుండా ఎక్కడో ఆఫీస్ లో కూచుని, కాల్పులు జరగనియ్యండి." అంటున్నాడు. పైగా ఆ వార్త పత్రికలకెక్కుతుందని సంతోషపడుతున్నాడు. గిర్రున వెనక్కు తిరిగి ఫ్యాక్టరీ ముందుకొచ్చేసింది. గేటుబయట బారులు తీరిన కూలీలు, నినాదాలు, గేటులోపల ఆయుదాలతో పోలీసులు.....అందరూ అవకాశంకోసం ఎదురుచూస్తున్నారు__ఏ ఒక్కడు శ్రుతిమించినా కాల్పులు జరిపించటానికి.    
    "నామాట వినండి. మీరంతా ఇళ్ళకు వెళ్ళిపొండి. పోరాటానికి ఇది సమయంకాదు."    
    ప్రాధేయపడుతున్నట్లు గట్టిగా చెప్పింది. ఆ మాటలకు వాళ్ళు శాంతించటానికి బదులుగా మరింత ఉద్రేకం తెచ్చుకున్నారు.    
    "రాజవల్లిగారి ముద్దుల మనవరాలు ఇంకెలా మాట్లాడుతుందీ?" మనతో తియ్యతియ్యగా మాట్లాడుతూ, మనణు వాళ్ళకు మరింత తొత్తుల్ని చెయ్యాలని చూస్తోంది."    
    "శకుంతలా, డౌన్__డౌన్!"    
    ఈ అరుపులతో మతి పోసాగింది శకుంతలకి __ "నా మాట నమ్మండి. నేను మీ స్నేహితురాలిని," అ అరుపులను చీల్చుకొంటూ నచ్చజెప్పటానికి ప్రయత్నించింది.    
    "మేము నమ్ముతాము" అన్నాడు ఒకడు.    
    ఏంచేస్తే నమ్ముతారో చెప్పండి."    
    "నువ్వూ మాతో కలిసి పోరాటం సాగించు,"    
    అటూ, ఇటూ ఎవరూ తను చెప్పిన మాట వినటంలేదు. వాళ్ళతో కలిసి తానూ నిలబడటం తప్ప మరో గత్యంతరం లేకపోయింది.    
    "సరే! నేనూ మీతో కలిసి పోట్లాడుతాను. కానీ, మీరంతా గేటుకి ఫర్లాంగు దూరంలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలి చొచ్చుకుపోవటానికి ప్రయత్నించకండి!"    
    అప్పటికీ శకుంతల తమతో కలిసి పోరాటం సాగిస్తుందని నమ్మకం లేని వాళ్ళందరూ ఆ మాటలకు ఒప్పుకున్నారు. శకుంతల వాళ్ళతో కలిసి పోయి, తానూ నినాదాలియ్యటం ప్రారంభించింది.    
    బారులు తీరిన కూలీలెవరూ గేటు ఆవరణదాటి లోపలికి అడుగు వెయ్యకుండా శతవిధాల ప్రయత్నం చేస్తూ నినాదాలు చేస్తోంది శకుంతల. కానీ, గేటు వెనుక తుపాకులతో నించున్న పోలీసులకు, తమకు తుపాకులకు ఏమీ పని తగలక పోవటంతో తిక్కరేగి కూలీల నుద్దేశించి, "దొంగ నాయాల్లారా! తింటానికి తిండిలేదుగాని ఎదవ రోసాలు తెగబలిసి పోనాయి!" అన్నాడు కాండ్రంచి నేలమీద ఉమ్ముతూ.    
    అప్పటికి చాలా సేపటినుంచీ అక్కడి వాతావరణమంతా ఉద్రిక్తమయి, లోలోన ఉడుకుతున్న అగ్నిపర్వతంలాగ ఉంది.    
    పోలీసుల ఈ చర్యతో పిల్లల వరసలో ముందున్న బాలసింహం రెచ్చిపోయి ముందుకురికి, పోలీసు ముఖంమీద ఉమ్మాడు. అక్కడితో పోలీసులకు అవకాశం దొరికింది తుపాకీ మడమతో ఆ పసివాడి వెన్ను మీద బాదాడు పోలీసు. అది చూసిన కూలీలందరూ తమ తమ కర్రలతో పోలీసుమీద కలియబడ్డారు. సరిగ్గా అందుకోసమే ఎదురుచూస్తున్నట్లు పోలీసులు కాల్పులు జరిపించారు.    
    శకుంతల ఉన్మాదినిలా, "రండి, వెనక్కు రండి ముందుకు వెళ్ళకండి. కొట్లాటలొద్దు, అల్లర్లు వద్దు మీరంతా తుపాకులకు గురి కావద్దు." అని అరుస్తూ, అందరినీ వెనక్కు లాగటానికి ప్రయత్నించసాగింది. కానీ పరిస్థితి అదుపు తప్పిపోయింది. తుపాకులు పేలసాగాయి బాలసింహం నేలకూలాడు. అతడిని తప్పించటానికి ముందుకురికిన శకుంతల శరీరంలోంచి తూటాలు దూసుకుపోయాయి.    
    "ఆగండి, నిష్కారణంగా బలికాకండి." అంటూనే నేలమీద పడిపోయి స్పృహ తప్పిపోయింది.
    
                                                          25

    "దాహం!" అతిప్రయత్నంమీద అనగలిగింది ఎవరో చెంచాతో గ్లూకోజ్ నీళ్ళు పోసారు. ఎవరో తెలియటంలేదు. ఏమీ తెలియటంలేదు. శరీరమంతా సూదులతోపొడుస్తున్నట్లు బాధ. కాలు కదపబోయింది. దేనికో కట్టినట్లుగా ఉంది. గట్టిగా కదిలించబోయింది.    
    "కదలకు!"    
    అది తన తండ్రి స్వరం. 'తండ్రి వచ్చాడా ఇక్కడికి?' చేత్తో చుట్టూ తడిమింది. తండ్రి చెయ్యి అందుకున్నాడు-ప్రేమగా, వెచ్చగా ఆ స్పర్శ ఏదో కొత్త బలాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. అభిమానానికి ఉన్న శక్తి అది.    
    "శకుంతలా, "అది అమ్మమ్మ రాణి రాజవల్లి గొంతు. 'పాపం, మనసులో ఎంత క్షోభ అనుభవిస్తోందో, అంతా ఆ గొంతులో వినిపిస్తోంది. తన బాధ ఎలా ఉన్నా, ముందు ఆ వృద్దురాలిని ఓదార్చాలనిపిస్తోంది.'    
    "నేను.....నేను...." కులసాగానే ఉన్నానని చెప్పబోయింది. మాట రావటంలేదు. ఊపిరి తియ్యటం కష్టంగా ఉంది.    
    "మాట్లాడకు," తండ్రి గొంతు. ఇట్లాంటి పరిస్థితులలో కూడా సంయమనం కోల్పోకుండా పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకోగలిగేశక్తి తన తండ్రిదే. కాలం గడుస్తోంది. మధ్యలో అమ్మమ్మ ఆపుకొంటున్న ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఎంతకాలం గడిచింది? నిముషాలా? రోజులా?'        
    అతి ప్రయత్నంమీద కళ్ళు తెరిచింది. ఒక్కక్షణం భయంతో శరీరం జలదరించింది. పాదంమీద ఒక సూది_ దానిలోంచి ఓ స్టాండ్ కి వేలాడ దీసిన సీసాలోంచి రక్తం బొట్లుబొట్లుగా శరీరంలోకి ప్రవహిస్తోంది. మోచేతిదగ్గర మరో సూది- అందులోంచి సెలైన్, అటూఇటూ కదపటానికి లేకుండా బరువైన కట్టు.    
    చిత్రంగా ఈ సూదులన్నీ చూస్తోంటే, భయంవేసింది తప్ప బాధ కలగటం లేదు. బహుశః ఆ బాధ తన శరీరానికి ఇప్పటికి అలవాటై వుంటుంది. ఎంత చిత్రమైనది ఈ మానవ శరీరం? ఎలాంటి పరిస్థితుల కైనా, అతి త్వరలో అలవాటు పడిపోతుంది.    
    మంచానికి పక్కనే కుర్చీలో శ్రీధర్ శర్మ చేతిలో ఏదో పుస్తకం, చూపులు ఎటో....    
    "డాడ్?....."    
    "బేబీ! ప్రమాదం లేదు నువ్వు కోలుకుంటున్నావు."    
    "అమ్మమ్మ ఏదీ?"    
    "ఆవిడకి బ్లడ్ ప్రషర్ ఎక్కువయింది ట్రీట్ చేస్తున్నారు. నార్మల్ కి వచ్చింది."    
    "ఐ యామ్ సారీ! షి లవ్స్ మి!"    
    "బేబీ! ఆవిడ కెప్పుడూ కష్టం కలిగించకు. నువ్వు తప్ప ఆమెకీ లోకంలో ఏమీ లేదు."    
    "సో విత్ ట్రై!"

 Previous Page Next Page