క్రింది బెర్త్ మీద సౌదామిని బాబుమీద చెయ్యివేసి నిద్రపోతూంది. తను పై బెర్త్ మీద వున్నాడు. కూపే తలుపు వేసే వుంది.
హైద్రాబాద్ ప్రయాణంలో కృష్ణానది అనగానే ఇదంతా కల అని అనుమానం వచ్చి వుండాల్సింది రాలేదు. దీన్నే ఎంజాయ్ చేస్తూ వుండిపోయాడు.
ఎంజాయ్!
నిజంగా సౌదామిని చచ్చిపోవటం తనకి ఆనందాన్నిస్తుందా?
కలలో కూడా ఆమె గురించి ఉదాత్తంగానే ఆలోచించాడు తను! అటువంటి తనని మోసం చేసిందంటేనే బాధ. పోనీ స్నేహంగా విడిపోతే.... నీ దారి నువ్వు చూసుకోమంటే...? అతడు కొద్దికొద్దిగా కరుగుతున్నాడు.
పూర్తిగా కరిగేవాడేమో...
మరుసటిరోజు ఆ సంఘటన జరగకపోయివుంటే-
17
హైద్రాబాద్ చేరేసరికి ఏడయింది. రాత్రి తాలూకు కల అతన్ని వెంటాడుతోంది. ఎందుకొచ్చిందీ కల? మార్తాండ్ నౌబర్ గురించి చెపుతూ గిన్నె నీళ్ళలో మునిగిపోవటం ద్వారా తయారయే గడియారం గురించి చెప్పాడు. అందుకే నదిలో పడటం అనేది తన సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రపడి వుంటుంది. అతని మనసంతా వేసిలేటింగ్ గా వుంది.
ఇల్లు చేరీచేరగానే అప్రయత్నంగా అతని కలలు మేడమీదికి దారితీశాయి. కళ్ళు జానకి కోసం వెదికాయి.
నందివర్ధనం పువ్వులా తెల్లచీర కట్టుకుని కనబడింది జానకి. తలంటి పోసుకున్నట్లు వుంది. ఒత్తైన మెత్తటి జుట్టు జారుముడిలో నుంచి జరి మొహంమీద పడుతూ మబ్బుల్లో చందమామని గుర్తు తెస్తోంది. ఆడవాళ్ళకి తల వెనక కూడా కళ్ళుంటాయేమో!
తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించగానే భరతనాట్య భంగిమలా గిరుక్కున సగం వెనుదిరిగి, తల తిప్పి పైకి చూసింది.
కొద్ది క్షణాలు అటూ ఇటూ దిక్కులు చూసి, మళ్ళీ ఆమె వైపు చూశాడు.
ఇప్పుడామె పూర్తిగా ఇటువైపే తిరిగి వుంది. పెదిమలు దాటిరాని పలకరింపు ఆమె కళ్ళలో కనబడుతోంది.
"ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్న.
ఆమె కనుబొమల పంపులో కనబడుతోంది. అతడు తలూపాడు.
...కాసేపు అక్కడే తచ్చాడి, తర్వాత లోపలికి వెళ్ళిపోయింది జానకి.
వెనక్కి తిరిగాడు బాలూ అక్కడ బల్లమీద కాఫీ గ్లాసు పెట్టి వుంది.
ఎవరు తెచ్చారు? ఎప్పుడు పెట్టారు? సౌదామినా? ఆసెయ్యా? పైకి వచ్చి తనని చూశారా?
......కాఫీ తాగి, స్నానం చేసి బయటికి వెళ్ళిపోయాడు బాలూ.
* * *
అక్కడికి దగ్గరలోనే రోడ్డు అవతల్నుంచి బాలూని గమనిస్తున్న ఆంజనేయులు బాలూ కారులో బయటికి వెళ్ళిపోగానే లేచి, చక చక నడవటం మొదలెట్టాడు. బాలూ ఇంటివైపు వచ్చాడు.
అతను అడుగులు వెయ్యటంలో సంకోచం లేదు. స్వంత ఇంట్లోకి వెళుతున్నట్లే బాలూ ఇంటిలో ప్రవేశించాడు.
అతను రావటం చూసిన సౌదామిని తలుపు కొద్దిగా తెరిచి, రమ్మని తలపంకించి, అతను లోపలి రాగానే తలుపు వేసేసింది.
అప్పటికే బాబు ఆడుకోవటానికి వెళ్ళాడు.
ఆసెయ్య బజారు కెళ్ళాడు.
మూసి వున్న ఆ తలుపుల వెనుక గదిలో సౌదామిని, ఆంజనేయులూ ఏకాంతంగా -వున్న సమయంలో.
-హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి కారు వెనక్కి తిప్పాడు బాలూ-
తీసుకు వెళ్ళవలసిన క్యాసెట్టు మర్చిపోయాడు. దాంతో తిరిగి కారు శరవేగంతో ఇంటిదారి పట్టింది. మొత్తం అంతా జరిగి ఒక్క నిముషం కూడా కాలేదు. కారు తన సందుమలుపు తిరగ్గానే సడన్ బ్రేక్ వేశాడు బాలూ. అతడి భ్రుకుటి ముడిపడింది.
దూరంగా, తన ఇంటి గేట్లోంచి ప్రవేశిస్తూ కనపడ్డాడు ఆంజనేయులు. ఒక క్షణం తను చూస్తున్నది నిజమో, అబద్దమో అన్న అనుమానం వచ్చింది. అప్పటివరకూ సౌదామిని మీద ఏ మాత్రమైనా సానుభూతి వుంటే అది పోయింది. స్టీరింగ్ చుట్టూ చేతులు బిగుసుకున్నాయి. కారు దిగాడు. రక్తం సలసలా మరిగిపోతూ వుంటే కారు అక్కడే ఆపేసి నడిచి ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే తమ ఇంటి తలుపులు మూసుకుంటున్నాయి.
ఏం చెయ్యాలా అని కాసేపు ఆలోచించి మెల్లగా, నిశ్శబ్దంగా బెడ్ రూమ్ కిటికీ దగ్గరకు చేరుకున్నాడు. అద్దాల ఫ్రెంచ్ విండోస్ లో నుంచి బెడ్ రూమ్ లోకి దృశ్యం సినిమా తెరమీద కనబడినట్లు కనబడుతోంది.
లోపల సౌదామిని అటు తిరిగి, చేతులకు వున్న గాజులు, మెడలోని గొలుసూ, చెవికి వున్న కమ్మలూ తీసి అతడికిస్తోంది.
"మళ్ళీ వస్తాను" అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆంజనేయులు- వాటితో హడావుడిగా.
పళ్ళు కొరుక్కున్నాడు బాలూ.
తన ప్రత్యక్షదైవానికి పరమ భక్తురాలు. నిలువుదోపిడీ యిచ్చినట్లు అంతా దోచి ఇచ్చేస్తుందన్నమాట ఆంజనేయులుకి.
ఐ విల్ సీ ది ఎండ్....
మళ్ళీ బయటికి నడుస్తుంటే, లోపలికి అప్పుడే వస్తున్న ఆసెయ్య కనబడ్డాడు.
అతను తనవైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించింది బాలూకి.
తన నౌఖర్లు కూడా తనమీద జాలిపడే స్థితికి దిగజారి పోయాడా చివరికి తను.
కరక్టే! బజారు మనిషిలాంటిదాన్ని చేసుకున్న తర్వాత ఇంకేమవుతుంది మరి? సౌదామిని అన్న పేరులోనే బజారు వ్యవహారం వుంది.... "సౌదా" అంటే ఉర్దూలో వ్యాపారం అని అర్ధం. మనీ అంటే డబ్బు అని అందరికీ తెలుసు!
సౌదామిని ఇలాంటిదాని కూడా ఈపాటికి అందరికీ తెలిసి పోయి వుంటుంది ఆలోచిస్తూనే సందు చివర్లో ఆపిన కారుని స్టార్ట్ చేసి తెచ్చి పోర్టికోలో ఆపాడు బాలూ.
ఆసెయ్య చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళబోతూ వున్నాడు సరీగ్గా అదే సమయానికి.
బహుశా తను వెళ్ళిపోయానని అనుకుని వుంటాడు.
"ఏమిటిది?" అన్నాడు కఠినంగా. దొరికిపోయిన దొంగలా చూశాడు ఆసెయ్య.
"ఏం లేదు దొరా! ఏం లేదు".
"చూపించు".
భయంగా చేతులు ముందుకు చాచాడు ఆసెయ్య.
సిగరెట్టు పీక!!! అది తన బ్రాండ్ కాదు. సిగరెట్టు బాలూ కంట పడటం తన పీకమీదికి వస్తుందేమో అన్నట్లు బిత్తరచూపులు చూస్తున్నాడు ఆసెయ్య.
ఆసెయ్య అంటే అదోరకమైన సానుభూతి కలిగింది బాలూకి. పాతరకం పెద్దమనిషి! ఒక సంసారం పాడయి పోతుందేమోనన్న భయంతో తనకు తెలిసిన రహస్యాన్ని దాచి వుంచటానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట!
తమ కాపురం ఇంకెవ్వరూ సరిచేసే స్థితిలో లేదని ఇతనికి తెలియదు.
"వెళ్ళు ఆసెయ్యా!" అన్నాడు ఆర్ద్రంగా.
"ఎళ్ళిపోతున్నాను దొరా! ఇయాళ పదిగంటల ఎర్రబస్సుకి ఎళ్ళిపోతున్నా మా వూరు".
ఉలిక్కిపడ్డట్టు చూశాడు బాలూ.
"వెళ్ళమంటే ఊరెళ్ళిపొమ్మని కాదు ఆసెయ్యా! నువ్వు లేకపోతే మాకెలా గడుస్తుంది?"
తల అడ్డంగా తిప్పాడు ఆసెయ్య. "కాదు దొరా! ఈ బస్తీ వ్యవహారాలు నా ఒంటికి పడవు. మా ఊరికెళ్ళి కూలీ నాలీ అక్కడే చేసుక బతుకుతా దొరా! నన్ను వెళ్ళనీయ్యండ్రి".
తల కొట్టేసినట్లయింది బాలూకి. సౌదామిని మీద కోపం వెయ్యిరెట్లు పెరిగిపోయింది. ఏం మాట్లాడకుండా లోపలికి నడిచాడు.
అవును సౌదామినికి బ్రహ్మానంద ముఠానుంచి ప్రమాదం వస్తుందేమోనని రక్షణకోసం ఈ ఆసెయ్యని పెట్టాడు తను.
సౌదామినే ఆంజనేయులుతో సంబంధం పెట్టుకుని శత్రుపక్షంలో చేరిపోయాక ఇంక తనకెందుకు ఈ బాధ!
అరగంట తర్వాత మూటా ముళ్ళు సర్దుకుని భక్తిగా బాలూ కాళ్ళకి దణ్ణంపెట్టి, అతను ఇచ్చిన అయిదొందలు జాగ్రత్తగా బనీను జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆసెయ్య.
"వెళ్ళాడా?" అంటూ వచ్చింది సౌదామిని. రిలీఫ్ కనపడుతోంది ఆమె మొహంలో.
ఏం మాట్లాడలేదు బాలు.
"పీడ విరగడైంది! వాడిది మంచి బుద్ది కాదు. దొంగవెధవ!" అంది సౌదామిని.
పళ్ళు బిగించి పట్టుకున్నాడు బాలూ. పెనం బాణలిని చూసి 'నువ్వు నల్లగా వున్నావ్' అని ఈసడించుకున్నట్లుంది ఇది! దొంగ వెధవ అంటే? నగలు ఏమైపోయాయని తను అడక్కముందే మంచి కేసు తయారు చేసుకుంటుందా?
అతను మళ్ళీ హఠాత్తుగా ఒక నిశ్చయానికి వచ్చేశాడు.
అనుకోకుండా, అరక్షణంలో అతి నిర్దుష్టమైన ప్లాను తట్టింది అతనికి! మదిలో వీణ మ్రోగినట్లయింది.
"అవును! వీణ!"
సౌదామినికి వీణ పేరు తెచ్చింది. ప్రఖ్యాతి తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ వీణే ప్రాణాలు తియ్యబోతోంది. వెరీ సింపుల్ ప్లాన్! బట్ వెరీ నావెల్ డెత్!
వీణతో చావు! షాకింగ్ గా వుండదూ వినేవాళ్ళకి?
అతని ఒళ్ళు ఉద్వేగంతో జలదరించింది.
ఇది ఫైనల్ అటెంప్ట్! దీనితో అటో యిటో తేలిపోవాలి! అంతే! వెంటనే ఉత్సాహంగా లేచి, విజిలేస్తూ సౌదామిని వీణవున్నాచోటికి వెళ్ళాడు.
అతి ఖరీదైన వీణ అది. అతి భద్రంగా ముఖమల్ లైనింగ్ వున్న పెట్టెలో పెట్టి వుంది. ఎప్పుడూ ఎక్స్ పెరిమెంట్లు చేస్తూ వుండే సౌదామిని తన వీణానాదం శ్రోతలకి మరింత స్పష్టంగా వినబడటానికి గానూ వీణకు బూస్టర్ కనెక్షన్ పెట్టించింది.
వీణకు కనెక్ట్ చేసి వున్న ఆ ఎలక్ట్రికల్ బూస్టర్ తీగల్లో ఇన్ ఫుట్ వైరు ఆంప్లిఫియర్ కి కనెక్టు చేసి వుంటుంది. రెండోవైరు స్పీకర్ కి కనెక్టు చేసి వుంటుంది. అతి తక్కువ ఓల్టేజ్ కరెంట్ ప్రవహిస్తూ వుంటుంది ఆ వైర్లలో. ప్రమాదం వుండదు దానివల్ల.
కానీ ఆంప్లిఫియర్ లోకి వెళ్ళే వైర్ కి మరి రెండు వైర్ లు కనెక్టు చేసి అందులోకి కరెంటు వచ్చేలా చేస్తే-
వీణ తంత్రులు లిఫ్ వైర్స్ గా మారతాయి!!!
తాకితే చావు తప్పదు!!! చావకుండా ఒకవేళ బతికి బయట పడినా, ఆ తీవ్రమైన షాక్ కి చేతులు చచ్చుబడిపోతాయి.