"హుష్! అరవమాక! నీ పేనాలకీ మోసం అమ్మకు నన్ను తెలుసు. సూసీ పలకరించలేదంటే, ఎల్లిపొమ్మని అర్ధం నిన్నూ తీసుకుపొమ్మని అర్ధం హమ్మో! ఎంత గండం గడిచినాదీ! అమ్మకిష్టమయితే తీసుకురమ్మంటాది. ఎవరినయినా ప్రేమగా రమ్మంటాది. నిన్ను గుర్తుపట్టేసినాది. హోరమ్మో!"
శామి ఇంకా వణుకుతోంది. శకుంతలకు భయం వెయ్యలేదు 'బాధ కలిగింది. తల్లి తనను గుర్తించింది. గుర్తించికూడా దూరంగా వుండమని సూచించింది.'
'ఎందుకు? ఇంతమందికి తల్లిగా వుండగలిగిన తన తల్లి తనకే తల్లిగా వుండడానికి ఇష్టపడడంలేదు?' శకుంతలకు భయం లేదు. తల్లితో మాట్లాడాలనే వెర్రి ఆశతో శామిని ఏమార్చి వేగంగా మళ్ళీ బడిలోకి వచ్చింది. కానీ, ఇప్పుడది శూన్యంగా వుంది. పిల్లలూ లేరు, విమలాలేదు. శామి ఒగరుస్తూ, "ఏంటిది? సెప్తే యినవ్? పోదాం- రా!" అంది!
శకుంతల మాట్లాడలేదు.
దూరంగా వీరణం చప్పుడు వీనులవిందైన కమ్మని గానం.
23
"అన్నల్లారా! అక్కల్లార!
తల్లుల్లారా! పాపల్లార!
కల్లకాని కత సెప్తున్నామూ;
కళ్ళు తెరిసి ముందు కురకండీ!
1. అది ఒక్క ఊరు!
అందొక్క రైతు,
కల్లకపటం తెలియనోడూ,
మనోడు__
కాయకష్టం సేసెటోడూ__
2. బంగారు భూమి
రంగారు పంటా
పంచ సేనాలయినవోడూ
మనోడూ__
ఉన్నంతలోనే మురిసెటోడు__
3. ఇంతింత మీసం
అంతంత బొర్ర
నక్కజిత్తులు నేర్చినోడూ
పగోడు__
పరుల పొట్టలు కొట్టేటోడూ__
4. పైపైన నవ్వు
లోలోన కుళ్ళు
పైసంటే పడ సచ్చెటోడు
పగోడు__
తిన్న ఇంటినె కూల్చెటోడు__
5. అమ్మమ్మ అంటా
అయ్యయ్య అంటా
మంచితనమే కొల్లగొట్టే
పగోడు__
మనిషితనమే మరిసినాడు
6. అంగళ్ళు పెట్టీ
అప్పుల్లో ముంచీ
తప్పులెక్కలు సూపినాడూ__
మనోడి__
బతుకులో నిప్పెట్టినాడూ__
7. ఇది నీతి కాదంటే,
మేమూరుకోమంటే
గూండాల ఉసికొల్పినాడు
మనోడి__
పచ్చినెత్తురు తాగినాడూ__
8. దెబ్బకు దెబ్బ
నెత్తురుకు నెత్తురు
మనమంత ఒక్కటవ్వాల!
మనోళ్ళ__
బతుకులే యెలిగిపోవాల!
భాషలో ఏన ఉన్నా పాడినది మాత్రం బాగా చదువుకొన్న వాళ్ళని అర్ధమవుతోంది. అటూ ఇటూ ఇద్దరు మెడలో కట్టుకొన్న వీరణాలమీద దరువు వేస్తోంటే, మధ్యలో ఒకమ్మాయి చక్కగా నాట్యం చేస్తోంది. వీటి చివర అందరి ముఖాల్లోనూ, ఉద్రేకం కనిపించసాగింది. అందరి కళ్ళలోనూ నీళ్ళు....ఆకథలోని ఇతివృత్తం ఇంచుమించు అక్కడున్నఅందరూ అనుభవించినవారే. వారి వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ధనికవర్గాల క్రౌర్యానికి బలి అయినవాళ్ళే.
పాటా, నాట్యము కూడా చాలా భావస్పోరకంగా ఉన్నాయి. ప్రేక్షకులంతా ఉద్రేకంతో ఉడికిపోసాగారు. శకుంతల కేదో భయం వేసింది. రాజుకోసం చూసింది. దూరంగా ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. లేచి నిలబడింది. యధాలాపంగా ఉన్నట్లు పైకి చూశాడు. తనూ పైకి చూసింది. దట్టంగా ఉన్న చెట్ల కొమ్మలమధ్య అనేకమంది, ఎక్కుపెట్టిన బాణాలతో__
మోకాళ్ళు వణికాయి. రాజుకళ్ళలో ఏదో కనిపించింది. రావద్దన్నట్లు వెంటనే కూలబడిపోయింది.
నాట్యం పూర్తికాగానే, వాళ్ళు ముగ్గురూ అప్పటికప్పుడే జీప్ లో వెళ్ళిపోయారు.
ఆల్లంతా ఇట్లే వస్తారు, పోతారు" అంది శామి.
"ఆల్లు పెద్ద పెద్ద పట్నాలలో కూడా డాన్స్లాడతారంట!" అంది అదే మళ్ళీ.
శకుంతల ఊహిస్తోంది. వీళ్ళు ప్రత్యేకం ఇందుకే అంకితమయిన కళాకారులేమో!
అక్కడివారిమాటల్లో- 'రాజవల్లీ నగర్' అని వినిపించి, అటు చెవి ఒగ్గింది.
ఆఁ! ఒక్క నగరేంటి! ఎన్నయినా కడతాడు. ఎటొచ్చినాడు మనూరికి? కట్టుబట్టలతొచ్చినాడు. దుకాణవెడతానంటే, సరేనన్నాం మన కాడకొచ్చి మననే మింగేసినాడు"
"ఓలన్నా! ఆ ఫాక్టరీ బాగా మనదేనంట గదరా!"
"ఆ జాగా మనదే! ఇంటిజాగా మనదే. అన్నీ మనయ్యే! మనయి లాక్కొని మనమీదే పెత్తనాలు చేస్తన్నారు."
"ఓరోరి, గురూగారేం సెప్పిండృ? మన మూలంగానే అల్లంత గొప్పాళ్ళవుతున్నారంట! మనం పాటడకపోతే, ఆల్లకేం రాదంట! పాటడ్డానికి ఈయాల్సినంత మనకీటం లేదంట! అసలు మనం నేకపోతే, ఆళ్ళు బతకలేరంట! మనిలువ మనం తెల్సుకోవాలంట!"