Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 39

   

    "నేను ఋజువు చెయ్యలేను."
   
    "నమ్మిన వాళ్ళైనా కనీసం నమ్ముతారు."
   
    "నా కుటుంబం నాశనం అయిపోతుంది."
   
    "మీరు మాట్లాడకపోతే అంతా నాశనం అయిపోతుంది."
   
    అటువైపు డాక్టర్ కంఠంలో కోపంతోపాటు రవ్వంత ఇరిటేషన్ కూడా ధ్వనించింది. "....ప్రమాదం నాది కాకపోతే నేనూ లక్ష చెప్పగలను ధరణీ! నీ భర్త హాస్పిటల్ లో వుంటేనో, నీ పిల్లలు ప్రమాదంలో పడితేనో నీకూ ఆ బాధ తెలుస్తుంది."
   
    ధరణి అదే నెమ్మదైన స్వరంతో, "మంచిది డాక్టర్ వుంటాను" అంది.
   
    "నా సంగతి ఎక్కడా బయటికి రానివ్వకు. ఈ ఒక్కసాయం చెయ్యి."
   
    "రానివ్వను. ఐ ప్రామిస్ మీకు ప్రమాదం వచ్చే పనేదీ చెయ్యను."
   
    "మీ పిల్లల క్షేమం గురించి చెప్పాను అర్ధంచేసుకో...."
   
    "థాంక్స్ డాక్టర్.... వుంటాను" ఫోన్ పెట్టేసి, ఒక్కక్షణం అక్కడే నిలబడి ఆమె ముందుగదిలోకి వచ్చింది. శ్రీధర్ ఆమె వైపు కోపంగా చూసేడు. కూతుర్నెవరో కిడ్నాప్ చేస్తే-అక్కడ అంతసేపు బాతాఖానీ కొడుతున్న భార్యపై అమితమైన కోపం వచ్చిందతనికి.
   
    ధరణి మూడ్ మాత్రం దానికి భిన్నంగా వుంది. భర్తని పట్టించుకోలేదు. ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది- ఆమె మొహం.
   
    "కిడ్నాపర్స్ ఎవరో తెలిసింది విక్రమ్ గారూ-" అంది.
   
    "ఎవరు?" ఇద్దరూ ఒకేసారి ప్రశ్నించారు.
   
    ఆమె చెప్పటం ప్రారంభించింది.
   
    తన కూతురు బొమ్మల్తో ఆడుకుంటూ ఒక స్త్రీ బొమ్మపై మొగబొమ్మని పడుకోబెట్టడం నుంచీ, కొన్ని గంటల క్రితం తను రెసిడెన్షియల్ స్కూల్లో చూసిన సంఘటన వరకూ, క్రమం తప్పకుండా చెప్పుకుంటూ వచ్చింది. యదార్ధ సంఘటనలకి హేతువు జోడించి, తనేం ఊహిస్తుందో వివరంగా చెప్పింది. ఆమె చెప్తున్నంతసేపూ గాలి కూడా అచలమైంది. శ్రోతలిద్దరూ కట్రాటలయ్యేరు. క్రిమినల్స్ తో ఎంతో అనుభవమున్న ఇన్ స్పెక్టరే - ఈ అనూహ్యమైన వ్యూహానికీ, నేరవిధానానికీ చిత్తరువయ్యాడు. నోట మాట రాలేదు. శ్రీధర్ పరిస్థితి అయితే వర్ణనాతీతం. "....ఇప్పుడేం చేద్దాం" అని మాత్రం అనగలిగాడు.
   
    "ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధమవుతోంది. అక్కడ జరుగుతూన్నది నేను గ్రహించాననే, వాళ్ళు పూజని కిడ్నాప్ చేసారు" ధరణి అన్నది. తన నిస్సహాయతను చెప్తున్నట్లు ఇన్ స్పెక్టర్ కల్పించుకుని, "కేవలం అనుమానాల్తో యోగిమీద యాక్షన్ తీసుకోలేం" అన్నాడు.
   
    ధరణి అంది. "అధికారికంగా మీరు తీసుకోలేక పోవచ్చు. అనధికారికంగా నేను తీసుకుంటాను"
   
    "అంటే?"
   
    "రేపు ఆగస్టు పదిహేను జాన్ అబ్రహం కాలనీ వాసుల మీటింగ్ ప్రొద్దున్నే ఏర్పాటు చేసారు. ఆ మీటింగ్ లో ఈ విషయం వెల్లడి చేస్తాను. ఆ తరువాత ప్రెస్ ని పిలుస్తాము."
   
    శ్రీధర్ అదిరిపడి, "మరి మన కూతురి సంగతి?" అన్నాడు.
   
    ఆమె నెమ్మదిగా కళ్ళెత్తి సూటిగా భర్తవైపు చూస్తూ, దృఢమైన స్వరంతో క్లుప్తంగా చెప్పింది. "-వందమంది ప్రియల్ని రక్షించటం కోసం ఒక్క పూజని రిస్క్ తీసుకుంటే ఏం?"
   
                                       8
   
    కాలనీ వెల్ ఫేర్ అసోసియేషన్ హాల్లో గుండ్రంగా వేసివున్న కుర్చీల్లో అందరూ వరసగా కూర్చుని వున్నారు. ఉపోద్ఘాతంగా జాన్ అబ్రహం ప్రారంభించాడు.
   
    "దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలయిన ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంలో..." ద్వారం దగ్గిర చప్పుడవటంతో అతడో క్షణం ఆగాడు. ధరణి ప్రవేశిస్తోంది. అందరిదృష్టీ తనమీద పడటంతో, ఆమె మరి ఆలస్యం చేయదల్చుకోలేదు. "ముందు నేను మాట్లాడవచ్చా?" అని అడిగింది. అబ్రహం ఆశ్చర్యాన్ని వెల్లడి చేయకుండా, "ష్యూర్" అన్నాడు- తన స్థానాన్ని ఆమెకిస్తూ.
   
    "యాభైసంవత్సరాల స్వాతంత్ర భారతంలో మనలో కొంతమంది సాధించిన ప్రగతి ఒకటుంది. మారిని తెలివితేటల్తో మనుష్యుల బలహీనతల్ని క్యాష్ చేసుకోవటం.."
   
    ఆమె ఏం చెప్పబోతోందో అక్కడ ఎవరికీ అర్ధంకాలేదు.
   
    "స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం నిజమే కానీ స్వర్ణ భారతిని కూడా నగ్నంగా చిత్రీకరించి తమ పబ్బం గడుపుకోగల మాఫియా ముఠాల్ని అరికట్టలేక పోతున్నాం. తప్పు ఆ ముఠాలదికాదు, మనది! మన పిల్లల్తో సరిఅయిన కమ్యూనికేషన్ ఏర్పర్చుకోలేని మనది!!!" ఆమె ఆగి, కొనసాగించింది. "....అడవిలో జంతువులకి ఒక ధర్మం వుంది. కొంత వయసు వచ్చేవరకూ పిల్లల్ని పెంచి, ఆ తరువాత ప్రకృతి ధర్మానికి వాటిని వదిలేస్తాయి. మనుష్యులం మనం అలాకాదు. మన పిల్లల్ని యుక్త వయస్సు వచ్చేవరకూ రక్షించుకోవాలనుకుంటాం. ముఖ్యంగా ఆడపిల్లల్ని!!!"
   
    "ఇంతకీ నువ్వేం చెప్పదల్చుకుంటున్నావమ్మా!" జాన్ అబ్రహం అడిగాడు. ఇండిపెండెన్స్ డే ప్రొద్దున్నే ఆమె ఏం చెప్తోందో అతడికి అవగాహన కాలేదు. ధరణి ఆహుతులవైపు చూసింది. తను చెప్పేది ఎంతమందికి అర్ధమవుతుందో తెలీదు. అయినా చెప్పింది -"మనం మన పిల్లల్తో కోల్పోతున్న కమ్యూనికేషన్ గురించి! మన సెమీ రెసిడెన్షియల్ స్కూల్ సంస్కృతి గురించి!" అన్నదామె. "...ఆ చిన్నపిల్లలు అక్కడ ఏం జరుగుతోందో మనతో చెప్పలేక పోతున్నారంటే ఆ తప్పు వాళ్ళది కాదు. తెలుసుకోలేని మనది-"
   
    ఆ తఃరువాత ఆమె- తాను తెలుసుకున్నది చెప్పటం ప్రారంభించింది. మొదట్లో మామూలుగా వింటున్న శ్రోతలు- క్రమక్రమంగా అలర్ట్ అయ్యారు. కొంచెంసేపటికి విభ్రాంతులయ్యారు. అక్కడ వాతావరణంలో ఉద్విగ్నత చోటుచేసుకున్నది. వాళ్ళ రక్తం సలసలా మరుగుతోన్నదని ముఖకవళికలు చెప్తున్నాయి. కొంతమంది నమ్మలేకపోతున్నారు. నమ్మినవారు ఆవేశంతో రగిలి పోతున్నారు.
   
    మరికొందరు- ఇంత జరుగుతూన్న తమ పిల్లలు తమకెందుకు చెప్పలేదని ఆశ్చర్యపోతునారు. చిన్నపిల్లలు చాలా చాలా విషయాలు పెద్దవాళ్ళకి చెప్పుకోలేరనీ, ఆ మాటకొస్తే, పద్దెనిమిదేళ్ళ ఆడపిల్ల బస్సులో జరిగిన విషయం తల్లిదండ్రులకి వివరించలేదనీ, కాలేజీలో అబ్బాయి అల్లరిపెడితే ఆ విషయం పెద్దవాళ్ళకి తెలియబర్చదనీ, దీనంతటికీ కారణం ఒకటేననీ-
   
    అదే 'కమ్యూనికేషన్ లేకపోవటమనీ'
   
    ధరణి చెపుతోంది అదేననీ-
   
    జాన్ అబ్రహం ఒక్కడే గ్రహించాడు!!!
   
    అయితే ప్రస్తుత సమస్య అదికాదు జరుగుతున్న దారుణాన్ని ఎదుర్కోవటం!
   
    తాను చెప్పదల్చుకున్న అంశపు ఉపసంహారాన్ని ధరణి ఆవేశంగా ప్రారంభించి ముగించింది. "...మనం ఎంత దారుణమైన సమాజంలో వున్నామో మనకి తెలియటంలేదు. నిజంగా భరతమాత అంటూ వుంటే, ఈ రోజు ఆ యోగి చేస్తున్నపనికి సీతలా భూమిని చీల్చుకుని లోపలి వెళ్ళిపోయేది. యుక్తవయసు కూడా రాని పసిమొగ్గల శరీర విన్యాసాల్ని అమ్ముకునే వ్యాపారుల్ని చూసి ఆత్మహత్య చేసుకునేది. మరి అలాటివాణ్ణి ఏం చెయ్యాలి?"
   
    "నడిరోడ్డు మీద ఉరితీయాలి.... "వెనుకనుంచి వినిపించింది. అందరూ తలలు వెనక్కి తిప్పి చూశారు. ప్రియ తండ్రి అక్కడ నిలబడి వున్నాడు. అతడి మొహం నిప్పులు మండే సూర్యుడిలా వుంది.
   
    "-ధరణి చెప్తున్నది నిజం! నా కూతురు అలాటి కామాంధుల చేతుల్లోనే బలైంది. తనకేం జరిగిందో చెప్పటానికి కూడా ఊహరాని ఒక పసిమొగ్గ రేకులు బలవంతంగా త్రుంచేశారు ఆ కిరాతకులు. నాకీ విషయం ఇప్పుడే - ఈ ప్రొద్దున్నే చెప్పింది డాక్టర్ పరిమళ! మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు. ఇన్ని రోజులూ నోరువిప్పని ఆ డాక్టరు - ఈ రోజు ఎందుకు ఈ విషయం వెల్లడి చేసిందా అని....." అంటూ ఆగాడు. అక్కడ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం అలుముకుంది. అతడు ముందుకు నడుస్తూ ధరణి దగ్గిరకు వచ్చి ఆగాడు. ఆమెను చూపిస్తూ "....ఈమె వల్ల" అన్నాడు.
   
    కాలనీ వారందరూ దిగ్భాంతులై చూస్తున్నారు. అతడు అన్నాడు. "మనుష్యులు పైకి చాలా చెప్తారు. కానీ ప్రమాదం వచ్చేసరికి జారిపోతారు. మామూలు సమయంలోనూ, ప్రమాదంలోనూ ఒకేలా ప్రవర్తించేవారిని శూరులు అంటాం. అదే విధంగా, ఇతరులకోసం తమని కష్టపెట్టుకునే వాళ్ళని త్యాగమూర్తులంటాం! మనలోనే వుంటూ, అతి సామాన్యంగా కనబడే ఈ మాతృమూర్తిలో అటువంటి శూరత్వాన్నీ, మూర్తీభవించిన త్యాగాన్నీ నేనీరోజు చూసాను. పిల్లలు కనపడటంలేదన్న శోకాన్నీ, ఈ సంగతి వెల్లడి చేస్తే పిల్లలు దక్కరన్న భయాన్నీ అధిగమించి, ఈ రోజు మనకీ విషయాన్ని వెల్లడిచేసింది. ఈ విషయం ఇప్పుడే అక్కడ ఆ డాక్టర్ కి తెలిసి గిల్ట్ ఫీలింగ్ తో కృంగిపోతోంది."
   
    కాలనీ వారందరూ ధరణి చుట్టూ మూగారు. ఆమెని అభినందించాలో, జరిగిన దానికి సానుభూతి చెప్పాలో వారికి అర్ధం కావటంలేదు. ఆ పరిస్థితి అర్ధం చేసుకుని ధరణి అంది. "నా పిల్లల సంగతి ఆలోచించకండి. ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. జరుగుతున్న అధర్మాన్ని ఎదుర్కోవటం ఎలా అన్న విషయం ఆలోచించండి."

 Previous Page Next Page